సంస్కృతభాష యొక్క ఔన్నత్యము -నేటి పరిస్థితి.. - టి. వి. యెల్. గాయత్రి.

సంస్కృతభాష యొక్క ఔన్నత్యము -నేటి పరిస్థితి..

సంస్కృత భాష యొక్కఔన్నత్యం -దానిని నేర్చుకోవలసిన ఆవశ్యకం. సంస్కృతము దేవభాష. అంటే దేవతలు మాట్లాడే భాష అని మాత్రమే అర్థం కాదు. పూజింప వలసిన భాష అని. ప్రపంచంలో అన్ని భాషల కంటే అతి ప్రాచీనమైన భాష. అపారమైన విజ్ఞాన సంపత్తి కలిగి ఉన్న భాష. సంస్కృతంలో ఉన్న శాస్త్రవిజ్ఞానాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారు? శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యకుండా, భాషనే వదిలి వేస్తున్నాము. దాని వలన మన జీవన విధానం మారిపోయింది. పాశ్యాత్య నాగరికతే గొప్పది అనే భావన ఎన్నో ఏళ్లుగా ప్రజలలో వేళ్లూనుకొని ఉంది. ఈమధ్య మన యోగ శాస్త్రము గొప్పది అనే విషయం ప్రపంచం గుర్తించింది. ఇప్పుడిప్పుడే ఆయుర్వేదానికి ప్రాచుర్యం కలుగుతోంది. ప్రకృతి వైద్యం ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తోంది. ప్రాచీన భారతీయులు సైన్స్ పరిశోధనలు చేసి ఎన్నో అద్భుతాలు సృష్టించారని మెల్లమెల్లగా తెలుసుకొంటున్నాము. ఆ విషయం ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు చెప్తే మనకు నిన్న చంద్రయాన్ విజయం తర్వాత తెలిసింది.ఇక వేద గణితాన్ని కొన్ని పాఠశాలలో బోధిస్తున్నారు. మన భారతీయ జీవన విధానమే మేలని కరోనా కాలంలో తెలుసుకొన్నాము. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వలన నేలకు జీవం వస్తుందని ఆ మధ్య తెలుసుకున్నాము. గోమాత గొప్పదనం తెలిసినాకూడా దేశంలో గోవధ ఆగటంలేదు. మన పూర్వీకులు కామధేనువును, కల్పవృక్షాన్ని పెరట్లో కట్టివేసినా కూడా మూర్ఖంగా గొడ్డలితో నరికివేసి. ముళ్ల కంపలను,విదేశీ శునకాలను తెచ్చుకొన్నట్లుగా ఉంది.దాని వలన మనకు ఒరిగేదేముంటుంది? ప్రపంచంలో ప్రాచీనమైనవైన గ్రీకు, రోమన్ నాగరికతలు నాశనమయ్యాయి. మన అదృష్టం కొద్దీ మన భారత సంస్కృతి ఇంకా బ్రతికి ఉండి మినుకు మినుకు మంటూ ఉంది.దీనికి కారణం మనలో మిగిలివున్న ధర్మ నిరతి మరియు సంస్కృతం బోధించే సంస్థలు నిస్వార్ధంగా సేవ చేయటమే. అలాగే మన దేవాలయాలు, పీఠాధిపతులు,మఠాధిపతులు తమవంతుకృషి చెయ్యటం వలన సంస్కృత భాష ఈమాత్రం మిగిలిఉంది. మన పూర్వీకులు మానవజీవనాన్ని సుసంపన్నం చేసే అన్ని విషయాల గురించి కూలంకషంగా పరిశోధనచేసి మనకందించారు.భాష జీవనది వంటిది.సంస్కృతీ, నాగరికలతో మమేకమై నిత్యనూతనంగా ప్రవహిస్తూ ప్రాణాధారమై నిలుస్తుంది. వేదములు, స్మృతులు, శృతులు, దర్శనాలు, న్యాయసూత్రాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, విజ్ఞాన శాస్త్రాలు ఇలా సర్వతోముఖంగా వికసించి, విజ్ఞానాన్ని అందించింది సంస్కృత భాష. మనిషి జీవన విధానం ఎలా ఉండాలి?ఏ రకంగా జీవిస్తే మానవుడు ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు? ఆశ్రమ ధర్మాలు ఏమిటి? ఏ విధంగా తత్త్వ శాస్త్రము మనిషిని ప్రభావితం చేస్తుంది? వీటన్నిటికీ సమాధానంగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల వంటి తాత్త్విక గ్రంథాల అధ్యయనం వలన తెలుసుకోవచ్చు. సంస్కృతంలో విజ్ఞానశాస్త్రాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్య సిద్ధాంతం, త్రికోణమితి, చలనము, కాలగణన, ఖాగోళం వంటి శాస్త్రాలు, యంత్ర,,ఆయుధ,వైజ్ఞానిక శాస్త్రాలు, వ్యవసాయ పద్ధతులు ఒక ఎత్తైతే భారతీయ వైద్యశాస్త్రము విశిష్టమైనది.ప్రపంచంలో మొదటి శస్త్రచికిత్స జరిగింది వేదకాలంలో. వేదాలలో దీని ప్రస్తావన ఉంది. ఇంత ఉజ్వలంగా వెలిగిన మన సంస్కృత భాషకు ఈ దుస్థితి ఎలా దాపురించింది? బౌద్ధ, జైన మత ప్రభావం ఉన్నాకూడా సంస్కృతానికి పెద్ద నష్టం వాటిల్లలేదు.సంస్కృత శబ్దకోశం రచించిన అమరసింహుడు బౌద్ధుడు. మన దేశంలో మొత్తం పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉండేవి. విదేశీ విద్యార్థులు సైతం మన దేశానికీ వచ్చి విద్యను అభ్యసించేవారు.అందులో ఒకటి మహిళలకు మాత్రమే విద్య బోధించే విశ్వవిద్యాలయం ఉండేది.విదేశీయుల వరుస దాడులతో మన విశ్వవిద్యాలయాలు తగలబెట్ట బడ్డాయి. ఉపాధ్యాయుల తలలు నరకబడ్డాయి. ఈ దమనకాండ అవిచ్ఛిన్నంగా కొన్ని వందల సంవత్సరాలు సాగింది. దుష్ట విదేశీ ముష్కురుల పాలనలో మన దేవ భాష కనుమరుగుగయ్యింది.తర్వాత వచ్చిన ఆంగ్లేయులు అరకొరగా ఉన్న అర్షవిజ్ఞానాన్ని నాశనం చేశారు. విలియం జోన్స్, మెకాలే వంటి ప్రబుద్ధులు మన భాషలను నాశనం చెయటానికి కంకణం కట్టుకొన్నారు.ఉన్న అరకొర విజ్ఞాన సంపదను జర్మనీ దేశం తరలించుకొనిపోతూ, దాదాపు నాలుగు వందల పండితుల కుటుంబాలు జర్మనీకి వెళ్ళాయని అధికారిక సమాచారం. ఆంగ్లేయులు దుర్బుద్దితో మన సంస్కృత భాషను కాలరాచి ఇంగ్లీషును ప్రజల నెత్తిమీద రుద్దటం మొదలుపెట్టారు. సంస్కృతం విషయం అలా ఉంటే ఆంగ్లభాష ధాటికి ప్రాంతీయభాషలు కొట్టుకొని పోవటం మొదలైంది. మన తెలుగు భాష పరిస్థితి తల్చుకుంటే గుండె చెరువవుతుంది. విదేశీభాషా సంపర్కంతో సరిగ్గా బోధించే పండితులు కరువయ్యారు.దానితో సంస్కృత ప్రాభవం మసకబారింది. సంస్కృత భాష ఒక జ్ఞాననిధి. ఇక్కడ ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.ఒక్కొక్క శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలంటే ఎంతమంది పండితులు ఉన్నారు? ఒక వ్యక్తి తన జీవితంలో ఒక శాస్త్రాన్ని మాత్రమే నేర్చుకోగలడు. అలా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళ సంఖ్య చాలా పరిమితంగా కనిపిస్తోంది. కాబట్టి సంస్కృతంలో శాస్త్రాధ్యయనం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది. నేటి యువత మాతృభాష అయిన తెలుగును నేర్చుకోవటానికి ఆసక్తి చూపించటం లేదు. ఇంక సంస్కృతం గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు భాష యొక్క నాశనానికి ప్రభుత్వం, ప్రజలూ కలిసి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అలాంటప్పుడు సంస్కృత భాషాధ్యయనం గురించి ఆలోచించటం వృధా అనిపిస్తోంది. కర్ణాటకలోని ఒక సంస్కృతవిశ్వవిద్యాలయంలో ఎన్నో ఏళ్లుగా 8 నుండి 10 శాస్త్రాల అధ్యయనం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మూడు శాస్త్రవిభాగాలు మూతపడ్డాయి. ఇంకో నాలుగేళ్లలో మరో నాలుగు విభాగాలు మూతపడే స్థితికి వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే సంస్కృత భాషలో ఉన్న అపారమైన జ్ఞాన సంపద ప్రజలకు ఎలా చేరుతుంది? ప్రభుత్వం భాషాధ్యయనం పట్ల దమననీతిని అనుసరిస్తోంది.మన దేశయువత పాశ్చాత్య చదువుల్లో మునిగి, విదేశాలకు ఎగబాకుతున్నారు. దీనితో మన దేవభాష ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడుతోంది. ఈ అఖండ జ్యోతిని ఆరిపోనివ్వకూడదు. ప్రజలందరు కలిసికట్టుగా ప్రయత్నించి మన దేశీయభాషల ఔన్నత్యాన్ని గుర్తించి వాటిని అభివృద్ధిని చెయ్యాలి. దీనికోసం ప్రభుత్వం మీద ఒత్తిడిని తేవాల్సి ఉంటుంది. మన ప్రాచీనమైన అర్షవిజ్ఞాన సంపత్తిని ప్రపంచానికి పంచిపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువత సంస్కృత భాషా పరిరక్షణకొఱకు ఉత్సాహంగా ముందుకు వచ్చి, మన దేవభాషకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టాలి అని కోరుకొందాము.