భీంరావ్ రాంజీ అంబేడ్కర్ . మనకీర్తి శిఖరాలు .
ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.
ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.
1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు.
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ అన్న ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు. ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామము నివాసులు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారు గా పనిచేసాడు.
ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు.
బాల్యములో అంబేద్కర్ సమస్య
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (peon) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని అంబేడ్కర్ క్లుప్తంగా - “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.
డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (మంగలి మహర్లని, చాకలి వీరి బట్టలనూ ముట్టుకునేవారు కాదు) అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేడ్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువగా అంబేడ్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు .
విద్యాభ్యాసం-ఉద్యోగం-కుల వివక్ష: బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎం.ఏ., 1916లో పి.హెచ్.డి. పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా (The evaluation of provincial finances of India)" అనే పేరుతో ప్రచురితమయ్యింది. 1917లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది
మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు. కాని కార్యాలయములో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్‌ని పైచదువుల కొఱకు విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ కార్యాలయములో జనులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూచారు.
దళిత మహాసభ (1927) : 1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా, అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. 'అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్‌ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.
పరిష్కారం: భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే, ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలపై గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒప్పందం: 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకి అంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "కమ్యూనల్ అవార్డు"ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నాడు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టాడు. అంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకముగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసాడు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి.
రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్: రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు' అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు
బౌద్ధమును స్వీకరించుట: అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.1956 అక్టోబరు 14న నాగపూర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీతో అనేక విషయాలలో విభేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరి పోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న మహాపరి నిర్వాణం చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం.
చదువు
• బి.ఎ. (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
• ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
• ఎమ్మెస్సీ ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్, 1921)
• పి. హెచ్. డి. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)[24]
• డీ.ఎస్.సి ( లండన్ విశ్వవిద్యాలయం, 1923)
• బారిష్టర్ ఎట్ లా (గ్రేస్ ఇన్ లండన్, 1923)
• ఎల్. ఎల్. డి ( కొలంబియా విశ్వవిద్యాలయం, 1952, గౌరవపట్టా)
• డి. లిట్. ( ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోనసీమ జిల్లాను డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గా 2022 ఏప్రిల్ 2 న పేరు మార్చింది..