కర్తవ్యమ్ - బాధ్యత - మద్దూరి నరసింహమూర్తి

Kartavyam baadhyata

కర్తవ్యం - బాధ్యత. సాధారణ మానవుడికి ఈ రెండూ పదాలు మధ్య పెద్దగా తేడా ఏమి లేదనిపిస్తుంది.

కానీ, నిశితంగా పరిశీలిసే --

కర్తవ్యం అంటే చేయదగినది / చేయవలసినది అని అర్ధం. అనగా, ఒక పని తప్పకుండా చేయదగ్గది / చేయవలసినది అన్నమాట.

బాధ్యత అంటే బాధ్యత్వం అని అర్ధం. అనగా ఒక పనిని భుజస్కందాల మీద ఎత్తుకొనేది అన్నమాట.

 

తల్లితండ్రులు - పిల్లలు మధ్యన ఉండే సంబంధ బాంధవ్యాలలో ఈ రెండు పదాలు ఎక్కువగా వర్తిస్తాయి. అంతే కాక, ఇందులో ఏ పదం ఎవరికి వర్తిస్తుంది అన్నది కొందరికి అనుమానం వచ్చే అవకాశం లేకపోలేదు.

 

పిల్లలని పెంచడం, తగువిధంగా చదివించడం, కోడి తన పిల్లలని కాపాడుకొనేటట్టుగా తమ పిల్లలని దుష్ట వ్యక్తుల/చర్యల నుంచి కాపాడుకోవడం, యుక్త వయసు రాగానే తగిన జంటను వెదికి తెచ్చి పెద్దలు, బంధువులు, మిత్రులు సమక్షంలో శాస్త్రవిధిగా వివాహం చేసి, వధూవరులకు వారి ఆశీర్వాదం అందించే ప్రయత్నం చేయడం -- తల్లితండ్రులకు పిల్లల పట్ల ఉండే కర్తవ్యం.

వయసుడిగిన తల్లితండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ, వారి ఆరోగ్య ఆహార అవసరాలను తీరుస్తూ, అన్ని వేళలా అండగా నిలబడడం, అలా తల్లితండ్రులు భావించే లాగ ప్రవర్తించడం, కాలం చేసిన తల్లితండ్రులకు శాస్త్రవిధిగా అంత్యక్రియలు జరిపించడం, ప్రతీ సంవత్సరం వారి పుణ్యతిథి నాడు శాస్త్రవిధిగా పిండప్రదానం చేయడం -- తల్లితండ్రుల పట్ల పిల్లలకు ఉండే బాధ్యత. మన న్యాయస్థానాలు కూడా వయసుడిగిన తల్లితండ్రుల పోషణ పిల్లల బాధ్యత మరియు ఆ బాధ్యత నిర్వర్తించని పిల్లలు శిక్షార్హులు అని స్పష్టమైన తీర్పులు ఇచ్చేయి.

 

మీకు చిన్నప్పుడు మేము అన్నీ చేసేము కాబట్టి, మాకు మీరు ఇప్పుడు ఇలా ఎందుకు చేయరు అని తల్లితండ్రులు పిల్లలతో వాదులాడుట -- తల్లితండ్రులు పిల్లల మధ్య వ్యాపార సంబంధాలను మాత్రమే గోచరింపచేస్తాయి.

మమ్మల్ని కన్నారు కాబట్టి, మేము కోరిన విధంగా మీరు మమ్మల్ని పెంచి, చదివించాలి అని పిల్లలు భావించి వ్యవహరించడం -- తల్లితండ్రుల పట్ల పిల్లలకుండే అవహేళనను అగౌరవాన్ని తెలియచేస్తుంది.

 

ఏ పదాన్ని ఎవరు ఎప్పుడు ఎలా అర్ధం చేసుకున్నా – తల్లితండ్రులు పిల్లలు ఒకరి పట్ల ఒకరు సదవగాహనతో మెదులుతూ, పరస్పర ప్రేమానురాగాలుతో ఉంటే -- మానసికంగా కానీ భౌతికంగా కానీ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ కనీస సూత్రం అర్ధం చేసుకొని -- తల్లితండ్రులు పిల్లల పట్ల అలాగే పిల్లలు తల్లితండ్రుల పట్ల వ్యవహరిస్తే, అందరూ ఆనందంగా జీవిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.

*****