'తస్మాత్ జాగ్రత్త' - మద్దూరి నరసింహమూర్తి

Tasmat jagratta

 

(తొలి పలుకు : ఈ వ్యాసంలో 'ఆసుపత్రి' అంటే 'ప్రైవేట్ హాస్పిటల్' అని అర్ధం చేసుకోమని పాఠకులకు మనవి)

 

అత్యవసర వైద్యం కోసం తప్ప మరేదైనా చికిత్సకై ఆసుపత్రిలో చేరే ముందర, రోగి

తీసుకోవలసిన జాగ్రత్తలను ఉద్దేశించి నాకు తెలిసినంతవరకూ నేను వినినంతవరకూ

నేను చదివినంతవరకూ – పాఠకులను జాగరూక పరిచేందుకై చేసిన ప్రయత్నమే

నా ఈ వ్యాసం.

 

ఆసుపత్రిలో ఏదైనా ఆపరేషన్ / చికిత్సకై చేరాలనుకుంటే –

ముందుగా రోగి ఎదుర్కొనే ప్రశ్న "మీకు భీమా (ఇన్సూరెన్సు) ఉందా ?

'ఉంది' అంటే, ఆసుపత్రివారు చెప్పే ఖర్చు కంటే ;

'లేదు' అంటే, ఆసుపత్రివారు చెప్పే ఖర్చు ---- చాలా తక్కువగా ఉంటుంది.

కానీ, 'లేదు' అని జవాబిచ్చిన రోగితో ఆసుపత్రివారు - 'మీ పేరున భీమా లేకపోయినా, మీ పిల్లల పేరుమీద ఉన్న భీమాలో కూడా మీకు భీమా దొరికే సదుపాయం ఉంటుంది, కనుక్కోని రండి' అంటూ –

ఎలాగైనా భీమా సదుపాయం ఉండే లెక్కలో రోగిని చేర్చుకుందుకే విశ్వప్రయత్నం చేస్తారు.

 

ఆసుపత్రివారు అలా ఎందుకు అడుగుతారంటే / చేస్తారంటే --

ఆసుపత్రి వారు రోగి పేరున ఖర్చుచిట్టా (బిల్) భీమా (ఇన్సూరెన్సు) వారికి పంపితే, ఏదో ఒక కారణంతో అందులో కొంత మేర కోత పెట్టి ‘ఇంతే ఇస్తాము’ అనడం భీమా (ఇన్సూరెన్సు) వారు పాటించే సర్వ సాధారణ నియమం.

అలా కోత పెట్టినప్పుడు, ఆసుపత్రి వారికి అయే కనీస ఖర్చులు తప్పకుండా దొరికిపోగా, అధిక లెక్కన చూపిన మిగిలిన సొమ్ము ఆసుపత్రివారు రోగి దగ్గర వసూలు చేస్తారు.

కాబట్టి, ముందుగానే భీమా (ఇన్సూరెన్సు) సదుపాయం లేదు అని రోగి చెప్తే అయే ఖర్చు తప్పకుండా తక్కువ అవుతుంది.

 

ఒకప్పుడు భీమా (ఇన్సూరెన్సు) ఉన్నా కూడా -- భీమా (ఇన్సూరెన్సు) సదుపాయం లేదు అని ఆసుపత్రివారితో అబద్ధం చెప్పడంలోనే వివేకం ఉంది.

-2-

ఎందుకంటే, తక్కువ ఖర్చుతో వైద్యం జరిపించుకోవొచ్చు. పైగా, భీమా (ఇన్సూరెన్సు) వారు నిర్ధారించిన కాలపరిమితిలోపల ఆసుపత్రివారిచ్చిన చిట్టా (బిల్) భీమా (ఇన్సూరెన్సు) వారికి పంపి, ఆ ఖర్చుని తిరిగి ఇమ్మని అడిగే సదుపాయం (రీయింబర్సుమెంట్) వాడుకోవడం మంచిది.

అయితే, ఈ సదుపాయంలో, ఆసుపత్రిలో జరిగే వివిధ ఖర్చులు ముందుగా భీమా (ఇన్సూరెన్సు) తీసుకున్నప్పుడు వారు చెప్పిన పరిధిలోనే ఉండేటట్టుగా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.

 

అందుకై, ఆసుపత్రివారి దగ్గర చికిత్సకై చేరేటప్పుడే, వారి దగ్గర వైద్యంకు అయే ఖర్చు గురించి ఒక అంచనా పత్రం అధికారికంగా వ్రాత పూర్వకంగా తీసుకొనే ప్రయత్నం చేయాలి.

అందులో కూడా, టోకుగా ఇంత ఖర్చు అని కాకుండా, ఎన్నిరోజులకు ఏ ఏ చికిత్సలు ఏవిధంగా జరుపబడతాయి, వాటికయే వివిధ ఖర్చుల వివరాలు పేర్కొన బడేటట్టుగా చూసుకోవాలి.

 

ఇక్కడ రోగి చేయవలసిన మరో ప్రయత్నం ఏమిటంటే --

'ఆహార వ్యవహారేన నలజ్జ' అని చాణక్యుడి నీతి ఆధారంగా -- ఏమాత్రం సిగ్గు పడకుండా ఆసుపత్రివారితో ప్రతీ ఖర్చు విషయం మీద, ఆఖరుకి టోకుగా వచ్చే మొత్తం ఖర్చు మీద 'బేరం' ఆడినవాడిదే లాభం. ఆసుపత్రివారు 'ఏమిటి బేరం ఆడడం' అని గేలి చేసినా కూడా సిగ్గు పడవలసిన అగత్యం లేనే లేదు.

'బేరం' కి ఒప్పుకోకపోతే, 'మరో ఆసుపత్రిలో నాకు కావలసిన వైద్యం చేయించుకుంటాను, అక్కడైతే మీదగ్గర కంటే తక్కువ ఖర్చులో అయిపోతుందని మాకు తెలిసినవారు చెప్పేరు అని చక్కటి అబద్ధం ఆడితే, ఈ ఆసుపత్రివారే ఒక మెట్టు క్రిందకు దిగి వస్తారు అని చెప్పేందుకు బోలెడు తార్కాణాలు ఉన్నాయి.

ఎందుకంటే, ప్రతీ ఆసుపత్రి వారికి ఇంత ఆదాయం సమకూర్చుకోవాలి అనే లక్ష్యం అంటూ ఒకటి ఉంటుంది. ఒకరి దగ్గర కొంత తగ్గినా మరొకరి దగ్గర మరింతగా ఎక్కువగా ఆదాయం ఆర్జించుకోవొచ్చు అన్న ఆలోచనతో, ఆసుపత్రివారు రోగి పెట్టిన బేరానికి ముందు కాదని బెట్టు చూపినా, తదుపరి తగ్గి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఉదాహరణకు - లక్ష రూపాయల ఖర్చు చూసిన రోగి ఎనభై వేలకు బేరం ఆడితే, ఏ ఆసుపత్రివారు కూడా ఇరవై వేలకోసం ఎనభై వేలు వదులుకోరు.

 

కాబట్టి ఆసుపత్రిలో చేరే రోగులూ – ‘ తస్మాత్ జాగ్రత్త ’ -- అని విన్నవించుకుంటున్నాను.

*****