మహానటి - ambadipudi syamasundar rao

మహానటి

తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానుల చేత మహానటిగా కీర్తింపబడిన నిశ్శంకర సావిత్రి డిశంబర్ 6, 1936 న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగ నాయుడు కుటుంబంలో నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. రెండో సంతానంగా జన్మించింది చిన్నతనంలోనే అంటే సావిత్రికి 6 నెల వయస్సు ఉన్నప్పుడు తండ్రి పోవటంతో పెద్దనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి ఆమెను పెంచి పెద్ద చేశారు సావిత్రి విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయడం చూసి ఆ నృత్య నిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది..బాల్యము నుండి సావిత్రికి కళల వైపు ఆసక్తి ఎక్కువ ఉండటం వల్ల నాటక రంగం లోకి ప్రవేశించింది అప్పుడే ప్రముఖ హిందీ నటుడు పృథ్వి రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి కూడా అందుకుంది ఆ స్ఫూర్తితో సినిమాల్లో నటించడానికి 1949లో మద్రాసు చేరుకుంది.
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులో నుండి తొలగించారు ఇంటికి చేరి మళ్ళీ నాటకాల్లో నటించటం మొదలుపెట్టింది ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవి లో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళి చేసి చూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కానీ అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి ఆమె, నృత్యరూపకుడు మరియు దర్శకుడు అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తర్వాత వచ్చిన దొంగరాముడు, అర్ధాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి. 1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకం లో ఒక మణిమకుటం. అది మొదలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది ఆ విధంగా చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టిన సావిత్రి అగ్ర కథానాయికగా ఎదిగింది.ఆవిడ కెరీర్ లో మూడు దశాబ్దాల పాటు 250 సినిమాల్లో నటించి ఆ కాలంలో అంటే 50,60 70 దశకాల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న అగ్ర నటిగా పేరు సంపాదించింది.1960 లో చివరకు మిగిలేది అనే సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకుంది మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్"కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్ లో పాల్గొనేది.ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్ల కూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట.దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. పాకిస్తాన్ తో యుద్ధం జరిగే రోజుల్లో ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసి అక్కడ మొత్తం నగ లన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకుంది.ఈ పెళ్లితో సావిత్రి తన పెద్ద నాన్నకు దూరం అయింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు ఆ సినిమాకు వచ్చిన ఆర్ధికంగా అంత విజయం సాధించలేదు.ఇన్కమ్ టాక్స్ గొడవల్లో చాలా ఆస్తులు కోల్పోయింది. తర్వాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది.సావిత్రితో పనిచేసిన దర్శకులు నటులు సావిత్రికి నటనలో ఎవరూ సాటి రారు అని మెచ్చుకునేవారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది దాసరి నారాయణ రావు లాంటి దర్శకులు ఆవిడకు సహాయం చేయడానికి సినిమాల ద్వారా ప్రయత్నించినప్పటికీ అనారోగ్యం వల్ల నిలదొక్కు కోక లేకపోయింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో 1981 డిసెంబర్ 26 న మరణించింది ఆ విధంగా ఆవిడ జయంతి వర్ధంతి రెండు ఒకే నెలలో రావడం విశేషం 2011 లో కేంద్ర ప్రభుత్వం సావిత్రి జ్ఞాపకార్ధము పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. సావిత్రి జీవిత విశేషాలతో 2018 లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో "మహానటి" అనే సినిమా రూపొందించారు. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించింది, ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది.నాడు నేడు రాబోయే రోజులకు కూడా మహానటి అనే బిరుదుకు అర్హురాలు సావిత్రి మాత్రమే అని నిస్సందేహముగా చెప్పవచ్చు ఆ విధంగా ఆవిడ నటించిన పాత్రల ద్వారా తెలుగు వారి హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న అగ్రనటి సావిత్రి.




I