మన రాజకీయ నాయకులు - మద్దూరి నరసింహమూర్తి

Mana rajakeeya nayakulu

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మన దేశంలో ఉండే రాజకీయనాయకులు ఒక ప్రత్యేక తరగతికి చెందినవారు. వారి వలన మన దేశానికి వచ్చిన ప్రత్యేతకు కించిత్ గర్వంగా ఉంటుంది.

 

ఏమిటయ్యా నీకు వారిలో కనిపించిన ప్రత్యేకత అనుకుంటున్న వారికి నా వివరణ ---

ప్రతీ రాజకీయనాయకుడు - ప్రజలకు, ముఖ్యంగా వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉండే ప్రజానీకానికి, సేవ చేయాలనే సంకల్పంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్తాడు. అందుకై ఎంతటి త్యాగం చేయడానికీ వెనుకడుగు వేసేదేలేదు అని పదే పదే ఉద్ఘాటిస్తూ ఉంటాడు. తాను నిరక్షరాసుడైనా, విద్యాశాఖామాత్య పదవి గ్రహించి జనానికి చక్కటి చదువు అందించే ప్రయత్నంలో అవిరామంగా కృషి చేస్తూ ఉంటాడు. తనలో ఎన్ని అనారోగాలు గూడుకట్టుకుని ఉన్నా జనం ఆరోగ్యం కోసం ఆరోగ్యశాఖామాత్య పదవి గ్రహించి జనారోగ్య సేవకి నడుం కడతాడు. దేశం కానీ, దేశంలో ఉండే వ్యాపార సంస్థలు కానీ, ఇతర సంస్థలు కానీ భవిష్యత్తులో నిర్వీర్యం చెంది దివాళా తీస్తే -- జనానికి కలగబోయే ఆర్ధిక కష్టాలు తీర్చడానికి -- తాను రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ పైసా పైసా కూడబెట్టి వేల కోట్ల రూకలు తన దగ్గర చేర్చుకొని, వాటిని భద్రంగా కాపాడుతూ, జనసేవ కోసం ఎప్పుడు ఆ సొమ్ముని వినియోగించి తరించగలనా అని ఎదురుచూస్తూ నిద్రాహారాలు మాని కష్టపడుతూ ఉంటాడు. ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో సభ్యుడిగా చేరేందుకు కనీస విద్యార్హత అవసరం లేని వాడే మన రాజకీయనాయకుడు. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర కార్యాలయాలలో పనిచేసే జనం ఏదో ఒకరోజు పదవీ విరమణ చేసి తీరాలి. కానీ, మన రాజకీయనాయకుడు మాత్రం తాను ఎంత వృద్ధుడైనా పదవీ విరమణ అనే ప్రశ్న లేవదీయకుండా ఆఖరి శ్వాస వరకూ కేవలం జనసేవకొరకే పాటు పడుతూ కీర్తి శేషుడవడానికి కంకణం కట్టుకుంటాడు. జీవితమన్నది బుద్బుదమైనది అని పూర్తిగా తెలిసిన మన రాజకీయనాయకుడు తనకి ఒక నలుసు కలగగానే, తాను మాత్రమే చేయగలిగే జనసేవకి ఆ సంతానంను చిన్నప్పటినుంచి వారసుడు(వారసురాలు)లా పెంచి పెద్ద చేసి, రాజకీయాల్లోకి దింపి ఆ చిన్నారుల చేత కూడా జనసేవ అన్న మంత్రాన్ని జపింప చేస్తాడు. ఆ సంతానానికి ఐదు పదుల వయసు వచ్చినా యువనేతగా మాత్రమే కీర్తింపడే చర్యలు చేపడతాడు. తాను చేసేదే చట్టం ధర్మం న్యాయం కనుక తాను ఎప్పుడూ అధర్మం అన్యాయం చట్టవిరుద్ధమైన పనులు చేయను అని నమ్మించే ప్రయత్నంలో సాధారణంగా సఫలీకృతుడు అవుతుంటాడు. ఎప్పుడేనా విధి వక్రించి, పొరపాటున చెరసాల పాలైతే అందులో తానున్న గదిని సర్వసుఖాలమయంగా ఉండే ఏర్పాట్లు చేయించి, అక్కడనుంచి కూడా పరోక్షంగా జనసేవ చేస్తూ, విడుదలైన తక్షణమే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ప్రత్యక్ష సేవలోకి వెంటనే ఉరుకుతాడు. చట్ట సభలు చేసే చట్టాలు కేవలం జనం కోసమే అమలుచేసి, తాను వాటికి అతీతంగా మెలుగుతూ ఉంటాడు.

-2-

ధనికవర్గం దగ్గర ఎక్కువ మొత్తంలో పన్నులు శిస్తులు వగైరా వసూలు చేసి బీద జనానికి అందవేసే సామాజిక సమానత్వం కోసం - ఆ బీదజనం అయిన తన అనుయాయులకు మాత్రమే వసూలు చేసిన సొమ్ములో పదో శాతం వరకూ పంపిణీ చేసి, మిగతా 90 శాతం భద్రంగా తన స్వంత ఖాతాలో జమచేసుకుంటూ -- ఆ లెక్కలన్నీ స్వంతంగా చూసుకోలేక సతమతమవుతూ అహర్నిశలూ శ్రమిస్తూ ఉంటాడు. తన ఆదాయం అంతా తన పేరున ఉంటే విపక్షంలోని నాయకులు ఈర్ష పడతారని తనకి నమ్మకం ఉన్న కొంతమందిని తనకు బినామీలుగా తయారుచేసుకొని వారికి కూడా ఆ రహస్యాలు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఎంతో కష్ట పడుతూ ఉంటాడు. ప్రజాసేవ చేసే తనని విద్రోహించే కొంతమంది రాలుగాయూలు తనని మట్టు పెట్టే అవకాశం కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటారని, వారి ప్రయత్నంలో తాను మరణిస్తే జనం అనాధలైపోతారని ఆలోచించి - ఆయన రోడ్డు మీద ప్రయాణం మానుకొని, బస్సుల్లో రైళ్లలో తాను ప్రయాణిస్తే తన వలన సాధారణ జనానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంద ఆలోచనతో కేవలం గాలిలోనే (అయితే విమానంలో లేకపొతే హెలికాఫ్టర్ లో - ఇంకా వీలయితే స్వంత విమానం/హెలికాఫ్టర్ లో) ప్రయాణాలు చేస్తూ తనని నమ్ముకున్న జనానికి ఎప్పుడూ అండగా నిలబడుతూ ఉంటాడు. విధిలేని పరిస్థితిలో ఎప్పుడేనా రోడ్డు మీద ప్రయాణం చేయవలసి వస్తే - తనకి ముందు తనకి వెనుక తనకి కలిపి కనీసం 30 /40 ఒకేలాంటి వాహనాలు (వీలైనంతమట్టుకూ అవన్నీ కూడా బులెట్ ప్రూఫ్ అయినవి) పెట్టుకొని ప్రయాణం చేసి - తనని మట్టు పెట్టే వారి అంచనాకి దొరకక, తనని నమ్ముకున్న జనానికి ఇంకా సేవ చేసుకునే అవకాశం కలగచేసుకుంటూ ప్రయాణం చేస్తాడు. ఎవరేనా కోర్టులో తనమీద వ్యాజ్యం నడిపేందుకు సిద్ధపడుతున్నారని తెలియగానే - ముందస్తు బెయిలు పొంది, పోలీసులు తనని అరెస్టు చేసి అవస్థపడకుండా, తనని పోలీసులని కాపాడుకుంటూ ఉంటాడు. న్యాయం అందించే కోర్టులుకి పనిరోజులు సెలవురోజులు సమయాసమయాలు ఉండకూదన్న సదుద్దేశంతో తనకి అవసరం పడినప్పుడు కోర్టులని ఏరోజైనా ఏసమయంలోనేనా తెరిపిస్తాడు. అల్పసంతోషులైన జనానికి ఎన్నికలప్పుడు కావలసినదాని కంటే కాస్త ఎక్కువగా మందు సొమ్ము అందచేసి, వారికి తనమీదున్న నమ్మకాన్ని పునరుద్ధరించుకుంటూ, నాయకత్వ హోదాలో పైపైకి చేరుకుంటూ - ఆ జనానికి తమ నాయకుడిని గెలిపించేమనే / ఎదిగేటట్టు చేసేమనే తృప్తిని సమకూరుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఎన్నికలొస్తే అన్నిసార్లు తన నియాజకవర్గంలోని జనానికి ఎన్నో ప్రమాణాలు చేసి, వాటిని నమ్మి జనం ఓటు వేస్తే గెలిచి, తాను చేసిన ప్రమాణాలు తీర్చడానికి ఎంతో శ్రమిస్తున్నట్టుగా ఆ జనం భావించేటట్టుగా పరిస్థితి కల్పిస్తూ ఉంటాడు.

 

మన రాజకీయనాయకుల ఉన్నత మనసుని ఇంకా ఎన్నివిధాలుగా మీ ముందు ఉంచను?

*****