పూర్వం గుణశేఖరుడు భువనగిరి రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. ఓక రోజు మారువేషంలో తన మంత్రి సుబుధ్ధితో కలసి ప్రజల కష్ట సుఖాల గురించి తెలుసు కోవాలని గుర్రంలపై బయలుదేరి, చాలాదూరం ప్రయాణించి ఓక తోటకు నీరు పెడుతున్న రైతును చూసి, " అయ్య మేము బాటసారులం దాహంగాఉంది మంచినీళ్లు ఇస్తారా " అన్నాడు.
" అయ్యా నాపేరు ఓబులేసు నాతోటలోనికి రండి భోజనం చేసి మాఆతిధ్యం స్వీకరించి కొద్దిసేపు విశ్రాతి తీసుకుని ప్రయాణం కొనసాగిద్దురుగాని " అని రైతు రాజుగారిని ఆహ్వనించాడు. గుర్రాలను పచ్చిక(పచ్చిగడ్డి)పెరిగి ఉన్నచెట్టుకు కట్టిన రాజు,మంత్రి ఆరైతు పూరిఇంట భోజనంలో పెరుగుతో అమృతవంటి మామిడి పండు ముక్కలు వడ్డించాడు.భోజనానంతరం తోటఅంతా పరిశీలించి, "ఓబులేసు ఎలాఉంది మీరైతుల జీవనం ఏటా ఏమాత్ర మిగులుతుంది ,వచ్చిన రాబడి ఎలా వినియోగిస్తున్నావు " అన్నాడు రాజు." అయ్య మారాజుగారి దయవలన మారాజ్యంలోని ప్రజలు అందరం సంతోషంగా ఉన్నాం.కావలసినంత నీరు అందేలా ఉండటంతో నాతోటలో నారింజ, బత్తాయి,మామిడి,సపోటా, సీతాఫలం,బొప్పాయి, కొబ్బరి,కూరగాయలు, ఆకుకూరలు వంటి పలురకాల మొక్కలు నాటాను.అవన్ని కాలాని తగిన ఫలాలు అందించడంతో నాఆర్దిక పరిస్ధితి బాగుంది. నాకు వచ్చేఆదాయం అయిదు భాగాలు చేసి ఒకభాగం రాజుగారికి పన్నురూపంలో చెల్లిస్తాను.రెండో భాగం అప్పు చెల్లిస్తాను. మూడవ భాగం అప్పు ఇస్తాను.నాలుగో భాగం రాబోకాలంలో కాబోయే బంధువులకొరకు దాసస్తున్నాను.అయిదో భాగం కుటుంబ అవసరాలకు వాడుకుంటాను " అన్నాడు రైతు.
' ఓబులేసు వీరు మన దేశ రాజుగారు,నేను మంత్రిని " అని రాజుగారి సైగతో అయిదు బంగారు నాణాలు ఆరైతుకు ఇవ్వబోయాడు మంత్రి." సున్నితంగా బంగారు నాణాలు తిరస్కరిస్తూ ఓబులేసు "అతిధిదేవోభవ అన్నారు పెద్దలు,తిథి చూడకుండా వచ్చేవారే అతిథి.తమఅంతటివారికి ఆతిధ్యం ఇవ్వడం మాఅదృష్టం ,తమరు అనుమతిస్తే అన్ని ఋతువులలో కాసే పండ్లను తమరికి పంపించే అవకాశం కలగజేయండి ప్రభు "అన్నాడు వినయంగా . "అలాగే, నేటినుండి నువ్వు ఈపండ్లతోటకు సుంకం చెల్లించనవసరం లేదు "అని రాజు ,మంత్రి భువనగిరికి తమ గుర్రాలపై బయలుదేరారు. దారిలో గుణశేఖరుడు " మంత్రివర్యా రైతు చెప్పిన అయిదింటిలో మోదటిది, చివరిది నాకు అర్దం అయ్యాయి,మిగిలిన మూడింటికి అర్ధం ఏమిటి ? " అన్నాడు.
" ప్రభు రెండోభాగం అప్పుచెల్లించడం అంటే తనకు జన్మనిచ్చిన తల్లి తండ్రికి ఆరోగ్యపరిరక్షణకు ఇస్తున్నట్లు.ఇది పెద్దలపట్ల రైతుకు ఉన్న గౌరవం తెలియజేస్తుంది. మూడవ భాగం అప్పుఇస్తాను అంటే తనకుమారుడికి అయ్యే విద్యాకొరకు కర్చుచేస్తున్నాను. అంటే రేపు అతని కుమారుడు రైతును జీవితాంతం పోషించాలి కదా.నాలుగో భాగం రాబోఏ కాలంలో కాబోయే బంధువులకు అంటే తనకుమార్తే వివాహం చేసేందుకు,అలా వచ్చే కొత్త బంధువులకు విందుకొరకు ధనం దాస్తున్నాను అని అర్ధం అన్నాడు మంత్రి.
మంత్రి వివరణతో తృప్తిపడిన రాజు గుణశేఖరుడు తన రాజ్యంలో ఇంత తెలివైన రైతు ఉన్నందుకు ఆనందించాడు.

