మారిన పల్లె - M chitti venkata subba Rao

Maarina palle

పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కాలువలు పెద్ద కాలువలు ,కాలువగట్లు ,కొబ్బరి తోటలు, అరటి తోటలు మామిడి తోటలు ,చల్లటి పైరగాలి,పెద్ద పెద్ద పెంకుటి ళ్లు ఇలా బాపూగారి బొమ్మలా ఉంటాయి .సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు కృత్రిమత్వం ఎక్కడ ఉండదు. సాయం అంటే ఒక అడుగు ముందు సహాయం అంటే అందరికంటే ముందు ఉండే జనంతో నిండుగా ఉండేది పల్లెటూరు. చేతిలో చెర్నాకోలు పట్టుకుని నాగలి కి రెండు ఎడ్లు కట్టుకుని వాటిని అదిలిస్తూ బురద తొక్కుకుంటూ పొలం దున్నుతూ చేతులు బొబ్బలెక్కిన కర్తవ్య నిర్వహణ ఆపకుండా ఆ పొలంలో బంగారం పండించడానికి కృషి చేసే రైతన్నల అడ్డా మన పల్లెటూరు. పల్లె పదాలు పాడుకుంటూ ఊడ్పు చేలో మొక్కలు నాటే పల్లె పడుచులు ఉండే ఊరు పల్లెటూరు. పైరు ఎదిగి పూతపూసి గింజ కాసి గింజల బరువుకి నడువొంగి న పైరు తల్లిని కోత కోసి జోడెడ్లతో నూర్పించి దూళి వేరుచేసి బంగారు రాశులు ఇంటికి చేర్చే రైతన్నల సంతోషం ప్రతి సంక్రాంతి పండుగ కి వాకిళ్లలో చుక్కల ముగ్గు గా వెలుగుతున్న ఊరు పల్లెటూరు. మా అమ్మ అన్నపూర్ణ. మేము రైతన్నలము. మేము చేసేది వ్యవసాయం. గాల్లో ఎగిరే పక్షికి ,గట్టుమీద తిరిగాడే పశువుకి కడుపు నింపి , పంట దిగుబడి పెంచి పరోక్షంగా దేశానికి ,ప్రజలు అందరికీ ప్రధాన ఆహారo తో కడుపు నింపి అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనాలు అందుకునే మహా దాతలు ఉండేది ఆ ఊరు. భారతదేశంఅంతాపల్లెల్లోనేనివసిస్తుందిఅంటారు.భారతదేశంలాగే అన్ని మతాల వాళ్ళు ఇక్కడ పొరపాచ్చాలు లేకుండా అన్ని వృత్తుల వాళ్ళు ఆనందంగా కలిసిమెలిసి కాపురం చేసే ఆ పల్లె కి ఏమొచ్చిందో తెలియదు గానీ పల్లె రూపుమారిపోయింది. పల్లె అంతా పట్టణం పారిపోయింది. యాంత్రికరణ పేరుతో తనకు తనతో పాటు పదిమందికి తిండి పెట్టి పేదవాడికి సాయం చేసే వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చేసాడు మేధస్సు పెరిగిన మన మానవుడు. జోడెడ్లను అయినకాడకు అమ్మేసి నాగలిని పశువులు కొట్టంలోకి చేర్చేసాడు కోతలు కోసే కొడవళ్ళు చరిత్రలో ఉనికిని కోల్పోకుండా మ్యూజియంలో అద్దాల అల్మారా లో ప్రదర్శిస్తున్నాడు .ఇన్నాళ్లు వంచిన నడుము ఎత్తకుండా ఆ భూమాతనే నమ్ముకు ని అక్షరం నేర్చుకోని మన రైతన్న చేసే పని లేక అయిన కాడికి అమ్మేసి తట్ట బుట్టా సర్దుకుని ఆ టౌన్ వైపు పరుగులు తీశాడు. గుప్పెడు మట్టి పిసికితే డొక్కనిండా అన్నం పెట్టే ఆ భూమాతని వదిలేసి అన్నమో రామచంద్రాయని ఆ పట్టణంలో బ్రతుకు వెళ్ళ దీస్తున్నాడు. ఎందుకో మానవ శక్తి మీద నమ్మకం పోయింది. ఇక్కడ యంత్ర శక్తి రాజ్యమేలుతోంది. పట్టెడు అన్నం పెట్టే పంట పొలాలు ఉండే చోటు పరదాలు కట్టిన రెండంతస్తుల భవంతులు వెలిశాయి .గాదెల నిండా ధాన్యంతో కళ కళ ల్లాడే రైతుల ఇల్లు కంపెనీ సంచుల బియ్యంతో నిండిపోయా యి. గాదెలన్ని మాసిన బట్టలకు చోటిచ్చాయి. చూరుకు వెళ్లాడే ధాన్యపు కుచ్చులు కనుమరుగయ్యి గుప్పెడు గింజలు దొరక్క పక్షి జాతులు రైతుతోపాటు ఆ పట్టణం వైపు పరుగు తీసే యి.అక్కడ ఏముంది అని ప్రశ్నిస్తే నగర వాసులు అందాల డాబాల మీద తమ ఆనందానికి గింజలన్నీ విసురుతూ తమని ఆనందంగా అభిమానిస్తున్నారని ఆహ్వానిస్తున్నారని అందమైన గూళ్ళు ఏర్పరిచి తమకు చోటు కలిపిస్తున్నారని సర్కార్ వారు కూడా ప్రదర్శనశాలలు ఏర్పాటుచేసి ఇంత బువ్వ పెడుతున్నారని అవి ఆనందంగా సమాధానం చెప్పాయి. మాటలు వచ్చిన మనిషి గుడి దగ్గర బస్టాండ్ దగ్గర సిగ్నల్ దగ్గర చేతులు చాచి అడుక్కుంటున్నారు. కానీ మేము మూగజీవులం. మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు నగరవాసులు అంటూ ఆనందపడ్డాయి. అందంగా ఉన్న నాలుగు లైన్ల రహదారులు ఆ పల్లెకి నగరాన్ని దగ్గర చేస్తే నిశ్శబ్దంగా ఉన్న పల్లె పట్టణాన్ని తలపిస్తూ నాలుగు చక్రాల బండి అందంగా ఆ పల్లెకి పరుగు పరుగున చేరుస్తుంటే ఇంక మా పరుగుతో పని ఏముంది అంటూ మైసూర్ ఎడ్లు మెడలోని గంటలన్నీ రైతుకి ఇచ్చేసి నగరంలో మున్సిపాలిటీ బండికి మెడలు వంచేసాయి. ఆ పచ్చటి భూమాత రైతు తో పాటు గట్టుమీద కూడా గడ్డి పెంచి గోమాత కడుపు నింపేది. గోమాత ఉదయమే అంబా అని అరిచి రైతును మేలుకొలిపి చెంబు నిండా చిక్కటి గుమ్మ పాలు రైతుకి తన పసిబిడ్డకి ఇచ్చి రుణం తీర్చుకునేది. ఆ భూలక్ష్మి గృహలక్ష్మి గా మారిపోయింది. పచ్చదనం ఎక్కడ ఉంది. పల్లెంతా పట్టణం అయిపోయింది. రైతుకు గుమ్మ పాలు బదులు బొమ్మ పాలే గతి అయ్యాయి. గుమ్మ పాలు తాగి చెంగుచెంగున ఎగురి గంతులు వేసే లేగ దూడ మెడలోని గంటలన్నీ విసిరేసి ఎటో పారిపోయింది. పశువుల కొట్టం పాత సామాన్లకు అడ్డాగా మారిపోయింది. ఊరు పల్లెటూరు అంటూ సినిమాలో పాటలు పాడుకుని సినిమాల్లో పల్లెటూరు ను చూసి లేగ దూడ గoతులు చూసి ఆనందపడే రోజులు వచ్చేసాయి. ఏడాదికి ఒకసారి సంచులు నిండా ధాన్యం పుచ్చుకుని తుమ్మ నాగళ్ళు చెక్కుతూ కొడవళ్ళు పదునుపెట్టుతూ ఎప్పుడూ కొలిమి మంటలకి చమటలు కక్కుతూ రైతుకు సహాయకారిగా ఉండే మా వీరన్న గుడిమెట్ల దగ్గర తచ్చాడుతుంటే గుండె తరుక్కుపోయింది. ఎర్ర రంగు పులుముకుని ఆ పంట పొలాల్లో హల్ చల్ చేసే యంత్రాలకు రోగం కుదిర్చే పనిని పట్టణంలో నేర్చుకోవడానికి పల్లె వదిలి పారిపోయాడు మన వీరయ్య. అందాల భవంతులు ఎయిర్ కండిషన్ గదులు అద్దాల లోంచి పచ్చగా మెరిసిపోయే పుత్తడి సరుకులు ఆకర్షిస్తుంటే పుట్టి మూడు వారాలయిన చంటి దానికి చెవులుకి అలంకారం కోసం రెడీగా బహుమతులు తెచ్చేస్తున్నారు తాతయ్యలు. చెవులు కుట్టే చలమయ్య పొట్ట కొట్టేస్తున్నారు. చేతివృత్తులకు సాటి లేదు గువ్వల చెన్న అని ఇంతవరకు పాట పాడుకునే చలమయ్య డొక్క మాడి నగరం వైపు పరుగు తీసి ఆ అద్దాల గదిలో సరుకు అందం తెలిపి యజమానికి అమ్మకాలు పెంచే పనిలో కుదిరిపోయాడు . పల్లెటూరు లాగే పల్లెటూరులో పుట్టిన పిల్ల పచ్చని పైరు లాంటి పావడా కట్టి పిల్ల కాలువ లాంటి పైట వేసుకుని పాము లాంటి జడ వేసుకొని మొగలిపూలు పెట్టుకుని వరద గోదావరి లాగా పరవళ్ళు తొక్కుతూ ఉండేది. నగరం నుంచి నాగరికత గాలి వీచి అదిరేటి డ్రస్సులు మీద మోజు పెరిగితే అరుగుల మీద ఉండే కుట్టు మిషన్ తుప్పు పట్టి పాత సామాన్లు వాడికి అమ్మేసి చేతినిండా పని లేక నాలుగు వేళ్ళు లోపలికి పోక ఉతుకులో వెలిసిపోయే రెడీమేడ్ దుకాణం తలుపులు మూసి ,తెరిచే పని కి పట్టణం చేరిపోయి ఆ షాపుకు వచ్చే కస్టమర్లు అందరూ తనవాళ్లేనని మదిలో చింతపడే కుట్టుమిషన్ కుటుంబరావులు ఎందరో ఆ పట్టణంలో. ఆ ఊరంతా మూగబోయింది. ఆడుతూ పాడుతూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ బడి చదువు ముగించుకుని సందడి చేస్తూ సైకిల్ పోటీలు వేసుకుని హై స్కూల్ చదువు అయిందనిపించి పట్టణంలో పట్టాపుచ్చుకొని ఎర్ర బస్సు ఎక్కి నగరం చేరి దొరికిన వృత్తిలో స్థిరపడిపోయిన పిల్లలు లేక ఊరంతాసందడిపోయింది. నిశ్శబ్దం అయిపోయింది. గూడులోంచి గువ్వ పిల్లలు ఎగిరిపోయిన తర్వాత ఆ గూడులోనే మగ్గుతూ ఆ గూడును గుడి లాగ అనుకుని బ్రతుకు వెళ్లదీస్తున్న ఆ దంపతులు ఏడాది కోమారు కూడా వెల్లలు వేయించలేక ఆ గోడలు వెలిసి పోయాయి. ఆ ఊరి ఎల్లలు దాటి వెళ్ళలేక ఆ గూడులోనే గువ్వలు మగ్గిపోయాయి. ఏ ఇల్లు చూసినా బ్రతుకు వెళ్లదీస్తున్న గువ్వలు తప్పితే రివ్వున ఎగిరే పావురాలు జాడలేదు. ఒకప్పుడు గంప కింద నుండి కోడి కూత, గుడిలోగంటలు, చర్చిలో ఫాదర్ ప్రార్ధనలు, మసీదులో నమాజు సందడి ఉండే పల్లెటూరు జేబులో ని బుడ్డి సెల్లు గంటలతో మార్మోగిపోతో oది. పొలికేకతో దూరంగా ఉన్న వారిని పిలిచే ఊరి జనం వీడియో కాల్ లో మాట్లాడే స్థాయికి పల్లెటూరి ఎదిగిపోయింది గుడిగంటల కన్నా సెల్లు గంటలు తోనే మార్మోగిపోతో oది పల్లెటూరు. ఎక్కడ పుట్టిందో ఆ కంటికి కనపడిన జీవి మన జీవితాల మినే మార్చేసింది. పదిమంది కలిస్తే భయం. పక్కనుంచి నడిస్తే భయం . ఆపరేషన్ థియేటర్లో వేసుకునే మాస్కులు ప్రజానీకం ముక్కులు మూసేసాయి. రాములోరి కళ్యాణానికి , కార్తీకమాస వనభోజనానికి ఆకు పచ్చ అరిటాకు వేసుకుని చతురోక్తులతో విందు భోజనాలు చేసే ఊరి జనం కనపడని ఆ జీవి భయం తో జొమాటో వాడికి కబురెట్టి వీధి తలుపులు బిగించి భయంతో కాలక్షేపం చేస్తున్నారు. ఏటేటా జీవి భయపెడుతూనే ఉంది. ఊరిలోని మట్టి అంతా వాకిట్లో వేసుకుని కాళ్లతో నుగ్గు చేసి చక్రం తిప్పుతూ ఆ మట్టి ముద్దలని పేదవాడి పొయ్యి మీదకి వంట పాత్రగాను , అందరి ఆఖరి యాత్రకి తప్పనిసరిగా వెళ్లే అతిధి గాను దీపావళి పండక్కి వెలుగులు పంచే ప్రమిదలని తయారు చేసే కుమ్మరి ముత్యాలు జీవనచక్రం ఆగిపోయింది బజార్లో దొరికే రంగురంగుల మట్టి పాత్ర ల మీద జనాలకి మోజు పెరిగి ఆ చేతి వృత్తుల కళాకారుడి నోట్లో మట్టి కొట్టింది. చిలక కొరికిన జామపండు చెట్టు నుంచి రాలితే సమయం వచ్చిందని దోరకాయలు కోసి ఆనందంగా తినే వారు. ఎవరి దొడ్లో చెట్టు ఉన్న ఊరందరికీ కాయలే. కొన్ని దొంగతనంగా కోసుకునేవి. పట్టుబడిన శిక్షలు ఏమీ ఉండవు . చెట్టు నుంచి పడిపోతావ్ రా నాయనా అంటూ చెప్పే జాగ్రత్తలు తప్ప. మరికొన్ని కాయలు ఆనందంతో పంచి ఇచ్చేవి. జామకాయలే కాదు నిమ్మకాయలు నారింజకాయలు ఒకటేమిటి. ఏ పండు ఉన్నా పదిమంది కలిసి పంచుకోవడమే అదే ఆ ఊరి ఆనందం. అలాంటి ఆనందం నుంచి మా పల్లె వీధిలో జామకాయల అమ్మే షావుకారు దగ్గర నుంచి కాయలు కొనుక్కునే స్థితికి దిగ జారిపోయింది. ఇక వేసవికాలoలో పరువుకు వచ్చిన మామిడి కాయలు ఎండు గడ్డి వేసి వేడి పుట్టించి ముక్కులదిరిపోయేలా వాసన వచ్చిన పండు తిని పది కాలాలు అయింది. ఇప్పుడు బజార్లో కాయలన్నీ మందు తాగి రంగు తేలి వాసన లేని రుచిలేని పండు తూకానికి కొనుక్కునే దౌర్భాగ్యం వచ్చేసింది. టౌను పక్కనున్న పల్లెటూరు లో మామిడి తోపులన్నీ సుందర భవనాలు అయిపోయి మనం పళ్ళ కోసం టౌన్ లోని బళ్ళమీదకి ఎగబడుతున్నాము. అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్ళికొడుకుకి పెద్దాపురం సిల్క్ పట్టుపంచి కండువా పెళ్లి మాటల్లో మగ పెళ్లి వారి కోరిక. మగ పెళ్లి వారు కోరిక తీర్చడానికి పెద్దాపురం పెడితే ఆ వీధిలో మగ్గాలన్నీ కాళ్లు విరిగి అరుగు మీద దుమ్ముకొట్టుకు పడి ఉన్నాయి. అలా వీధిలో తిరుగుతుంటే ఓ మూల మగ్గం చప్పుడు వినిపించింది. పట్టు పంచ కండువా కావాలి నేస్తావా అంటే రాజరాజేశ్వరి సిల్క్ షాప్ అడ్రస్ చెప్పాడు ఆ నేస్తం. మళ్లీ అభ్యర్థిస్తే అయ్యా మేము ఇప్పుడు రోజు వారి జీతగాళ్ళం. ఇన్నాళ్లు కూడు పెట్టిన మా మగ్గం మమ్మల్ని పని వాళ్ళని చేసింది. కాలం మారిపోయింది అయ్యా. యంత్రాలతో నడిచే మిల్లులొచ్చి మా కడుపులు గుల్లలు చేసేసాయి అని ఆ వృద్ధుడు దీనంగా చెప్పాడు. మా పిల్లలు అందరూ ఎప్పుడో ఊరు దాటి వెళ్లిపోయారు. నేను ఒక్కడినే మిగిలిపోయాను వయసు మీరి పోయి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఎండాకాలంలో తడారిపోయిన గొంతుకకి కడుపులో నుంచి తన్నుకొచ్చే గోబర్ గ్యాస్ కి ఉపశమనం ఇచ్చేది గోళీసోడా. గాజు సీసాలో నీళ్లు పోసుకుని కడుపులో గాలి దాచుకుని గుండెల్లో గోళీ దాచుకుని తల మీద కొడితే విచిత్ర శబ్దం చేసి గొంతులో పోసుకోగానే తేనుపు తెచ్చి హమ్మయ్య అనిపించే ఆ గోళీ సోడా పొట్ట కొట్టేసి రంగురంగుల బంగారు స్పాట్ పల్లెటూర్లో హల్చల్ చేస్తోంది. ఇవన్నీ చూసి నా ఊరు మారిపోయింది. అన్నీ దొ రుకుతున్నాయని అని ఎప్పుడో పండక్కొచ్చే పిల్లలు ఆనంద పడిపోతున్నారు. అలా ఊళ్లోకి వెళ్లి చూస్తే ఖాళీగా ఉన్న ఇళ్ళు అరుగులు దర్శనమిస్తున్నాయి ప్రతి ఇంటిలోనూ అతిథులను ఆహ్వానించేది ముందుగా ఇంటి అరుగులే. అవి అరుగులు కాదు హంస తూలికా తల్పాలు నిండుగా జనం ఉంటేనే ఇంటి అరుగులుకి అందం. జనంతోటే రచ్చబండకు మరింత అందం. రచ్చబండ అంటే అది ఒక పార్లమెంట్. ఆ ఊరి దగ్గర నుంచి దేశ రాజధాని వరకు అన్ని కబుర్లు ప్రశ్నలు సమాధానాలు వాదోపవాదాలు చివరికి సర్దుబాట్లు అన్ని అక్కడే. రోడ్డు వెడల్పు చేసే భాగంగా రావి చెట్టు కొట్టేస్తే రచ్చబండ కూడా ముక్కలైపోయింది. రంగురంగుల బల్బులు పెట్టి చలువ రాతి బండలు పెట్టి కమ్యూనిటీ హాలు ఆ ఊరిలో నాలుగు పేపర్లు వేయించుకుని జనాలందరినీ పిలుస్తోంది. మా ఊరు మారిపోయింది. మా ఊర్లో పేపర్ వస్తోంది. రచ్చబండ వద్దు రావి చెట్టు వద్దు అంటూ కమ్యూనిటీ హాలు బెంచ్ మీద చతికిలబడి పోతున్నారు జన o. పురుడు పునర్జన్మంటారు. చేతిలో వెదురు బుట్ట పట్టుకుని అమాయకంగా కనిపించే మంత్రసాని ఆ ఎరుక లి సుబ్బమ్మ సమయం అయింది బాబు ఇంజక్షన్ ఇవ్వండని చెప్పి పురిటి నొప్పులు పడుతున్న ఆ పిచ్చి తల్లికి సాయపడి ధైర్యం చెప్పి పండంటి బిడ్డను చేతిలో పెట్టి ఇచ్చినది పుచ్చుకొని కొన్నిసార్లు ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లే ఆ తల్లి ఎన్ని వందల ప్రాణాలు కాపాడిందో ఆ పల్లెలో. ఆమెకి ఏ డిగ్రీలు లేవు. వారసత్వంగా వచ్చిందే మంత్రసాని తనం. ఆమెకి ఏ మంత్రాలు తెలియవు. మరో ప్రాణికి జన్మనివ్వడానికి నరకయాతన పడుతున్న తల్లికి నాలుగు హితవచనాలు చెప్పడం తప్పితే ఏ మాటలు రావు. కాలం మారింది. మెడలో శతస్కోపు తో గుండెని రక్తాన్ని మైక్రోస్కోప్ లోను పరీక్షించే తెల్ల కోటు వేసుకున్న పెద్దమనిషి పట్టాలేదని మంత్రసానిని కసిరి కొట్టాడు. ఎటు పోయిందో ఆ పల్లె వదిలి ఆ మంత్రసాని. ఎక్కడి నుంచి వచ్చిందో గోడకి తగిలించి ఉండే బుల్లి తెర రోజంతా సినిమాలు వార్తలు సీరియళ్లు చూపించి వయసు మీరిన వాళ్ళకి కాలక్షేపానికి అడ్డంగా మారిపోయింది. అరుగుల మీద కూర్చుని పురాణాలు విని కాలక్షేపం చేసుకునే పెద్దవాళ్ళు హాలు దాటి అరుగు మీదకు రావడం మానేశారు. ఇంకా పిల్లలకి పురాణం కథలు ఎవరు చెబుతారు. నీతి కథలు ఎవరు నేర్పుతారు. మంచి చెడ్డ తేడా ఎవరు చెబుతారు. ఇలా ఉంది పల్లె బ్రతుకు. పట్టణo తో సమానం అయిపోయింది పల్లెటూరు. పల్లె పట్టుపావడ లాంటి పచ్చదనం వదిలి నాగరికత బొట్టు అలంకరించుకొంది. ఇక ముందు ఎలా మారిపోతుందో.బాపు గారు బ్రతికిఉంటే మచ్చుకి ఒక బొమ్మ వే యించుకుని ముందు తరాలు వాళ్లకి దాని గొప్పతనం దాచి ఉంచేవాళ్ళo. అయినా పల్లె. టూర్ అంటే నాకు చాలా ఇష్టం.