విశాఖమహానగరంలో ఘనంగా నిర్వహించిన యన్ సి సి యఫ్ వారి కార్టూన్ ప్రదర్శన - లాల్

యన్ సి సి యఫ్ వారి కార్టూన్ ప్రదర్శన

విశాఖమహానగరంలో ఘనంగా నిర్వహించిన యన్ సి సి యఫ్ వారి కార్టూన్ ప్రదర్శన
****
12-1-2024 నుండి 15-1-2024 వరకు విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన సంక్రాంతిసంబరాలు లో మన యన్ సి సి యఫ్ తరఫున చక్కని కార్టూన్ల ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగినది. ఈ నాలుగురోజులు ఈ వేడుకలు చూడడానికి లక్షకుపైగా సందర్శకులు వచ్చారు..వారిలో సుమారు ఐదువేలమంది మన స్టాల్ ను సందర్శించడం జరిగింది..అందరిని ఆకట్టుకుంది.వచ్చినవారిలో చాలామంది వీడియోతీసుకోవడం..కొన్ని కార్టూన్లను ఫోటోలు తీసుకోవడం ఫ్రెండ్స్ కి పంపుకోవడంచేశారు.శర్మగారి వాట్సాప్ కు స్పందిస్తున్న కోమాలో ఉన్న పేషెంట్ కార్టూను, వర్మగారి కరోనా వేషంవేసి దెబ్బలుతిన్న వాడికార్టూను, ఓంకార్ , రఘు, టి ఆర్ బాబు,లాల్ గారికార్టూన్లు , కన్నాజీగారి జీడిపప్పు తింటున్న కోడిపుంజుకార్టూను ఆలా అన్ని కార్టూన్లు విజిటర్స్ ని ఆకట్టుకున్నాయి.

కన్నాజీగారి కార్టూన్ చూసి నాకు అ బైసన్ బొమ్మకావాలి అని ఒక చిన్నపిల్లాడు ఒకటే ఏడుస్తూ ఉంటే వాళ్ళనాన్న ఊరుకోబెట్టి తీసుకెళ్ళాడు.

సరసిగారి తాతగారు భోగిపళ్ళు పోయమనడం కార్టూన్ చూసి పెద్దావిడ ఒకటే నవ్వి అందరికి చెప్పింది. గోతెలుగు.కాంలో పబ్లిషయిన డా.జయదేవ్ గారి కార్టూన్ ని చూసి కళ్ళుచెమర్చుకుంది ఒక వయసుమళ్ళిన ఆవిడ..(నవ్వుతెప్పించకుండా..లోతుగా ఆలోచింపజేసిందావిడని) అదే దూడ ఆవుతో అంటుంది... నా పాలు నన్నుతాగనివ్వకలాక్కెళుతున్నారు..నువ్వు గొబ్బిళ్ళకు పేడవెయ్యొద్దమ్మా!

ఈ ప్రదర్శనలో హాస్యరసాన్ని,కార్టూన్లను ప్రోత్సహిస్తూ కార్టూన్లు నిత్యందొరికే వనరులయిన హాస్యానందం గురించి..గోతెలుగు.కాం గురించి బ్యానర్లను ప్రదర్శించి కార్టూన్లను అమితంగా ఇష్టపడే విజిటర్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.

నభూతో నభవిష్యతిగా జరిగిన ఈ సంబరాలలో మనకు అవకాశమిచ్చిన గౌరవ రాజ్యసభసభ్యులు శ్రీ జి వి యల్ నరసింహారావుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

ఇంతటివిజయానికి కారణమైన నిరంతరం శ్రమించిన మన యన్ సి సి యఫ్ సభ్యులందరికి ధన్యవాదాలు.పండగరోజులైనా సరే అన్నిరోజులూ తప్పకుండా స్టాల్ వద్దకు హాజరయి నిబద్ధతతో పాల్గొన్న మన యన్ సి సి యఫ్ సభ్యులు టి ఆర్ బాబుగారు, దంతులూరివర్మగారు, రఘుగారు, ఓంకార్ గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు.

లాల్
విశాఖపట్నం
16-1-2024