లింగోద్భవం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

లింగోద్భవం .

లింగోద్భవం . శివరాత్రికి ప్రత్యేకం.

శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు.

పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి మహాగ్నిస్తంభాన్నిచల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది. కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు.

అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగం దర్శనం, స్వామి వారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ సమయంలో స్వామి వారిని బిల్వ పత్రాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని అంటారు.

ఆంధ్రప్రదేశ్ లోని పంచరామాల గురించి,జ్యోతిర్లింగాల గురించి....

ఈదిగువన ఉదాహరించిన 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.

పంచారామాల పుట్టుక.

శ్రీనాధుడు (సా.శ. 14 నుండి 15వ శతాబ్డం) రచించిన భీమేశ్వర పురాణములో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపం ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేతృత్వములో తీవ్రమైన జపతపాలను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహాదేవుని శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగం

మాత్రం చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛేదించి ఐదు వేరు వేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి.

స్కాంద పురాణం.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది. హిరణ్యకశ్యపుని కుమారుడు

నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః

- స్కాందం

తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. అవి:

అమరారామం.

అమరావతి క్షేత్రం లోని అమరేశ్వరస్వామి దేవాలయం గుంటూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.

ద్రాక్షారామం.

కోనసీమ జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో సా.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.

 

నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.

భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.

సోమారామం.

పశ్చిమగోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు అమ్మవారు ఉమాదేవి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్ధనస్వామి ఆలయంఅంటారు. తూర్పుచాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడోశతాబ్దంలో నిర్మించాడు. మామూలురోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవారు పైఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి.

కుమారభీమారామం.

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమారభీమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది. ఈయనే దాక్షారామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం సా.శ.892లో ప్రారంభమై సుమారు సా.శ.922 వరకు సాగింది.

క్షీరారామం.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధనుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపై పడతాయి.

ద్వాదశా జ్యోతిర్లింగాలు...

శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు అవి...

రామనాథస్వామి లింగం - రామేశ్వరం శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం భీమశంకర లింగం - భీమా శంకరం ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్) సోమనాథ లింగం - సోమనాథ్ నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక) ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం మహాకాళ లింగం - ఉజ్జయిని వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్) విశ్వేశ్వర లింగం - వారణాశి కేదార్‌నాథ్‌ ఆలయం

 

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

జ్యోతిర్లింగాలు.. సోమనాథుడు - విరవల్ రేవు, ప్రభాస్ పటాన్, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ - దీనిని ప్రభాస్ క్షేత్రం అంటారు. చంద్రునిచే ఈ లింగం ప్రతిష్ఠింపబడిందని స్థలపురాణం. మల్లికార్జునుడు - శ్రీశైలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ - ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి. మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ - క్షిప్రానది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరం, మధ్య ప్రదేశ్ - నర్మద (రేవా) నదీతీరాన వెలసింది. ఇక్కడ ఒకే లింగం రెండు బాగాలుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతుంది. అమ్మవారు అన్నపూర్ణ. వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవఘర్, బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉంది. సహ్యాద్రి కొండల అంచునుంది. అమృతమధనానంతరం ధన్వంతరిని, అమృతాన్ని ఈ లింగంలో దాచిరనీ, సృశించిన భక్తులకు అమృతం లభించుననీ నమ్మకం. భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనే వద్ద, మహారాష్ట్ర - చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతాలవద్ద - త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడా యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండం ఉన్నాయి. రామేశ్వరుడు - రామేశ్వరం, తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం - కాశీ గంగా జలాన్ని రామేశ్వరంనకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి. నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనం) ద్వారక వద్ద, మహారాష్ట్ర - ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు. విశ్వనాథుడు - వారణాసి, ఉత్తర ప్రదేశ్ - కాశీ అని కూడా ప్రసిద్ధం - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానం - పరమపావన తీర్థం - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర - గౌతమీ తీరాన - ఇక్కడి లింగం చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగాలున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరం ఉంది. కుశావర్త తీర్థం, గంగాధార తీర్థం, వరాహ తీర్థం ముఖ్యమైనవి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థపర్వం పెద్ద పండుగ. కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనానికి తెరచి ఉంటుంది. ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర - (దేవగిరి లోనిదే జ్యోతిర్లింగమని కూడా చెప్పుదురు) మోక్ష సాధన ,వైరాగ్యం,భక్తి,జ్ఞానం ప్రధాన మార్గాలు అంటారు పెద్దలు. లింగారాధన ఈసృష్టిలో అత్యంత ప్రాచీనమైనది. బ్రహ్మ,విష్ణు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారే లింగారాధన చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆకృతిని బట్టటి,ఛాయను బట్టి లింగ విభజన జరుగుతుంది. అవి...."ఆట్యం"-"సారోట్యం"-"అనాట్యం"-"సర్వసమం"అని నాలుగు రకాలుగా పిలువబడతాయి.

వేయి ఓకముఖం కలిగినలింగాన్ని"ఆట్యలింగం"అని.నూట ఎనిమిది ముఖాలు కలిగిన లింగాన్ని""సారోట్యలింగం" లేక "అష్టోత్తరలింగం" అని కూడా అంటారు.ఒకటినుండి ఐదుముఖాలు కలిగిన లింగాన్ని "సర్వసమ లింగం" అంటారు.మనకు విరివిగా కనిపించేవి "అనాట్య లింగం"అంటే ముఖం లేని లింగం.శ్రీకాళహస్తి-కాశీ-శ్రీశైలం లోలాగా.

ఏక ముఖం నుండి పంచ ముఖం కలిగిన శివలింగ ఆలయాలు అపూర్వమని చెప్పవచ్చు.పానవట్ట ఉపరి భాగంలో అమర్చిన ముఖాలనుబట్టి లింగవర్ణన జరుగుతుంది.ఆరు ముఖాలు కలిగిన "షణ్ముఖలింగం" కూడా ఉంది . కాని దీనిని ఆరాధించడం మన సాంప్రదాయంలో లేదు.పానవట్టనికి పైభాగాన రెండు చేతులతో శివుడు నడుముల వరకు అమర్చిన ముఖ లింగాలు మనకు కొన్నిచోట్ల దర్శనమిస్తాయి.

"ఏక ముఖ లింగం"తూర్పు ముఖంగా ఉండి తెల్లనిఛాయతో అవధులు లేక ప్రసరించే శక్తికలది.ఈలింగాన్ని"తత్పురుషం"అంటారు.ఇవి "తిరువన్నామలై"లో అరుణాచలేశ్వరుని ఆలయంలో పెరియనాయగర్ సన్నిధికి నైఋతి మూలలో అతిసుందర ఏక ముఖ లింగం ఉంది.అలాగే "చిదంబరం"లోనూ సుచీంద్రం ధానుమాలస్వామి ఆలయంలో ఏక ముఖ లింగాలను మనం దర్శించుకోవచ్చు.

"ద్విముఖ లింగం"తూర్పు-పడమరగా అమర్చబడి తూర్పుముఖాన్ని తత్పురుషం,గా,పడమర ముఖాన్ని "సాద్యోజాతం"గా పూజింప బడుతుంది.

"త్రిముఖ లింగం"పానవట్ట పైభాగంలో తూర్పుముఖం తత్పురుషం, ఉత్తర దిక్కు ముఖాన్ని "వాయుదేవము" అని, దక్షణ దిక్కు ముఖాన్ని "అఘోర" అని పిలుస్తారు.ఈలింగం తూర్పుముఖం చిరునవ్వుతోనూ, ఉత్తరముఖం బంగారు రంగుతోమందహాసం తోనూ,దక్షణముఖం ఉగ్రరూపంతోను మలచబడి ఉంటాయి.బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులకు ప్రతిరూపంగా-సత్య-రజ తమో గుణాలకు ప్రతీక. ఈత్రిముఖ లింగం తమిళనాడులోని దిండివనం వద్దఉన్న "తిరువాక్కరై" క్షేత్రంలోని "చంద్రమౌళిశ్వర"ఆలయంలోమాత్రమే చూడవచ్చు.ఈభూమండలంలో అంతటిలోనూ ఉన్న ఏకైక త్రిముఖలింగ ఆలయం ఇది ఓక్కటే. ఇలామలచిన విగ్రహాలు ఎలిఫెంటా గుహలలో (ముంబాయి) దుండగుల చేతిలో శిధిలమై కనిపిస్తాయి.అలానే ఇటువంటి పోలికలుకలిగిన త్రిముఖం "ఇండోనేషియా"లో ఉంది.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన "త్రయంబక లింగం"ముమ్మూర్తులా ఇలానేఉంటుంది.

"చతుర్ముఖ లింగం"పానవట్టపై నాలుగు ముఖలింగాలు కలిగి ప్రతిష్టించిన దేవాలయాన్ని."సర్వతో భద్రాలయం"అంటారు."తిరువన్నామలై"-"తిరువానైక్కావల్"-కంచిలోని "కచ్చపేశ్వర"ఆలయాలలో ఈచతుర్ము ఖలింగాలను దర్మించుకోవచ్చు.(ఇవన్ని తమిళనాడులోఉన్నవి) ఈలింగాన్ని "వేదలింగం" అనికూడా అంటారు.పడమరముఖాన్ని

"సద్యోజాతాది"అంటారు.

"పంచముఖ లింగం"ఈలింగానికి నలు దిశలతో పాటు,లింగం పైభాగాన (అంతర్ముఖంగా)ఆకాశంకేసి చూస్తున్నట్లు ముఖ రహితంగా ఉంటుంది. తమిళనాడులోని "వేలూరు"లోని"మార్గసహాయేశ్వర" ఆలయంలోనూ, నేపాల్ లోని"పసుపతి నాద్" దేవాలయంలోచూడవచ్చు .ఈలింగానికి

పైభాగాన ఉన్నముఖాన్ని"ఈశాన"అంటారు.

ముపైఆరు ముఖాలుకలిగిన లింగం తమిళనాడులోని మహాబలిపురంలో ఉంది.

విచిత్రలింగాలు:పిఠాపురంలోని "కుక్కుటేశ్వరుడు" స్వయంభూవులింగం. ఈలింగానికి ఇరువైపులా 'రెక్కలు'ఉంటాయి. ఈక్షేత్రాన్ని "పాదగయా"అనికూడా అంటారు.

కాళేశ్వరము:ఒ కేపానవట్టంపై రెండులింగాలు దర్శించుకోవచ్చు.లింగానికి నాసికరంధ్రాలుఉంటాయి.ఈలింగం నాసిక రంధ్రాలలో ఎంత అభిషేక జలం పోసినా ఓక్కచుక్కజలం వెలుపలకు రాదు.

మంథాని:ఒకేపానవట్టంపై పదకొండు లింగాలు ఉంటాయి.ఇక్కడ ఒకే విగ్రహంలో పదకొండు నందులు చూడవచ్చు.ఈఆలయనిర్మాణ రాళ్లు నీటిపైతేలడం విషేషం.

గోవా: చంద్రనాద్ ఇక్కడ ప్రతిపౌర్ణమికి లింగంపై వెన్నెలపడుతుంది .ఆసమయంలో లింగంనుండి నీరు ఉబుకుతుంది. స్వామిపేరు చంద్రేశ్వరుడు.

పంచభూతలింగాలు:క్షితిలింగం (కంంచి)ఆకాశలింగ (చిదంబరం) జలలింగం (జంబుకేశ్వరం)తేజోలింగం (తిరువన్నామలై) వాయులింగం(శ్రీకాళహస్తి)

పెదపులివర్రు:ఇది తెల్లని పాలరాతి లింగం మకర సంక్రాంతి రోజు సూర్యోదయకిరణాలు లింగంపై ప్రసరింపబడతాయి.కిన్నెరకైలాస పర్వత లింగం ఇది వాతావరణానికి అనుగుణంగా రంగులు మార్చుకుంటుంది. చెన్నయ్ లోని"వడివాంబిక"దేవి,కరుమారిఅమ్మన్" కొటిలింగాలపల్లి లోనూ,కాశీలోనూ,"అష్టోత్తర లింగాలను"దర్శించుకోవచ్చు. "త్రికోటేశ్వరుడు"గా మీసాల కోటయ్య ,కోటప్పకొండలోనూ, అమరనాధ్-గోకర్ణంవంటి పలుప్రాంతాలలో భక్తీలను శంకరుడు పరవశింపజేస్తున్నాడు.

లింగాకారం కాకుండా పార్వతిదేవి మనోహరుడు మానవ రూపంలో కనిపించే దేవాలయాలు రెండూ తెలుగు నేలపై ఉన్నాయి.ఒకటి అనంతపురం జిల్లా అమరాపుర మండలం హేమావతి గ్రామంలోని "సిద్దేశ్వర ఆలయం"రెండవది చిత్తూరుజిల్లా నాగలాపుర మండలం సురుటుపల్లి గ్రామంలో ని"పళ్లికొండేశ్వర"స్వామి పవ్వళించి కనిపిస్తాడు. ఈఆలయంలోనే సతీసమేత"దక్షణామూర్తి"కనిపిస్తారు.మరెకక్కడ దక్షణామూర్తి సతి సమేతంగా కనిపించడు.శివభక్తులను నయనార్లు అంటారు.ఇటువంటి మహిమాన్విత,మనోహర సుందర రూపలింగాలు ఆసియా లో ఎన్నోకనిపిస్తాయి.ఏరూపంలో కొలిచినా,ఏబాషలో వేడుకున్నా, ఏగుడిలోమొక్కినా ఫలితం ఓక్కటే.నదులన్ని సాగరం చేరినట్లే పూజించే వారంతా ఆసదాశివుని చేరుకోవలసిందే! దేవదేవుని కృపకు అందరూ పాత్రులే.అదే మానవ జీవిత పరమార్ధం.

"హరహరమహదేవ శంభోశంకరా"