పూర్వజన్మ కృతం పాపం - సి.హెచ్.ప్రతాప్

Poorva janma krutam paapam

పూర్వజన్మలలో చేసిన పాపాలే ఈ జన్మలో వ్యాధులుగా అవతరిస్తాయి.పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టేయే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.

ఇప్పుడు మనకు భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మకి, మన గత జన్మలకి సంబంధం ఉంది. గత జన్మలో మనం చేసిన పుణ్యాలు, పాపాలు అన్నీ కూడా ఆత్మ స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాలి. ఆ పాప, పుణ్యాల ఫలితాలను, పాపాలకు ప్రతికూల యోగాలుగా, పుణ్యాలకు అనుకూల యోగాలుగా ఫలితాన్ని మనం ఈ జన్మలో అందుకుంటాము అని జ్యోతిష్య శాస్త్రం ప్రబోధిస్తొంది. కామాకామకృతం తేషాం మహాపాపం ద్విధాస్మృతమ్” అన్నది సాస్త్ర వచనం. బుద్ధి పూర్వకముగా చేసినది, కోరకతో చేసినది అని పాపములు రెండు విధములు. అయితే శాస్త్రం ప్రకారం తెలియక జేసిన పాపములు ప్రాయశ్చిత్తము వలన నిర్మూలనము అవుతాయి కానీ తలబిరుసు, అహంకారం తో తెలిసి తెలిసి కావాలని చేసిన పాపములు ప్రాయశ్చిత్తముతో పోవని మనం అర్ధం చెసుకోవాలి. అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు. ‘తెలియకుండా చేసిన పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగ పాపం తొలగిపోతుంది.

పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే, తచ్ఛాంతి రౌషధై ర్దానైః జపహోమ సూరార్చనైః” అని లోకోక్తి.

 

మనం చేసిన పాపకర్మలే మళ్ళీ మళ్ళీ మనకు చుట్టుకుంటూ వుంటాయి. జీవితం అందించే చేదు అనుభవాల ద్వారానే మనం జ్ఞానపాఠాలు నేర్చుకుంటాం. అయితే ఈ జ్ఞానపాఠాలు నేర్చుకుంటేనే వ్యాధులు మౌలికంగా మాయమవుతాయి , అనుభవిస్తున్న వ్యాధుల నుంచీ, మరి రాబోయే వ్యాధుల నుంచీ శాశ్వతంగా తప్పించుకోవాలి అంటే . . ధ్యానమే ఏకైక శరణ్యంఅని పత్రీజీ పూర్వ జన్మ కర్మలు ఈ జన్మలో ఎలా మనల్ని బాధిస్తాయో అద్భుతంగా చెప్పారు.

మరి పాపం అంటే ఏమిటి… చెడు కర్మ, చెడు పని పాపం అన్నారు. మరి చెడు పని అంటే… శాస్త్ర వచనమునకు తద్భిన్న మైనది, విరుద్ధ మైనది. అంటే ఒక జీవి పట్ల అనుచితముగా ప్రవర్తించడం. చేసిన పాపాలకు పరిహారంగా కొన్ని శిక్షలు ధర్మశాస్ర్తాలలో చెప్పడమనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే. ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.