తప్పు - మద్దూరి నరసింహమూర్తి

Tappu

ముందు మాట : స్వస్థలానికి దూరంగా విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ ఉంటూ, ఆశతో గతస్మృతులు

నెమరు వేసుకుందుకై స్వస్థలానికి వచ్చే వారి అనుభవానికి -- అద్దం పట్టేదే ఈ కథ.

తప్పు

“మీనాక్షీ, మన ఊరికి విమానాశ్రయం వచ్చిందని, అక్కడకు దగ్గరగా అరడజను హోటేల్స్ కూడా వచ్చేయని, ఆ హోటేల్స్ లో దిగేందుకు వచ్చిన వారిని విమానాశ్రయం నుంచి ఎటువంటి ఖర్చు లేకుండా తీసుకొని వెళ్లడానికి ఆ హోటల్ వారు కార్లను కూడా ఏర్పాటుచేసేరని - ఈరోజు దినపత్రికలో వచ్చింది” సుందరేశం ఉత్సాహంగా చెప్పుకొచ్చేడు.

“మన ఇద్దరి తల్లితండ్రులు గతించి పాతికేళ్ళైనా, ఏ కారణం అయితేనేం, ఇంతవరకూ మనం మన ఊరికి వెళ్ళలేదు. ఇప్పుడు విమానయానం సదుపాయం కూడా ఉన్న మన ఊరికి త్వరలో విమానంలో వెళ్ళి ఒకసారి మన ఊరు చూసి గతస్మృతులు తాజా చేసుకొని వద్దామండీ”

“మన ఊరిప్పుడు చాలా మారిపోయి ఉంటుంది మీనాక్షీ. మన జ్ఞాపకాల్లో ఉన్న ఊరు కనపడకపోతే విచారించవలసి వస్తుందేమో”

“మన ఊరు అభివృద్ధి చెంది ఉంటుంది కానీ మారిపోతుందేమిటండీ, మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు. రోడ్లు అక్కడి ప్రదేశాలు ఎలా మారిపోతాయి చెప్పండి. మనం చదివిన బడులు, మన బడులకు దగ్గరగా ఉన్న సినీమా హాలు, విశాలమైన మండువాలో ఎత్తుగా కట్టిన వేదిక మీద మన పెళ్ళైన ఇరుకులవారి పెద్ద ఇల్లు, ఆ ఇంటికి ఎదురుగా మీకు విడిదిల్లుగా కేటాయించిన ఇల్లు, అక్కడికి దగ్గరగానే మన పెళ్ళిలోని తోట కార్యక్రమం జరిగిన రాములవారి గుడి – ఇవన్నీ చూసి మన పాతరోజులు గుర్తు తెచ్చుకొని మనసా ఆనందించి రావొచ్చు, నా మాట కాదనకండీ” అని ముద్దుగా పలికిన మీనాక్షి పలుకులను కొట్టివేసే ధైర్యం లేని సుందరేశం –

“సరే” అంటూనే –

పెళ్ళైన దగ్గరనుచీ సంసారం ‘మధురై’ గా మారిపోయింది కానీ, ముచ్చటగా మూన్నాళ్లు కూడా ‘చిదంబరం’ గా చిందులు వేసిందే లేదని తనలో తాను వాపోయేడు.

రాత్రి పూట వారి జన్మభూమిలో నిండైన లైట్ల వెలుగులలో విమానం దిగుతూంటే, విమానం లోపల తెరలు తెరలుగా చీకటి కమ్ముకొని ఉండగా, కోరిక తీర్చిన సుందరేశం చెంప మీద ఉత్సుకత నిండిన మీనాక్షి తన అధరాలను నిశ్శబ్దంగా ముద్రించింది.

హోటల్ వారు విమానాశ్రయంకు పంపిన కారులో దర్జాగా ప్రయాణించి ఎంతో దర్పంగా హోటల్ కి చేరుకొన్న దంపతులు, మరునాడు ఉదయం అల్పాహారం అక్కడే చేసి, తమ స్వస్థలం చూస్తూ గతస్మృతులు నెమరవేసుకునేందుకు ఆత్రంగా అద్దె కార్లో బయల్దేరేరు.

వారి కళ్యాణం జరిగిన ఇరుకులవారి ఇల్లు మరియు ఆ ఇంటికి ఎదురుగా అప్పుడు అందిన విడిదింటికి బదులుగా -- పది అంతస్తుల ఎత్తులో నిలచిన గృహాసముదాయాలు చూసి కొంత అబ్బుర పడినా, కంటికి ఇంపుగా గతస్మృతులు కనపడకపోయేసరికి చాలా నిరుత్సాహపడ్డారు. రాములవారికి నిత్యపూజాదికాలే కరవైపోయాయా అనిపించేటట్టు కళావిహీనంగా కనపడిన గుడిని చూసి -- వారి కళ్ళ వెంట కారిన నీటితో సీతారాముల పాదాలు భక్తితో కడిగేరు. 500 మీటర్ల దూరంలో బాలబాలికలకు వేరు వేరుగా ఉంటూ, వారిరువిరు చదువుకున్న సర్కారువారి బడులకు బదులుగా -- ఒకేచోట బాలబాలికలకు నాలుగు అంతస్తులలో బేసర్కారువారి బడి కనపడే సరికి, పాత రోజుల ఛాయలు కూడా కంటికి కానరాక కొంత విచారానికి గురయేరు. దంపతులైన తదుపరి, వారిరువురూ పలుమార్లు జంటగా ఎన్నో సినీమాలు చూసిన సినీమాహాలు ఉండే స్థలంలో, నాలుగు సినీమా తెరలు తినుబండారాల దుఖానాలతో పెద్ద మాల్ కనపడేసరికి, అంత సందడిలోనూ పూర్తి ఒంటరితనానికి లోనయ్యేరు.

త స్మృతులు తాజా చేసుకుందామని ఎంతో ఆశతో వచ్చిన

వారి మనసుల్లో దాచుకున్న మధురస్మృతులు మాయమైపోగా,

వచ్చి తప్పు చేసామనిపించింది వారికి.

**శ్రీరామ**

మరిన్ని కథలు

Andari bandhuvayya
అందరి బంధువయ్యా
- డా:సి.హెచ్.ప్రతాప్
Ruthuchakram- O chinnari katha
ఋతు చక్రం - ఓ చిన్నారి కథ
- మిక్కిలి రాజ్యలక్ష్మి
Dharma samstapanardhaya
ధర్మ సంస్థాపనార్ధాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Atyaasha
అత్యాశ
- చెన్నూరి సుదర్శన్
Bhayanakam
భయానకం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vinadagunevvaru cheppina
వినదగు'నెవ్వరు'చెప్పిన!!
- జి.ఆర్.భాస్కర బాబు
Aadapillamma
ఆడపిల్లమ్మా!
- రాపాక కామేశ్వర రావు