గంగిరెద్దు ఆటలు. - సృజన.

Gangireddu aatalu

 

గంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం.ఇది ప్రాచీనమైనది. తెలుగు సంప్రదాయాలకు గుర్తు సన్నాయి అప్పన్న, విశాఖ పట్నంలో జరిగే విశాఖ ఉత్సవ చిహ్నం కూడా సన్నాయి అప్పన్నే. కానీ సన్నాయి అప్పన్నల జీవితాలలో విషాదమైన సంగీతము మారుమ్రోగుతోంది. ఇతరులకు సన్నాయి పాటలను వినిపించి డోలు కొట్టి, శిక్షణ నిచ్చిన గంగిరెద్దును పట్టుకొని తిరిగే గందిరెద్దులోళ్ళు జీవితాలు చీకటి మయమయ్యాయి. స్థిర నివాసాలు లేనివారు, భూములు లేని వీరికి విద్యా, ఉద్యోగం, మొదలగు వాటిలో వున్న రిజర్వేషన్లు వీరికి తెలియవు.

"గంగిరెద్దుల వాడు కావర మణచి - ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు" అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి అతి ప్రాచీన కాలం నుంచీ ఈ గంగి రెద్దాటలు ప్రచారంలో వున్నాయని తెలుస్తుంది.

గంగిరెద్దుల ఆటకు మూలం.

పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నంది కేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బూర, సుత్తి లను ధరింప చేసి, తాను మేళానికి నాయకత్వం వహించి ...గజాసురుని చెవుల బడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించ మని కోరుతాడట. అందు కోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. గజాసురుడు ఆనంద భరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట. తన పాచిక పారిందనుకున్న హరి... ఇది శివుని వాహనమై న నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజ లందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా యివ్వడం జరుగుతుంది. (గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు) అప్పటి నుండి గంగిరెద్దులను తిప్పుకొని బ్రతుకు తున్నట్లు పెద్దలు చెప్తారు.

వీరు ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట, రాములవారి పాట, ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట, వీరగున్నమ్మ పాట (మందస ప్రాంతంలో), మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీకట్టి పాడతారు. సినిమా పాటలు కూడా పాడతారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా గంగిరెద్దుల వారున్నారు. అయినా వీరంతా తెలుగువారే. మహారాష్ట్రలో వీరిని నందివాలా అంటారు.

గంగిరెద్దు ఆటల .

డూడూ బసవన్న

“ డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా వురుకుతు రారన్నా రారన్న బసవన్నా

అమ్మవారికీ దండం బెట్టు అయ్యగారికీ దండం బెట్టు

మునసబు గారికి దండం బెట్టూ

కరణం గారికి దండం బెట్టూ

రారా బసవన్నా, రారా బసవన్నా.... అంటూ ”

ఈ ఇంటికి మేలు జరుగుతాదని చెప్పు, మంచి జరుగుతాదని చెప్పు అంటూ గంగిరెద్దులతో తలలను ఊపిస్తారు. ఒక నాడు దేదీప్యమానంగా వెలిగిన గంగిరెద్దాటలు వ్యాచక వృత్తిని అవలంబించినా అవి విద్వత్తును ప్రదర్శించే గంగి రెద్దుల మేళంగానూ, ప్రజలను వినోద పర్చి ఆనందింప చేసే కళా రూపంగానూ ఖ్యాతి వహించింది. గంగిరెద్దుల మేళాల వారు, రెండు మూడు కుటుంబాలు కలిసి అయిదారు అందమైన బలిసిన గంగిరెద్దులతో దండుగా బయలు దేరి ఆంధ్ర దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ మకాంలు వేస్తూ జీవ యాత్రలు చేసే వారు. ఒకప్పుడు రాజులూ జమీందారులూ వారి వారి ప్రాంగణాలలో గంగి రెద్దులాటను ఏర్పాటు చేసుకుని వినోదించే వారు. గంగి రెద్దుల వారు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తెలుగు భాషనే మాట్లాడుతారు. వీరికి ఒక ఊరనేది లేదు. సంచార జీవులైన వీరు పర్వ దినాలలోనూ, ముఖ్యంగా రైతులకు పంటలన్నీ చేతికి వచ్చి పని పాటలు లేని సమయాల్లోనూ, సంక్రాంతి పండుగ దినాలలోనూ ఊర్ల వెంట బయలు దేరుతారు.

గంగిరెద్దులోళ్ళు యాదవులలో ఒక భాగమని చెప్పుకుంటారు. కాని గొల్లలకు వీరికి ఎటువంటి సంబధాలు లేవు. గతంలో గంగిరెద్దుల కులస్థులలో మగవారు గంగిరెద్దు పట్టుకొని ఊరంతా తిరిగితే ఆడవారు గ్రామాలలో కరక్కాయలు, దగ్గుమందులు, గిలకలు అమ్మేవారు. నేడు ఆ పరిస్థితులు మారటంతో ఆడవారు ఫ్యాన్సీ సామానులైన బొట్లు, కాటుకలు, తిలకాలు, అద్దాలు, పైనలు (దువ్వెనలు) ఊరూరా అమ్ముకుని వస్తున్నారు. కొన్ని చోట్ల ఆడవారు ఈత చాపలు, బుట్టలు, గిలకలు అల్లటం చేస్తుంటాయి.

ఆధునికత సంతరించక ముందు ప్రజలు గంగిరెద్దుల వారిని ఆదరించి బట్టలు, భత్యం, డబ్బులు యిచ్చి చనిపోయిన తాత తండ్రుల పేరు మీద పొగిడించేవారు. గ్రామాలలో వివిధ ప్రదేశాలలో గంగిరెద్దు విన్యాసాలు చేయించేవారు. ఈ రోజు ఆ పరిస్థితులు మారిపోయి భిక్షాటకుల కంటే అధ్వానంగా తయారైనారు. ఊరంతా గంగిరెద్దు తిప్పినా పూట గడవని పరిస్థితి. తమలాగే తమ పిల్లలు కూడా గంగిరెద్దుని తీసుకొని వెళ్ళటం, ఆడపిల్లలు ఫ్యాన్సీ సామాన్లు అమ్మటం జరుగుతుంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా నిరక్షరాస్యులే. ఇక గంగిరెద్దు విషయానికి వస్తే గంగిరెద్దే గంగిరెద్దులవారి ఆస్తి. పూర్వపు రోజులలో దేవుడు పేరు మీదుగా మొక్కుకున్న గంగిరెద్దు ప్రజలు ఉచితంగా యిచ్చేవారు. కొన్ని ప్రాంతాలలో ఉచితంగా యిస్తున్నా సింహాచలం దేవస్థానంలో మాత్రం గంగిరెద్దు వేలం పాడుకొని కొనుక్కోవలసి ఉంటుంది. ఒక్కొక్క గంగిరెద్దు రూ.1000 నుండి రూ.2000 వరకు పలుకుతుంది. అంత స్తోమత గంగిరెద్దుల వారికి లేదు. సింహాద్రి అప్పన్నను ఊరూరా వాడ వాడా పొగడటమే తప్ప సింహాచలం దేవస్థానం నుండి వీరికి ఎటువంటి సహాయం అందటం లేదు. భద్రాచల రాముని పేరు మీద, తిరుపతి వెంకన్న పేరుమీద, వేములవాడ రాజరాజేశ్వరి పేరుమీద రాష్ట్రమంతటా పొగిడి గంగిరెద్దును తిప్పే గంగిరెద్దుల వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నారు. గంగిరెద్దులు వారు సంక్రాంతికి ముందే కొన్ని ప్రాంతాలకు వలస పోతుంటారు. ఒక్కొక్క గ్రామంలో గుడారాలు వేసుకొని వారం, పది రోజులు నివాసం ఉండి పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేస్తారు. శివరాత్రి సరికి గ్రామాలు చేరుకుంటారు. అందుకే వీరి పిల్లలను కూడా విద్యాభ్యాసాలు ఉండవు. ఇపుడిపుడే ఈ వలసలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి.

ఆటను నేర్పటం.

వయసులో వున్న కోడె గిత్తల్ని తీసుక వచ్చి, వాటి ముక్కులకు ముకుతాడు కట్టి వాటి పొగరు బోతు తనాన్ని అణగ గొట్టి, వాటిని లొంగ దీసుకుని, చెప్పినట్ట్లు చేసేలా తయారు చేసే వారు. ఉదాహరణకు సర్కస్ జంతువులకు తరిఫీదు ఇచ్చినట్లు. ఇలా వాటిని కొన్ని మాసాల పాటు మచ్చిక చేసుకునే వారు. వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేయించటం, పరుగెత్తించటం, పడుకోబెట్టటం, అటూ ఇటూ దొర్లటం, మూడు కాళ్ళ మీద నుంచో పెట్టటం, చిట్టి అడుగులతో నృత్యం చేయటం, దూడూ బసవన్నా, రారా బసవన్నా అంటూ వాటిని పరుగులు పెట్టించటం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం చేయమంటే కాలు పైకెత్తి సలాం చేయటం, ఆడించే వాడు వెల్లకిలా పడుకొని తన గుండెలమీద గంగి రెద్దు ముందు రెండు కాళ్ళను, తొడలమీడ వెనక కాళ్ళను పెట్టించుకుని వూపడం, ఇలా ఎన్నో విద్యల్ని కొన్ని మాసాలపాటు నేర్పి వీధిలోకి ప్రదర్శనకు తీసుకవస్తారు.

గంగిరెద్దుల అలంకారం:

గంగిరెద్దుల్ని స్వంత బిడ్డల్లా చూస్తారు. వాటిని ఎన్నో రకాలుగా అలంకారిస్తారు. మూపురం వద్ద నుండి తోక వరకూ ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. రింగులతో కొమ్ములను అలంకరిస్తారు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడిగి చిరవన రంగురంగుల ఊలు దారాల కుచ్చులను కట్టతారు. వీటినే కుప్పెలు అని అంటారు. మూతికి తోలుతో కుట్టబడిన మూజంబరంను కడతారు. నొసటి భాగాన అందమైన తోలు కుచ్చులను కడతారు. అందమైన గవ్వలను కూడా కడాతారు. మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగ వేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును, గవ్వల హారాన్ని కడతారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. ఇంటి యజమానులు చీరలు, దుప్పట్లు వంటి బట్టలను ఇస్తారు. వాటిని ఆ గంగిరెద్దు వీపు మీద వేస్తుంటారు. అప్పుడు చూడాలి ఆ బసవన్నల అందం. సాక్షాత్తూ నందికేశ్వరుని పోలి వుంటుంది.

ఆడించే వారి హంగులు:

గంగి రెద్దుల వారి హంగులు, శ్రుతి సన్నాయి బూర, డోలు, చేతిలో కంచుతో చేయబడిన చిన్న చేగంట, వేషధారణలో నెత్తికి రంగుల తలగుడ్డ మూతిమీద కోర మీసాలు, చెవులకు కమ్మల జోడు, వారు వీరు ఇచ్చిన పాత కోటు, భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు, నుదురున పంగనామంతో సైకిల్ పంచ కట్టు కట్టి ఆకర్షణీయంగా తయారౌతారు. గంగిరెద్దుల వారికి ప్రతి వూరిలోనూ మధ్యనున్న పెద్ద బజారే వారికి రంగస్థలం. ముందుగా గ్రామంలో ప్రవేశించి, గ్రామ పెద్దల నాశ్రయించి వారి అనుమతితో ప్రదర్శనం ఏర్పాటు చేసుకుంటారు. వారి వాయిద్యాలాతో రణగొణ ధ్వనులు చేసి ప్రజలను రప్పిస్తారు. ఆ రోజుల్లో గంగి రెద్దుల ఆటలంటే మహా దానందంతో హాజరయ్యేవారు. ప్రేక్షకులందరూ మూగిన తరువాత గంగి రెద్దులను మేళతాళాలతో బరినంతా తిప్పుగూ స్వాగతం పలికిస్తారు. ఎద్దు నోటిలో మెడను ఇరికించి అదృశ్యాన్ని అందరికీ చూపిస్తారు. వాయిద్యానికి అనుకూలంగా గజ్జెల కాళ్ళతో నృత్యం చేసేది, పడుకో మంటే పడుకునేది, లేవమంటేలేచేది, అయ్యగారికి దండం పెట్టమంటే తలవంచేది. అయ్యగారికి శుభం కలుగుతుందా? అనుకున్న పనులు జరుగుతాయా అంటే అవునన్నట్టు తల వూపుతుంది. వాడు అడిగిన ప్రతిదానికీ తల వూపడాన్ని బట్టే ఒక సామె పుట్టింది. మనవాళ్ళు అంటూ వుంటారు. ఏమిటిరా అడిగిన ప్రతిదానికీ గంగి రెద్దులా తల వూపుతావు. నోటితో సమాధానం చెప్పరా అని. అది ఏనాడో పుట్టిన సామెత.

రామ లక్ష్మణులు.

ఈ ఎద్దులను రామ లక్ష్మణులుగా ఎంచి పేర్లు పెట్టి పిలుస్తారు. వాటిని బసవేశ్వరుడుగా పిలుస్తారు. రాముడుగా సీతగా ఎంచి కళ్యాణం జరుపుతారు. ప్రేక్షకులు కూడా వాటిని రామలక్ష్మణులుగా ఎంచి భక్తి భావంతో వాటికి ధాన్యాన్ని తినిపించడం, అరటి పళ్ళు పెట్టటం చేస్తారు. ఇలా గంటన్నర కాలం కనువిందుగా ప్రదర్శనం జరుగు తుంది. గంగి రెద్దుల విన్యాసంలో మధ్య మధ్య పాటలు పాడతారు. వాయిద్యాలకు తగినట్లు వాళ్ళ పిల్లలతో మొగ్గలు వేయిస్తారు. మధ్య మధ్య ప్రేక్షకులను చూచి సమయానుకూలంగా చలోక్తులను విసురుతారు. అలాగే ప్రదర్శనం చూచి ముద్థులైన ప్రేక్షకుల నుంచి విరాళాలను స్వీకరిస్తారు. బసవన్నా ఈ బాబు నీకు పది రూపాయలిస్తున్నా రంటే అక్కడికికి పరుతెత్తు కొస్తుంది. రామన్నా ఈ బాబు నీ వీపుమీద కండువా కప్పుతానంటున్నాడు ఇలా పేరు పేరునా పిలిచి ప్రేక్షకులను మోమోట పెట్టి విరాళాలు గుంజు తారు. అయితే ఈ నాడు వీరి గంగిరెద్దుల విద్యక్షీణించి పోయి సామూహిక ప్రదర్శనాలు నశించి కాల ప్రవాహంలో సామూహిక గంగి రెద్దాటలు నశించి పోయాయి. ఈ గంగి రెద్దుల ఆటగాళ్ళు కేవలం పొట్ట పోసుకోవడానికి ఒక ఎద్దుతో వూరారా, ఇల్లిల్లూ తిరుగు తున్నారు. పల్లెల్లోనూ పట్టణాలలోనూ ఈ కాలంలో గంగిరెద్దులు ఆటలు కనిపిస్తున్నాయి. కేవలం ఒక్కడే ఒక నాగస్వరాన్ని వూదుతూ ఇల్లిల్లూ తిరుగుతూ బిక్షాటన చేస్తున్నారు. గంగిరెద్దులకు అన్ని అలంకారాలున్నా.... వాటితో గతంలో చేసిన విన్యాసాలను మాత్రం చేయించడం లేదు. ఆ విద్యలు గత తరంతో అంతమయ్యాయి. ఇప్పుడు కేవలం గంగిరెద్దు ఆకారం మాత్రం మిగిలివున్నది. వాటి ఆటలు కనుమరుగయ్యాయి.

ఉత్తరాంధ్రలో గంగిరెద్దులవారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సారంగపురం లోను, జాడుపూడి, మెళియాపుట్టి, ఆముదాలవలస దరి చింతాడ మొదలగు ప్రాంతాలలో ఉన్నారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం పిన్నవలస, గంట్యాడ, డెంకాడ, శృంగవరపుకోట మొదలగు ప్రాంతాలలోనూ, విశాఖపట్టణం జిల్లా సబ్బవరం (గంగిరెడ్ల కాలనీ) , చోడవరం/ద్వారకానగర్, వేపగుంట, బొడ్డుపల్లి, అంకలపాలెం, ముల్లునాయుడుపాలెం మొదలగు ప్రాంతాలలో ఉంటున్నారు. వీటిలో ఒక్క సబ్బవరం లోనే ప్రభుత్వం యిచ్చిన కాలనీ యిండ్లలో గత 30 సంవత్సరాల నుండి నివాసముంటున్నారు. మిగతా ఏ ప్రాంతంలోనూ వీరికి ప్రభుత్వం పక్కా యిల్లు యివ్వలేదు. సంక్రాంతి రోజులలో తప్పించి మిగతా రోజులలో పూట గడవటం కష్టంగా ఉంటుంది. కులవృత్తినే నమ్ముకుని ఇంక ఏ విధమైన పనులకు వెళ్లరు.

దరిచేరని రిజర్వేషన్లు.

సంచార జాతులలో ఉన్న వీరిని బి.సి కులాలలో "ఎ" గ్రూపులో చేర్చినా ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకొని చదివినవారు గానీ, ఉద్యోగం పొందినవారు కాని ఒక్కరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇది మన యాభై ఏళ్ళ భారత ప్రభుత్వం సాధించిన ప్రగతి. 10 వ తరగతి చదువుకొనే వారు అక్కడక్కడ కనిపిస్తారు. బి.ఎ వరకు చదువుకున్నవారు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నా వారికి కూడా ఉద్యోగాలు లేకపోవటంతో పిల్లలను చదివించటానికి కూడా ఎవరూ యిష్టపడటం లేదు.

కొమ్మదాసర్లు కూడా గంగిరెద్దులవారే.

విజయనగరం జిల్లా మరికొన్ని ప్రాంతాలలో "కొమ్మదాసర్లు"గా కూడా గంగిరెద్దులవారే వ్యవహరిస్తారు. కొమ్మదాసరిగా వ్యవహరించిన వారు గంగిరెద్దులను త్రిప్పరు. ఒక కొమ్మ పట్టుకొని, చెట్టుపై ఒక కొమ్మపై కూర్చుని కొమ్మదాసరోడొన్నినాడప్పో..... శాంతప్ప, కాంతప్ప, సరస్వతప్ప అంటూ ఆడవాళ్ళ పేర్లు పిలుస్తారు. కొమ్మపై ఉండగా తెచ్చిన బిక్షం గానీ, డబ్బులు గాని పుచ్చుకుంటారు. కొమ్మ దిగితే కోటి రూపాయలిచ్చినా కొమ్మదాసరోడు పుచ్చుకోడు.

కులం - కట్టుబాట్లు.

ఇక వీరు కుల సంప్రదాయాలను, కట్టుబాట్లను అంగీకరిస్తారు. ఈ కులంలో గొప్పతనాన్ని పెద్దలు వర్ణిస్తూ మా కులంలో ఇంతవరకు నేరం చేసినట్లుగానీ, దొంగతనం వగైరాలు చేసినట్లుగానీ కోర్టులను ఆశ్రయించటం గానీఇంతవరకు లేదని చెప్పారు. వీరు తమ సమస్యలను పెద్దల సమక్షంలో తేల్చుకుంటారు. గ్రామంలోని కులపెద్దల వలన పరిష్కారం కానప్పుడు జిల్లా పెద్దలను ఆశ్రయించి తగవులను పరిష్కరించుకుంటారు.

వివాహాల విషయానికొస్తే వీరి వివాహాలు సాదాసీదాగా జరుగుతాయి. ఇప్పటికీ కట్నపు వాసనలు ఈ కులంలో లేవు. ఆడపిల్లవారికి 26 రూపాయలు యిచ్చి వివాహము చేసుకొంటారు. కులాంతర వివాహాలు లేవు. కులాంతర వివాహం ఎవరైనా చేసుకుంటె కులం నుండి బహిష్కరిస్తారు. భార్యా భర్తలు మధ్య యిష్టం లేకపోయినా మొన్నటి వరకు విడాకులు ఉండేవి కాదు. కానీ ఇటీవల ఇష్టంలేని వారు విడిపోవటానికి పెద్దలు విడాకులకు అంగీకారం తెల్పుతున్నారు. గంగిరెద్దుల వారికి పునరావాసం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.