శ్రీ సాయి లీలామృతం - సి.హెచ్.ప్రతాప్

Sri Sai Leelamrutham

శ్రీ రఘువీర భాస్కర పురందరే చిన్ననాటి నుండి శ్రీ సాయికి పరమ భక్తుడు. నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, శ్రీ సాయి పూక చేయనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాడు. అతను వీలును బట్టి సంవత్సరానికి కనీసం మూడు, నాలుగు సార్లు తప్పక శిరిడీ దర్శనం చేసుకునేవాడు. ఒకరోజు అతని ధర్మపత్నికి తెల్లవారుఝామునే మూడు గంటల సమయం నుండి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దానితో కొద్దిసేపటికే ఆవిడ బాగా నీరసించిపోయి శరీరం చల్లబడిపోయింది.దానితో కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. డాక్టర్ వచ్చి ఆవిడను పరీక్షించి శ్వాస బలహీనంగా వుంది కాబట్టి ఒక గంట కంటే ఎక్కువ బ్రతకదని కాబట్టీ దగ్గర బంధువులను పిలిపించుకోమని ఖచ్చితంగా చెప్పేసాడు. అంతేకాక ఆఖరు క్షణాలలో మందులు అసలేమాత్రం పని చెయ్యవని , ఒక మాత్ర అయినా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆ వైద్యుడు. అయితే ఆ సమయానికి పురందరే ఇంట్లో లేడు. పక్క గ్రామంలో తన యజమాని భార్య కోసం తయారు చేస్తున్న ఒక ఖరీదైన నక్లెస్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.స్వగ్రామం నుండి భార్య అనారోగ్యం గురించి ఒక పాలెగాడు కబురు తెచ్చాడు. దానితో పురందరే అన్ని పనులను అక్కడికక్కడే ఆపివేసి వడివడిగా బయలుదేరాడు. అతని దురదృష్టం కొద్దీ అప్పుడు ఒక్క ఎడ్ల బండి కూడా సిద్ధంగా లేదు. దానితో తన గ్రామం వైపు పరుగులు తీయడం ప్రారంభించాడు. అయితే ఆ ఊరి పొలిమేర్లలో వున్న ఒక దత్త మందిరం ముందు తెల్లటి కఫ్నీ , భుజానికి జోలె వేలాడదీసుకొని వున్న ఒక ముస్లిం ఫకీరు పురందరేను జబ్బ పట్టుకొని ఆపి " నీ భార్య కోసం ఏ మాత్రం దిగులు చెందవద్దు. ఆమె ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అమెలో ప్రవేశింప ప్రయత్నించిన దుష్ట శక్తులను అల్లా తరిమివేసాడు. ఈ ఊదీను నీటిలో కలిపి త్రాగించు. అరగంటలో లేచి కూర్చుంటుంది. అల్లా మీఅందరినీ తప్పక రక్షిస్తాడు. " అని జోలె నుండి ఒక ఊదీ పొట్లాన్ని పురందరేకు ఇచ్చి " అల్లా అచ్చా కరేగా" అని ఆశీర్వదించాడు.


ఫకీరు దర్సనంతోనే పురందరేలో వున్న ఆందోళన అంతా మటుమాయమైపోయింది. ఆ ఫకీరును బాబా మారు స్వరూపంగా భావించి, సాయి నామస్మరణ చేసుకుంటూ తన ఊరికి చేరుకున్నాడు.అప్పటికి ఇంట్లో బంధువులంతా అందోళనతో నిమిషాలు లెఖ పెట్టుకుంటున్నారు. పురందరే భార్య ఆఖరు చూపుకు నోచుకున్నందుకు ఎంతో సంతోషించారు. పురందరే ఫకీరు చెప్పినట్లు ఊదీని నీటిలో కలిపి భార్య చేత బలవంతంగా త్రాగించాడు.అప్పటికే ఆమె శ్వాస చాలా బలహీనంగా వుంది. ఊదీ తీర్ధం సేవించిన తర్వాత శ్వాస మరింత బలహీనమై ఆవిడ కళ్ళు తేలేసింది.ఈ స్థితిలో ఆవిడను కిందకు దించేదామ్మని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా సాయి పట్ల విశ్వాసంతో వారిని పట్టించుకోకుండా ఆవడను తన వీపుకు ఆసరాగా చేసి కూర్చోబెట్టుకొని కాస్త కాస్త తీర్ధం సేవిస్తూ నుదుటిన ఊదీ రాయసాగాడు.కుటుంబ సభ్యులతో పాటు బాబా నామస్మరణ ప్రారంభించాడు.

 

ఒక గంట తర్వాత ఆ ఇంటి ముందు నుండి వెళ్తున్న ఆ వైద్యుడు ఇంట్లోకి వచ్చి ఆవిడను పరీక్ష చేసి ఆవిడ నాడి, గుండె పని తీరు , శ్వాశ ఎంతో మెరుగుపడిందని ఇంతకూ ఆవిడకు ఎవరు మందు ఇచ్చారని అడిగాడు. పురందరే ఈ ప్రపంచానికే వైద్యుడు అయిన సాయి ఫొటో చూపించి జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పాడు. ఫకీరు రూపంలో సాయి ఇచ్చిన ఊదీయే మృత సంజీవనిలా పని చేసి రోగి అనారోగ్యాన్ని క్షణాలలో పారదోలిందని అర్ధం చేసుకున్న ఆ వైద్యుడికి బాబాపై ఎనలేని, గురి, విశ్వాసం కుదిరాయి. వెంటనే తన వంతు కర్తవ్యంగా మందులు ఇచ్చి గంట గంటకూ ఆవిడను పర్యవేక్షించాడు. రెండు రోజులలోనే పురందరే భార్యకు పూర్తి స్వస్థత ఏర్పడింది. అత్యంత కరుణ, దయ, ప్రేమానురాగాలతో ఆవిడను మృత్యు ముఖం నుండి కాపాడినందుకు పురందరే, అతని కుటుంబ సభ్యులందరూ సాయికి శత సహస్ర కోటి కృతజ్ఞాతాభివందనములు తెలియజేసుకున్నారు. సాయి చెప్పిన శ్రద్ధ, సబూరిలతో ఆయనను సేవిస్తే తన భక్తులను సప్త సముద్రాల ఆవల వున్నా ఖూడా ఇట్టే రక్షిస్తారనడానికి పై లీల ఒక ఉదాహరణ. యుద్ధములో అర్జునిడికి కృష్ణుడు రథ సారధిలా వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేసాడే కాని , అతని బదులు స్వయంగా యుద్ధము చేయలేదు . అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవిన రథసారధి చేసుకుంటే మనకి కూడా అర్జునిడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ .నమ్మకమే మనని అన్ని వేళలా కాపాడుతుంది

మరిన్ని వ్యాసాలు