ఇది కూడా మార్పే - మద్దూరి నరసింహమూర్తి

Idi koodaa marpe

 

ప్రపంచంలో 'మార్పు' అన్నది సహజం. ఆ మార్పు మంచికి దారితీస్తే అందరూ హర్షిస్తారు, అందుకు కారకమైనవారిని అందలం ఎక్కిస్తారు. అలాకాక, ఆ మార్పు చెడుకి దారితీస్తే అందరూ విచారిస్తారు, అందుకు కారకమైనవారిని విమర్శిస్తారు.

 

ప్రస్తుతం, మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద –

‘మాతృభాషను కాపాడుకుందాం, అభివృద్ధి చేద్దాం’ అన్న తాపత్రయానికి గురి అవుతున్నది – మన ‘తెలుగుభాష’ ఒక్కటే అన్నది నిర్వివాదాంశం.

 

మన దౌర్భాగ్యం ఏమిటంటే -- మన తెలుగువాడు 'టెలుగు' లో తప్పించి 'తెలుగు' లో మాట్లాడడు.

ఇక, వ్రాత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతగా మన గౌరవం నిలబడుతుంది.

 

'మాతృభాష' అంటే తల్లి దగ్గర మనం అభ్యసించే భాష.

మాతృభాష నేర్పాలన్నా, కాపాడాలన్నా, కాపాడబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధిచెందబడాలన్నా -- బీజం మన తెలుగు మహిళామణుల దగ్గరే ఉంది.

ఆవిధంగా మన తెలుగు మహిళామణులు ఎంతో గురుతర బాధ్యత నెరవేర్చవలసిన కార్యనిర్వాహకులుగా నిలబడుతున్నారు.

 

కానీ ఈరోజుల్లో, తల్లులే తెలుగులో మాట్లాడరు; ఇక వారు వారి పిల్లలకు తెలుగు భాష ఏమి నేర్పగలరు.

 

మన దైనందిక కార్యకలాపాలలో మనతో మమేకమైన మన మహిళా వ్యాఖ్యాతల గళాలలో విలవిలలాడుతున్న మన మాతృభాష గురించి ఒకసారి పరికిద్దాం.

దూరదర్శన్ (టీవీ) మరియు దూరశ్రవణ (రేడియో) మాధ్యమాల ద్వారా ఏ కార్యక్రమం చూసినా/విన్నా -- మీకు ముందుగా కనిపించేది/వినిపించేది వ్యాఖ్యాత గళమే.

మాతృత్వానికి తద్వారా మాతృభాషకి ప్రతీకగా నిలిచే మహిళా వ్యాఖ్యాతలు కార్యక్రమం ఆసాంతం వారు మాట్లాడే మాటలలో ఎనభై శాతం పైగా ఆంగ్లంలోనే మాట్లాడేందుకు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.

వారు కార్యక్రమాలు నడిపే ధోరణి ఎలా ఉంటుందంటే – పొరపాటున కూడా తెలుగు పదాలు దొర్లకూడదని బహు జాగ్రత్త పడుతున్నట్టుగా మనకి తెలిసిపోతూంటుంది.

 

ఈ వ్యాసకర్తగా కొన్ని ఉదాహరణలు ఉటంకించవలసిన బాధ్యత నామీద ఉంది కాబట్టి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తున్నాను.

మన మహిళా వ్యాఖ్యాతలు --

‘పాట’ అనరు ‘సాంగ్’ అనే అంటారు;

‘చిత్రం’ అనరు ‘ఫిలిం’ అనే అంటారు;

‘గాయకులు’ అనరు ‘సింగర్స్’ అనే అంటారు;

‘సంగీతదర్శకుడు’ అనరు ‘మ్యూజిక్ డైరెక్టర్’ అనే అంటారు;

‘పాట రచయిత’ అనరు ‘లిరిసిస్ట్’ అనే అంటారు.

---ఇలా ఎన్నని చెప్పను?

 

ఈ లెక్కన, మన మహిళా వ్యాఖ్యాతలు మన మాతృభాష అయిన

తెలుగు భాషకు ఎంతటి (హీనమైన) మార్పు చేకూరేందుకు దోహదం

చేస్తున్నారో అన్న ఆవేదన కలగక తప్పడంలేదు.

 

తెలుగు భాషాభిమానినైన నేను కొద్దిరోజులుగా గమనించిన నగ్న సత్యాలను మాత్రమే ఇప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం చేసేను.

అంతేకానీ, ఎవరినీ -- అందునా నా సోదరీమణులను -- కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు; పురుషుడనైన నేను మహిళా ద్వేషిగా ఈ వ్యాసం వ్రాసేను అని పొరపాటున కూడా పొరపడకండి, దయచేసి, అని వినయపూర్వకమైన నా విన్నపం.

ఆపైన మీ దయ, నా ప్రాప్తం.

*****