
సూత ముని శౌనకాది మహర్షులు కోరిక మేరకు శివుడు నటరాజ మూర్తి గా మారడానికి ప్రేరకుడైన మంకణ మహాముని కథను వివరిస్తాడు.పూర్వం మాతారిశ్వుడు అనే గొప్ప తపశ్శాలి ఉండేవాడు అతని భార్య సుకన్య వారి కుమారుడే మంకణ మహాముని. ఆర్యావర్తము అనే పుణ్యభూమిలో సప్త సారస్వతము అనే మహతీర్ధములో గల పునీతాశ్రమములో మంకణ మహాముని శివ జ్ఞానం తపస్సిద్ధి కలుగుతుందని అని తెలుసుకొని మహర్షుల ఆదేశానుసారం మహతీర్ధములో స్నానమాచరించి తపోనిష్ఠలో మునిగిపోతాడు. పూర్వకాలములో గయా మహీపతి, ఉద్దాలకుడు,వసిష్ఠ, బృహస్పతి, పరమేష్ఠి మొదలైన మహామునులు ఇక్కడే క్రతువులు ఆచరించారు.సప్త సారస్వతము అనే పేరు ఆ తీర్ధానికి రావడానికి కారణం సుభద్ర, కనకాక్షి, విశాల, సురతన్వ, జీఘమాల, సువేణి, విమలోదక అన్న పేర్లతో సరస్వతి నది ప్రవహించి ఒక్కొక్కసారి ప్రత్యక్ష నారీ రూపము ధరించి, ఆయా దేవా మునీశ్వరులను సేవించి వారి మన్నలను అందుకున్నది కాబట్టి సప్త సారస్వతము అనే పేరు వచ్చింది.
ఒకనాడు మంకణ మహాముని పంచాక్షరీ జపం చేస్తూ ఉంటె అతని శరీరం సూర్యునితో సమానమైన కాంతి వంతం కాసాగింది. క్రమంగా ముని భక్తి పారవశ్యంతో తాండవం చేయసాగాడు. మహర్షి భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ మంకణ మహాముని తాండవాన్ని ఆపడం లేదు. శివుడు ఆ మహర్షి తాండవాన్ని ఆపడానికి ప్రశ్నల వర్షం కురిపించారు ఎవరికోసం నీ తపం? ఈ తాండవం ఏమిటి ? నీ కోరిక ఏమిటి? అన్న ఏ ప్రశ్నకు ముని జవాబు చెప్పలేదు తాండవం ఆపలేదు దాంతో శివుడు ఉగ్రుడై మహాతేజో మూర్తిగా మహాతాండవం ఆరంభించాడు శివుడితో పాటు ఒక స్త్రీ మూర్తి కూడా ఉన్నది శివుని తాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది అప్పుడు మంకణునికి జ్ఞానోదయము అయి "మహా నటరాజ మూర్తి శరణు శరణు "అని సాష్టాంగ దండ ప్రమాణము ఆచరించాడు. అంతట శివుడు శాంతించి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని పక్కన ఉన్న దేవి మూర్తి అంతర్హితురాలైంది.
మంకణుడు ఆయనకు నమస్కరించి, "దేవాధిదేవా! మహాశివ! ఈ మహాతాండవ మేమిటి? ఇంతవరకు మీ పక్కన నిలిచిన ఆ దేవి మూర్తి ఎవరు?" అని ప్రార్థించగా "ఇది పరమేశ్వరుని దివ్య రూపం ! ఆ దివ్య మూర్తిని నేనే! నాతో ఉన్న దేవి ప్రకృతి రూపిణి. బ్రహ్మరూపుడనై నేను సకల చరాచరాలు పంచవింశతి (ఇరవై ఐదు) తత్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడైన వాటిని పోషిస్తాను. సంహార కాలంలో నేనే కాలస్వరూపుడని వాటిని లయం చేస్తాను. సర్వ ప్రాణుల యందు నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈ తత్వం గ్రహించి, భక్తితో నన్ను ఉపాసించి శివ సాయుజ్యం పొందు" అని ఆనతిచ్చాడు పరమశివుడు..కనుక - లింగరూపుడై, అర్థనారీశ్వరుడయినా, నటరాజు అయినా అంతా శివమయమే!" అని వివరించాడు రోమహర్షణ పుత్రుడు.