మా చార్ధామ్ యాత్ర - కర్రా నాగలక్ష్మి

మా చార్ధామ్ యాత్ర

మా చార్ధామ్ యాత్ర

 

ఇంతకు ముందు నేనే చార్ధామ్ యాత్ర గురించి వ్రాసి ఇదే పత్రికి పంపడం, అది ప్రచురించబడడం జరిగింది, మళ్లా ఎందుకు వ్రాసేను అనుకుంటున్నారా?.

విశేషం ఉంది, వివరాలు 2013 వరకు మేము చూసిన విశేషాలు, అప్పటి పరిస్థితులు వివరించేను. సారి 2023 లోను, 2024 వెళ్లి నప్పుడు మేము చూసిన, అనుభవించిన వాటిని నేని మీతో పంచుకోకపోతే చాలా మంది యాత్రీకులలో పాత విషయాలే గుర్తుండిపోతాయి, చాలా మంది టూర్ ఆపరేటర్లు చాలా విషయాలు చెప్పరు, మేము 2023 లో వెళ్లినప్పుడు అప్పటికే 6 సార్లు వెళ్లిన మాకే ఒక షాక్ తగిలింది.2024 లో కూడా చాలా మంది టూర్ ఆపరేటర్లు హరిద్వార్ లో వారి ఆఫీసులలో పాత మేప్ లనే పెట్టడం చూసి అక్కడి విషయాలు యథాతథంగా వివరిస్తే వ్యాసం చదివిన వారు యాత్ర చేద్దామనుకుంటే ముందుగానే మానసికంగా తయారుగా ఉంటారు కాబట్టి మాలా షాక్ లు తినక్కరలేదు.

సంవత్సరం సెప్టెంబరు 10 చార్ధామ్ వెళ్లడానికి ముహూర్తం పెట్టుకున్నాం. ఇది మా ఏడవసారి చార్ధామ్ యాత్ర, క్రిందటి సంవత్సరం అక్టోబరులో యాత్ర చేసేం. టికెట్లు కొన్న దగ్గర నుంచి ఉత్తరాఖండ్ లో వర్షాలు ఎలా ఉన్నాయో అని టీవీ న్యూసు చూస్తూ ఉండే వాళ్లం. వార్తల నిండా వర్షాలు, కొండచరియలు విరిగి పడడం, వరదలు ఇవే ఉండేవి, అయితే అవి కొత్త వార్తలా?, పాతవార్తలా? అనే అనుమానం. పాతవార్తలనే చూపిస్తున్నరేమో అనే మరో అనుమానం. శ్రావణం అయిపోగానే వర్షాలు తగ్గిపోతాయిలే అనే భరోసా తో ఉన్నాం.

శ్రావణం అయిపోయింది హైదరాబాద్ లోనే కాదు దేశమంతటా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మా యాత్ర రోజు రానే వచ్చింది. మా దంపతులం కాక బెంగుళూరు నుంచి మరో ఇద్దరు దంపతులూ మాతో వస్తున్నారు. డెహ్రాడూన్ వరకు అందరం ఫ్లైటులో వెళ్తున్నాం. అక్కడనుంచి ముందుగా మేం మాట్లాడుకున్న ట్రావెలర్స్ వారి టక్సీలో బయలుదేరేం. మేం బయలు దేరడానికి 2 గంటల ముందునుంచి వర్షం మొదలయింది. అందరం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రయాణం మొదలు పెట్టేం, మనసులో వాన పెరిగి కొండచరియలు విరిగిపడితే ఏది దారి అని భయపడసాగేం. మా అదృష్టం వాన మెల్లగా తగ్గు ముఖం పట్టింది.

మేము డెహ్రా డూన్ లో బయలుదేరడమే సాయంత్రం 4 అయింది, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మా ఇన్నొవా డ్రైవరు జానకి చట్టికి సుమారు 100 కిమీ దూరం ఉండగా రోడ్డుమీద ఉన్న హోటలు దగ్గర ఆపేడు, హోటలు మాకు కావలసిన సదుపాయాలు( వేడినీళ్లు, నీటుగా ఉన్న బత్రూములు, కమోండు) ఉండడం తో ఆరాత్రి అక్కడ ఉండి మరునాడు ప్రొద్దుటే 5 గంటలకి జానకి చట్టికి బయలుదేరుదామని నిర్ణయించుకున్నాం.

మేము 2023 లో వచ్చినప్పుడు వర్షాలు లేకపోవడంతో రోడ్లు కూడా బాగున్నాయి, అందుకు బర్కోట్ కి సుమారు 27 కిలోమీటర్ల దూరం లో ఉన్నలక్క మండల్శివకోవెలకి వెళ్లేం. మా డ్రైవరు మాకు యమునోత్రిలో ఉండే యమునాదేవి విగ్రహాన్ని శీతాకాలంలో కోవెలలో ఉంచి పూజిస్తారని చెప్పేడు, కాని యమునోత్రి విగ్రహాన్ని జానకి చట్టికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్సాలి లో ఉంచి పూజలు చేస్తారు, అక్కడినుంచి మే నెలలో అమ్మవారిడోలియమునోత్రికి బయలుదేరుతుంది.

లక్కమండల్చేరేక అక్కడి పూజారులు వినిపించిన కథ ఇక్కడ పూర్వం లక్ష మందిరాలు ఉండేవట, మందిరానికి లక్కమండలం అని పేరు రావడానికి ఇక్కడ లక్ష మందిరాలు ఉండడం ఒక కారణమైతే, మహాభారతం ప్రకారం కౌరవులు పాండవులను లక్క గృహంలో నిద్రిస్తున్న సమయంలో నిప్పుపెట్టి సంహరించాలని ప్రయత్నించిన లక్కాగృహం ఇదేనని అందుకే దీనిని లక్క మండల్(లక్క మంటపం) అంటారనేది రెండవ కథ.

ఏది ఏమైనా చూడముచ్చటగా ఉన్న చిన్న గ్రామంలో ఉన్న మందిరం. ప్రాంగణంలోనే కొన్ని మెట్లు దిగేక ఉండే శివలింగాన్ని గుహాలయం అని అంటారు, అది గుహలా అనిపించలేదు, చిన్న పుషకరిణిలో ఉన్నట్లుగా ఉంది. పన్నెండవ శతాబ్దంలో ప్రాంతాన్ని పరిపాలించిన రాణి మందిర నిర్మాణం చేసినట్లు ఇక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఈసారి వర్షాలువల్ల మందిరాన్ని మేము దర్శించుకోలేదు.

మా రాత్రి భోజనానికి గాను ఇంటినుంచే రొట్లు కూర తెచ్చుకున్నాం. అవి తినేసి నిద్రపోయేం.

అనుకున్నట్లుగానే మరునాడు బయలుదేరి పది గంటలకి జానకి చట్టి(యమునోత్రికి ఇక్కడ నుండి నడక మార్గమే ఉంటుంది) చేరుకున్నాం. ఆరోజు వర్షం లేదుగాని విపరీతమైన బురద, ముందురోజు వర్షం వల్ల ఆరోజు రద్దీ పెద్దగా లేదు, దాంతో డోలీ వాళ్ళకి డిమాండులేక గవర్నమెంటు నిర్ణయించిన రేటుకే వచ్చారు. 2023 లో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల డోలీకి గవర్నమెంటు రేటుకి ఒకటిన్నర రెట్లు ఇచ్చేం. మేము ముందు జాగ్రత్తకి రైనుకోట్లు తీసుకొని డోలీలలో వెళ్లేం, మాతో వచ్చినసరళగారు కూడా డోలీలో వచ్చేరు. మిగతావారు ఫణి భూషన్ గారు( సరళ గారి భర్త), శ్రీనివాసమూర్తిగారు, సుధగారు. వారు నడకన యమునోత్రి దర్శించుకున్నారు. వాళ్లు నలుగురు యమునోత్రిలో స్నానాలు చేసుకొని దర్శనాలు చేసుకున్నారు. మాకిది మొదటిమారు కాదు కాబట్టి క్రితం సంవత్సరానికి సారికి వచ్చిన మార్పులను యమునాదేవిని, వేడినీటి( యమునానది పుట్టిన జాగా) బుగ్గని చూసుకొని సాయంత్రం 4కి అందరం జానకి చట్టీ చేరేం, అక్కడనుంచి రాత్రి 8 కి రోడ్డు మీద ఉన్న హోటల్ లో బస చేసుకున్నాం.

మరునాడు ఉత్తర కాశీకి బయలుదేరేం. ఓవారం రోజులు యమునోత్రికి దారి బంద్ అయిందట, ఆరోజు చాలా టూరిస్ట్ బళ్లు యమునోత్రికి వెళుతూ కనబడ్డాయి. మేం ప్రొద్దుటే పొంగల్ చేసుకొని బయలుదేరేం, వీలయిన చోట తినాలని అనుకున్నాం. బర్కోట్ లో ఆగి వేడి టీ తో పాటు మా పొంగల్ తినాలని అనుకున్నాం. కాని మా డ్రైవరు బర్కోట్ లో ఆగలేదు. బర్కోట దాటేక 35 కిలో మీటర్ల దూరంలో నాలుగు టీ దుకాణాలు ఉన్నచోట మా డ్రైవరు బండీని పక్కగా పార్క్ చేసేడు. అప్పటికే అక్కడ చాలా బళ్లు ఆగి ఉన్నాయి. పక్కగా పెద్ద జలపాతం. పక్కగా ఉన్న మెట్లు చూపించి వెళ్లి దర్శనం చేసుకు రమ్మన్నాడు. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. మెట్లకి ముందు ఆర్చి దాని మీద ప్రకటేశ్వర మహదేవ్ అని వ్రాసి ఉంది. మెట్లు ఎక్కడం మొదలుపెట్టేం ఇంతకు ముందు అన్ని సార్లు వచ్చేం కాని ఎప్పుడూ ఇక్కడో మందిరం ఉందనే విషయం తెలియలేదు.

ఒక 500 మీటర్లు ఎక్కేక చిన్న గుహలోకి పదేసి మందిని మాత్రమే పంపుతున్నారు. అదొక గుహాలయం. లోపలకి వెళ్ళేక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతి, గైడ్ అవుసరం లేకుండానే సహజంగా ఏర్పడ్డ ఆకృతులు మనకి పౌరాణిక కథలను చెప్తున్నాయి. అందులో శివుని జటాఝాటం, పార్వతి వినాయకుడు, ఐరావతం ఇలా ఒకటేమిటి?, ముఖ్యంగా పంచముఖ శివలింగం గురించి చెప్పుకోవాలి. నిరంతరం సహజ జలాలు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాయి. 1996 లో గుహాలయం బయల్పడిందట, ఇలాంటి గుహాలయాలు కొండలలో ఇంకెన్ని ఉన్నాయో!.

ప్రతీమారు మా యాత్రలో క్రొత్తక్రొత్త మందిరాలు చూస్తూ ఉంటాం, ప్రతీసారి అన్నీ చూసేసేం అనుకుంటాం కాని మరోసారి కొండలలోకి వచ్చేటప్పుడు మరికొన్ని క్రొత్త మందిరాలో, గుహాలయాలో చూడడం వల్ల మా యాత్రలు ఎప్పుడూ మాకు ఉత్సాహాన్ని ఇస్తాయి. మొదటి మారు వచ్చినప్పుడు ఒక్క యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాథ్, ఋషికేశ్, హరిద్వార్ మాత్రమే వెళ్లేం. మా యాత్రలో ఒక్కొక్కటిగా చేరి ఇప్పటికిలక్కమండల్’, యమునోత్రి, ప్రకటేశ్వర్ మహదేవ్, ఉత్తరకాశి, గంగనాని, ముఖ్బ మందిరం(హర్షిల్ గ్రామానికి దగ్గరగా ఉన్న మందిరం, శీతాకాలపుగంగాదేవిమందిరం), గంగోత్రి), ఓఖిమఠ్, గుప్తకాశి, గౌరికుండ్, కేదార్ నాథ్, కాళీమఠ్, చోప్త, గోపేశ్వర్, జోషిమఠ్, పాండుకేశ్వర్, హనుమాన్ చట్టి(బదరీనాథ్ దగ్గర ఉన్న హనుమాన్ మందిరం), బదరి నాథ్, మానా, విష్ణుమందిరం(విష్ణు ప్రయాగ), కర్ణ ప్రయాగ లో కర్ణ మందిరం, ఆది బదరి మందిరాలు, నందప్రయాగ లో నందుడు తపస్సు చేసిన ప్రదేశం, మందిరం, రుద్ర ప్రయాగలో రుద్ర మందిరం, ధారీదేవి మందిరం, దేవ ప్రయాగలో రఘునాథ్ మందిరం, త్రివేణి ఘాట్(ఋషికేశ్), చంద్రబదనా దేవి, శర్ఖండాదేవి, ఋషికేశ్, హరిద్వార్ లలో ఇంకా చాలా మందిరాలు చేరేయి.

పైన చెప్పిన మందిరాలన్నీ చూడదగ్గ మందిరాలే, వీలైతే ఒకసారి వెళ్లండి, మీకు కూడా నచ్చుతాయి.

ప్రకటేశ్వర మహదేవ్ ని చూసుకొని ఉత్తరకాశీ వైపు ప్రయాణమయేం. ఈసారి ఇంకా వానలు పడుతూ ఉండడం వల్ల మాకు బసలు కాస్త తక్కువ ధరకే దొరికాయి. 2023 లో వెళ్లినప్పుడు వర్షాలు లేవు కాబట్టి యాత్రీకుల తాకిడి బాగా ఉండడం వల్ల మాకు ప్రతీ చోట హోటలు ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈసారి ఇచ్చిన ధరలకి సుమారుగా నాలుగు రెట్లు ఇచ్చేం, ఈసారి ఉన్న వసతులకన్నా గొప్పగా ఏమీ లేవు.

2013 వరకు చిన్న టౌనుగా ఉన్న ఉత్తర కాశి, పెద్ద పట్టణంగా మారడం, కనుచూపు మేరవరకు పచ్చని మైదానాలతో, చుట్టూరా మంచుకప్పబడ్డ పర్వతాలతో, గలగలమని ప్రవహిస్తున్న భాగీరథి నది ఏవీ!, ఎక్కడ?, ఎటు చూసినా ఇళ్లు హోటల్స్, వాహనాల రణగొణలు, బజార్లు ఇవే.

ఉత్తరకాశి మందిరం గురించి చెప్పాలంటే చాలా ఉంది.

శివుడు ఎండాకాలంలో కైలాశంలో నివశిస్తాడని, శీతాకాలంలో ఉత్తరకాశిలో నివాసముంటాడని

అంటారు.

ఉత్తరకాశి మందిర వివరాలు వచ్చే సంచికలో చదువుదాం, అంత వరకు శలవు.

 

 

కర్రా నాగలక్ష్మి