ఆది కైలాశ్ ఓం పర్వత్ యాత్ర - కర్రా నాగలక్ష్మి

ఆది కైలాశ్ ఓం పర్వత్ యాత్ర

ఆది కైలాశ్ ఓం పర్వత్ యాత్ర

 

పంచ బదరీలు, పంచ కేదారాలు, పంచ ప్రయాగలు, పంచ పురాలు, పంచ ధారలు, పంచ శిలలు, పంచ కైలాశాలు దర్శంచ దగినవి అని మన పురాణాలలో చెప్పబడ్డాయి.

ఇవాళ మనం పంచ కైలాశాల గురించి తెలుసుకుందాం, తరువాత మాఆది కైలాశ యాత్రగురించి తెలుసు కుందాం.

ఆది కైలాశ్, మణిమహేష్, శ్రీఖంఢ్ మహదేవ్, కిన్నోర్ కైలాశ్, కైలాశ్ మానససరోవర్ వీటిని పంచ కైలాశాలని అంటారు.

మణిమహేష్, శ్రీఖంఢ్ మహదేవ్, కిన్నోర్ కైలాశాలు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. ఆది కైలాశ్ ఉత్తరాఖండ్ లో పిత్తోరాగఢ్ జిల్లాలో ఉంది. కైలాశ్ మానససరోవర్ చైనా ఆక్రమిత టిబెట్ లో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా ప్రభుత్వం కైలాశ్ మానససరోవర్ యాత్ర భారత పాసుపోర్టు గల యాత్రీకులకు అనుమతి నివ్వలేదు. సంవత్సరం కొద్దిరోజుల క్రిందట చైనా ప్రభుత్వం యాత్రకి అనుమతి నిచ్చింది.

మణి మహేశ్ యాత్ర జన్మాష్టమి నుంచి రాధాష్టమి వరకు అంటే పదిహేను రోజులు మాయ్రమే ఉంటుంది. యాత్ర చెయ్యాలని మేముచంబాజిల్లాలోనిహడ్ సర్ఊరు వరకు వెళ్లేం. కరోనా వెంటనే వెళ్లేం. అప్పటి వరకు జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదట, యాత్ర వల్ల చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే యాత్రీకుల వల్ల మహమ్మారి విజృంబించే అవకాశాలు ఉండడంతో యాత్రను రద్దు చెయ్యడమే కాకుండా హడ్ సర్ గ్రామంలోకి ఎవరినీ రానివ్వలేదు. అలా కొండ వరకు వెళ్ళగలిగేం కాని పరిక్రమ చేసుకోలేక పోయేం.

కిన్నోర్ కైలాశ్ హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నోర్ జిల్లాలో ఉంది. శ్రీఖంఢ్ మహదేవ్ హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో ఉంది. రెండూ కూడా కష్టతరమైనవే. అక్కడకి చేరుకోడానికి నడక తప్ప మరే సాధనమూ లేకపోవడం ఒక కారణమైతే మాకు అంత దూరాలు నడిచే ఓపిక లేకపోడం మరోకారణం.

కైలాశ్ మానససరోవర్ యాత్ర 2012 లో చేసుకున్నాం. ఇక మిగిలింది ఆది కైలాశ్ యాత్ర.

ఆదికైలాశ్ ఓం పర్వత్ గురించి మొదటి మారు మా కైలాశ్ మానససరోవర్ యాత్రప్పుడు విన్నాం. భారతప్రభుత్వం వారు నడిపే కైలాశ్ మానససరోవర్ యాత్ర ఆది కైలాశ్, ఓం పర్వతాల మీదుగా సాగుతుందని, “ధార్ చూలవరకు రోడ్డు ఉంటుందని, అక్కడ నుంచి కాళి నది ఒడ్డున రోజుకి సుమారు 18 కిలోమీటర్లు చొప్పున రానుపోను 16 లేక 18 రోజులు నడవాలని విన్నాం. నిజానికి ఆది కైలాశ్ పక్కకి ఉండిపోతుంది. ఓం పర్వతం మాత్రం కనిపిస్తుంది. అని అప్పటికే రూట్లో కూడా కైలాశ్ మానససరోవర్ యాత్ర చేసుకున్న వారు చెప్పేరు.

గత కొన్ని సంవత్సరాలుగా కైలాశ్ మానససరోవర్ యాత్ర లేకపోడంతో టూరు ఆపరేటర్లు కైలాశ్ఏరియల్ వ్యూయాత్ర అని మొదలు పెట్టేరు.

ధార్ చూలా నుంచి భారత ప్రభుత్వం మిలిటరీ ఉపయోగానికి రోడ్లు వేయడంతో ఆది కైలాశ్ యాత్ర ఊపందుకుంది.

రోజూ యాత్రను గురించిన ప్రకటనలు రాసాగాయి. అప్పుడు కుతూహలం కలిగి మేము టూరు ఆపరేటర్ తో యాత్ర గురించి అడిగి తెలుసుకొని అతని ద్వారా యాత్రకు బయలు దేరేం.

మా టూరు ఆపరేటర్ దగ్గర వివరాలు సేకరించేము. వీరు సాధారణంగా హలద్వాని రైల్వే స్టేషను నుంచి హలద్వాని స్టేషను వరకు పేకేజ్ టూరు నిర్వహిస్తారు.

ఇందులో వారు హలద్వాని లో యాత్రీకుల సంఖ్యబట్టి వెహికల్ ఇస్తారు. తెల్లవారి బయలుదేరితే రాత్రికి ధార్ చూలా చేరుతాం, దారిలో కైంచీధామ్, గోలు దేవి మందిరం, జాగేశ్వర్ మందిరం చూపిస్తారు. మరునాడు ధార్ చూలా లో హెల్త్ చెకప్ మరియు పెర్మిట్ కోసం ఆగాలి. ఆతరువాత రోజు ప్రొద్దుటే ఆదికైలాశ్ కి బయలు దేరాలి. మొత్తం మాది ఆరు రాత్రుళ్లు, ఏడు పగళ్లు పేకేజ్.

మేము పిత్తోరాగఢ్ వరకు చాలా సార్లు వెళ్లేం కాబట్టి మాకు దారి కొత్తకాదు. కాని మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కి అది మొదటిమారు.

మేము హైదరాబాద్ నుంచి ప్రొద్దుటి ఫ్లైట్ లో బయలు దేరి ఢిల్లీ చేరి అక్కడి నుంచి హలద్వాని టాక్సీ లో వెళ్లేం. ఢిల్లీ నుంచి పిత్తోరాగఢ్ వెళ్లే రోడ్డు మొత్తం హైవే, 4,5 గంటలలో హలద్వాని చేరేం. అంతకు ముందు 8,9 గంటలు పట్టేది. రైల్వే స్టేషనుకి దగ్గరగా ఉన్న హోటలు తీసుకున్నాం. మరునాటి నుంచి మా పేకేజ్ మొదలు. సారి మేం వంటల కార్యక్రమం పెట్టుకోలేదు.

మా ప్రయాణంలో గ్రామాలు టౌనులుగా, పట్టణాలు నగరాలుగా మారడం చూస్తూ ప్రయాణించేం. కొన్ని గ్రామాలు ఏమీ మారలేదు.

అనుకున్నట్లుగా కైంచీధామ్ లో దిగి స్వామీజీ సమాధి ఆశ్రమం చూసుకున్నాం. తరవాత పిత్తోరాగఢ్ దాటుకొని ముందుకు సాగేం. ఇది హై వే కాదు కాని రోడ్డు చాలా బాగుంది.

ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ లు, ముస్సోరి మొదలయినవి ఘరేవాల్ భాగానికి చెందినవి కాగా నైనితాల్, పిత్తోరాగఢ్, జాగేశ్వర్, భాగేశ్వర్, రాణీఖేత్, ఆదికైలాశ్ మొదలయినవి కుమావు లోకి వస్తాయి.

గోలు దేవత మందిరానికి కిలోమీటరు దూరం ఉందనగానే దుకాణాలు హడావిడి మొదలయింది. అతి చిన్న నుంచి అతి పెద్ద వరకు గంటలు అమ్ముతూ ఉంటారు. చైతై అనే గ్రామం లో ఉండడం వల్ల దేవుడిని చైతై దేవత అని కూడా అంటారు.

ఉత్తరాఖండ్ ప్రజలు గోలుదేవతని న్యాయ దేవత అని కూడా అంటారు. పౌరాణిక నమ్మకం ప్రకారం గౌర భైరవుడు(శివుడు) అని అంటారు. ఇతను తెల్లటి గుర్రాన్నెక్కి, తెల్లవస్రములు ధరించి న్యాయం చెయ్యడానికి వస్తాడని ఇక్కడి ప్రజల నమ్మకం. కోర్టులో కూడా దొరకని న్యాయం కోవెలలో అర్జీ పెట్టుకుంటే తప్పక నెరవేరుతుందని అంటారు. అలా కోరిక తీరితే దేవతకి గంట సమర్పిస్తారు. అలా కోవెలలో లెక్కకు మించి గంటలు ఉన్నాయి. ప్రతీ ఏడాదీ గంటలు విపరీతంగా పెరగడం చూస్తున్నాం. సారి కోవెల బాగా పెద్దదిగా చేసేరు. దారంతా గంటలతో తోరణాలలా కట్టేరు. లోపల గర్భగుడిలో లక్షల సంఖ్యలో టైపు చేసినవి కొన్ని, స్టాంపు పేపర్లమీద, మామూలు కాయితాలమీద, చేతి వ్రాతతో వ్రాసిన అర్జీలు వ్రేలాడ కట్టేరు.

మందిరంలో చిన్నచిన్న గుర్రపు బొమ్మలు కూడా భక్తులు దేవుడికి సమర్పిస్తున్నారు.

ఇక్కడి ప్రజలు పన్నెండవ శతాబ్దంలో ప్రాంతాన్ని పరిపాలించిన రాజు కొడుకే గోలు దేవత అని కథ వినిపించేరు. అదేమిటంటే అప్పట్లో ప్రాంతపు రాజుకి నలుగురు రాణులట, వారిలో ఒకరాణి గర్భవతై కుమారుడిని ప్రసవించిందట, మగపిల్లవాడు కాబట్టి అతను యువరాజు అతని తల్లి పట్టమహిషి అవుతారనే ఈర్యతో మిగతా రాణులు పసివాడి స్థానంలో రాయిని పెట్టి పసివాడిని వెదురు బుట్టలో పెట్టి నదిలో విడిచి పెట్టేరట, జాలర్లకు దొరికి పసివాడు పెరిగి పెద్దవాడై అన్ని విద్యలూ నేర్చుకొని రాజ్యానికి వచ్చి కర్రగుర్రంతో నీరు త్రాగించుతానని దండోరా వేయుంచేడట, వింత చూడడానికి ప్రజలేకాక రాచపరివారం కూడా వచ్చిందట. పిల్లవాడు కర్రగుర్రాన్ని నీరు త్రాగమని అదలిస్తూ ఉంటే రాణులు నీకు పిచ్చా? కర్ర గుర్రం ఎక్కడైనా నీళ్ళు తాగుతుందా? అని ప్రశ్నించేరుట. దానికి బాలుడు మీ రాజ్యంలో స్త్రీ రాయిని ప్రసవించినప్పుడు కర్ర గుర్రం నీరు త్రాగలేదా? అని ప్రశ్నించేడట, అది విన్న రాజుకు జ్ఞానోదయం కలిగి వెంటనే విషయంలో విచారణ చెయ్యమని మంత్రులను నియమించి, నిజం తెలుసుకొని విషయం నీకెలా తెలుసు అని అడుగగా పిల్లవాడు తానేనని చెప్పేడట. రాజు పిల్లవాడిని తన కుమారునిగా స్వీకరించి తదనంతరం పట్టాభిషేకం చేసేడట. రాజు ఎక్కడ అన్యాయం జరిగినా తన తెల్లటి గుర్రం మీద వచ్చి వారికి న్యాయం చేసేవాడట. అతని తరువాత ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా అతనే వచ్చి తమకు న్యాయం చేస్తాడని ప్రజలు నమ్మేవారట. అలా అలా మొక్కుబడులు వచ్చేయట.

ఇప్పటికీ కుమావు ప్రజలు ప్రతీ శుభకార్యానికి ముందు ఇతనిని పూజిస్తారు. అంటే మనం వినాయకుడిని పూజించినట్లు.

మిగతా యాత్ర వివరాలు వచ్చే సంచికలో చదువుదాం.