
"చిన్న పొరపాటు జరిగినట్టుందండి " గుమ్మం లోనుంచి ఇంటి లోపలికి వస్తూ అంది శకుంతల.
ఏవో రెండు జాతకాల గుణ గణాలు పరిశీలిస్తున్న నరసింహం ఆపి , కాస్త కంగారుగా " ఏమైందీ !" అన్నాడు.
కూజాలోని నీరు తాగుతూ , "మన శివమ్ రోడ్డు మీదున్న రిలయన్స్- ఫ్రెష్ లో పొరపాటున ఆర్గానిక్ సెక్షన్ లో ఉన్న టొమాటోలు తెచాన్నండి . అవి తీరా బిల్లింగ్ దెగ్గర చూస్తే ధర రెట్టింపు లా అనిపించింది. నామోషీ తో కొట్టు వాడిని ఏమి అడగలేక తీసుకొచ్చేసా " అంది శకుంతల.
"ఓసి అంతేనా , నేను ఇంకా ఏమో అనుకుని కంగారు పడ్డా. పోనిలే , కొన్నిసార్లు అలా పొరపాట్లు జరుగుతూంటాయి.
"అయినా , ఈ ఆర్గానిక్ వ్యవహారమేంటండి?" అంది
"ఒకరకంగా చూస్తే కొన్నీ లాభాలున్నాయి. ఎరువులు రసాయనాలు కాకుండా, ప్రకృతిలో లభించే పాడి, పేడ, ఆవు మూత్రం వంటివే ఎక్కువ వాడుతుంటారు. రసాయనాలకు దూరంగా అని గర్వంగా చెప్పిన ఆర్గానిక్ కూరగాయలు మనల్ని కాస్త మెప్పించే రుచితో ఉండవచ్చు. అందుకే ధర కాస్త ఎక్కువే ఉంటుంది, అసలు ,వాడకానికి వస్తే వాటి లోకల్ ప్రత్యామ్నాయాలే ఎక్కువ ఫలితాలు ఇస్తాయి అంటారు.
తమాషా ఏంటంటే, ధర ఎక్కువైనందుకు కొనేవారు తక్కువ , కొనేవా రు తక్కువైనందుకు, దరెక్కువ ! ఇదో ఎకనామిక్స్ గిమిక్సు !
ఈ కూరగాయలు ఆర్గానిక్ నమ్మకాన్ని మన చేతుల్లోనే ఉంచి మన సొమ్ము తినేస్తాయి.చాలా బ్రాండ్లు "ఆర్గానిక్" అని లేబుల్ పెడుతుంటాయి కానీ వాటి అసలైన ప్రమాణాలు మనకు తెలియవు. ఆర్గానిక్ ట్యాగ్ తో సరిపెట్టుకునేవాళ్లకు ఓకేనే లే . మనం తినే ఆర్గానిక్ పండ్లూ కూరలూ మనకు చేరుకునేలోగా ఊరు - ఊరు చుట్టి వస్తాయి. డీజిల్ , పొగ , డాంబర్ రోడ్లు, స్పెషల్ ప్యాకేజింగ్ తయారీ , వీటిని చల్లగా ఉంచే రెఫ్రిజిరేటర్లు అన్నీ ప్రకృతి కాలుష్యం అదే కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారే అవన్నీ బాగా పెంచుతాయి. మనకు చేరుకునేలోగానే పర్యావరణానికి ఇంత నష్టం కూడా జరుగుతుందిగా.
"ఆర్గానిక్" అంటే సహజమైనదని అర్థం, కాబట్టి వేప ఆధారిత పురుగుమందులు వంటి వాటిని ఉపయోగించి పండించే పంటలు సహజసిద్ధంగా పెరిగినవిగా ఎలా అండి పరిగణిస్తాం ? అంటే, సహజత్వం ఎలాంటి మానవ జోక్యం లేకుండా ప్రకృతిలో పెరిగినట్లు ఉండాలి; అలాంటప్పుడు వేప వంటి వాటితో వాడకం కూడా అసలు "ఆర్గానిక్"కి విరుద్ధంగా? అంది శకుంతల.
“కరెక్ట్ అదీ కాకుండా ఆర్గానిక్ అన్నంత మాత్రాన ఆరోగ్యానికి మంచిదని కాదు. కొన్ని పరిశోధనల్లో ఆర్గానిక్ రుచిగా ఉన్నట్టు తేలినా, కొన్ని మాత్రం అసలు రుచి వేరే. చాల మంది , మిడి మిడి జ్ఞానం తో, మేము ఆర్గానిక్ పోటాటో చిప్స్ తింటాం గర్వాంగ అంటారు, కానీ అవీ చిప్స్యేగాస్టార్షిప్ ! ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తింటాం అంటారు . కానీ అదీ ఐస్ క్రీమేగా! అలాగే, ఆర్గానిక్ కుకీస్ తింటున్నారంటే, అసలు ఇవన్నీ మితంగా తినకుంటే, అంతే కధ ! ఆర్గానిక్ ఫుడ్ తిన్నా , ఆక్టివ్ గా వాకింగో , యోగానో గా ఉండాలిగా! ఆర్గానిక్ వెజిటబుల్స్ అని తెచ్చి అవి వారలు-వారలు ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటి లాభం ? వాటితో నూనె కారే వేపుళ్ళు చేస్తే , అసలు ఫలితం సూన్యం గా !
ఆర్గానిక్ పంటలకీ పురుగు నివారణ అవసరం ఉంటుంది, కానీ అవి నేచురల్ పేరుతో నిమ్మకాయ నూనె లేదా పైరెత్రిన్ వంటి సహజ పురుగు మందులపై ఆధారపడతాయి. ఇవి సహజమైనవే కాబట్టి ప్రమాదం లేకుండా ఉంటాయనుకోవద్దు – కొన్ని ఆర్గానిక్ పురుగు మందులు పురుగులకే కాకుండా , పంట పైన మన పైనా చెడుగా పనిచేయొచ్చు.
ఈ రకంగా చూస్తే ఇది ,మసిపూసి మారీడు కాయను చేసే వ్యవహారమే!' అన్నాడు నరసింహం.
"అన్నట్టు , చెప్పడం మర్చిపోయాను, మారీడు కాయలు కూడా ఉన్నాయండి , రిలయన్స్ - ఫ్రెషలో !
"అదే మసిపూసి మారీడు కాయను చేయడం అంటే " అంటూ, దూరంగా వినిపిస్తున్న రామాలయం గుడి గంటలు వింటూ, టైం 6.30 కావోస్తుందని అని మనసులో అనుకుంటూ, మళ్ళీ జాతకాల పరిశీలనలో పడిపోయాడు నరసింహం.