ప్రజాస్వామ్యానికే నా ఓటు - రాపాక కామేశ్వర రావు

Prajaswamyanike naa Otu

"అన్నయ్యా,ఎప్పుడు బయలుదేరుతున్నారు? వదిన కూడ వస్తుంది కదా, ముందు రోజు రాత్రికల్లా మీరువచ్చెస్తె ఎన్నికల రోజు ఉదయమే వెళ్ళి ఓటేసేద్దాం" మా తమ్ముడు మోహన రావు ఫోన్ చేసాడు.

"ఆ..., బయలుదేరి వచ్చెస్తాములే. మన ఓట్లన్నీ ఉన్నాయి కదా"

"ఉన్నాయి. ఓటరు లిస్టులు పట్టుకుని ఇరు పార్టీల వాళ్ళు వచ్చారు. ఎన్నికల ముందు రోజైతే నిఘా ఉంటుందని ఇప్పుడే డబ్బులు పంచడం మొదలు పెట్టేసారు. మావి నాలుగు ఓట్లకి వీళ్ళు ఎనిమిది వాళ్ళు ఎనిమిది మొత్తం పదహారు వేలు ముట్టింది. మీవి కూడ రెండు ఓట్లకి ఇరు పార్టీ వాళ్ళ నుండి నాలుగు వేలు చొప్పున మొత్తం ఎనిమిది వేలు తీసుకున్నాను."

"నాకు అలా తీసుకోవడం ఇష్టముండదని నీకు తెలుసుగదా. ఎందుకు తీసుకున్నావు?"

"మనము తీసుకోక పోతే ఆ డబ్బులు పంచినోడు నొక్కెస్తాడు. నీకు ఇష్టము లేకపోతె దేవుడు హుండీలో వేసెస్తానులే."

"దేవుడికెందుకురా ఆ మలినాన్ని అంటగడతావు? ఆ పంచినోడు తినెస్తె వాడి పాపాన వాడు పోతాడు."

"సారీ అన్నయ్యా! నీకు ఇలాంటివి ఇష్టముండదు అని తెలుసు గానీ……..మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చెస్తానులే"

"సరే గాని, ఈసారి ఎవరు గెలుస్తారంటావు?"

"ఇంకెవరు, యర్రయ్య వర్మ మనవడు అరవింద్, ఎన్నారై కదా, "జేగంట" పార్టీకి ఫండ్ బాగా కొట్టి, టికెట్ సంపాదించాడు. సుమారు వంద కోట్లు ఖర్చు పెడుతున్నాడట. మొదట రామానాయుడికి ఇస్తారనుకున్నారు కాని వాడి కన్నా అరవింద్ ఎక్కువ ఖర్చు పెట్టగలడని వీడికే టికెట్ ఖరారయింది. గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశం కూడ ఉంది."

"ఇక పోతె ఆ "శటారి" పార్టీ కేండిడేట్ భానుమూర్తి కొద్దిగ వీక్. అంత ఖర్చు పెట్టలేడు, కాబట్టి అరవింద్ గెలిచే ఛాన్స్ ఉంది."

యర్రయ్య వర్మ పేరు వినగానే నాకు యాబయ్యేళ్ళ నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.

-----///-----

"రాజారావు భిలాయి నుండి నిన్న వచ్చాడురా, చూసావా?" నా క్లాస్ మేట్ మన్మథరావు అడిగాడు.

"నాకెలా తెలుస్తుందిరా మీ ఎదురింట్లో ఉంటాడు గనుక నీకు తెలుస్తుంది" అన్నాను నేను.

"గొప్ప స్టైలు కొడుతున్నాడురా"

"ఏమైందిరా?"

"ఉదయం లేవగానే వాడిని చూసాను. నేను విష్ చేసినా వాడు రిప్లై ఇవ్వలేదురా"

"పోనీలేరా వాడు మనకన్నా పెద్దవాడు కదా అని అన్నాను."

రాజారావు మాకన్నా పది సంవత్సరాలు పెద్దవాడు. చదువు ఏమి అబ్బలేదు. దానితో టైలరింగు నేర్చుకున్నాడు.

కొన్నాళ్ళ తరువాత వాళ్ళ చిన్నాన్నతో కలిసి భిలాయి వెళ్ళిపోయాడు. అక్కడ కూడ ఏమి ఉద్యోగం దొరక్క టైలరింగే చేసాడట.

"ఇప్పుడు పెర్మనెంటుగా వచ్చేసాడు. మరి తిరిగి వెళ్ళడట" మా వీధిలో ఎవరో అనుకుంటుంటె విన్నాను.

రాజారావు మేనమామ యర్రయ్య వర్మ. యర్రయ్య వర్మకు మొదట్లో ఏమి లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బర్మా కాందిశీకులు మన దేశానికి ఎక్కువగ తరలి వచ్చారు. వివిధ గ్రామాలలో వారు స్థిర పడ్డారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం వారు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళకు సహాయం చెయ్యడానికి నిధులు సమకూర్చారు. అప్పుడున్న ఎం ఎల్. ఏ గారి ప్రోద్బలముతో ఆ కమిటీకి కోశాధికారిగా యర్రయ్య వర్మ నియమింపబడ్డాడు. కోశాధికారిగా ఉంటూ తప్పుడు లెక్కలు చూపించి కొంత సొమ్మును వెనకేసుకున్నాడు యర్రయ్య వర్మ. అలా అక్రమముగా సంపాదించిన సొమ్ముతో ఆ రోజుల్లో అయిదెకరాల పల్లం రెండెకరాల మెట్టు భూమి కొన్నాడు. ఆ తరువాత ఎమ్మెల్యే వెనక తిరుగుతూ "సహకార భూమి తనఖా బేంకు" అధ్యక్ష పదవిని సంపాదించాడు.

-----///-----

"ఒరే రత్నం, మన ఊరి పంచాయతి ఎన్నికలు వస్తున్నాయి నీకు తెలుసు కదా, నీ సాయం కావాలిరా" అన్నాడు రాజారావు.

"నాకు టెంత్ పరీక్షలున్నాయి. ఇప్పుడు నేనేమి చెయ్యలేను" అన్నాను నేను.

"ఎన్నికలు మే నెలలో జరుగుతాయిరా, నీ పరీక్షలు మార్చి నెలలో అయిపోతాయి. నీ పరీక్షలకేమి ఇబ్బంది లేదురా" అన్నాడు రాజారావు.

పంచాయతి ఎన్నికల తేదీలు ఖరారై పోయాయి. ఇంకో పది రోజుల్లో జరుగుతాయనగా ఒక రోజు రాజారావు మా వార్డుకు సంబంధించిన ఓటర్ లిస్టులు పట్టుకుని వచ్చాడు.

"ఒరే రత్నం, మన వార్డు మెంబరుగా నేను పోటీ చేద్దామనుకున్నాను గాని ఈ సారి మా అమ్మ పోటీ చేస్తుంది, ఎందుకంటె మన వార్డుని లేడీస్ కి రిజర్వు చేసారు" అన్నాడు.

"వీడే అయిదో తరగతి వరకు చదివాడు. వీళ్ళ అమ్మ గారైతే నిరక్షర కుక్షి. వీళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారు!”అని అనుకున్నాను.

"మన వార్డులో సుమారు నాలుగు వందలు ఓట్లున్నాయి. ఈ నాలుగు వందల ఓట్లలో మన వీధిలోనే ఎక్కువ. రెండు వందల యాబై ఉన్నాయి. మిగిలిన నూట యాబై మన పక్క వీధిలో ఉన్నాయి. మన వీధి ఓట్లు మనకు పడితె చాలు. సులువుగా గెలవగలం"

"నీవు చెయ్యవలసిందేమిటంటె, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి అన్న విషయం ఈ పుస్తకం లో రాయి" అని నాకు ఒక నోట్ బుక్, పెన్ను ఇచ్చాడు.

నేను మన్నథరావు కలిసి మా వీధిలో ఏ ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు అన్న విషయం తేల్చి రాజారావుకు అప్పగించాము.

ఈ విషయాలు రాజారావుకు ఎలా పనికొస్తాయో మాకైతే అర్ధం కాలేదు.

వయసులో పెద్దవాడైనా మాతో కలిసి మెలిసి ఉండడము వలన మేము రాజారావుని చనువుగా "ఇవి నీకు ఎలా పనికొస్తాయిరా?" అని అడిగాము.

"మీరు చిన్న వాళ్ళురా, కొద్దిగా పెద్దయ్యాక తెలుస్తాయి" అని దాట వేసాడు.

పంచాయతి ఎన్నికల ముందు రోజు రాత్రి రాజారావు మరియు యర్రయ్య వర్మ గారి అబ్బాయి శ్రీనివాస్ ఇద్దరు కలిసి, చేతిలో కేష్ బేగ్ పట్టుకుని ప్రతి ఇంట్లోకి వెళ్తుండడం నేను గమనించాను.

తరువాత కొంత సేపటికి మన్మథరావు పరుగు పరుగున వచ్చి " ఒరే రత్నం, నీకు ఇది తెలుసా? రాజారావు అందరి ఇళ్ళలోకి వెళ్ళి డబ్బులు పంచుతున్నాడు. మా ఇంట్లోకి వచ్చి వంట చేస్తున్న మా అమ్మ తో "మహలక్ష్మి గారు, రేపు మన పంచాయతి ఎన్నికలు జరుగుతున్నాయి మీకు తెలుసు కదా, ఇదిగో ఈ డబ్బులు ఉంచండి. మా అమ్మ గారికి రోజా పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించండి" అని చెప్పి పక్కనున్న నన్ను విష్ చేసి వెళ్ళిపోయాడు"

"వాడు వెళ్ళిపోయిన తరువాత మా అమ్మ చెప్పింది పది రూపాయలిచ్చాడని. మా ఇంట్లో అయిదు ఓట్లున్నాయి. అంటె ఓటుకు రెండు రూపాయల్లెక్కన ఇస్తున్నాడనుకుంటా" అని చెప్పాడు మన్మథరావు.

"అంటె మన వీధిలో ఉన్న రెండు వందల యాబై ఓట్లు అయిదొందల రూపాయలకు కొనెస్తున్నారన్నమాట" అనుకున్నాను మనసులో.

ఎలాగైతేనేం ఆ మరుసటి రోజు జరిగిన ఎన్నికలలో రాజారావు వాళ్ళ అమ్మ గారు మా వార్డు మెంబరుగా నెగ్గారు.

-----///-----

ఈ ఓట్లు కొనే దుష్కృతి ఆనాటి నుండే ఉంది.

పూర్వం రాజులు యుద్ధాలు చేసి గెలిచి రాజులయ్యేవారు. అంటె రాచరికం లో "బలవంతునిదే రాజ్యం"

కాని ఇప్పుడు"ధనవంతునిదే రాజ్యం, రాజ్యాధికారం" అంటె ప్రజాస్వామ్యం కాదిది ధనస్వామ్యం.

నేను మా ఆవిడతో కలిసి మూడు రోజుల ముందే మా ఊరుకు బయలు దేరాను.

దారిలో ట్రైన్ లో ఎదురుగా కూర్చున్న ఒకాయన్ని అడిగాను మీదేఊరని? ఆయన మా సోంపేటవాడేనని చెప్పాడు.

"ఎవరు గెలుస్తారనుకుంటున్నారు?" అని అడిగాను.

"ఇంకెవరు సార్? జేగంట పార్టీ అరవింద్, ఎవరికేమి కావాలంటె అవి ఇస్తున్నాడు. పైపెచ్చు ఆయనకి జేగంట పార్టీ "ఎన్ ఆర్ ఐ వింగ్" వాళ్ళు కూడ ఆర్ధిక సహాయముచేస్తున్నారు. ఓటుకు ఎంతిచ్చైనా కొనేయమంటున్నారు. వాళ్ళ దగ్గర భానుమూర్తి దిగదుడుపే. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి" అన్నాడు.

"శటారి పార్టీ వాళ్ళ సంక్షేమ పథకాలు చూసి ఓటెయ్యరా?" అని అడిగాను.

"వీళ్ళ కన్నా జేగంట పార్టీ వాళ్ళు ఎక్కువ ఇస్తామంటున్నారు సార్ " అన్నాడాయన.

ఇంకా ఒకరిద్దరు కూడ ఆయన మాటనే సమర్ధించారు.

"ఎలా ఇస్తారు? ఇప్పటికే రాష్ట్రం అప్పులకుప్ప అయిందంటున్నారు కదా" అన్నాను నేను.

"అప్పుల జోలికి పోకుండా సంపద సృష్టిస్తారు సార్" అందులో ఉన్న ఒక యువకుని మాట. పొలిటికల్ న్యూస్ బాగా వంటబట్టిన వాడేమో!

"ఓహ్...అలాగా" అని నవ్వుకున్నాను.

ఈ మాట విన్న నాకు చిన్నప్పటి స్నేహితుడు దాలిశెట్టి గుర్తొచ్చాడు.

-----///-----

నేనప్పుడు టెక్కలి దగ్గర్లో ఉన్న దండు గోపాలపురం "సమితి ప్రాథమిక పాఠశాల" లో అయిదో తరగతి చదువుతున్నాను. దండు గోపాలపురం హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా మా నాన్న గారు నియమితులవ్వడం వలన మేము అక్కడికి బదిలీపై వెళ్ళాం.

"ఏమే హైమా, ఎంత ఉందే నీ దగ్గర ?" అడిగాడు దాలిశెట్టి

"అయిదు పైసలురా" అని బదులిచ్చింది హైమ

ఇలా ఇవ్వమంటు హైమ చేతిలోని అయిదు పైసలు లాక్కున్నాడు దాలిశెట్టి.

దాలిశెట్టి, తన తాత గారైన సుబ్బిశెట్టి గారి ఇంట్లో ఉండి చదువుకునేవాడు. సుబ్బిశెట్టి కిరాణా కొట్టులో తన తాతకి సహాయపడేవాడు దాలిశెట్టి. షావుకార్లు ఉండే వీధిలో సుబ్బిశెట్టి పక్క ఇంట్లో హైమ ఉండేది. ప్రతి రోజు స్కూల్ కు వెళ్ళేటప్పుడు ఇంటర్వెల్ లో ఏదైనా కొనుక్కుని తినడానికి షావుకార్లు వాళ్ళ పిల్లలికి అయిదు పైసలో లేక పది పైసలో పాకెట్ మనీగా ఇచ్చేవారు.

ఆ రోజు దాలిశెట్టికి తాత గారు ఏమి ఇవ్వలేదట. అందువలన ఏంచెయ్యాలా అని ఆలోచనలో పడ్డ దాలిశెట్టి బుర్రలో ఒక అయిడియా ఆవిర్భవించింది.

అదే తడవుగా హైమ చేతిలోని అయిదు పైసలు లాక్కొని అది పెట్టుబడిగా చూపి ఒక లాటరీ వేసాడు. నోట్ బుక్ లోని ఒక తెల్ల కాగితం చింపి చిన్న ముక్కలుగా చేసి టికెట్లు తయారు చేసాడు. తన దగ్గరున్న అయిదు పైసలను లాటరీప్రైజు గా చూపిస్తూ, ఒక్కో టికెట్ ఒక పైసా చొప్పున ఆరు టికెట్లు అమ్మాడు. లాటరీ ప్రక్రియ పూర్తి అయిపోయే సరికి తనకు ఒక పైసా లాభమువచ్చింది. ఇలా అయిదు సార్లు చేసాడు. అయిదు పైసలు సృష్టించాడు తనతెలివితేటలతో. చివరిగా హైమ దగ్గర తీసుకున్న అయిదు పైసలు హైమకు తిరిగి ఇచ్చేశాడు.

ఆ ఒక్క రోజే కాదు, ఆ తరువాత కూడ ఇలా పలుమార్లు చేసాడు దాలిశెట్టి. అందుకే వాడి బుర్రని " కోటి రూపాయలిచ్చి కొనాలనేవారు" అక్కడివారు.

-----///-----

రాత్రికల్లా మాఊరికి చేరుకున్నాను.

మా ఊరిలో ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మాజీ గ్రామ సర్పంచ్ అయిన రామస్వామి గారి ప్రియ శిష్యుడు భానుమూర్తి. రామస్వామి గారి లాగానే భానుమూర్తి కూడ అభ్యుదయ గాంధేయ వాది. ఆదర్శాలకు కట్టుబడి రాజకీయాలు చేస్తాడు. పైగా విద్యావంతుడు.

ఆయన గత రెండు సార్లనుండి పోటీ చేస్తున్నా గెలవలేక పోతున్నాడు. ఈ సారి ఎలాగైనా గెలవాలనుకున్నాడు. "ధనం మూలం ఇదం జగత్" అన్న నానుడి తెలియని వాడేమి కాదుగాని తన దగ్గర అంత డబ్బు లేదు.

తెలిసిన వాళ్ళు కొంత అప్పుగాను కొంత విరాళాలుగాను సహాయం చేసారు. పార్టీ కొంత ఫండ్ సమకూర్చింది. అందుకే ఆయన కూడ ఓటుకు రెండు వేల రూపాయలు పంచ గలిగాడు ఈ సారి. భాను మూర్తి ఆంధ్రా యూనివర్సిటీ లో నాకు సీనియర్. నేను మా ఊరు వెళ్ళిన వెంటనే భానుమూర్తి ఎన్నికల కార్యాలయానికి వెళ్ళి ఆయన్ను కలిసాను.

"ప్రచార పర్వం ఎలాగుంది" అని అడిగి కొంత ముచ్చటించిన తరువాత "ఇలాంటి కలుషిత రాజకీయాలు మీలాంటి వారికి సరిపడవు సార్" అన్నాను.

"ధనానికి కాకుండా మనిషికి విలువ ఇచ్చే రోజు రావాలని చూస్తున్నాను, బహుశా రాదేమో" అన్నారాయన నాతో.

ఈ సారి భాను మూర్తి ఎత్తుకు పై ఎత్తు వేసాడు. మరునాడు భానుమూర్తి ప్రచారాన్ని వారి కులం వారు ఎక్కువగా ఉన్న ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఉధృతం చేసాడు. ఆ గ్రామాల్లో అందరు ఆయనకే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ కూడ చేసారట.

"ఏమో గుర్రం ఎగరా వచ్చు!" అని ఎన్నికల రోజున అన్ని ప్రముఖ దిన పత్రికలలో భానుమూర్తి గెలిచే ఛాన్స్ ఉందని పతాక శీర్షికలతో వార్తలు రాసారు.

అలాగే ఎన్నికల ఫలితాల రోజున వారు ఊహించినది నిజమయింది. తూర్పు దిక్కున భానుడు ఉజ్వలంగా ప్రభవించాడు. కాగల కార్యము గంధర్వులే తీర్చారు అన్నట్టు భాను మూర్తి భారీ ఆధిక్యతతో గెలుపొందాడు.

ఇప్పుడు భారతావనిలో జరిగే ఎన్నికల దృష్ట్యా ఒకాయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి.

ధనం మూలం ఇదం జగత్,

కులం మూలం ఇదం రాష్ట్రం,

మతం మూలం ఇదం దేశం.

ఇందులో ఏ మంత్రం పని చేసిందో గాని భానుమూర్తి విజయుడయ్యాడు.

నేను మాత్రం ప్రజాస్వామ్యానికే నా ఓటు వేసాను.

దరిద్రకోటి భారతానికి దారి చూపాల్సిన వెలుగురేఖ లాంటి "ఎన్నికల తంతు" ఒక ప్రహసనం లా మారి పోయింది. ప్రజాస్వామ్యం పరిహసించబడుతోంది.

-----///-----

మరిన్ని కథలు

Srivarante maavare
శ్రీవారంటే మా వారే
- సి.హెచ్.ప్రతాప్
KOusikuniki Gnanodayam
కౌశికునికి జ్ఞానోదయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Saswathamainadi?
శాశ్వతమైనది ??
- సి.హెచ్.ప్రతాప్
Raghavaiah chaduvu
రాఘవయ్య చదువు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Pratibha
ప్రతిభ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari pareeksha
చివరి పరిక్ష.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు