
" మూడు రూపాయల కూరకి ముప్పై రూపాయల తాళింపు, అన్నట్టుందీ వ్యవహారం " అంటూ షర్ట్ ని హుక్కు కి తగిలించాడు నరసింహం .
"ఏంటి సంగతి , ఈ రోజు సామెతల పైన పడ్డారు " అంది శకుంతల నీళ్ళ గ్లాస్ చేతికిస్తూ .
"పాపం, సురేంద్ర కలిసాడే మన సాయిబాబా గుడి దగ్గర . ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్ళా కదా ఈవెనింగ్ వాక్ కి " అన్నాడు.
"ఏమైందండీ ?" అంది శకుంతల.
"వాళ్ళ అబ్బాయి , అదే అమెరికాలో ఉంటాడే , వాడికి జాబ్ పోయిందట, ఖర్చులు అవి- ఇవి ఎక్కువై , ఇక్కడ నుంచి డబ్బు పంపమని అడిగాడట !"
"మొన్న సరోజ ఫోన్ చేసింది, అంతా బాగున్నారు, కోడలు , కొడుకు ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ , బాగా వెనకేస్తున్నారు అందే ?" అంటూ సోఫా లో కూర్చింది శకుంతల.
"ప్రపంచ వ్యాప్తంగా ఆ వర్క్ ఫ్రమ్ హోమే కొన్ని లక్షల మంది కొంపముంచింది. కోవిడ్ కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఒక కొత్త అధ్యాయం లోకి అడుగు పెట్టింది . కొంతమంది దాని కారణంగా కోట్లు సంపాదించగా, చాలామంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆఫీసులకి వెళ్ళడానికి అయ్యే ఖర్చూ , బేబీ సిట్టింగ్ అయ్యే ఖర్చూ , హోటళ్ళ లో తినడం , వీకెండ్ షికార్లు ఇలా దాదాపుగా రెండు ఏళ్ళు భార్య భర్తలు పెట్టె ఖర్చు తగ్గి పోయి , చేతిలో అదనంగా సమయం దొరకడం తో , ఉద్యోగం చేస్తున్న యాజమాన్యానినకి తెలియకుండా మరి కొన్ని ఉద్యోగాలు చేస్తూ , వెనకటి రోజుల్లో కన్నా ఎక్కువ సమయం, డబ్బు మిగలడం తో , ఉన్నవి చాలవన్నట్టు కొత్త లోన్లు పెట్టి ఇంకో ఇల్లు కొనటం, ఉన్న ఇల్లుని మోడరన్ చేయటం ఇలా ఖర్చులు పెంచుతూ పోయారు. కంప్యూటర్ లో పని చేస్తున్నట్టు బ్రమ పెట్టే సాఫ్ట్వెర్ సాయం తో , పని చేయాల్సిన సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. కొంతమంది స్టాక్ మార్కెట్ నుండి లక్షలు సంపాదించారు, కానీ చాలా మందికి అనుభవం లేకపోవడం వల్ల భారీ నష్టాలు ఎదురయ్యాయి.స్టాక్ మార్కెట్ సవతి పెళ్ళాం , క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ మరియు ఇతర నాణేలు అనూహ్యంగా పెరగడం వల్ల, చాలామంది దానిలో పెట్టుబడి పెట్టారు. కానీ 2021 తరువాత మార్కెట్ పడిపోవడం వలన, కొందరు తమ పెట్టుబడులన్నీ కోల్పోయారు. విషయం తెలిసిన యాజమాన్యం వాళ్ళని ఉన్న పలానా ఉద్యోగం నుంచి తీసేయటం, కోవిడ్ ఆంక్షలు తగ్గి, ఉద్యొగులని మళ్ళీ ఆఫీస్ కి రమ్మనటం, చూస్తుండగానే కాలచక్రము మళ్ళీ మొదటికొచ్చింది. అంతే! అంతా అష్టదిక్బంధనం లో ఇరుక్కు పోయారు . వృధా చేసిన డబ్బు గోడకు వేసిన సున్నం లాంటిది కదా!.
ఇప్పుడు అలాటి వారంతా మనం ఊహించని ఇబ్బందులు పడుతున్నారు" అన్నాడు నిట్టూరుస్తూ .
"నిజమేనండి, పిల్లలు చదువుకోకుండా ఆన్లైన్ క్లాసులు సైలెంట్ చేసి, నెట్ఫ్లిక్స్ చూడడం ప్రారంభించారు. పెద్దలు సైతం కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మధ్యాహ్నం స్నేహితులతో గడపడం అలవాటు చేసుకున్నారు. క్యాష్బ్యాక్ యాప్లు డబ్బు సేవ్ చేస్తాయని,కొంతమంది ఎక్కువ కొనుగోళ్లు చేయడం వల్ల తాము సేవ్ చేశామని అనుకున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారు.ఎక్కడో కొంతమంది అదృష్టం పొందినప్పటికీ, ఇతరులు అనుకోకుండా నష్టపోయారు.
"WFH ని వర్క్ -ఫ్రమ్-హోం అర్థం మార్చి వైఫ్-ఫర్- హస్బెండ్ , భార్యలను సతాయించిన వారు ఉన్నారు. ఇంట్లోనేగా ఉండేదని , కట్టూ-బొట్టూ, తిండి-తిప్పలు లాంటి క్రమశిక్షణ తప్పి , దొరికిందల్లా తిన్నవారు ఇప్పుడు ఒబేసిటీ తో బాధ పడుతున్నారు. దొరికిన బట్టలేసుకుని , జూమ్ మీటింగ్లో ఇంటి విషయాలన్నీ బైట పడి నవ్వులపాలైన వారు ఎంత మందో "అంటూ నవ్వేసాడు నరసింహం.
“వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల అత్తా-కోడళ్ళ తగాదాలు,
భార్య-భర్త గొడవలు ,ఇరుగు-పొరుగు కొట్లాటలు మన నల్లకుంటలోనే ఇన్ని విన్నామంటే ఇంకా ప్రపంచం లో ఎన్నో " అంది శకుంతల గోంగూర వలుస్తూ.