ఆడపిల్లమ్మా! - రాపాక కామేశ్వర రావు

Aadapillamma

"ఆడపిల్లమ్మా!" జగన్నాథం గారు ఫోన్ లో పెద్ద కూతురితో మాటలాడుతున్నారు. ఆయన స్వరములో నిందాస్తుతిని గమనించి

"అదేంటి నాన్నగారు అలా మాటలాడతారు, చెల్లి ఆడపిల్లనే కావాలనుకుంటుంది కదా. మొదటి కానుపులో ఎలాగు కొడుకే పుట్టాడు" జగన్నాథం గారి రెండో అమ్మాయి సరస్వతి ప్రశ్నిస్తుంది.

ఇంతకీ విషయమేమింటంటె పస్తుతము జగన్నాథం గారి మూడో కూతురు రెండవ కానుపులో ఆడపిల్లని ప్రసవించింది.

జగన్నాథం గారికి వరుసగా ముగ్గురు ఆడపిల్లల తరువాత మగబిడ్డ పుడతాడేమో ప్రయత్నించమని బంధుమిత్రులెంత చెప్పినా వినలేదు. ఎందుకంటె "మళ్ళీ ఆడపిల్ల పుడితే!!!" ఆ ఆలోచనకే వణికి పోయేవారు. తన అక్క చెల్లెళ్ళ పెల్లిళ్ళ కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో చిన్నప్పటినుండి చూసారు. ఇప్పుడు తన కూతుళ్ళను కూడ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చెయ్యడానికి ఎంత కష్టపడ్డారో అన్న విషయం ఆయన స్వరములోని నిందాస్తుతిని గమనిస్తె ఎవరికైనా అర్థమైపోతుంది.

ఆడపిల్లలంటె విసిగిపోయిన జగన్నాథంలో తన వారు ఎవరు ఆ బాధలు పడకూడదనే చిన్న స్వార్థం. ఎందుకంటె ఆయన సగటు మనిషి.

జగన్నాధం గారు రెండో అమ్మాయి మాటలు విన్నాక ఆడపిల్లలతో తాను పడ్డ కష్టాలు నెమరు వేసుకున్నారు.

---///---

సహజముగా భయస్తుడైన జగన్నాథం ఆడపిల్లల్ని గుండెల మీద కుంపటిలా భావించేవాడు. తన భార్య పురిటికి వెళ్ళిన ప్రతిసారి స్నేహితులు మరియు సహోద్యోగులు సరదాగా "ఏమోయ్ జగన్నాథం ప్లస్సా? మైనస్సా?" అని అడిగేవారు. ఆ ప్రశ్నలకు ఇంకా ఎక్కువ భయపడేవాడు.

ఏ దేవుడైనా కరుణించి ఒక మగ నలుసునైనా ఇవ్వకపోతాడా అని అందరి దేవుళ్ళకు మొక్కుకున్నాడు. అయినా వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు.

ఆ భయంతోనే, పదిహేనవ ఏటనే పెద్ద పిల్లకు పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

ఉద్యోగ రీత్యా విశాఖపట్నం లో స్థిరపడ్డ జగన్నాధం సొంత ఊరు శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరు. ఇక్కడ విశాఖపట్నంలో తన కులం వాళ్ళెవరు తెలియకపోవడం వలన తన సొంత ఊరిలో చుట్టాల అబ్బాయి అప్పలరాజు చదువుకున్నాడని తెలిసి అటు వైపుగా అడుగులు వేసాడు.

"మన ఊరిలో మా చిన్నాన్న గారి అమ్మాయి కమల నీకు తెలుసుకదా. ఆమె కొడుకు స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడట" భార్య అనసూయతో జగన్నాథం మాట కలిపాడు.

"మన అమ్మాయికి ఈడు జోడు సరిపోతాడు. మన అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని కబురు పెడదామా" అని ప్రశ్నిస్తున్నట్టు భార్యతో అన్నాడు.

"ఉద్యోగం ఏమైనా వచ్చిందా?" అనసూయ అడిగింది.

"ముఖము కడుక్కుని ఉంటే ఎవరైనా కాఫీ నీళ్ళు పోస్తారు. అబ్బాయి చదువు పూర్తి చేసి రెడీ గా ఉన్నాడు, ఎవరైనా ఉద్యోగమివ్వవచ్చు."

"పెళ్ళి అయ్యాక ఇక్కడికి తెచ్చి మా కంపెనీలో ఎవరికైనా చెప్పి ఉద్యోగం వేయించవచ్చులే" జగన్నాథం ధీమా.

భార్యాభర్తలు ఆలస్యం చేయకుండా ఆ మరుసటి రోజునే పెళ్ళికొడుకు వారికి కబురుపెట్టడం. ఆ తరువాత పెళ్ళి చూపులు కట్నకానుకలు మాట్లాడుకోవడం పెళ్ళి జరిపించడం అన్నీ నెల రోజుల్లో పూర్తి అయిపోయాయి.

జగన్నాథం పెద్ద కూతురు భారతి పెళ్ళి అయ్యాక అత్తవారింట్లో అడుగు పెట్టింది.

అలా ఒక సంవత్సరం గడచింది. భారతికి ఇంకా కడుపు పండే భాగ్యము కలగలేదు. అత్త వారింట సూటిపోటి మాటలు మొదలయ్యాయి.

"ఏం కమలక్కా కొడుక్కి పెళ్ళి చేసి సంవత్సరమైనట్టుంది మీ కోడలు నీళ్ళోసుకోలేదా ఇంకా?" పక్కింటి మీనాక్షి పైట సర్దుకుంటు వచ్చి కమల పక్కన కూర్చొని అడిగింది.

"ఆ... ఇంకా లేదు. వాళ్ళమ్మ పోలికనుకుంటాను. వాళ్ళమ్మకి పెళ్ళైన మూడేళ్ళకి పుట్టింది మా కోడలు."

"అటుకులు బొక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఊరుకోవు" అన్నట్టు మీనాక్షి ఒక ఉచిత సలహా పారేసింది, "సిమ్మాచలం కొండకొస్తానని ముడుపు కట్టి మొక్కుకో అక్కా."

-----///-----

అక్కడ జగన్నాథం తన కంపెనీలో తెలిసిన ఆఫీసర్లందరి వద్ద తన అల్లుడి ప్రస్తావన తెచ్చినా ఫలితము కనబడలేదు. తన అల్లుడికి ఇక్కడ ఉద్యోగం దొరికితె కూతురిని తన కళ్ళ ముందు చూసుకోవచ్చనే చిన్ని ఆశ ఆయనది.

సరిగ్గా నెలరోజులు తరువాత ఆ కంపెనీకి కొత్తగా ఒక జనరల్ మేనేజర్ బదిలీపై వచ్చాడు. ఆ నోటా ఈనోటా జగన్నాథం పని తనం గురించి ఆయన నిజాయితీ నిబద్ధత గురించి విన్న కొత్త జి ఎం, జగన్నాథంని తన పి ఏ గా పెట్టుకున్నారు.

కొత్తగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తలచిన జగన్నాథం తన అల్లుడి గురించి జి ఎం గారితో చెప్పాడు. ఏ దేవతలు ఆయన మొర విన్నారో గాని జి ఎం గారు వెంటనే ఒప్పుకున్నారు. వారం రోజుల్లో అల్లుడు ఉద్యోగం లో చేరిపోయాడు. కంపెనీ వాళ్ళిచ్చిన క్వార్టర్స్ లో కాపురం కూడ మొదలుపెట్టారు కూతురు అల్లుడు.

అదే నెలలో కూతురు నెల తప్పింది. ఆ వార్త విన్న జగన్నాథం అనసూయల ఆనందానికి అవధుల్లేవు.

-----///-----

ఒక రోజు అప్పలరాజుకి వాళ్ళ ఊరినుంచి వచ్చిన మనిషి ద్వారా తన తండ్రి ఆరోగ్యం బాగులేదని తెలిసింది. కంపెనీలో మామగారితో ఒక మాట చెప్పి సెలవు తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళాడు.

ఊరిలోకి వచ్చిన వెంటనే తండ్రిని అక్కడ స్థానికముగా ఉన్న ఒక ఆర్ ఎం పి డాక్టరు దగ్గరికి తీసుకెల్లాడు. ఆయన రాసిన మందుల్ని కొని తెచ్చాడు. ఆ సాయంత్రం ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్న అప్పలరాజు తో పొరుగింటి కనకమ్మ

"అయ్యా వచ్చావా? మీ నాయన ఒంట్లో బాగులేదు. వైజాగు తీసుకెళ్ళి పెద్దాసుపత్రిలో బాగు చెయ్యించు"అని అంది.

ఈలోపల అప్పలరాజు వచ్చాడని తెలిసి చుట్టుపక్కల వారందరు వచ్చి చేరారు. తలా ఒక సలహా, ఉచితమే కదా! ఇస్తున్నారు. ఇంచుమించుగా వారందరు వైజాగు ట్రీట్మెంట్ కే ఓటేసారు.

అప్పలరాజు "తలిదండ్రుల్ని తనతో తీసుకెల్తే తనకు వచ్చిన జీతముతో ఆర్థిక ఇబ్బందులెక్కువవుతాయని" ఆలోచిస్తున్నాడు. "అందులోను తన భార్య భారతి ఇప్పుడు గర్భవతి. ఆ తరువాత ఎవరో పుట్టాక ఖర్చులు ఇంకా పెరిగిపోతాయి"

"కొన్నాళ్ళు ఈ మందులు వాడి చూద్దామమ్మా" అని తల్లితో అన్నాడు.

“అయినా కందకు లేనిదేదో ....... అంటారు కదా, నాకెందుకులెండి” అని పక్కింటి మీనాక్షి నిందాస్తుతి తో అంది.

ఆమాటతో అప్పలరాజు తల్లి కమల కన్నీళ్ళు పెట్టుకుంది. అప్పలరాజు మనసు మార్చుకుని అమ్మానాన్నతో ఆ మర్నాడు ఉదయం వైజాగు బయలుదేరాడు.

మళ్ళీ భారతికి తిప్పలు తప్పలేదు. రోగిష్టి మామ, చీటికి మాటికి వేలెత్తి చూపే అత్త.

భారతి ఆడపిల్లని ప్రసవించింది. కమల మనవరాల్ని కోడల్ని చూడడానికి కూడ వెళ్ళలేదు. కూతురికి మూడవ నెల రాగానే, భార్యని, కూతురిని అత్తగారింటి నుండి తమ ఇంటికి తీసుకొచ్చాడు అప్పలరాజు. భారతికి అత్త కమల వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. అనుకున్నట్టుగానే అప్పలరాజుకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. కొన్నాళ్ళు భార్యని, కూతురిని తన మామ జగన్నాధం గారింటిలోనే వదిలెస్తే తనకు ఖర్చులు తగ్గుతాయని తలచాడు.

ఒక రోజు తన భార్యకు సుస్తీగా ఉందని చెప్పి, అత్తవారింటికి పంపించాడు అప్పలరాజు. అదే అదనుగా భార్యను కూతురిని తిరిగి తీసుకు రాకుండా అయిదేళ్ళు జగన్నాథం గారింట్లో వదిలేసాడు. ఎలాగు భార్య, కూతురు ఇద్దరూ మామ గారింట్లో ఉన్నారు కాబట్టి తాను కూడ తరచు అక్కడే ఉండేవాడు. "అంగడిలో ఆంబోతై తినాలి. అత్త ఇంట్లో అల్లుడై తినాలి" అని ఊరికే అనలేదు మన పెద్దలు.

-----///-----

జగన్నాథం పెద్దకూతురి చదువును స్కూల్ ఫైనల్ తో ఆపించి పెళ్ళి చేసేసాడు. కాని రెండో కూతురు సరస్వతి చదువుల్లో రాణిస్తుండడం వలన కొంత అయిష్టం గానే కాలేజి చదువుకు పంపించాడు.

ఒక రోజు సరస్వతి క్లాస్ మేట్ నని చెప్పుకుంటు ఒక అబ్బాయి జగన్నాథం ఇంటికి వచ్చి "మీ అమ్మాయి సరస్వతిని ప్రేమించాను, పెళ్ళి చేసుకుంటానండి" అని అడగడంతో భయపడిపోయిన జగన్నాథం వెంటనే సరస్వతి చదువు మానిపించి పెళ్ళి చేసేసాడు.

అల్లుడు స్టేట్ గవర్నమెంటులో గుమస్తాగా చేస్తున్నాడు. జీతం నాతం బాగానే వస్తుంది. ఉల్ఫాగా వచ్చిన డబ్బుతో వ్యసనాలు మొదలయ్యాయి. తాగుడు, పేకాట నిత్యకృత్యాలు. మాటి మాటికి పెళ్ళాన్ని కొట్టి పుట్టింటికి పంపించేవాడు డబ్బు తెమ్మని. వాడి వేధింపులకు తాళలేక సరస్వతి విడాకులు తీసుకుని అమ్మగారింట్లో సెటిల్ అయిపోయింది.

-----///-----

మూడో కూతురు కృష్ణవేణి. బి ఏ వరకు చదువుకుంది. ఎన్ని సంబంధాలొచ్చినా, అమ్మాయి రంగు తక్కువని చెప్పి వెళ్ళిపోతున్నారు. జగన్నాథం దంపతులు మొక్కని దేవుడు లేడు. ఏ దేవుడి కరుణాకటాక్షములో గాని ఎలాగైతేనేం భారీ కట్నం ఎర చూపి చివరికి నరేష్ అనే ఒక బేంక్ గుమస్తాతో పెళ్ళి జరిపించారు.

నరేష్, తల్లి అంజలీదేవికి నలుగురు ఆడపిల్లల తరువాత పుట్టాడు. అంజలీదేవికి ఆడపిల్లలంటె చులకన భావన. అది విన్న జగన్నాధం "చిన్న కూతురు కృష్ణవేణికి మొదటి సంతానములో ఆడపిల్ల పుడితే అత్త వేధింపులు తట్టుకోలేదని" చాల ఆందోళన పడసాగాడు. కృష్ణవేణికి మొదటి సంతానములో కొడుకు పుట్టడముతో కుటుంబం అంతా కుదుటబడ్డారు. ఇప్పుడు కృష్ణవేణికి రెండో సంతానములో ఆడపిల్ల పుట్టింది. అందుకే మళ్ళీ జగన్నాధం కు తెలియని ఆందోళన.

-----///-----

జగన్నాథం దంపతులు కృష్ణవేణికి పుట్టిన మగ పిల్లాడిని అతి గారాబముగా చూసుకునే వారు. తమకి మగ సంతానం కలగక పోయినా తమ కూతురుకి మగ సంతానం కలిగిందని ఆనందం.

అదే మనవరాళ్ళపై మాత్రం అంత గారాబము చూపే వారు కాదు. ఆడపిల్లలంటె ద్వేషము కాదు గాని అయిష్టము.

మనవడు, మనవరాళ్ళందరు పెరిగి పెద్దవారయ్యారు. అటు నాన్నమ్మ తాత, ఇటు అమ్మమ్మ తాత, అతి గారాబము చెయ్యడము వలన కృష్ణవేణి కొడుకు చదువుల్లో రాణించలేదు.

భారతి కూతురు సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా అమెరికా లో ఉద్యోగం చేస్తుంది. కృష్ణవేణి కూతురు అనిత ఎంసెట్ లో మంచి రేంకు సంపాదించి ఆంధ్ర మెడికల్ కాలేజి నుండి గ్రాడ్యుయేషన్ తరువాత పి జి డిగ్రీ పొంది అపోలో ఆస్పత్రిలో డాక్టరుగా స్థిరపడింది.

-----///-----

కొన్నాళ్ళకు జగన్నాథం భార్య అనసూయకు బ్రెస్ట్ లో ఒక కణితి ఏర్పడింది. దానితో ఆయన బెంగ పెట్టుకున్నారు. మనవరాలు అపోలో ఆసుపత్రిలో డాక్టర్ అవ్వడం వలన అనసూయను అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు. కూతుర్లందరు తల్లికి ఆపరేషన్ అని ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లలందర్ని అక్కడ చూసిన జగన్నాథం మనసులో అనసూయకు ఏమవుతుందోనన్న భయం ఎక్కువయింది.

అనసూయకు అపోలో ఆసుపత్రిలో చేర్చడము వలన, మనవరాలు డాక్టర్ అనితకు, అమ్మమ్మ బ్రెస్ట్ ఆపరేషన్ చేసే అవకాశం కలిగింది.

"తాతగారు మీరేమి గాబరా పడాల్సిన అవసరములేదు. అమ్మమ్మ ఆపరేషన్ సక్సెస్" డాక్టర్ అనిత ఆపరేషన్ థియేటర్ నుండి వస్తూ అన్న మాటలకు జగన్నాథం కళ్ళు చెమర్చాయి.

ఆయన ఆనందంలో అతిశయం కనిపిస్తుంది. ఆడపిల్లలంటె జగన్నాథంలో ఇప్పుడు 'భయం' స్థానం లో 'గర్వం' తొంగి చూస్తుంది.

" నాన్నగారు, మా అమ్మాయి, డాక్టర్ అనిత ఆడపిల్లేనండి!!!" అని దెప్పిపొడుపుగా సరస్వతి అన్న మాటలకు జగన్నాథంతో సహా అందరు నవ్వుకున్నారు సంతోషంతో.

-----///-----

మరిన్ని కథలు

Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
Aanaatiki eenaatiki amarulu
ఆనాటికి ఈనాటికి అమరులు
- హేమావతి బొబ్బు
Aashavaadi
ఆశావాది
- డా:సి.హెచ్.ప్రతాప్
bhrama
భ్రమ
- బెహరా కోటేశ్వరరావు
Kalisi vunte kaladu sukham
కలిసి ఉంటే కలదు సుఖం
- డా:సి.హెచ్.ప్రతాప్
Paatradhaari
పాత్రధారి
- బొల్లిముంత వెంకట రమణా రావు .
Surigaadu
సూరిగాడు
- అనిసా తబస్సుమ్ sk
Chintoo lo bhayam poyindi
చింటూలో భయం పోయింది
- నారంశెట్టి ఉమామాహేశ్వరరావు