భువినుండి దివికి - తాళ్ళూరి చంద్రశేఖర్

Bhuvi nundi diviki

 

కలియుగ వైకుంఠం అని అందరు భక్తితో పిలుచుకునే ఏడుకొండల వాసుడి తిరుమల సందర్శనం తీర్థయాత్రలిచ్చే భక్తి, ముక్తులతోపాటు విహార యాత్రలిచ్చే మానసిక ఆనందం, ఉల్లాసం, ఉపశమనం కూడా ప్రసాదిస్తుంది.

 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని భక్తితో దర్శించుకోడానికి కొండపైకి వెళ్లుతుంటే ఆ సప్తాద్రులలో అణువణువు అత్యంత ఆహ్లాదాన్ని, మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతిని ఇస్తాయి. అలిపిరి దాటి కొండ పైకి వెళుతుంటే చెప్పనలవి కాని ఒక అలౌకిక అనుభూతికి లోనవుతాం. పచ్చటి చెట్లతో కనువిందు చేసే ఆ పర్వత శ్రేణిని ఎంతసేపు చూసినా తనివి తీరదు.

 

పద్మావతీ వల్లభుడి దర్శనం భక్తుల అకుంఠిత భక్తికి పరాకాష్ట

అవుతే, కొండ పైన గడిపే సమయం ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రశాంతంగా, హాయిగా మానసిక ఉల్లాసాన్నిచ్చే విహార యాత్రలాగా అనిపిస్తుంది. అందుకే ఆపదమొక్కులవాడి దర్శనం మొక్కుబడి లాగా, ఆదరాబాదరాగా పూర్తి చేసుకునే ఒక కార్యక్రమం లాగా పరిగణించ కూడదు.

 

తిరుమల పర్యటన అంటే స్వామి దర్శనంతో పాటు కొండపైన కనీసం ఒకటి, రెండు రోజులు గడిపే అత్యంత ప్రియమైన సమయం. ఎంతో అమూల్యమైన ఆ సమయం ప్రతి క్షణం మనలో

నూతన ఉత్తేజాన్ని ప్రేరేపిస్తూ ఐహిక బంధాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది.

 

తిరుమల పర్యటన చలికాలమైతే భక్తుల రద్దీ కొంచం తక్కువగా ఉండడంతో పాటు, శీతాకాలపు మంచుతెరలలో తిరుమల గిరులు ఒలకబోసే సరికొత్త వయ్యారాలు కూడా కనువిందు చేస్తాయి.

అలిపిరి దాటగానే మొదలవుతుంది మన భూతల స్వర్గ ప్రయాణం.

పాము మెలికలు తిరుగుతున్న నున్నటి రోడ్డు మీద ప్రయాణిస్తుంటే ఒక వైపు లోయలు, మరో వైపు శిఖరాలు. మరి కొంచం పైకి వెళితే మబ్బులను తాకుతున్న అనుభూతి. పచ్చటి వృక్షాల మధ్యనుండి వీచే శీతల పవనాలు ముఖాన్ని స్పర్శిస్తుంటే కలిగే ఆహ్లాదమే వేరు.

 

కొండ పైకి చేరుకోగానే మరో లోకంలోకి వెళ్లిపోతాము. ఎక్కడ చూసినా భక్తి రస తరంగాలే. ఎవరిని చూసినా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నవారే. ఏ కొండా కోనా, చెట్టూ చేమా చూసినా అ దేవదేవుడే కనబడతాడు.

 

స్వామి దర్శనం కోసం గంటల తరబడి పిల్లా పాపాలతో క్యూ లైన్లలో నిలబడి ఆ వడ్డీకాసులవాడి దర్శనం రెప్పపాటు కాలంమాత్రమే లభించినా, ఆలయం బయటకు వస్తున్నప్పుడు భక్త జనులందరి ముఖాలలోనూ ఒక వింత తేజస్సుతో కూడిన ఆనందం, సంతృప్తి కనిపిస్తాయి.

 

అందుకే కొండపైన పగలంతా గోవిందుడి దర్శనం కోసం పడిగాపులు పడినా, సాయంత్రాలు మటుకు ఆలయం బయటి ప్రాంగణంలో విశ్రాంతిగా కూర్చుని, భక్తి పార వశ్యంతో పరవశించిపోతున్న భక్తులను చూస్తూనో, తిరుమలంతా విన్పించే అన్నమయ్య భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలు, ఘంటారావాలు వింటూనో గడిపితే ఆ భావోద్వేగ తాదాత్మ్యం నుండి పొందే మానసిక ప్రశాంతత వర్ణించ నలవి కానిది.

 

సుషుప్తావస్థలోనే ఏ అర్ధరాత్రి దాకానో గడిపి బస చేరుకుని కొద్ది సేపు కునుకు తీశామో లేదో సుప్రభాతంతో శ్రీవారి మేలుకొలుపు మొదలవుతుంది. వీనులవిందు చేసే ఆలయ అర్చకుల వెంకటేశ సుప్రభాతం వింటూ బస బయటికొచ్చామంటే గుప్పున సంపెంగల సువాసన చుట్టుముట్టుతుంది చుట్టూతా ఉన్న సంపెంగ చెట్లనుండి. మసక, మసక చీకట్లలో పెనవేసుకుంటాయి దట్టంగా అలుముకున్న శీతాకాలపు పొగమంచు పొరలు.

 

చేతులు కొంకర్లు పోయే ఆ చలి గాలిలో ఆరుబయట బడ్డీ కొట్టు వాడు ఇచ్చే వేడి వేడి కాఫీ త్రాగుతుంటే అమృతమే త్రాగుతున్న అనుభూతి. మరికొద్ది సేపట్లో చిక్కటి చీకట్లను పారదోలుతూ పైకెగసినఆదిత్యుడు శ్రీవారి ఆలయ సువర్ణ గోపురం మీద ధగ ధగలు కురిపిస్తూ కనుల విందు చేస్తాడు.

 

తెల్లవారుతూనే కాఫీ టిఫిన్లు చేసి బయల్దేరితే ఆకాశ గంగ, పాప వినాశనం, శిలా తోరణం, శ్రీవారి పాదాలు, చక్రతీర్ధం మొదలైన పవిత్ర ప్రదేశాలు అన్నీదర్శించుకుని వచ్చేసరికి మధ్యాహ్నమవుతుంది.

 

ఒక్కో ప్రదేశానిది ఒక్కో ప్రత్యేకత. శ్రీవారి పాదాల వద్దనుండి చూస్తే శ్రీవారి ఆలయ విహంగ వీక్షణం, దూరంగా తిరుమల చుట్టూతా

పచ్చటి చెట్లతో సింగారించుకున్న గిరులు- ఎన్నటికీ మరచిపోలేని

రమణీయ దృశ్యాన్ని కనులముందు సాక్షాత్కరింపజేస్తాయి.

 

భోజనానంతరం కొద్దిసేపు సేదదీరి, స్వామి వారి ఉద్యానవనంలో

కాసేపు విహరించి తిరిగి చల్లటి సాయంత్రం వేళ అదే తాదాత్మ్యంతో శ్రీనివాసుడి సన్నిధిలో ఆలయ ముఖద్వారం బయటి ప్రాంగణంలో ఆనందంగా గడిపి ఏ అర్ధరాత్రికో కాటేజీ చేరుకుంటే మనసుకు ఎక్కడలేని ప్రశాంతత చేకూరుతుంది.

 

మరునాడు ఏడుకొండలవాడి ఉదయపు నైవేద్య ఘంటారావం

విన్నాక కొండదిగి శ్రీ కాళహస్తీశ్వరుడిని, కాణీపాకం గణపతిని,

అలివేలుమంగను సందర్శించుకుని స్వస్థలానికి తిరుగుముఖం పడితే మనసంతా ఏదో తెలియని ఉద్వేగంతో, సంతృప్తితో నిండిపోయి జగమంతా ఆనందంతో పరవశించిపోతున్న భావన కలుగుతుంది.

 

 

********

 

 

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్