వంట గదిలో వీరుడు కథ - రాము కోలా దెందుకూరు

Vanta gadi lo veerudi katha

ఫైనల్ ఆ రోజు మా శ్రీమతి పుట్టినరోజు. రాత్రంతా ఆలోచించి, ఉదయానికే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను. "ఈసారి ఏదో భిన్నంగా చేయాలి. పూలు, కేకులు అందరూ ఇస్తారు. నేను మాత్రం స్వయంగా వంట చేసి నా శ్రీమతిని ఆశ్చర్యపరుస్తాను!" అనుకున్నాను. వెంటనే వంటగదిలోకి దూసుకెళ్లి, "బంగారం! ముందుగా మీ నోరు తీపి చేస్తాం... నీ కోసం నేనే పాయసం చేస్తాను. ఈరోజు వంటంతా నా బాధ్యత. నువ్వు హాయిగా కూర్చొని చూస్తూ ఉండు!" అన్నాను. ఆమె నా ముఖం వైపు ఓసారి చూసింది. ప్రపంచంలోని పదకొండో వింత కళ్లముందు నిలబడినట్టుగా ఆశ్చర్యపోయింది. చిరునవ్వుతో, "అయ్యో! వంట పాత్రల మీద మీ వీరప్రతాపం చూపించకండి. పాపం... వాటికి నోట్లో నాలుక లేదు!" అంది. నేను మాత్రం హీరోలా కాలర్ సరిచేసుకుని, "ఈరోజు నా వంట రుచి చూసాక నువ్వే ఆశ్చర్యపోతావు!" అని ప్రకటించాను. ముందుగా పాయసం మొదలెట్టాను. పాలు పోశాను... బియ్యం వేసాను... పంచదార కలిపాను... అన్నీ బాగానే సాగుతున్నాయని అనుకుని, "ఇంతలో చికెన్ బిర్యానీకి సిద్ధమవుదాం" అంటూ మరో స్టవ్ దగ్గరకు వెళ్లిపోయాను. అక్కడ ఉల్లిపాయలు తరగడం మొదలెట్టాను. తరిగింది ఉల్లిపాయ ఒక్కటే కాదు... నా కళ్లలోని ధైర్యమూ! కన్నీళ్లు కారుతుంటే, "అయ్యో ఉల్లి తమ్ముడా! నీకు నాపై కాస్తైనా కనికరం లేదా?" అని మనసులోనే వాపోయాను. ఇంతలో చికెన్ కుక్కర్‌లో వేసి, మసాలా పొడి ప్యాకెట్‌ను వీరావేశంతో లాగాను. అంతే! మసాలా పొడి గాలిలో ఎగిరి నేరుగా నా ముఖంపై అభిషేకం చేసింది. దగ్గు... తుమ్ములు... కళ్లలో నీళ్లు... వంటగది మొత్తం యుద్ధరంగంలా మారిపోయింది. ఆ హడావుడిలో పాయసం సంగతి పూర్తిగా మర్చిపోయాను. కొద్ది సేపటికి... "ఏదో మాడిన వాసన వస్తోంది!" అని నా శ్రీమతి అరిచింది. నేను ధైర్యంగా, "అది కొత్త స్టైల్ పాయసం అయి ఉంటుంది!" అన్నాను. మూత తీసి చూడగానే... గిన్నె అడుగున పాయసం కాదు... బొగ్గులా నల్లగా మారిన ఒక కళాఖండం! చెంచాతో కలపాలని ప్రయత్నిస్తే అది కదల్లేదు. గిన్నె మాత్రం, "నన్ను వదిలేయండి బాబూ!" అని వేడుకుంటున్నట్టనిపించింది. ఆ వాసనకు పక్కింటి పిల్లి కూడా ముక్కు మూసుకుని వెనక్కి వెళ్లిపోయింది. అప్పటికే నా శ్రీమతి వంటగదిలోకి వచ్చి ఆ దృశ్యం చూసింది. మొదట గిన్నెను చూసింది... తర్వాత నన్ను చూసింది... ఇంకేముంది! నవ్వు ఆపుకోలేక గోడ పట్టుకుని పగలబడి నవ్వింది. చీరకొంగు నడుముకు దోపుకుని, "చాలు మీ వంటవీరత్వం! ఇక మీరు రాముడిలా కూర్చొని చూస్తూ ఉండండి. నేను ఐదు నిమిషాల్లో పాయసం, బిర్యానీ రెండూ చేసి పెడతాను!" అంది. నేను మాత్రం ఓడిపోయిన సేనాధిపతిలా నిశ్శబ్దంగా వంటగది నుంచి బయటకు వచ్చేశాను. ఆ రోజు నాకు ఒక జీవిత సత్యం అర్థమైంది. యూట్యూబ్‌లో వంట చూడటం చాలా సులువు... గ్యాస్ ముందు నిలబడి చేయడం మాత్రం మహాయోగం! నీతి: భార్య పుట్టినరోజున వంటగదిలో కథాకళీ ఆడటంకంటే... మంచి హోటల్‌కు తీసుకెళ్లి భోజనం పెట్టడం ఆరోగ్యానికీ, పాత్రలకీ, భర్త పరువుకీ ఎంతో మేలు!

మరిన్ని కథలు

Manavatwam gelichindi
మానవత్వం గెలిచింది
- డా:సి.హెచ్.ప్రతాప్
Dinadina gandam noorella ayusshu
దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Dwesham
ద్వేషం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manasupaddaanu kaanee
మనసు పడ్డాను కానీ!
- మీ రాము కోలా
Nenu mallee podupu chestaa
నేను మళ్ళీ పొదుపు చేస్తా...!
- బొందల నాగేశ్వరరావు
Rakthaksharaalu
రక్తాక్షరాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Pakshi premikudu
పక్షి ప్రేమికుడు (బాలల కథ)
- చెన్నూరి సుదర్శన్
Panimanishi nmerpina gunapatham
పని మనిషి నేర్పిన గుణపాఠం
- కామేశ్వర రావు రాపాక