కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు .
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
"సోదరులారా ఈరోజు మీకు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు అనే కథ చెపుతాను వినండి " అని శ్రీహరి కథ చెప్పడం ప్రారంభించాడు ...
మగధ రాజ్యపాలకుడు గుణవర్ధనుడు,సింహపురి పాలకుడు విజయుడు బాల్యంలో గురుకులంలో మిత్రులుగా ఉండేవారు ,కాలక్రమంలో వారు తమ రాజ్యాలను పరిపాలించసాగారు .
తమ రాజ్య ఉమ్మడి అరణ్యంలోని మృగాలు ,కోతులు సమీప గ్రామాలలోనికి రాత్రులు ప్రవేసిస్తున్నాయి అని అక్కడి ప్రజలు చెప్పడంతో అడవి జంతువులను అడవిలోపలకు తరమడానికి విజయుడు,గుణవర్ధనుడు అరణ్యం పొలిమేరలలో వేసిన గుడారాలలో కలసుకున్నారు.
"మిత్రమా విజయా ఎలా ఉన్నది నీపరిపాలన " అన్నాడు గుణవర్ధనుడు. " సొదరా పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అర్ధభాగం రాజ్య నిర్వహణకు ,పావుభాగం రాజ్య అభివృధ్ధికి ,మిగిలిన పావుభాగం ప్రజలకు దానం చేస్తాను "అన్నాడు విజయుడు.
అతని మాటలకు అశ్చర్యపోయిన గుణవర్ధనుడు " ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకు దానమివ్వడమేమిటి? అసలు దానం అంటే ఏమిటి? తము కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంతభాగం ఇతరులకు ఉచితంగా ఇవ్వడాన్ని దానం అంటారు, దానం ఎందుకు చేయాలో,ఎలాచేయాలో మనపూర్వీకులు ఇలా తెలియయజేసారు.
మూర్ఖో న హి దదాత్యర్థం, నరో దారిద్య్రశంకాయ,
ప్రాజ్ఞస్తు వితర త్యర్థం, నరో దారిద్య్రశంకాయ.మూర్కుడు ఈజన్మలో తనకు ఏమి ఉండదేమోనని తన సొమ్మును ఎవ్వరికి దానం ఇవ్వడు.ప్రాజ్ఞుడు ముందుజన్మలో ఉండదేమోనని తన సంపాదనను యోగ్యులకు దానంచేస్తాడు.ఇది జీవిత సత్యం.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు,నిస్వార్ధంతో చేసేదానాన్ని 'స్వాతిక' దానంఅని . ఫలాపేక్ష ఆశించి చేసేదానాన్ని 'రాజస'దానంఅని .తృణీకిరభావంతో, డాంబికంతొ ఇచ్చేదానాన్ని'తామస'దానం అని చెప్పాడు.దానంలో, 'కన్యాదానం' -'గోదానం'-'భూదానం'-'విద్యాదానాలతో పాటు,తిల, హిరణ్య,రత్న,ఆజ్య,వస్త్ర, ధాన్య,గుడ, రౌష్య,లవణ,అవయవ,' దానాలు వంటివి ఎన్నో ఉన్నాయి."భీతేభ్యశ్చా అభయం దేయం-వ్యాధితేభ్యస్థ దౌషధం-దేయా విజ్యార్థినే విద్యా-దేయమన్నం క్షుధాతురే"
మరణ భయంతో ఉన్నవారికి అభయం ఇవ్వడం. వ్యాధిగ్రస్తునకు చికిత్స చేయించడం. విద్యాదానం. అన్నదానం వంటి ఎన్నో రకాలదానాలు మనపెద్దలు సూచించారు.ఇలా దానం చేసేవారిని మూడురకాలుగా విభజించారు.తనకు ఉన్నంతలో అడిగిన వారికి దానం చేసేవారిని 'దాత'అని,అడిగినంత ఇచ్చి ఇంకా ఇవ్వలేక పోయానే అనేభావన కలిగినవారిని'ఉదారుడు'అని, తనవద్దలేకున్నా ఇతరులవద్ద అడిగి తెచ్చి దానం చేసేవారిని'వదాన్యుడు'అంటారు.'శ్రధ్ధయా దేయం' దానాన్ని శ్రధ్ధతో ఇవ్వాలి.'హ్రియాదేయం'దానం గర్వం లేకుండా ఇవ్వాలి.'శ్రీయాదేయం' ఇలా ఇవ్వడం వలన తనకు నష్టంరాదని భావించాలి .
అంతేకాని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రజల సొమ్ము ప్రజలకు దానం చేయడం ఏమిటి ? ప్రజలకు ఉపాధి కలిగించాలి,విద్యా,వైద్య,విజ్ఞాన రంగాలు అభివృధిచేయాలి యువతను,ఔత్సాహవంతులను ప్రోత్సహించాలి అప్పుడే సమగ్ర అభివృధ్ధిని సాధించగలం ,అన్నార్తులను, వ్యాధిగ్రస్తులను, నిరాదరులను అదుకొనడం పాలకుల బాధ్యత "అన్నాడు
ఇన్నాళ్ళు ఉచిత దానాలు చేస్తూ ప్రజలను తానే స్వయంగా సోమరులను చేస్తున్నాను అని గ్రహించాడు విజయుడు.
'అపాత్ర దానం చేయడ తప్పే ప్రజలకు బ్రతుకుతెరువు నేర్పించాలి కాని వారికి ధనసహయం చేస్తూ వెళితే వారు సోమరులు అవుతారు,పాలకులు అప్పుల ఊబిలో కూరుకుపోతారు ,రేపు ఆఅప్పులుకూడా పన్నులరూపంలో తామే తీర్చాలని ప్రజలు గ్రహించాలి " అన్నాడు శివయ్య.
కథ ముగియడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు.

