గాంధార దేశపు రాజు అయిన సుబలుని కూతురు గాంధారి. ఈమె వివాహం హస్తినాపురపు యువరాజు ధృతరాష్ట్రుడితో జరిగింది. తన భర్త పుట్టుకతో అంధుడని (కనిపించనివాడని) తెలుసుకున్న గాంధారి, తన కళ్లకు గంతలు కట్టుకుని జీవితకాలం అలానే ఉంది
గాంధారి రెండు సంవత్సరాలు గర్భం ధరించి ఒక మాంసపు ముద్దను కన్నది, కానీ సంతానం కలగలేదు. వ్యాసుని సహాయంతో ఆ మాంసపు ముద్దను నీటితో తడిపి, 101 భాగాలుగా కోసి, వేర్వేరు ఘృత కుండాలలో (నెయ్యి నింపిన కుండలు) ఉంచాడు. (అదే నేటి టెస్ట్ ట్యూబు బేబీ) ఆ కుండలను ఒక సంవత్సరం పాటు కాపాడమని చెప్పాడు వ్యాసుడు . కాలక్రమేణా వాటి నుండి నూరుగురు కుమారులు, ఒక కుమార్తె ఉద్భవించారు వారే కౌరవులు మరియు దుశ్శల (కుమార్తె) .
మహాభారత యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుని సారధ్యంలో పాండవులు కౌరవులను వధించి,హస్తినపురం సింహాసనాన్ని కైవసం చేసుకొని, విజయగర్వంతో ధృతరాష్ట్రుని, గాంధారిని కలవటానికి రాజమందిరానికి శ్రీకృష్ణుని తో కలసి వెళ్లారు. కుమారుల మరణవార్త విన్న గాంధారి పుత్రశోకంతో తల్లడిల్లి, తన నూరుగురు కొడుకులు చనిపోవడానికి కారణం శ్రీకృష్ణుడేనని భావించింది.ఆ ధుఖంలో గాంధారి తనను పలకరించ వచ్చిన వ్యక్తి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అని తేలిసిన, పుత్రశోకం తో శ్రీకృష్ణుని వంశం కూడా ఇలాగే అంతరించిపోతుందని శపించింది. శ్రీకృష్ణుడు భగవంతుడు అయిన ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు.
కొంత కాలం తరువాత, తన కుమారుడు సాంబుడికి బ్రహ్మర్షులు ఇచ్చిన శాపం ఫలించే సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు గ్రహించాడు. యాదవ వంశం నాశనం కావటానికి కారణం శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు. అతను చేసిన చిన్న తప్పు వల్ల యదువంశం నాశనం అయింది .
ఒకసారి ద్వారకకు విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దుర్వాస మహర్షి, భృగు మహర్షి, అంగిరసుడు వంటి మహనీయులు వచ్చారు. సాంబుడు తన స్నేహితులతో కలిసి ఋషులను పరీక్షించాలనే ఉద్దేశంతో, ఒక చిన్న నాటకం ఆడాడు. సాంబునికి గర్భవతిగా కనిపించేలా స్త్రీ వేషధారణ చేయించి ఋషుల వద్దకు తీసుకెళ్లారు.”ఈ స్త్రీ గర్భం నుండి పుత్రుడు పుడతాడా? లేక పుత్రిక పుడుతుందా?" అని ప్రశ్నించారు.
యోగదృష్టితో వారి మోసాన్ని గుర్తించిన ఋషులు ఆగ్రహించి ఇలా శపించారు.ఈ గర్భం నుండి కుమారుడు గానీ, కుమార్తె గానీ పుట్టరు. ఒక ఇనుప ముసలం పుడుతుంది . అదే మీ యదువంశం మొత్తం వినాశనానికి కారణమవుతుంది అని ఋషులు శపించారు. శాపం విన్న యువకులు భయపడి సాంబుడి వస్త్రాలను తొలగించగా, నిజంగానే ఒక ఇనుప ముసలం ప్రత్యక్షమైంది.
ఈ విషయం తెలిసిన రాజు ఉగ్రసేనుడు, ఆ ముసలాన్ని పూర్తిగా పొడిచేసి సముద్రంలో పడేయమని ఆజ్ఞాపించాడు. అయితే ముసలంలోని ఒక పదునైన ముక్క మాత్రం అలాగే మిగిలిపోయింది. దానిని ఒక చేప మింగేసింది. మిగిలిన పొడి సముద్ర తీరానికి చేరి అక్కడి నేలలో కలిసిపోయింది. కాలక్రమేణా ఆ పొడి నుండి "ఎరక గడ్డి"గా మొలిచింది.
కొన్ని సంవత్సరాల తరువాత, ద్వారకలో అపశకునాలు కనిపించడం ప్రారంభమైంది.ఈ అపశకునాలు యదువంశ నాశననికే సంకేతంగా భావించి, శ్రీకృష్ణుడు సుధర్మ సభలో, యదువంశీయులతో ఇక్కడ మీరు క్షణం కూడా ఉండకూడదు అన్నాడు.
శ్రీకృష్ణుని ఆదేశం మేరకు యాదవులు ప్రభాస క్షేత్రానికి (సరస్వతీ నది తీరానికి) చేరి పుణ్యకార్యాలు చేయాలని నిర్ణయించారు. కానీ విధి, వారి బుద్ధిలని మార్చింది . అక్కడ వారు "మైరేయక" అనే మద్యాన్ని సేవించారు . ఆ మద్యం ప్రభావంతో. వారు కోపావేశాలతో, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. చివరకు యుద్ధంలో వారి ఆయుధాలన్నీ విరిగిపోయాయి.
అప్పుడు సముద్ర తీరంలో పెరిగిన "ఎరక గడ్డిని" పీకి ఆయుధాలుగా ఉపయోగించారు. ఆశ్చర్యకరంగా, యాదవుల చేతుల్లోకి రాగానే ఆ సాధారణ గడ్డి వజ్రాయుధంలా మారిపోయింది. శ్రీకృష్ణుడు, బలరాముడు వారిని ఆపడానికి ప్రయత్నించిన విఫలం ఐయారు . చివరికి పరస్పర కలహాల వల్ల యదువంశం మొత్తం నాశనమైంది.
కావున, గాంధారి నూరుగురు కుమారుల మరణానికి శ్రీకృష్ణుడు కారణం కాకపోయినా. గాంధారి శపానికి యదువంశం మొత్తం నాశనం అయింది. శ్రీకృష్ణుని కుమారులే కాక ఇతర యదువంశ వీరులు అందరూ చనిపోయారు .
శ్రీమద్భాగవత మహాపురాణంలోని ఏకాదశ స్కంధంలో ఈ సంఘటన మనం చూడవచ్చు

