అది చాలా ఏళ్ల క్రితం మాట! నేను స్కూల్ చదివే టైమ్లో మా టీచర్ చెప్పిన విషయం అప్పట్లో పెద్ద ఇంపాక్ట్ కలిగించలేదు. ఏదో ఆ క్షణాన కేవలం ఆ సంవత్సరంలో జరిగే పరీక్షల వరకు గుర్తుంటే చాలు అనుకున్నా; కానీ, ఇన్నేళ్ల తర్వాత అదే విషయం నా మదిని పలు విధాలుగా కలవరపెడుతుంది అని ఆనాడు ఊహించలేదు. నేను ఇంకా చిన్నపిల్లాడిలానే ఆలోచిస్తున్నానా? లేదా నా ఊహకు వచ్చిందంతా నిజమేనా? అసలు అర్థంకావడం లేదు. అసలు ఇదంతా నేను ఉదయం పండగ ఏర్పాట్ల కోసం ఇల్లు సర్దుతుంటే జరిగింది ఇల్లు సర్దుతున్నప్పుడు , నా చూపు మూలన పడి ఉన్న పుస్తకాల మూట మీద పడింది. ఒకప్పటి రోజులు గుర్తు చేసుకుందాం అని మూటను దించి ఒక్కొక్క బుక్ ని చూస్తూ వచ్చా. ఇంతలో అందులో ఒక బుక్ లో— “భూమి సౌరకుటుంబంలో ఒక భాగం. మన సౌర కుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంతలో ఒక భాగం. విశ్వం లక్షలాది గెలాక్సీల సమూహం. శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి” అని రాసి ఉంది. ఎప్పుడో పదేళ్ల క్రితం స్కూల్ చదివే రోజుల్లో రాసిన నోట్స్ లో ఉన్న ఈ 'గెలాక్సీ' అనే మాట ఇప్పుడు నా మదిలో లెక్కలేనన్ని ఊహలు పుట్టిస్తుంది. ఇది కేవలం నాకు వచ్చిన ఊహ అని నాకు తెలిసినా, నా మనసుకి మాత్రం ఏమో... ఇలా కూడా జరిగి ఉండొచ్చు అని గట్టిగా అనిపిస్తుంది! కొన్ని బిలియన్ గెలాక్సీలలో భూమిని పోలి ఉన్న భూమిలాంటి గ్రహాలు లెక్కలేనన్ని ఉండొచ్చు. ప్రతి గెలాక్సీలో మనల్ని పోలిన మనుషులు జీవించి ఉండొచ్చు. వారు తల్లి గర్భంలో ఉన్న పిండం మొదలుకొని కాటికి పోయి బూడిద అయ్యి భూమిలో కలిసే వరకు విభిన్న వయసుల్లో, వివిధ సమయాల్లో జీవించవచ్చు. అసలు మనిషికి అంతమే లేదేమో! ఈ గ్రహంలో మరణించిన మనం ఇంకో గ్రహంలో అప్పుడే పుట్టొచ్చు. ఈ గ్రహంలో మనం చేసే పనుల ప్రస్తుత ఫలితాలు ఇంకేదో గ్రహంలో మన గతంలో జీవించి ఉన్న వారికి సంకేతాలు, సందేశాలు ఇవ్వొచ్చు. అందుకే కొన్నిసార్లు మనకు 'తప్పక జరుగుతుంది' అనిపించిన విషయం కచ్చితంగా జరుగుతుంది. అప్పుడే కలిసిన వ్యక్తిని, అప్పుడే చేసిన పనిని, అప్పుడే వెళ్లిన ప్రదేశాన్ని గతంలో ఎప్పుడో కలిసాం, చేశాం, వెళ్లాం అనిపిస్తుందేమో. మనకు ప్రస్తుతం చేయాలనిపించి ఆత్రుత కలిగించే కార్యం ఇంకేదో గెలాక్సీలో భవిష్యత్తులో జీవిస్తున్న మన నిర్ణయం కావొచ్చు; వారు పొందే ఫలితాల ఆధారంగా ఇప్పుడు మన నిర్ణయాలు ఉండొచ్చు…. కొన్ని గెలాక్సీలు మన భూత, వర్తమాన, భవిష్యత్తులను కలిగి ఉంటే, ఇంకొన్ని గెలాక్సీలలో మన జీవితానికి పూర్తి భిన్నంగా మనం జీవితం గడపొచ్చు. అంటే... భూమి మీద పేదవారుగా తినడానికి తిండి లేనివారు మరొక గెలాక్సీలో దేనికి లోటు లేని జీవితం గడపొచ్చు; అలాగే భూమి మీద అసలు చదువు లేని వారు మరో గెలాక్సీలో సరస్వతి పుత్రులు అవ్వొచ్చు; ప్రేమలో విఫలమైన ప్రేమికులు మరొక గెలాక్సీలో పెళ్లి చేసుకొని సుఖంగా జీవించి ఉండవచ్చు. ఏమో! మనకు వచ్చే కలలు, ఊహలు వేరు వేరు గెలాక్సీలలో మనం అనుభవించిన అంశాలు కావొచ్చు. అసలు ఇది నిజం కావొచ్చు, లేదా కేవలం నాకు పుట్టిన ఊహ కావొచ్చు, లేదా మరో గెలాక్సీలో నేను తీసుకున్న నిర్ణయం కావొచ్చు! అసలు ఆలోచిస్తే విశ్వం మనకు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. బహుశా నాకు మీతో ఈ విషయాలు పంచుకోవాలని అనిపించడం వెనుక కూడా ఏదో గెలాక్సీలో మీతో పంచుకుంటే నేను పొందిన ఆనందమే ఇప్పుడు నన్ను మీతో నా భావాలను పంచుకునేలా చేసి ఉండొచ్చు!

