అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

003. గోవింద గోవింద అని కొలువరె

గోవింద గోవిందయని కొలువరె
గోవిందాయని కొలువరె

1.హరియచ్యుతాయని యాడరె
పురుషోత్తమాయని పొగడరె
పరమపురుషాయని పలుకరె
సిరివరయనుచును జెలగరె జనులు

2. పాండవవరదా అని పాడరె
అండజవాహను కొనియాడరె
కొండలరాయనినే కోరరె
దండితో మాధవునినే తలచరే  జనులు

3.దేవుడు శ్రీవిభుడని తెలియరె
సోవల యనంతుని చూడరె
శ్రీవెంకటనాథుని చేరరె
పావనమైయెపుడును బ్రదుకరె జనులు   (10-02)

ముఖ్యమైన అర్థాలు
చెలగరె  =శబ్దం చేయండి; అండజవాహను= గరుత్మంతుడు వాహనముగా  కలిగిన వాడు;  దండి= గొప్పగా  ; సోవల= ఎదుట ఉన్న

తాత్పర్యము
ఓ ప్రజలారా ! మీరు గోవిందా ! గోవిందా  అంటూ గోవిందుని కొలవండి.

1. ఓ ప్రజలారా ! హరీ ! అచ్యుతా ! అంటూ ఆడండి.  పురుషోత్తమా అని స్వామిని పొగడండి. పరమపురుషా ! అని స్వామిని పలుకరించండి.  లక్ష్మీ దేవికి ఇష్టమైన వాడా అంటూ  శబ్దం చేయండి.

2. ఓ ప్రజలారా !పాండవులకు వరములు అనుగ్రహించిన వాడా  అంటూ  పాడండి. గరుత్మంతుడు వాహనముగా  కలిగిన వాడా ! అని పొగడండి. కొండల రాజు అంటూ ఆయనను కోరండి. గొప్పగా  మాధవుడిని తలుచుకోండి.

3. ఓ ప్రజలారా ! ఈ వేంకటేశుడు లక్ష్మీదేవి భర్త అని తెలుసుకోండి. ఎదుట ఉన్న అనంతుని చూడండి. శ్రీ వేంకట నాథుని చేరటానికి ప్రయత్నించండి . ఎప్పుడూ పవిత్రంగా బతకండి.

ఆంతర్యము
ఇది తాళ్లపాక చిన తిరుమలాచార్యుల వారి రచన.  తాళ్లపాక చిన తిరుమలాచార్యులు  అన్నమయ్య మనుమడు.  ఇది   చిన తిరుమలాచార్యులు రాసాడని చెబితే తప్ప , ఈ కీర్తన రచయిత అన్నమయ్యే  అని అందరూ నమ్ముతారు. అది ఆ తాళ్ల పాక వంశ మహిమ. భక్తి వారి గళములో, గంటంలో సమానంగా  హెచ్చు తగ్గులు లేకుండా   నినదించింది.

గోవిందా అన్న పదం వేంకటేశునికి చాలా ఇష్టమైన పదం. అందుకే తాళ్ల పాక కవులకి కూడా చాల ఇష్టమైన పదం. ఈ కీర్తన కిరీటంలో మూడు గోవింద పదాల మణులు విరాజిల్లుతున్నాయి. పనికి మాలిన రాజులకి, అధికారులకి సేవ చేయట మేమిటి? వాళ్లని  కొలవట మేమిటి ? చక్కగా  గోవిందా అంటూ గోవిందుని కొలుచుకో అను సందేశం కీర్తనలో పల్లవించింది.

ఈ కీర్తనలో క్రియా పదాలు కవి భావనా వాహినిలో  ఆడుకొన్నాయి.  ప్రతి పంక్తి చివర క్రియా పదం సంబోధనాత్మకమై  భక్త జనులకు కర్తవ్యాన్ని నిర్దేశించింది.

శ్రీదుడు, శ్రీ ధరుడు అను పదాలను పలికితే ఐశ్వర్యము  లభిస్తుంది. ఏ పనిలో అయినా జయం కావాలనుకొనేవారు రామ, పరశురామ, నృసింహ, త్రివిక్రమ నామాలను పలకాలి. విద్యాభ్యాసము చేసేవారు ప్రతిరోజూ పురుషోత్తమ అని పలకాలి. కష్ట బంధాలు తొలగిపోవాలనుకొనేవారు దామోదర నామాన్ని పలకాలి.కంటి రోగాలు పోవాలనుకొనేవారు పుష్కరాక్ష నామాన్ని జపించాలి.భయము తొలగిపోవాలనుకొనేవారు  హృషీకేశ నామాన్ని ఉచ్చరించాలి.మందులు తీసుకొనే ఔషధ కర్మ సేవలో అచ్యుత నామాన్ని పలకాలి.  ఇలా మనస్ఫూర్తిగా నమ్మి పలికితే ఒక్కో నామానికి ఒక్కొక్క  ఫలితం లభిస్తుందని అగ్ని మహా పురాణములో ఉంది.(284వ అధ్యాయము)  ఈ కీర్తన చదివినవారికి ఆ ఆయాయా ఫలితాలు వస్తాయి.

పాండవవరదా అని పాడరె
పాండవులను శ్రీ కృష్ణుడు ఆదుకొన్న సందర్భాలు ఒకటా రెండా ! శ్రీ కృష్ణుడు లేని   పాండవులు  మొక్కలు కాలేని విత్తనాలు. పాండవులను  తీర్చి దిద్దింది కృష్ణుడు.  కృష్ణుడు నిర్యాణము చెందినప్పుడు  అర్జునుడు ఏడుస్తూ చెప్పిన ఈ పద్యం సుప్రసిద్ధం.

''మన సారధి/మన సచివుడు,
మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్ ,
మన విభుడు, గురుడుదేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!''

అర్జునుడు ద్రౌపదిని పెండ్లాడింది కృష్ణుని కటాక్షం వల్ల. ఇంద్రుని నుండి గాండీవాన్ని గ్రహించింది  కృష్ణుని వల్ల. పాండవులు రాజసూయ యాగం చేయగలిగింది కృష్ణుని సహాయం వల్ల. పాంచాలి మనం కాపాడాడు. ముక్కోపియైన దుర్వాసుని శాపంనుండి రక్షించాడు. అర్జునునికి పాశుపతాస్త్రం ఇప్పించాడు. ఇలా కృష్ణుడు చేసిన సహాయాలు ఎన్నెన్నో. అందుకే కవి  పాండవవరదా అని పాడరె అన్నాడు.

అండజవాహను కొనియాడరె
కశ్యప బ్రహ్మ  భార్య వినత.భర్తనుండి ఇద్దరు మంచి కుమారులు పుట్టేటట్లు  వరం పొందింది.మొదటి కుమారుడు అనూరుడు.అమె రెండవ  గర్భం (=పిండం) అండంగా(=గుడ్డుగా)   మారింది.దానిని  నేతికుండలో  ఉంచారు. ఐదు వందల సంవత్సరాల తర్వాత వినతకు సంబంధించిన రెండవ గుడ్డు పగిలి అందులోనుండి గరుత్మంతుడు పుట్టాడు. (ఆది  02-36)గుడ్డునుంచి పుట్టాడు కనుకనే  గరుత్మంతునికి అండజుడు అని పేరు.

గరుత్మంతుడు యుద్ధంలో దేవతా వీరులను అనేకమందిని జయించాడు. తల్లి దాస్యం పోవటం , కోసం అమృతాన్ని అపహరించినప్పటికీ, నిజాయితీగా రుచి చూడలేదు. తనది కానిదానిపట్ల నిరాసక్తతతో ఉండే గరుత్మంతుని గుణాలకు విష్ణువు మెచ్చుకొన్నాడు. అతనిని వరంకోరుకొమ్మన్నాడు. నీ ఎదుట భక్తితో నిన్ను సేవించే అదృష్టం  ఇమ్మన్నాడు  గరుత్మంతుడు.

నాకు వాహనంగా , నాజెండాగా ఉండమని విష్ణువు అనుగ్రహించాడు. (మహా భారఆది  02-104-106)ఆవిధంగా గరుత్మంతుడు స్వామికి వాహనమయ్యాడు.  శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు గరుడవాహన సేవ  చాలా పేరు పొందింది. .   ఈ రోజు మాత్రమే స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం,ఊరేగించే  మలయప్ప స్వామికి   అలంకరిస్తారు. అది గరుడ వాహన ప్రత్యేకత.

సోవల యనంతుని చూడరె
అన్నమయ్య సందిగ్ధ పదాలలో సోవల ఒకటి. దీనికి ఎదుట,ప్రత్యక్షంగా  అని శ్రీ వేటూరి ఆనంద మూర్తిగారు అర్థం  చెప్పారు. రవ్వా శ్రీ హరిగారు దీర్ఘములైన, అందమైన అని అర్థాలు చెప్పారు. (అన్నమయ్య పద కోశం -618 పే.) ఎదుట అను అర్థం ఇక్కడ సరిపోతోంది.

శ్రీమహావిష్ణువునకు ఉండే అనేక పేర్లలో 'అనంతుడు'   ఒకటి. అనంతుడంటే ఆది అంతములు లేనివాడని ఒక  అర్థం.   ప్రపంచమంతా నిండినవాడని నిండిన వాడని ఇంకొక అర్థం.    భాద్రపద శుక్ల చతుర్ది రోజున ఆచరించే వ్రతాన్ని చేసే వ్రతాన్ని 'అనంత చతుర్ధశి వ్రతమని', 'అనంతపద్మనాభ వ్రతమని పిలుస్తారు.గృహస్థులు ధరించే యజ్ఞోపవీతంలోని మూడవ  పోగు -అనంతుడు ఇతడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని శ్రుతి.      ధైర్యం సంగతి ఎలా ఉన్నా- అనంతమైన సంపదకు నిలయమైన వాడని సంపదలను ప్రసాదిస్తాడని   ఇటీవల కేరళ వృత్తాంతం నిరూపించింది.

పావనమైయెపుడును బ్రదుకరె జనులు
మనసంప్రదాయంలోని గొప్పతనాన్ని  ఈ కవి వాక్యం నిరూపిస్తుంది.

పవిత్రంగా బతకండని కవి ఉపదేశం. సుఖంగా బతకండని మన శాస్త్రాలు చెబుతుంటాయి. సుఖం పవిత్ర జీవనం వల్లనే లభిస్తుందని కవి వాక్కు. పవిత్రత దైవ సాన్నిధ్యంలో లభిస్తుంది. దేవుని గురించి మాట్లాడుకొంటుంటే లభిస్తుంది. దేవుని గురించి పాడుకొంటుంటే లభిస్తుంది. ఇది తాళ్ల పాక కవులు ఆచరించి , చెప్పిన జీవన సత్యం. ఆ సత్యాన్ని అనుసరించిన వారు పవిత్రులవుతారు. అనుమానమే లేదు. స్వస్తి.