భగవాన్ శ్రీ రమణ మహర్షి (నాలుగవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography

ఓం నమో భగవతే శ్రీ రమణాయ.

(మూడవ సంచిక తరువాయి)
 

శ్రీరమణాశ్రమం,స్కందాశ్రమం
క్రమంగా ఆశ్రమంలోని భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుండడం వలన 1916లో శ్రీరమణులు స్కందాశ్రమానికి మారారు.  'కందస్వామీ అనే భక్తుని కృషి వలన ఈ ఆశ్రమం తయారైనది. భగవాన్ తల్లి గారైన శ్రీ అళగమ్మ గారు కూడా ఇక్కడే ఉండేవారు.1922లో శ్రీ అళగమ్మ గారు మరణవేదనలో వున్నప్పుడు స్వామి వారు వారికి ముక్తినొసగారు. ఆమె దేహాన్ని అరుణాచల పాదం వద్ద ఖననం  చేసి సమాధి నిర్మించారు. ఈ సమాధి చుట్టూ ఏర్పడిన ఆశ్రమమే శ్రీ రమణాశ్రమము.

తల్లిగారి సమాధి పై నిర్మింపబడిన ఆలయం పేరు మాతృభూతేశ్వరాలయం. భగవాన్ సేవకుడినైనా, జంతువులనైనా, పక్షులనైనా, వారు, వీరు, రండి, పొండి అని పిలిచేవారు. పళని స్వామి అనే శిష్యుని కోరికపై శ్రీ భగవాన్ "అక్షర మణమాల" రచించారు. ఒక్క గిరి ప్రదక్షిణలో ఆశువుగా శ్రీ భగవాన్ 108 పద్యాలు చెప్పారు. తాను ఆలోచించి పద్యాలు వ్రాయలేదని, వాటంతట అవే దొర్లాయనీ, శ్రీ భగవాన్ చెప్పరు. ఆ పద్యాలు వ్రాస్తున్నప్పుడు భగవాన్ కళ్ళ వెంట నీళ్ళు కారాయంటారు. "అక్షర మణమాల" అంటే "సువాసన గల దండ" అని అర్థం.

ఇందులో శ్రీ భగవాన్ ప్రియుణ్ణి ఉద్దేశించి పలికే కన్య పాత్రని ధరిస్తారు. ఇక్కడ విరహిణి అయిన కన్య శ్రీ భగవాన్, అరుణాచలుడు ప్రియుడు.

శ్రీ రమణులు అందరికీ, అన్నివేళలా అందుబాటులో వుండడం, వారి దయార్ద్ర హృదయానికి నిదర్శనం. అందరితో కలసి భోజనం చేసేవారు. తెల్లవారుజామునే రెండు గంటలకు నిద్ర లేచి, వంటింట్లో కూరలను తరిగేవారు, ఎంతో రుచికరంగా వంట చేసేవారు.

నెమళ్ళు, కోతులు, కుక్కలు, ఆవులు, ఉడతలు, వారిని చేరుతూండేవి. మహర్షి వారితో మాట్లాడే వారు. అవి కూడా వారి మాట ప్రకారం నడచుకొనేవి.

ఒకసారి ఒక కోతి తన బిడ్డనెత్తుకొని భగవాన్ ని చేరబోయింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆ కోతిని తరిమి వేయబోయారు. అయినా అకోతి మహర్షిని సమీపించి, తన బిడ్డను వారికి చూపింది. అప్పుడు మహర్షి "మీరు పిల్లలని, మనుమలని తీసుకు వస్తున్నట్టు అదీ తన బిడ్డని నాకు చూపడానికి వచ్చింది. కాని మీరు దానిని ఆపడానికి ఎందుకు ప్రయత్నించారు? అని ప్రశ్నించారు. కోతి వారి దగ్గర కొంతసేపు వుండి సంతోషంతో వెళ్ళిపోయింది.

 

శ్రీ భగవాన్ తన తల్లి గారి తర్వాత 'లక్ష్మీ' అనే ఆవుకి ముక్తినొసగారు.


శ్రీ భగవాన్ చాలా సందర్భోచితంగా మాట్లాడేవారు.  చిన్నతనంలో వారికి పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు  తిరువణ్ణామలై వచ్చారు. భగవాన్ తాను రచించిన ఒక రచనను ఆయనకు చూపించారు. ఆయన మెచ్చుకుని దానిలోని కొన్ని పద్యాల గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. అప్పుడు భగవాన్ అందర్నీ చూసి" ఈయన బడిలో వేస్తుండే ప్రశ్నలకు సమాధానాలీయలేక భయపడి 'మధురై' నుండి  పారిపోయి వచ్చేశాను. మళ్ళీ నన్ను ప్రశ్నించడానికి ఇంతదూరం వచ్చారీయన చూడండి" అన్నారు.

అమెరికా దేశస్తురాలు ఒకామె ఆశ్రమానికి  వచ్చింది. ఆమెకు నేల మీద మఠం వేసుకు కూర్చోవడం చేతకాక, కాళ్ళు మహర్షి వైపు చాచి కూర్చున్నది. భారతీయ సంప్రదాయం ప్రకారం అట్లా కూర్చోవటం అగౌరవ సూచకమని  ఆమెకు తెలీదు.. ఒక భక్తుడామెని సమీపించి, కాళ్ళు ముడుచుకు కూర్చోమని చెప్పడు. భగవాన్ దీనిని గమనించి " ఆమెను బలవంతం చేయటం తగదు." అని చెప్పారు. అయినా భక్తులు ఒప్పుకోకపోవటంతో భగవాన్ "ఓహో! అట్లాగా! అయితే నేను కాళ్ళు చాపుకు కూర్చోవడం వలన ఇతరులను అగౌరవ పరుస్తున్నానన్నమాట. నువ్వు చెప్పింది నాకూ వర్తిస్తుంది కదా! అంటూ ఒక రోజంతా మఠం వేసుకు కూర్చున్నారు. వారు తిరిగి మామూలుగా కాళ్ళు చాచుకు కూర్చునేట్టు చేయడానికి ఎంతమంది భక్తులు వేడుకోవాల్సి వచ్చిందో.

భగవాన్ చాలా పొదుపరి. ఒకసారి వారి కౌపీనం చిరిగితే, దగ్గరలో ఉన్న పొదలోకి వెళ్ళి ,దాని ముల్లుని తుంపి, దానికి బెజ్జం పెట్టి, సూదిలాగ చేసుకున్నారు. కౌపీనం నుంచే నూలు పోగుని తీసి, తాను తయారు చేసిన సూదితో చిరుగును కుట్టుకున్నారు.

పూలని త్రుంచడం సహించేవారు కారు. నేల మీద ఒక్క బియ్యం గింజ కనపడినా, దానిని తీసి డబ్బాలో వేసేవారు తన రచనలని కవితలని వార్తా పత్రికల అంచుల మీద వ్రాసేవారు.

(తరువాయి భాగం వచ్చే సంచికలో...)

శ్రీ రమణార్పణమస్తు