సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

sahitee vanam

(అల్లసాని పెద్దన విరచిత స్వారోచిషమనుసంభవము, గత సంచిక తరువాయి)

శ్రీకృష్ణరాయ! గుణ ర
త్నాకల్పా! కల్పకద్రుమాధిక దాన
శ్రీకుతుకాగత లోకా
లోకాంతర సకల సుకవిలోకస్తుత్యా!

శ్రీకృష్ణదేవరాయా! రత్నములవంటి సుగుణములనే ఆభరణముగా కలిగినవాడా! కల్పవృక్షముకన్నా మిన్నగా అడిగినవన్నీ ఇచ్చే దానగుణం ఉన్నవాడివని విని, నిన్ను ఆశ్రయించడానికి లోక లోకాంతరములనుండి వచ్చిన సుకవులందరిచేత స్తుతింపబడే వాడా! వినుమయ్యా! ఆ జైమిని మహర్షితో గరుడపక్షులు ఇలా పలికాయి అని మార్కండేయపురాణ కథాప్రకారంగా స్వారోచిషమనువు కథను కొనసాగిస్తున్నాడు పెద్దన.

మున్ను విప్రాకారమునఁ గూడుచో శంకఁ / గనుమూయఁ బనిచె నా ఖచర భర్త
యవ్వరారోహయు నాసక్త కావున / నిచ్చలో నటు సేయ నియ్యకొనియె
నా ప్రతిజ్ఞాపూర్తి యయ్యెఁ దనంత న / వ్వనితకు రతిపారవశ్యపటిమ
నపుడు తత్ప్రవర దేహ సమిద్ధ శిఖి దీప్తి / శాంబరీ మహిమచే సంగ్రహించి

నట్టి గంధర్వమూర్తి సౌఖ్యానుభూతిఁ
జలన మేదిన మానసాబ్జమున నిలువ
వెలసెఁ దేజోమయం బైన వృద్ది నట్టి
మేటిగర్భంబు నెలలు తొమ్మిదియు నిండె

ప్రవరాఖ్యుని ఆకారంలో వచ్చిన గంధర్వుడు రతికేళిలో ఉన్నప్పుడు నువ్వు కనులు తెరిచి నన్ను చూడకూడదు అని నియమము పెట్టినసంగతి తెలిసిందే, ఆ వనిత కూడా వాడిపొందు కావాలి కానీ, అది కనులు మూసి ఐతేనేం, కనులు తెరిచి ఐతేనేం అని వాడితో కలయికకోసం తపించిన కారణంగా ఒప్పుకున్నదే ఐనప్పటికీ, రతి పారవశ్యంతో కనులు తెరిపిడే పడని కారణంగా, అప్రయత్నంగానే ఆ షరతు పూర్తి అయ్యింది, దానంతట అదే అని సరసపు చెణుకు వేస్తున్నాడు ఇక్కడ పెద్దన, ప్రబంధం కనుక లోతైన శృంగార భావాలుంటాయి అక్కడక్కడ!

శాంబరీవిద్యతో ప్రవరుడి రూపాన్ని పొందిన ఆ గంధర్వుడితో సుఖానుభూతిని పంచుకుంటున్న వరూధిని మనసులో ప్రవరుడి రూపమే నిండిపోయింది, బాహ్య నేత్రాలను మూసుకున్నప్పటికీ, మనోనేత్రంతో ప్రవరుడినే చూసింది, ప్రవరుడినే భావించింది, అనుభవించింది వరూధిని. కనుక ప్రవరుని బ్రహ్మ తేజం మూర్తీభవించిన గర్భాన్ని ధరించింది. ఇక్కడ ఒక రహస్యాన్ని నిక్షిప్తం చేశాడు పెద్దన, మార్కండేయ పురాణంలో ఉన్న విషయమే. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏమి తింటుందో, ఏమి వింటుందో, ఏమి కంటుందో వాటి ప్రభావం గర్భస్థ శిశువు మీద పడుతుంది అని లక్షల సంవత్సరాల క్రితమే భారతీయులు చెప్పారు. ప్రహ్లాద వృత్తాంతంలో అన్నది అందరికీ తెలిసినదే. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి, భార్యా భర్తల కలయికలో కూడా మానసిక స్థితిని బట్టి గర్భంలో పిండం ఉద్భవము చెందడం, రూపు దిద్దుకోవడం ఉంటుందని చెప్పారు. కనుకనే వరూధిని ధ్యానంలో ఉన్న ప్రవరుని తేజం గర్భస్థమైంది!

తేజం బబ్జభవాండ గేహమునకున్ దీపాంకుర ఛ్ఛాయయై
రాజిల్లన్ గ్రహపంచకంబు రవిఁ జేరంబోని లగ్నంబునన్
రాజీవాక్షి కుమారుఁ గాంచె సుమనోరాజన్యమాన్యుల్ జనుల్
జేజేవెట్టఁ బ్రసూనవర్ష మమర శ్రేణుల్ ప్రవర్షింపగన్

తన తేజస్సు సమస్త విశ్వమంతటా చిరు దీపఛ్ఛాయలా అలుముకుంటున్నట్లున్న కుమారుడిని, ఐదుగ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు సూర్యుడితో కలియని లగ్నంలో, తమ తమ ఉఛ్ఛస్థితిలో ఉన్న లగ్నంలో వరూధిని కుమారుడిని ప్రసవించింది. దేవతలు, మానవులు, దేవతా ప్రభువులు, మాన్యులు జేజేలు పలికారు. దేవతలు పూలవర్షం కురిపించారు. సూర్యునితో ఉండడం వలన మిగిలిన గ్రహాలన్నీ తమ ప్రభావాన్ని కోల్పోతాయి, ఆయన గ్రహరాజు కనుక. అందుకనే, జ్యోతిష్యసూచనగా అలా అన్నాడు పెద్దన.

సూర్యయుతిలేక,  ఉఛ్ఛస్థితిలో ఉన్నప్పుడు చంద్రుడు భావుకత్వాన్ని, కళలలో ప్రావీణ్యాన్ని లలితమైన గుణాలను ఇస్తాడు. కుజుడు భూమిని, బలాన్ని, శౌర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. బుధుడు బుద్ధిని, విద్యనూ ప్రతిష్ఠను ఇస్తాడు. గురుడు తేజస్సును, కార్యదీక్షను, నాయకత్వాన్ని, పదవిని, అధికారాన్ని ఇస్తాడు. శుక్రుడు లలితకళలలో ప్రావీణ్యాన్ని, ఉపాసనా బలాన్ని, స్త్రీలను వశపరుచుకునే, ఆకర్షించే శక్తిని ఇస్తాడు. ముందు ముందు ఇవన్నీ పొందబోతున్నాడు ఆ బాలకుడు అని సూచిస్తున్నాడు సకలశాస్త్ర పారంగతుడు ఐన పెద్దన.

స్వరుచి స్ఫురణను శశిభా
స్కర పావక తారకా ప్రకాశములెల్లన్
విరళము సేయు నతనికి
స్వరోచి యను నామమిడి రచటి మునులెల్లన్

తన శరీర కాంతులతో చంద్రుడి, సూర్యుడి, అగ్ని, నక్షత్రముల కాంతులను పలుచనజేసే, జయించే ఆ బాలకుడికి 'స్వరోచి' అని పేరు పెట్టారు ఆ పర్వతప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మునులు. తనను ఆశ్రయించిన వారిని కరుణించడంలో చల్లదనానికి చంద్రుడివంటివాడు, తేజస్సులో సూర్యునివంటివాడు, పవిత్రతలో అగ్నివంటివాడు అని ధ్వనించాడు పెద్దన.

మరియు నతండు సంయమి సమాజ వినిర్మిత జాతకర్ముడై
నెఱిఁ బరివర్ధితుండు నుపనీతుఁడునై వివిధాయుధంబులన్
గఱకరియై రణస్థలుల గద్దఱియై నిగమార్థవేదియై
నెఱతనకాఁడునై మెఱసె నిర్మల కాంతి విలాస రేఖలన్

ఆ మునీంద్రులు ఆ బాలకునికి జననకాల సంస్కారాలు చేశారు. అతను క్రమంగా పెరిగిపెద్దవాడైనాడు. ఆ మునులే ఆతనికి ఉపనయన సంస్కారం కూడా చేశారు. వివిధాయుధములను ప్రయోగించడంలో, పోరాటాలలో తెగువగలవాడై, వేదవేదాంత రహస్యాలను తెలుసుకున్నవాడై, సమస్త విద్యలలో సంపూర్ణుడై తన స్వఛ్ఛమైన శరీరకాంతివిలాసముతో ప్రభలను విరజిమ్ముతున్నాడు. సంచులను గుద్దినట్లు కొండలను అదిరేలా ముష్టిఘాతాలు అవలీలగా చేయగలడు, తన ఖడ్గముతో ఒక్కొక్క దెబ్బకు అనేకములైన వృక్షములను ఖండించగలడు, భూమి కంపించేలా వాయువేగముతో తన జవనాశ్వముమీద ప్రయాణం చేయగలడు, ఇలా ఆ స్వరోచి సాటిలేని బలపరాక్రమాలతో యవ్వనంలో వెలిగిపోతున్నాడు.

వేదండము తొండము సరి
కోదండముఁ దివియు నెడమఁ గుడి నిబిడజ్యా
నాదము రోదసి నిండఁగ
భేదించున్ గండశిలలఁ బృథుబాణములన్

ఏనుగు తొండములాగా ఉండే తన విల్లును సవ్యసాచియై ఉపయోగించి, ఆ వింటి నారి చేసే ధ్వనులు ఆకాశానికి అంటేట్లు నిశిత బాణములతో గండశిలలను కూడా భేదించగలడు. సవ్యసాచి అంటే ఒకేసారి కుడి ఎడమచేతులతో బాణమును ప్రయోగించగలిగినవాడు (అర్జునునిలా) అని.

విశ్వకర్మ తనకు నిర్మించి ఇచ్చిన నగరములో ఆ పర్వత ప్రాంత ఆటవికులు అందరూ తనను సేవిస్తుండగా వారికి ప్రభువై పాలిస్తున్నాడు స్వరోచి. ఒకసారి చిటపట ధ్వనులతో మొదలై, ఫెళఫెళ ధ్వనులతో, ఝంఝా మారుతం కొండబిలాల్లోకి దూరి మంద్రస్వరంతో గానంచేస్తూండగా, పెద్ద వర్షం కురిసింది ఆ పర్వతం మీద. ఉరవళ్ళు పరవళ్ళతో సెలయేళ్ళు పరుగులెత్తాయి. పక్షుల ధ్వనులు చెలరేగాయి. ఆ వర్షపుధాత్రి రమణీయ దృశ్యాన్ని చూడడంకోసం...

అన్నగాగ్రమెక్కి  యందొక్క శశికాంత
వేదిఁ గతిపయాప్త వేష్టితుండుఁ
గుటజ విపిన పవన నట దలకభరుండు
నగుచుఁ బ్రొద్దు జరుపు నవసరమున

ఆ కొండశిఖరం మీదికి ఎక్కి, ఒక చంద్రకాంత శిలమీద కూర్చుని, కొంతమంది ఆప్తమిత్రులతో, ఆ పొదలనుండి అడవినుండి వీస్తున్న గాలులకు తన ముంగురులు నాట్యంచేస్తుండగా, చిరునవ్వులు చిందిస్తూ కబుర్లు చెప్పుకుంటూ చుక్కల మధ్య మచ్చలేని చంద్రుడిలా వెలిగిపోతూ కాలక్షేపం చేస్తుండగా ఆ ప్రాంతంలోని ఎరుకలకు ప్రభువైన ఒక ఎరుకలవాడు ఆతని సన్నిధికి వచ్చాడు.

(ఇంకా ఉంది)

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్