ఊరుకున్నంత ఉత్తమం... బోడిగుండంత సుఖం లేదు - కాశీ విశ్వనాథం పట్రాయుడు

Voorukunnatha vuttamam..Bodigundantha sukham ledu

ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ప్రతిరోజూ సాయంత్రం పార్కులో కలుసుకుని కష్టసుఖాలు మాట్లాడుకునేవారు. ఒకరోజు రాము ముఖం దిగులుగా ఉండటాన్ని గమనించిన సోము, "ఏరా రాము, అలా ఉన్నావు? ఇంట్లో అంతా క్షేమమేనా?" అని అడిగాడు. "ఏం చెప్పమంటావురా! ఈరోజు ఉదయం మార్కెట్ నుంచి వచ్చి ఇంటి గేటు తీసేసరికి 'ఏమే కోడలా! ఎన్నిసార్లు చెప్పాలి? పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలని తెలీదా? అసలు మీ అమ్మ ఇంట్లో పనులేవీ నీకు నేర్పలేదా?' అని నా భార్యని గద్దిస్తోంది మా అమ్మ. దానికి మా ఆవిడ కూడా ఏమీ తగ్గకుండా.. 'అత్తయ్య గారూ! దేనికో దానికి నన్ను, మా వాళ్లని ఆడిపోసుకుంటేనే కానీ మీకు తోచదు. నేను చంటిపిల్లాడి తల్లిని, వీడు రాత్రంతా ఒకటే ఏడుపు. నాకు కంటిమీద కునుకు లేదు. ఇంతకంటే త్వరగా లేవడం నా వల్ల కాదు' అని ధీటుగా బదులిచ్చింది.

అలా అత్తాకోడళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అలాంటప్పుడు లోపలికి వెళ్లి ఎవరికి నచ్చజెప్పినా 'కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం' అన్నట్లుగా తయారవుతుంది నా పరిస్థితి. అని ఆలోచించి కాసేపు గేటు బయటే ఉండిపోయాను. అదే సమయంలో మా ఇంటి ఎదురుగా ఉంటున్న నా బంధువు వెంకట్రావు, నా స్నేహితుడు కిరణ్ దగ్గర తీసుకున్న ఐదు వేల రూపాయల అప్పు తిరిగి ఇవ్వలేదని ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు.

ఆ గొడవలో నేను జోక్యం చేసుకుంటే, ఆ అప్పు నేనే తీర్చాల్సి వస్తుందేమోనని భయపడి మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోయాను” అని నిట్టూరుస్తూ తన బాధను చెప్పాడు రాము. అది విని సోము నవ్వుతూ, "భలే ఉంది నీ పరిస్థితి! ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్నమాట" అన్నాడు. “నన్ను చూడగానే మా ఆవిడ 'ఏమండీ! ఇంతసేపు కూరగాయలు కొనడానికి వెళ్లారా లేక అక్కడే పండించి తెస్తున్నారా?' అని నా మీద విరుచుకుపడింది. నేను మాత్రం ఎదురు చెప్పకుండా మౌనంగా గదిలోకి వెళ్లిపోయాను. అని ముగించాడు రాము.

అప్పుడు సోము నవ్వుతూ, "చూశావా రాము.. 'ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం లేదు' అని పెద్దలు ఊరకే అనలేదు.” అన్నాడు. రాముకి సోము మాటల్లోని అంతరార్థం అర్థమైంది. "నిజమేరా సోము! మౌనంగా ఉండటం వల్లే పెద్ద ప్రమాదం తప్పింది" అంటూ ఇద్దరు స్నేహితులు నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరారు. ఊరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం లేదు అనేది ఒక సామెత. ఏదైనా వివాదం జరుగుతున్నప్పుడు మధ్యలోకి వెళ్తే ఆ సమస్య మనకు చుట్టుకుంటుందని అనిపించి దూరంగా ఉన్నప్పుడు, లేదా లేనిపోని బాధ్యతలు నెత్తిన వేసుకుని తలనొప్పులు తెచ్చుకోవడం కంటే, అసలు ఆ జోలికే వెళ్లకుండా హాయిగా ఉండాలి అనుకుని మౌనంగా ఉన్నప్పుడు. ఈ సామెతను వాడుతారు. గుండు చేయించుకున్న వాడికి జుట్టు దువ్వుకునే పని, పేల సమస్య ఉండదు. నూని రాసుకునే అవసరం ఉండదు. అంటే, చిక్కులు లేని స్థితి ఎంత హాయినిస్తుందో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం కూడా అంతే సుఖాన్నిస్తుంది అని దీని అర్థం.

మరిన్ని కథలు

Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)
Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్