పుస్తక సమీక్ష: కొత్త గొంతులు - సిరాశ్రీ

Book Review - kotta gonthulu

పుస్తకం: కొత్త గొంతులు
రచన: టి ఎల్ కాంతారావు
వెల: 90/-
ప్రతులకు: 040-24031257, 9490751657

అట్ట మీద 'ప్రతి సాహిత్య సమీక్షకుడు, విశ్లేషకుడు, విమర్శకుడు, సాహిత్య విద్యార్థి తప్పక చదవాల్సిన పుస్తకం' అనే వాక్యంలో ఎంత వరకు నిజం ఉందో చూడాలని నిలబడే పేజీలు తిప్పడం మొదలుపెట్టాను. ఒక నిమిషం తర్వాత తీరిగ్గా చదవాలనిపించి కూర్చున్నాను. ఆ వాక్యంలో పూర్తి నిజముందనిపించింది. కేవలం విమర్శకులు, విద్యార్థులే కాదు నేటి తరం యువ కవులమని అనుకునే వారంతా చదివి తీరాలి.

ఈ 'కొత్త గొంతులు' వ్యాస సంపుటి. 1943లో జన్మించి 1990 వరకు జీవించిన ప్రముఖ విమర్శకులు, సమీక్షకులు శ్రీ టి ఎల్ కాంతారావుగారు ఆధునిక తెలుగు కవుల కవిత్వాన్ని గురించి వ్రాసిన చిరు వ్యాసాలు ఇవి. తెలుగులో ఆధునిక కవులు అనగానే ఇప్పటికీ గురజాడ, జాషువా, విశ్వనాథ, సినారె పేర్లు మాత్రమే చెప్పే వారున్నారు. కారణం ఆ తర్వాతి తరం కవుల రచనల పట్ల సమాజం దృష్టి సారించకపోవడమే అనిపిస్తుంది. కొందరు ప్రముఖ కవుల పేర్లు తెలిసినా వారి కవిత్వం ఎటువంటిదో తెలియని పరిస్థితి చాలా మంది సాహితీ ప్రియుల్లో కూడా ఉంది. లయాత్మక కవిత్వం తగ్గి వచన కవిత్వం విస్తరించడం వల్ల, ఆ స్వేచ్చతో తాము కూడా కవులమనుకున్న ఎందరో, పేజీలకు పేజీలు దీర్ఘ కవితలు రాసేసి ఒక రకంగా కవిత్వం అంటే భయపడేట్టు చేసారు. కవిత్వం అంటే వాక్యాల్ని ముక్కలు చేసి పదాల్ని ఒకదానికింద ఒకటి రాసుకుంటూ పోవడమే అనే ధోరణి కూడా పెరిగింది. ఈ నేపధ్యంలో అసలు సిసలైన సత్తా ఉన్న కవుల రచనలు, కవిత్వ రీతులు ఆశించిన రీతిలో జనాన్ని చేరలేదు. ఆ లోటును కొంత వరకు పూడుస్తుంది ఈ పుస్తకం.

దాదాపు 40 మంది ఆధునిక కవుల గురించి ఇందులో వ్రాసారు కాంతారావుగారు. దిగంబర కవులు ఆరుగురు. చాలా మందికి వారి పేర్లు తెలిసినా వారి కవిత్వం తెలియకపోవచ్చు. స్థాలీపులాకంగా ఇక్కడ వారందరి కవిత్వాన్ని ప్రస్తావించి విశ్లేషించారు. అలాగే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, దేవీ ప్రియ, గద్దర్, వజీర్ రెహ్మాన్, వేగుంట మోహన ప్రసాద్, గోపి, ఇస్మాయిల్, మాదిరాజు రంగారవు, శీల సుభద్రాదేవి వంటి ఎందరో కొత్త కవుల కవిత్వాన్ని ఇందులో వివరించారు.

తెలుగు సాహిత్యం లోతైన భావాలతో, సమకాలీన భావోద్వేగాలతో ఇంత హుందాగా ముందుకు నడుస్తోందా! అనే భావన కలుగుతుంది ఈ పుస్తకం చదివాక.

అలాగే యువ కవులు ఈ పుస్తకాన్ని చదివితే మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

ఈ వ్యాసాలతో పాటు మరో 37 విమర్శనాత్మక సాహిత్య వ్యాసాలు కూడా ఇందులో అందించారు.

ఆధునిక కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారు, ఆధునిక తెలుగు కవిత్వం ఎలా ముందుకెళ్తోందో తెలుసుకోవాలనుకునేవారు ఇది చదవండి.