పుస్తక సమీక్ష : మేఘ సందేశం - సిరాశ్రీ

Book Review - Megha Sandesam
మూల రచన: మహాకవి కాళిదాసు
తెలుగు వ్యాఖ్య: డా|| కే ఏ సింగరాచార్యులు
వెల: 50/-
ప్రతులు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు

కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు. ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట. అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని.

కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు పలికిన ఆ మూడు పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట. ఆ పదాలు అలా ఎందుకు తలలో ఆడుతున్నాయో తెలియలేదట.

ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు మొదలెట్టేసి రాసేసాడు. 
అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...' అంటూ కుమారసంభవం
'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..' అంటూ మేఘ సందేశం
'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...' అంటూ రఘు వంశం రాసేసాడు.

అసలు నీకు మాటలొచ్చా? అన్న ప్రశ్నకు అమ్మవారు కాళిదాసు నాల్క పైన ఆ మూడు పదాలతో అజరామరమైన మూడు కావ్యాలే పలికించిందన్న విషయం చరిత్రకారులు ఒప్పుకోకపోయినా, భాషాభిమానులు, భక్తి పారాయణులు 'అద్భుతం..' అనకుండా ఉండలేరు.
 
ఆ కావ్యాల్లో చిన్నది, విరహ శృంగార రస ప్రధానమైనది మేఘసందేశం. ఇక్కడ చిన్నది అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చదువరులు తక్కువైపోయిన ఈ రోజుల్లో అంత లావున ఉండే గ్రంథ రాజం అంటే భయపడి దీనివైపు చూడకుండా పోతారేమోనని. 
 
ఇది మొత్తం రెండు సర్గల కావ్యం. మొదటి దాంట్లో 67 శ్లోకాలు ఉంటే రెండో దాంట్లో 57 ఉంటాయి. అంటే మొత్తం 124 శ్లోకాల కావ్యం అన్నమాట. కావ్యం అంతా ఒకటే వృత్తం- మందాక్రాంత. చాలా మందికి 'శాంతాకారం భుజగ శయనం పద్మ నాభం సురేశం..' అనే ప్రసిధ్ధ శ్లోకం తెలిసే ఉంటుంది..ఈ కావ్యం మొత్తాన్ని ఆ నడకలో చదువుకోవాలి..
 
ఇంతకీ ఈ పుస్తక విశెషం ఏమిటంటే డా|| సింగరాచార్యులు గారు ప్రతి శ్లోకాన్ని అర్థ తాత్పర్యాలతో పాటు, ప్రతి పదార్థ వివరణ, అలంకార ప్రకటన కూడా చేసి భాషాలంకార ప్రియులకు మరింత చేరువయ్యారు. 
 
భారత దేశంలో పుట్టినందుకు పోయేలోపు ఒక్క కావ్యమన్నా చదివి ఆస్వాదించాలనే తృప్తికోసమైనా ఈ మేఘసందేశం చదివి తీరాలి. నిజానికి ఇదొక్కటీ ఆస్వాదిస్తూ చదివితే మరికొన్ని కావ్యాలు చదవాలనే కొరిక కలగొచ్చు. 
 
కూబేరుని శాపం వల్ల భార్యకు దూరమైన ఒక యక్షుడు మేఘంతో చేసే తన విరహ సంభాషణే ఈ కావ్య వస్తువు. మేఘంతో సంభాషనేమిటి అర్థం లేకుండా అని అనుకుంటూ ఉండే లోపే 5 వ శ్లోకంలోనే 'ధూమజ్యోతి సలిల మరుతా...' అంటూ విరహ బాధలో ఉన్నప్పుడు సాధ్యాసాధ్యాల బేరీజు వెసుకోవడం, ఇంగితం వంటివి ఉండవని చెబుతాడు కాళిదాసు. ఇక అక్కడి నుంచి నాయకుడైన యక్షుని మనఃస్థితిని అర్థం చేసుకుని తక్కిన కావ్యం సందేహాలు లేకుండా చదివేయొచ్చన్నమాట. 
 
ప్రతి పదార్థ తాత్పర్యాలు ఉన్నాయి కనుక అనేక సంస్కృత పదాలతో పాటు, కాళిదాసు వర్ణనా వైచిత్రి, అలంకార ప్రశస్తి రుచి చూడొచ్చు.
ఆసక్తి, ఆ రక్తి ఉంటే ఆలస్యం చేయకండి.

- సిరాశ్రీ 

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.