భగవాన్ శ్రీ రమణ మహర్షి (ఆరవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography

ఓం నమో భగవతే శ్రీ రమణాయ.

(ఐదవ భాగం తరువాయి)

శ్రీరమణాశ్రమ లేఖల నుంచి : శ్రీభగవాన్ బయటకు వెళ్ళే సమయంలో కొండ వైపు మెట్ల దగ్గర వున్న మామిడి చెట్టు కాయలు కోయటానికి వచ్చిన కూలివాళ్ళు చెట్టెక్కి మెల్లిగా కాయలు కోయక, క్రింద నుంచే గడలతో కొట్టడం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నాయి. భగవాన్, పనివాళ్ళను పిలిచి అలా కొట్టవద్దని చెప్పారు. తరువాత భగవాన్ బయటకు వెళ్లి వచ్చి చూసే సరికి, రాలిన ఆకులు కొల్లలుగా కంటబడ్డాయి. భగవాన్ చాలా బాధపడి, "ఓహో చాలు చాలు... ఇక పొండి. కాయలు కోయమంటే ఆకులు రాలేటట్టు కొట్టడమా? మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో చెట్టును బాదడమా? ఎవరీ పనికి నియమించినది? ఇలా కొట్టే బదులు మొదలంట నరికితే సరిపోతుంది కదా! కాయలు కోయవద్దు. ఏమీ వద్దు" అని గద్దించినారట. చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు, మన మనస్సు నొప్పించగలరా శ్రీ భగవాన్ ?

భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఎచ్చమ్మ గారు తన ఇంట్లో భగవాన్ ఫోటో పెట్టి, లక్ష పత్రిపూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి   ప్రారంభించారట. 50వేలు పూర్తయ్యేసరికి, వేసవి రావటం వలన పత్రి దొరకక ఒక రోజు కొండంత తిరిగి తిరిగి అలసట వచ్చి భగవాన్తో చెప్తే "పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా? " అన్నారట భగవాన్. "అమ్మో నొప్పి కాదా?" అని ఎచ్చమ్మ గారు అంటే "ఒళ్ళు గిల్లితే నీకు నొప్పయితే, పత్రి గిల్లితే చెట్టుకు నొప్పి లేదా?" అన్నారట భగవాన్. ఆమె తెల్లబోయి "ముందు ఎందుకు చెప్పలేదు స్వామి?" అంటే నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు, పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు? నేను చెప్పాలా?" అన్నారట భగవాన్ - చెట్టు వ్రేళ్ళను పెల్లగించుట,  ఆకులను గిల్లుట , భూతములను హింసించుట, పూలను కోయుట తగదని భగవాన్ చెప్పేవారు.

ఒకసారి ఎవరో శ్రీ భగవాన్ని ఇలా అడిగారట. వృషభారూడుడై శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అంటే మీరేమి కోరుకుంటారు అని. శ్రీ భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు. "నన్ను మోసగించడానికి ప్రయత్నించకు. శివునకు రూపం లేదు. అందరిలోని ఆత్మ వారే " అని.

అరుణాచలం వచ్చిన మొదటి రోజుల్లో శ్రీ భగవాన్, అరుణాచలేశ్వరాలయంలోని ఇప్ప చెట్టు క్రింద, పూదోటలోనూ, వాహన మండపం లోనూ, ఇంకా అక్కడక్కడ శరీరాన్ని లక్ష్యం చేయకుండా కూర్చొని వున్నప్పుడు, అటు వచ్చే పోయే జనం వారిని చూసి "జడం వాలే కూర్చుని వున్నాడు. ఎవరో పిచ్చివాడు" అనుకుంటూ వెళ్ళేవారిని, వారి మాటలకు భగవాన్ నవ్వుకుంటూ "ఈ పిచ్చి అందరికీ పడితే ఎంత బాగుండును" అని అనుకునే వాణ్ణనీ భగవాన్ చెప్పారు.

కుంజుస్వామి 1920 నుండి 1932 వరకు మహర్షి సేవకునిగా వ్యవహరించారు. కుంజుస్వామి ఇలా చెప్పారు. స్కందాశ్రమం చేరి, శ్రీ భగవాన్ తో నా బాల్యము, నేను జపం చేయడమూ, ప్రవచనాలు ఇవ్వటమూ మొదలైన విషయాలు చెప్పాను. నాలోని అలజడి పోయి, నాకు స్పష్టత కలగాలంటే నేనేమి చేయాలని వారిని అడిగాను. సమాధానంగా "ముందు నువ్వెవరివో తెలుసుకో. ఆలోచనలు అన్నీ ఎక్కడ్నుంచి వస్తున్నాయో గమనించు. మనస్సుని అంతర్ముఖం చేసి హృదయాన్ని చూడు." అని చెప్పారు. వారి కళ్ళలోకి చూసినప్పుడల్లా గొప్ప కాంతి కనిపించేది. తెలియని శాంతి, ఆనందమూ నన్ను ముంచేసేవి. అటువంటి అనుభవమే తిరిగి మామూలు స్థితికి వచ్చేటప్పుడు నా ఒళ్ళు జలదరించేది. చాలాసార్లు శ్రీ భగవాన్ దేహం అకస్మాత్తుగా అంతర్థానమై అనువులుగా మారి చెదిరి పోయేది. కాస్సేపటి తరువాత వారి దేహం రూపం దాల్చేది. శ్రీభగవాన్ ఘనతని గుర్తించిన మొదటి వాళ్ళల్లో ప్రసిద్ధ కవి, పండితుడు అయిన అచ్యుతదాస ఒకరు. శ్రీ భగవాన్  పాదాలను, చేతులను పట్టుకొని ఆనంద పారవశ్యులైనారు. అచ్యుతదాసుని శిష్యులు కూడా శ్రీ భగవాన్  పాడాలని తాకాలనుకుంటే "ఇదొక బ్రహ్మాండమైన జ్వాల, మీరెవ్వరూ దగ్గరికి కూడా రాలేరు" అని వారించారు.

శ్రీ భగవాన్ తల ఎప్పుడూ ఊగిపోతూ ఉండేది. చేతికర్ర లేకుండా వారు నడవ లేకపోయేవారు. నిలువుగా నిలబడలేకపోయెవారు కూడా. ఇదంతా వృద్ధాప్యం వల్ల కాదు. వారు చేతి కర్రని చాలా కాలంగా ఉపయోగిస్తుండేవారు. మదురైలో కలిగిన ఆత్మానిభూతి వల్ల ఆయనకివన్ని సంప్రాప్తించాయి. ఈ విషయం చెప్తూ శ్రీ భగవాన్ , "ఒక చిన్న పూరి పాకలో పెద్ద ఏనుగును బంధిస్తే ఆ పాక కదలిపోదా? అట్లాగే ఇదీను" అన్నారు.

మహర్షి తమ దేహాన్ని ఆరాధించటాన్ని ఎప్పుడూ ప్రోత్సహించేవారు కారు. ఎవరైనా పూలమాలలు వేయబోయినా, పూజ చేయ బూనినా వారించేవారు. హిందూ ధర్మానికి సంబంధించిన భావాలని అర్థం చేసుకోలేని వారికి ఆ భావాలని బలవంతంగా కట్టబెట్టాలని వారెప్పుడూ ప్రయత్నించలేదు. సలహా కోసం క్రిస్టియన్లు గాని, ముస్లింలు గాని వస్తే వాళ్లకి వాళ్ళ మతం లోని నిగూఢమైన బోధనలనే వివరించి చెప్పి, వారు ఎంచుకున్న దైవంతో ఐక్యం పొందడానికి కృషి చేయమనేవారు.

శ్రీ రమణాశ్రమ లేఖలనుంచి, తేనెటీగలు, మఱ్ఱి ఆకు విషయము శ్రీ భగవాన్, నాగమ్మ గారికి ఇలా వివరించారు.

"ఒక ఉదయం, నేను విరూపాక్ష గుహనుండి, ఇటు ప్రక్కనే కొండ దిగి ప్రదక్షిణ మార్గంగా పోతూ, పంచముఖ దర్శనానికి, పచ్చేయమ్మ కోవెలకూ, మధ్యనున్న మార్గాలలో కొండ ఎక్కి అడ్డ దోవన నడుద్దామని అట్లా ఎక్కుతూ పోయాను. దారి లేదూ, డొంకూ లేదు.  ఒకటే అడవి. ఎక్కగా ఎక్కగా ఎక్కడి నుండో పెద్ద మర్రాకు ఒకటి కొట్టుకొని వచ్చింది. ఆ ఆకు ఒక్కటి పెద్ద విస్తరంత వుంది. అది చూడగానే అరుణాచల పురాణంలో అరుణగిరి యోగి నివసించే వట వృక్షాన్ని గురించి చెప్పిన శ్లోకం జ్ఞప్తికి వచ్చింది" అన్నారు భగవాన్. "దేని నీడ బహుతర వ్యాప్తితో సదా మండలాకారంగా విరాజిల్లుతూ దేవ, మానవుల చేత ఆశ్చర్యకరంగా చూడబడుతూ ఉన్న ఆ వట వృక్షం ఈ అరుణగిరి ఉత్తర శిఖరమున కనిపిస్తూ వుంది. ఆ వట వృక్షము క్రింద సిద్ధ వేషము ధరించిన మహేశ్వరుడు(అరుణగిరి యోగి) సదా నివసిస్తూ ఉన్నాడు. " ఈ శ్లోకం జ్ఞప్తికి రాగానే, ఈ ఆకు ఆ వట వృక్షానిదే కాబోలును. ఇది వచ్చిన జాడననుసరించి పోయి ఆ వృక్షం చూద్దామని తోచి ఎక్కుతూ ఉంటె ఒక ఎత్తు ప్రదేశంలో ఒక  వృక్షం ఉన్నట్లు గోచరించింది. అక్కడికి ఎక్కుదామని పోతూ ఉంటే ఒక పొదకు నా తొడ రాచుకున్నది. ఆ రాపిడికి అందులో వున్న జుంటీగలు చెలరేగి కరవటం ఆరంభించినవి. సరే, ఈ తొడ తప్పు చేసింది గనుక దానికిదే శిక్ష అని కదలకుండా నిలిచాను. ఆ ఈగలు వేరెక్కడా కుట్టక ఏ భాగం వాటికి తాకిందో, ఆ భాగం మాత్రమే కుట్టినవి. ఒక్కొక్కటీ వచ్చి ముక్కుతో తొలిచి, ఆ ముక్కు అందులో విరిగేంత వరకూ పొడిచి పోయేది. ఈ విధంగా వాటి ఇష్టం వచ్చినంత సేపు కసిదీరా కరచి పోయినవి. అవి వదలి పోయిన వెనుక నడక సాగించాను.

అయితే ఆ వటవృక్షం సంగతి మాత్రం గుర్తే లేదు. చిత్రంగా ఆ విషయమే మరపు కలిగి ఏడుదోనలకు చేరుకుందామని చూస్తే మధ్యన అగాధమైనవి మూడు దోనలు అడ్డుగా వున్నవి. కాలు చూద్దామా ఇంత లావయి బాధిస్తూ వున్నది. సరే ఎట్లాగో ఆ మూడు దోనలు దాటి, ఏడుదోనలని చేరి అక్కడి నుంచి సరాసరి దిగి సాయంకాలం అయ్యేసరికి జటాస్వామి గుహవద్దకు చేరాను. అంత వరకు ఆహారం ఏమి లేదు. అక్కడ వారేదో పాలు, పళ్ళూ కలిపినది. ఒక లోటాలో ఇస్తే తాగి, రవంత విశ్రమించి, రాత్రి విరూపాక్ష గుహకు వెళ్ళాను. కాలు ఇంత లావయ్యింది. జటాస్వామి వాళ్ళు గమనించలేదు కాని, పళనిస్వామి వెంటనే చూసి, 'ఇదేమి?' అని విచారించి తెలుసుకొని మరుదినం నువ్వుల నూనె రాసి, శ్రావణంలో ఆ కుట్టిన చోట గుచ్చి చూస్తే ఒక్కొక్క ముక్కు ఇనుప మేకులాగా వున్నది. వారు చాలా శ్రమ పడి అవన్నీ మెల్లిగా తీసి, వెనుక ఏమేమో చికిత్సలు చేసారు. 2,3 రోజులకు కాలు వాపు తగ్గింది" అని చెప్పారు భగవాన్.

"ఆ తర్వాత  ఆ వట వృక్షం వున్న స్థలం గుర్తించాలన్న యత్నం చేయనేలేదా భగవాన్" అన్నాను. "ఊహూ, మళ్ళీ ఆ తలపే కలుగలేదు. " అన్నారు భగవాన్. కొందరు భక్తులు ఆ స్థలం కనిపెట్టాలని వెళ్లి భంగపడ్డారుట. 

(తరువాయి భాగం వచ్చే సంచికలో...)

శ్రీ రమణార్పణమస్తు