దసరా బొమ్మలకొలువు. - ఆదూరి హైమవతి

dassera bommala koluvu

దసరా వచ్చిందంటే అంతా సరదానే. ముఖ్యంగా  పిల్లలకు పరీక్షల తర్వాత దశరా సెలవులు ఎక్కడలేని ఉత్సా హాన్నీ ఇస్తాయి.ఈసెలవులు వారికిఆనందాల నెలవులు ,ఆటవిడుపు. పండుగతోపాటుగా పెట్టే బొమ్మలకొలువు వారిలోని సృజనా త్మకతనూ, తృష్ణనూ పెంచి ఉత్సాహాన్ని నింపుతుంది.మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో  ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువారంతా సంక్రాంతిపండుక్కి బొమ్మలకొలువు పెట్టేఆచారం ఎక్కువ.ఐతే మద్రాసు, కర్ణాటక ప్రాంతాల వారు ఈ దసరాకే బొమ్మలకొలువు పెడతారు. బొమ్మలన్నింటినీ చేర్చి, కొని, తయారుచేసి, ప్రతి ఏడాదీ కొత్తకొత్త  సంఘటనలనూ, పురాణ గాధలనూ, చారిత్రక ఘట్టాలనూ , శ్రీకృష్ణలీలలను, దశావతారాలను, కురుక్షేత్ర యుధ్ధఘట్టాలను, కొలువుగా తీర్చిదిద్దడం ఓకళ. షుమారుగా నెలముందునుంచే ఆలోచించి శ్రమించి పధకం వేసుకుని , తయారుచేసి అమరుస్తారు. మెట్లు మెట్లుగా ఏర్పరచి అన్నిబొమ్మలూ సరిగా కనిపించేలా అమర్చుతారు. ఇది ఒక అమోఘ మైన కళ.సర్వసాధారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం ఏర్పరిచేదే ఈ దసరా బొమ్మల కొలువు . ఈ దసరా పండుగ సందర్భంగా 9 రాత్రులు ఈ సరదా బొమ్మలకొలువు పండగ జరుపు తారు.

దుర్గాదేవి రాక్షస సమ్హారం గావించి నందుకు గుర్తుగా  అలంకరణకు తొమ్మిది మెట్లుఏర్పరుస్తారు.లేదా వసతినిబట్టి ఏడు, ఐదు, మూడు మెట్లు కూడా అమర్చడం సహజం. గృహస్తుల కళాదృష్టి, ఆర్ధిక స్తోమత, సౌకర్యాలను బట్టి ఈ మెట్లపై రకరకాల బొమ్మ లను కూరుస్తారు.  పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు  కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లు పై ప్రాపంచిక జీవితానికి సంబందించిన బొమ్మలు వుంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని నమ్మిక . మధ్యభాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధ వీరుల వంటి బొమ్మల పెడతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశం దేవీ కరుణకు సూచన. ఈ మూడు సత్వ రజస్తమో  గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షం అందుతుందని విశ్వాసం.

ఇదీ బొమ్మలకొలువు అంతరార్ధం . మెట్ల పై తెల్లని వస్త్రము పరచి దానిపై బొమ్మలను అమర్చుతారు. ఫ్రతిరోజూ ధూప, దీప నైవేద్యాలతో లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి, పూజలు చేస్తారు. రోజూ ఒక కన్య కు అంటే 10సం. లోపు బాలికకు , ఒక సువాసినికి భోజనము పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులైన, బొట్టు,కాటుక దువ్వెన, అద్దం వంటివి , బట్టలు ఇస్తారు.ఇది తాము సువాసినిగా జీవితాంత ఉండేందుకై చేసే సువాసినీ పూజ.ఇలా దసరా తొమ్మిది రోజులు చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం, పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ పసుపు - కుంకుమ, తాంబూలము, దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు కలసివస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఆ సమయం లో మగువలంతా ఇచ్చిపుచ్చుకొనే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నము. అష్టగంధము, పసుపు    ఆరోగ్యానికి చిహ్నాలు.  మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలము సూది మొన మీద తపస్సు చేసిందంటారు. అందుకని బొమ్మల కొలువున్నన్ని రోజులు సూదిలో దారము పెట్టికుట్టరు. ఈ  బొమ్మల కొలువు ప్రతి సంవత్సర ము ఒక్కో విధంగా ఏర్పరుస్తారు. బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక మొదటిసం. ఒక్కమెట్టుమీదపెడితే మరుసటి సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు.

ప్రతీ సంవత్సరం  తప్పని సరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సాంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు చోటు చేసుకున్నాయి కానీ పూర్వం  మట్టి బొమ్మలు, పింగాణీ బొమ్మలు మాత్రమే ఉండేవి. దేవుని బొమ్మలైన వినాయకుడు ,రాముడ , కృష్ణుడు, లక్ష్మి , సరస్వతి, పార్వతి, ఇంకాస్వాతంత్ర్య సమరయోధుల బొమ్మలు, పెళ్ళితంతు బొమ్మలు, హాస్య బొమ్మలు , సెట్టి అంగడి,పార్కు, మొదలగునవికూడా ఏర్పరుస్తారు.. ఒకమారు బొమ్మలకొలువుపెట్తడం మొద లెడితే ఆపకుండా ప్రతిసం.పెడుతూనే ఉండాలనే నియమం ఉంది.అందుచేత ప్రారంభించేప్పుడు బాగా ఆలోచించి చేస్తారు.ఈబొమ్మలకొలువు చాలా గొప్పనైపుణ్యాన్నీ, ఉత్సాహాన్నీ పెంచి, స్వేహభావాన్నీ ,ప్రేమనూ, ఐకమత్యాన్నీ పెంపొందించే గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. దసరా కొలువుకు జేజేలు.