సుశాస్త్రీయం - 'ఆరో రుద్రుడు' : ఆరుద్ర - టీ.వీ.యస్. శాస్త్రి

The 6th Rudra - Arudra

'ఆరుద్ర'గా కలం పేరుతొ ప్రసిద్ధుడైన ఈ రచయిత, అసలు పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి. ఆధునిక ఆంద్ర సాహిత్య చరిత్రలో ఒక సముచిత స్థానాన్నిసంపాదించుకున్న మహానుభావుడు. ఇతను 'ఆరుద్ర' కాడు, 'ఆరో రుద్రుడు' అని శ్రీశ్రీ చేత అనిపించుకొన్న ధన్యజీవి. వీరు మహాకవి శ్రీశ్రీకి బంధువులు కూడాను.1925,ఆగష్టు 31న ఆరుద్ర జన్మించారు. 

ఆరుద్ర జన్మస్థలం విశాఖపట్నం. అక్కడే ప్రాధమిక, మాధ్యమిక విద్యాభ్యాసం సాగించారు. తదుపరి కాలేజీ విద్య కోసమై 1942 లో విజయనగరానికి చేరారు. శ్రీ యుతులు రోణంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజులు వంటి రచయితల ప్రభావం చేత communism వైపు ఆకర్షితులైనారు. 1943 నుండి 1947 వరకు భారత వైమానిక దళంలో Band Boy గా పనిచేసారు.

ఆ తర్వాత,మద్రాస్ కు మకాం మార్చి,'ఆనందవాణి' అనే పత్రికకు రెండేళ్ళు సంపాదకునిగా పనిచేసారు.1949 లో సినీరంగ ప్రవేశం చేసి, అనేక సినిమాలకు మాటలు, పాటలు వ్రాసారు.1954 లో ప్రఖ్యాత రచయిత్రి అయిన  k.రామలక్ష్మి గారిని వివాహము చేసుకున్నారు. "సంతకం అక్కరలేని కవి ఆరుద్ర. అంత్య ప్రాసలే ఆయన వ్రాలుముద్ర. ఆరుద్ర పాటశాల, పాట 'చాల' వడిగా వరవడి దిద్దింది, తెలుగు సినిమాల ఆది 'ప్రాసాంతకం'అన్నది గిట్టని వాళ్ల కట్టుడు పన్ ను, దాని విగ్రహం తాత్పర్యం అడగవద్దు నన్ ను, మాటలు పన్ డటంలో గడసరి, పాటలు పేనడంలో పొడగిరి. జీవితం అంత అద్భుతంగా ఉపమించడంలో నేర్పరి. పొయట్రిక్స్ ప్రయోగించడం ---సరేసరి! అర్జంట్ రచనల్లో కూడా మరి, అరమెరుపైనా--తప్పనిసరి!"

‘నానృషిః కురుతే కావ్యం అన్నారుగా పెద్దలు!’--- ఆరుద్ర గడ్డం పెంచిన కొత్తలో ఆయనకు రాంభట్ల కృష్ణమూర్తి ఎదురయ్యారట. ‘ఏమిటీ గడ్డం?’అని అడిగిన రాంభట్లను చూసి నవ్వేసి‘నానృషిః కురుతే కావ్యం' అన్నారుగా పెద్దలు! అని చమత్కరించారట ఆరుద్ర.

కూనలమ్మ పదాలు కొన్ని

తాగుచుండే బుడ్డి 

తరుగుచుండే కొద్ది  

మెదడు మేయును గడ్డి

ఓ కూనలమ్మ

 

భార్య పుట్టినరోజు 

భర్త మరచినరోజు 

తగ్గెననుకో మోజు

ఓ కూనలమ్మ

 

ఏకపత్నీ వ్రతము 

ఎలుగెత్తి  మన మతము

వేల్పు భార్యలో?శతము

ఓ కూనలమ్మ
 

మనసు తెలుపని భాష

మంచి పెంచని భాష

ఉత్త సంద్రపు ఘోష 

ఓ కూనలమ్మ
 

ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞావంతుడు. వారు చాలా పద్యాలు, వ్యాసాలూ, కథలు, నాటికలు, తర్జుమాలు, సినిమా మాటలు, పాటలు, detective నవలలు...ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియలను చక్కగా నిర్వహించారు. అన్నిటినీ మించి వారు 'చదరంగం' మీద చక్కని పుస్తకం వ్రాసారు. 'త్వమేవాహం' (You are none other than me), 'సమగ్ర ఆంద్ర సాహిత్యం' వీరి రచనలలో అత్యంత ప్రాముఖ్యమైనవి. 'సినీవాలి' అనే గ్రంధం కూడా విశిష్ట ప్రచారం సంపాదించుకుంది . సమకాలీన జీవనం ఇతివృత్తముగా తీసుకొని, అతి సులభమైన భాషలో వీరు వ్రాసిన 'కూనలమ్మ పదాలు' చాలా ప్రాచుర్యం చెందాయి, అది వ్యంగ్య రచన కూడాను.

ఎవరి మనో భావాలు దెబ్బతినకుండా చాలా చక్కగా సాగిన రచన అది. రెండవ ప్రపంచ యుద్ధం గురించి చాలా వ్యాసాలు వ్రాసారు, ఎందుకంటే ఆ సమయంలో వారు, మిలటరీలో పనిచేసారు కనుక. అతను సృష్టించిన గుమాస్తా పాత్ర 'సూర్యారావు' చాలా సజీవమైన పాత్ర.రామాయణం గురించి, ఎక్కువగా పరిశోధనాత్మకంగా చదివి 'రామునికి సీత ఏమవుతుంది?' అనే సంచలన గ్రంధాన్ని రచించారు. తమిళ భాషలోని 'తిరుక్కురళ్' ను తెలుగులోనికి తర్జుమా చేసారు. 'అభ్యుదయ రచయితల సంఘం' లో చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. 'త్వమేవాహం'ను1948 లో రచించారు. వారి గ్రంధాలన్నిటిలో ఇది master piece. తెలంగాణాలోని రజాకార్ ఉద్యమం, నిజాం నిరంకుశ పాలన, అందులోని ముఖ్యాంశాలు. త్వమేవాహం రాసిన నాటికి ఆరుద్రకు 'పైలా పచ్చీసు'వయసే. కుర్రాడికి కేవలం 24 ఏళ్ళే! ‘లోహ విహంగాలు’ రాసినప్పుడే ఆరుద్ర సొంత గొంతుక ఖంగుమంటోంది. ‘వెలిసిందట! అప్పుడే విశాఖపట్నంపై వర్షించిన బాంబు వృష్టి!/ ఓహో! ఏమిటీ జీవ ప్రవాహం/ యంత్రాల మాదిరి మనుష్యులు/ ప్రాణాలు పిడికిట పెట్టుకుని/ గుండెలు చేపట్టుకొని/ బలుసాకును వెతుక్కుంటూ/బతుకు బాటపై కిక్కిరిసి/ భుజాలు రాసుకుంటూ ఉన్మాదంతో/ పోతున్నారు రాసుకుంటూ, ఒత్తుకుంటూ!’. 1949లో ‘త్వమేవాహం’ వెలువడ్డానికి ముందే ఆరుద్ర విభిన్న సామాజిక విషయాలపై 43 కవితల దాకా రాసి ఉన్నాడు.

ఇవి విశాఖపట్నం, గాంధీజీ, స్వాతంత్ర్యం, తెలంగాణ సాయుధ పోరాటం వంటి విషయాలపై రాసిన బలమైన కవితలు. ప్రయోగశీలత, శబ్దాశ్రయ చమత్కారం, తీవ్రమైన అభ్యంతర ప్రకటన...ఇవన్నీ ఆరుద్రను అప్పటి కాలపు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను తన దృష్టి పథంలోకి తెచ్చుకున్న ప్రగతిశీలవాదిగా నిలపెట్టాయి. చెన్నపట్నంలో ఉన్న కాలంలో గాంధీజీ హత్యకు కవిత్వ స్పందన, ఇంకొన్ని మేజర్‌ ఇష్యూస్‌ పై ఈ పైలాపచ్చీసు యువకవి నమోదు చేసిన పరిణత స్పందనలు చూస్తాం .ఆరుద్ర మార్కు పంక్తులైన ‘మన స్వతంత్రం మేడిపండు/ మన దరిద్రం రాచపుండు’, ఈ దేశ స్వాతంత్య్రపు తొలి వార్షికోత్సవం 1948 ఆగస్టు 15కి రాసాడు ఆరుద్ర తన 23 ఏళ్ళ వయసులో. ఆయన సృజనాత్మకు ప్రతీకలైన రెండు, మూడు చిన్న విషయాలను ప్రస్తావిస్తాను.

ఒక ఇసుక గడియారం, మరొక నీటి గడియారంను కవితా వస్తువులుగా తీసుకొని 'కాలాన్ని' అద్భుతంగా నిర్వచించారు. గంటల ముల్లు, ధనస్వామ్యానికి ప్రతీక, నిముషాల ముల్లు మధ్య తరగతివారి మానసిక స్థితికి ప్రతీక, ఇకపోతే సెకండ్ల ముల్లు కష్టజీవులకు ప్రతీకగా తీసుకొని ---వారు రచించిన తీరు నేటికీ నన్నుమురిపిస్తుంది. అంతటితో ఊరుకున్నారా, ఒక stop watch ని విప్లవానికి కొలబద్దగా, అలారంను మనల్ని జాగృత పరచే సాధనగా చక్కగా సాగిన ఆకవిత, నేటికీ సాహిత్యప్రియుల మస్తిష్కంలో నిలిచిపోయింది. 1965 నుండి 1968 వరకు సమగ్ర ఆంద్ర సాహిత్యాన్ని 12 సంపుటాలుగా ప్రచురించారు. ఆరుద్రకు వేలువిడిచిన మేనమామలైన శ్రీశ్రీ,నారాయణబాబూ అభ్యుదయ పథం వైపు తమ కవితా రధాన్ని పరిగెత్తించారు. ముందువాళ్లిద్దరూ ఆరుద్రకు వేలువిడిచిన మేనమామలట. వాళ్ల ప్రత్యక్ష ప్రభావం వల్లనే ఆరుద్ర సాహిత్య రంగ ప్రవేశం చేసారు.

గురజాడ అడుగుజాడల్లో నడవాలని యత్నించిన ఆరుద్రను ప్రభావితం చేసిన వారిలో అబ్బూరి, తాపీ, మల్లాది ముఖ్యులు. ప్రభావాల మాట ఎలా ఉన్నా ఇరవయ్యో శతాబ్ది ఉత్తరార్ధంలో తెలుగు కవితకు కొత్త పలుకుబడిని సవరించినవాడు ఆరుద్ర. అందుకే బాపుగారు ‘సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర - అంత్యానుప్రాసలే అతని ముద్ర’ అన్నారట. ఈ పలుకుబడి సంపాదించుకోవడంలో ఆరుద్ర పై పఠాభి (ఫిడేల్ రాగాల డజన్ కవి) ప్రభావం గురించి ఇక్కడ చెప్పుకుని తీరాలి.

జాతి రత్నం
ఒకసారెవరో శ్రీశ్రీకి ఉత్తరం రాస్తూ ‘తమ శిష్య రత్నం ఆరుద్ర’ అంటూ ఏదో ప్రస్తావించారట. దానిమీదట,‘శిష్యుడంటే అతనొప్పుకోడు - రత్నమంటే నేనొప్పుకోను!’ అని చమత్కరించారట శ్రీశ్రీ. ఈ చమత్కారాల మాటెలా ఉన్నా లోకమంతా ఆరుద్రను శ్రీశ్రీ శిష్యుడిగానూ, మేలిజాతి రత్నంగానూ కూడా ఎన్నడో గుర్తించేసింది! ఆయన  ఎన్నో సినిమా పాటలు వ్రాసారు, అన్నీ విశిష్ట  ప్రజాదరణ  పొందినవే. 'అంత్య ప్రాసల ముద్ర ఆరుద్ర' అనే నానుడి తెచ్చుకున్నారు. వీరి త్వమేవాహం చదివిన తర్వాత, శ్రీశ్రీ గారు, 'నేను ఇంక తెలుగులో వ్రాయనక్కర లేదు' అని అన్నారుట.

వారితో నా ప్రత్యక్ష సంభాషణ-నాకు వారితో ఒకసారి ముచ్చటించే భాగ్యం కలిగింది. నాకు వారు వ్రాసిన 'శ్రీ రామ నామాలు శతకోటి' (మీనా' సినిమాలోనిది) అనే పాట నాకు చాలా ఇష్టం. వారినేఅడిగాను, ఇంత చక్కని భావాన్ని ఎలా పొందగలిగారు? అని.

అందుకు వారు ఇచ్చిన సమాధానం నన్నుఆశ్చర్య చకితుణ్ణి చేసింది. వారు ఈ విధంగా చెప్పారు, 'నేను ఎప్పుడో చిన్నప్పుడు, హిందీలో వచ్చిన 'రామరాజ్' అనే సినిమా చూసాను. అందులో మహీపాల్ రాముని వేషం వేసారు. ఆ సినిమాలో  శ్రీరాముడు, లక్ష్మణుడుని పిలిచి,గర్భవతి అయిన సీతా మహాసాద్విని కారడవులలో దించిరమ్మని కఠినంగా ఆజ్ఞాపించారు.అదే పని లక్ష్మణుడు ఆచరించి, అన్నగారికి చెప్పగానే, శ్రీరామచంద్ర ప్రభువు,భోరున విలపిస్తాడు.అప్పుడు,లక్ష్మణ స్వామి, "అన్నా! ఇంతకు ముందే అడవులలో దించి రమ్మని కఠినంగా చెప్పిన వాడవు, ఇప్పుడు అతి బేలగా విలపించటానికి కారణం ఏమిటని?"అడుగగానే, రామచంద్ర ప్రభువు, "ఆ ఆజ్ఞ ఇచ్చినపుడు, నేను రాజారాముణ్ణి, ఇప్పుడు జానకిరాముణ్ణి అని చెప్పారట' ఈ భావం ఆరుద్రగారి మనసులో నాటుకు పోయింది.

ఎప్పుడైనా అవకాశం వస్తే దాన్ని పాటగా వ్రాయాలని వారి కోరిక. అయితే, వీరికన్నా ముందుగానే తమిళంలో కణ్ణదాసన్ ఆ ఇతివృత్తంతో ఒక పాట వ్రాయటం జరిగిందట. ఆ పాట చాలా జనాదరణ పొందిదట! ఆఖరికి,ఆయన కోరిక, 'మీనా' సినిమాలో ఆ పాట వ్రాసి తీర్చుకున్నారు. చివరిగా, ఆయన చెప్పిన విషయానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఏ మాత్రం భేషజం లేకుండా, ఇది నా స్వంత పాట కాదు, హిందీ, తమిళ రచయితలకే ఆ గౌరవం దక్కాలి అని వారు వినయంగా చెప్పినప్పుడు, వారి వ్యక్తిత్వానికి మనసారా నమస్కరించి, సెలవు తీసుకున్నాను.

ఆ మహనీయుని కవితనొక దానిని మీకోసం ----

పగటిచుక్క
వాడికోరల నోరు తెరచిన
వన్యమృగమును పోలు చీకటి
మనిషిమీదకి దుముకుచున్నది
మధ్యాహ్నవేళ!
పగలుమాసిన ఇరులమూకను
పట్టి చీల్చగ పొడిచె నింగిని
పదను పట్టిన కత్తిమాదిరి
పగటిచుక్క
పట్టపగలే కారుచీకటి
ముట్టడిస్తే మూగవోయిన
పెద్దలంతా చుక్కపొడుపుకి
బొబ్బలు పెట్టిరి
ఇరుల బాధను తొలగజేసే
అరుణతారక వెలుగు సంపద
అడ్డు చెప్పినవారు సైతం
అనుభవిస్తురు

అటువంటి మహనీయుడు, హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో మూత్రపిండాల వ్యాధితో ఘోరంగా 1998 జూన్ 4 న చనిపోయారు. ప్రభుత్వం ఆర్ధికసహాయం చేస్తే కొంతకాలం బ్రతికే వారేనేమో! మనప్రభుత్వాలు ఓటుకు ఇచ్చే విలువ మరి దేనికీ ఇవ్వరు, ఎందుకంటే ఆరుద్ర గారు కనీసం ఒక వెయ్యి ఓట్లు తెచ్చే వాడయితే, ప్రభుత్వం ఏమైనా సహాయం చేసేదేమో!!

ఆయన అన్నట్లుగానే -కవిత కోసమే ఆయన పుట్టాడు,క్రాంతి కోసం కలం పట్టాడు.

ఆఖరికి ఆ 'రుద్రభూమికే' చేరుకున్న ఆమహనీయునికి,జోహార్లు సమర్పిస్తూ,ముగిస్తున్నాను.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు