ఆరు చింతచెట్లు - డా. భీమ మోహన రావు

Aaru chintachetlu

నులక మంచం మీద పడుకున్న మునిస్వామి నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజంతా కుడి కన్ను కోల్పోయిన సతీష్ జ్ఞాపకం వస్తున్నాడు. గడచిన రోజుల నాటి జ్ఞాపకాలను క్షణాలు చీల్చుతున్నా సతీష్ గురించిన ఆలోచనలు మునిస్వామిని నిద్రలోకి జారనియ్యలేదు.

లక్ష్మమ్మ ఇంటి వెనుక ఉండే చింతచెట్లను చిన్నప్పటి నుంచి చూస్తు పెరిగింది. ఆ చెట్ల మీదే కోతికొమ్మ ఆడుకుంది. చెట్లు కాపుకి వచ్చినప్పుడు చింతపండు కోసుకువెళ్లి తిరుపతిలో అమ్మటం ఆమెకు అలవాటు. అలా అమ్మగా వచ్చిన సొమ్ముల్ని ఇంటి ఖర్చులకి వాడేది. చింతపండు వలవడంలో అందె వేసిన చెయ్యి ఆమెది. ఒక రోజు తన మనవడు రంగస్వామితో చింతపండు అమ్మడానికి తిరుపతికి బయలు దేరింది. చింతపండు గంపతో అన్నమయ్య సర్కిల్ వద్ద ఓ పక్కగా కూర్చుంది. ఓ అధికారి తిరుపతికి బదిలీపై వచ్చాడు. అధికారి ఇంట్లోకి చింతపండు కావాలని వారి సిబ్బంది వచ్చారు. లక్ష్మమ్మను ఆమె మనవడిని పక్కనే ఉన్న ఎమ్మార్ పల్లిలోని అధికారి నివాసానికి తీసుకు వెళ్లారు. లక్ష్మమ్మ అక్కడే కూర్చుని చింతపిక్కల్ని తీసేసి పండంతటిని వారికి అమ్మేసింది. రంగస్వామి ఉడతా సాయం చేశాడు. అవ్వతో నడుస్తూ తాను చేసిన పని తెలిస్తే మెచ్చుకుంటుందని “నువ్వు వొలిసిన చింత విత్తనాలను అక్కడే దగ్గరగా పాతిపెట్టాను. అవి చెట్లు అవుతాయి కదా? ఇకనుండి మనం తిరుపతికి చింతపండు మోసుకుపోయే పని తగ్గుతుంది" అని అమాయకంగా అన్నాడు. తాను కుటుంబం కోసం కష్టపడటాన్ని చూస్తున్న రంగసామికి అవ్వపై ప్రేమ ఎక్కువ అనుకుంది. తనలో తాను మనవడి దూర దృష్టికి, తెలివితేటలకి అభినందిస్తూ రంగస్వామి తలను అలా నిమిరింది. తాను చేసిన పని అవ్వకు నచ్చిందని రంగస్వామి అర్థం చేసుకొని సంతోషపడ్డాడు. ఆ సంతోషమే అవ్వ ఎప్పుడు తిరుపతి వెళుతుందాని మరల ఎదురు చూసేలా చేసింది. కొన్ని నెలలకి ఆకుకూరలు తీసుకొని అవ్వతో కలిసి తిరుపతి వెళ్లే అవకాశం వచ్చింది. అప్పుడు రంగస్వామి వయసు 11సంవత్సరాలు. చాలా చలాకీగా ఉండేవాడు. అవ్వ అన్నమయ్య సర్కిల్లో ఆకుకూరలు అమ్ముతుంటే తను మాత్రం నాటిన చింత పిక్కలు ఎలా ఉన్నాయో చూడాలని ఆశతో ఉన్నాడు. లాభనష్టాల గురించి ఆలోచించే రోజులు కావవి. రంగస్వామి నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న చింత పిక్కలు భద్రపరిచిన స్థలానికి సునాయాసంగా చేరుకున్నాడు. తాను విత్తనాలు నాటిన ప్రాంతం కొండల నుండి దిగి పడిన రాళ్లకుప్ప కాదు. పశువుల వ్యర్థాలతో నిండిన ఎరువు దిబ్బ. ఆ ప్రాంతం చూడగానే రంగసామి ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే నేలతల్లి కన్న బిడ్డల్లా భూమి నుండి పొడుచుకొచ్చిన మొక్కల్ని చూసి పరవశించిపోయాడు. తన చేతితో భూమిలో దాచిన చింతపిక్కలు రంగస్వామికి జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని మిగిల్చాయి. కొన్ని మొక్కల్ని దూర దూరంగా ఉంచి వాటి మధ్యలో కొన్ని మొక్కల్ని తనతో తీసుకెళ్లాడు. అన్నమయ్య సర్కిల్ నుండి దుర్గసముద్రం వెళ్లే దారిలో రోడ్డుకి ఎడమ పక్కన మంచి స్థలం అనిపించిన దగ్గర నాటుతూ వెళ్ళాడు. వీరు ఉత్తరం నుండి దక్షిణం ప్రయాణిస్తుంటే పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నది స్వర్ణముఖి. కాసేపు ఈత ఆడి దుర్గసముద్రం చేరుకోవడానికి వారికి ఇరవై నిమిషాలు పట్టలేదు. అప్పట్లో రోడ్డు విస్తరణ పనులు లేక చెట్ల జోలికి ఎవరు పోయేవారు కాదు. చెట్లు బాగా పెరిగాయి. రంగస్వామి కూడా పెద్దవాడయ్యాడు. లక్ష్మమ్మ 75 సంవత్సరాల వయసులో మనవడు రంగస్వామి నాటిన చెట్ల రక్షణ చూసుకుంటూ చింతకాయలు ఏరి అమ్మేది. అయితే మునుపుటి కన్నా ఇప్పుడు మనుషులు పెరిగారు. బండ్ల రాకపోకలు పెరిగాయి. అవసరానికి ఒకరు, రోడ్డుకి అడ్డు అని మరొకరు చెట్లు కొట్టేయడం వల్ల ఎంఆర్ పల్లి వెస్ట్ చర్చి దగ్గర మాత్రమే 11 చింత చెట్లు మిగిలాయి. ఎంత వయసు వచ్చినా చింతపండు లక్ష్మమ్మ అనే పేరు స్థిరపడిందే గాని పండు ఏరి అమ్మడం ఆపలేదు. ఒకసారి చింతకాయలు ఏరుతుంటే ఎండిన చింతకొమ్మ విరిగి లక్ష్మమ్మ పక్కన పడి చేతి మణికట్టుకి గాయమైంది. మరొకసారి లక్ష్మమ్మకి సైకిల్ మీద వచ్చిన పిల్లోడు వెనుక నుండి మోటించాడు. అప్పటికే ఆమె వయసు 94 సంవత్సరాలు. నిండు నూరేళ్లు పూర్తి చేస్తుంది అనుకున్నారంత కానీ మంచాన పడింది. ఎక్కువ రోజులు చాకిరీ చేయించుకోకుండానే భౌతికంగా దూరం అయ్యింది. 45 యేండ్ల చింత చెట్లు ఇకనుండి ఆమెను చూడలేవని మనవడు రంగస్వామి అనుకున్నాడు. ఆ చింత చెట్లతో అలాంటి అనుబంధం వారిది.

రంగస్వామి కొడుకు మునిస్వామి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో గుమస్తాగా చేరాడు. కమిషనర్ బంగ్లాకి ఎదురుగా 11చింత చెట్లు నాటింది తన తండ్రని గర్వపడేవాడు. నాలుగు సంవత్సరాలుగా వాటిని ప్రతిరోజు చూస్తున్నాడు. ఇప్పుడు తిరుపతికి కొత్త కమిషనర్ ప్రకాష్ వచ్చాడు. గతంలో లక్ష్మమ్మ దగ్గర చింతపండు తీసుకున్న అధికారి వెంకటపతి కుమారుడే ప్రకాష్. వెంకటపతి లక్ష్మమ్మను ఎన్నోసార్లు ప్రశంసించాడు. విలువలకు తిలోదకాలు వదలలేని రోజులవి చింతచెట్లను పెంచిందని ఆమెకా ప్రశంస. చింతచెట్లతో వెంకటపతి, లక్ష్మమ్మ, రంగస్వామి దిగిన ఫోటో అధికార భవంతి వరండా గోడకు వేలాడుతూ ఉండేది. ఆ ఫోటో చూస్తే అక్కడికి బదిలీ మీద వచ్చిన ఏ అధికారికైనా ఇట్టే అర్థమవుతుంది.

ఓ వైపు ఉండాల్సిన 11చింత చెట్లు అధికారి జోక్యంతో రోడ్డు మధ్యలోకి వచ్చేశాయి. చింత చెట్లకి ఇరువైపుల దారి ఏర్పడింది. అడ్డరోడ్డులో "అమ్మవారు" వెలసినట్లుగా రోడ్డు మధ్యలో ఉండే చింతచెట్లను తాకడానికి ఇప్పుడు ఎవరికీ ధైర్యం లేదు. ఇప్పుడైతే వాటి ఫలాలను సేకరించేవారు తగ్గిపోయారు. ఒకప్పుడు తండ్రి వెంకటపతితో వచ్చిన ప్రకాష్. కొన్ని సంవత్సరాలకి ఉద్యోగరీత్యా బదిలీపై తిరుపతికి వచ్చాడు. ఇప్పుడు ప్రకాష్ కుమారుడు సతీష్ తిరుపతిలోనే చదువుతున్నాడు. యమహా బైక్ నడపాలంటే సతీష్ కి చాలా ఇష్టం. ఇంట్లో నుండి బైక్లో బయటికి రాగానే ఎదురుగా ఉండే చింతచెట్లు రోజులాగే దర్శనమిచ్చాయి. స్కూలుకి సైకిల్ పై వెళ్తున్న పిల్లలు వారి తల్లిదండ్రులతో రోడ్డు హడావుడిగా ఉంది. చింతచెట్ల దగ్గర ఓ సంఘటన సతీష్ దృష్టి మళ్ళేలా చేసింది. అలా నడుపుతూ ఎండి పడిన చింతకొమ్మ మొదలుభాగాన్ని సునాయాసంగా ముందు చక్రంతో ఎక్కించాడు. ఆ కొమ్మ ఎగిరి స్కూలు పిల్లాడి సైకిల్ చక్రం మధ్యలో ఇరుక్కుంది. అనుకోని పరిణామానికి కంగారుపడి పిల్లోడు సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు. వెనకాల వస్తున్న వాహనం సైకిల్ ని తప్పించబోయి పిల్లాడి కాలుపైకి ఎక్కించారు. ఈ పరిస్థితిని గమనిస్తు పక్కాగా వస్తున్న ఓ వ్యక్తి తన మూడు చక్రాల రిక్షాతో సతీష్ బైక్ ని గుద్దేశాడు. సతీష్ కింద పడటం వల్ల సున్నితమైన కంటికి చింతపుల్ల గుచ్చుకుంది. అమ్మా… అంటూ పెద్దకేక వేశాడు. ఆ పెద్దకేక కన్నా క్షణం ముందే సైకిల్ మీద నుండి పడి కాలు విరిగిన పిల్లాడి కేక చిన్నగా అనిపించింది. సతీష్ పెద్దపెద్దగా కేకలు పెట్టడంతో ఎదురుగా అధికార నివాసభవనం నుండి పనివారు పరిగెత్తుకొచ్చారు. సతీష్ ని గుర్తించి చేతుల మీద వేసుకుని ఆస్పత్రికి చేర్చేశారు. సైకిల్ కుర్రాడిని కూడా ఎవరో ఆసుపత్రికి చేర్చారు. విరిగిన కాలు కట్టుకోవడానికి కుర్రాడికి మూడు నెలలు సరిపోయి ఉండొచ్చు. కానీ సతీష్ మాత్రం శాశ్వతంగా కన్ను కోల్పోయాడు.

కొన్ని నెలల తర్వాత సతీష్ కాలేజీకి వెళ్లడం ప్రారంభించాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. తన తండ్రి తనను డాక్టర్ గా చూడాలనుకున్నాడు. కన్నుపోవడంతో సరిగ్గా చదవక డాక్టర్ సీటు సంపాదించలేక అగ్రికల్చర్ బీఎస్సీలో చేరాడు. అంగవైకల్యం ఉపయోగించుకోవచ్చని చెప్పిన సలహాలు సతీష్ మనసుకు నచ్చక వద్దనుకున్నాడు. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న రోజుల్లో భవిష్యత్తుకు సంబంధించిన విద్యార్థుల ఆలోచనలు వారి మాటల్లో విన్నాడు. ఒకరు విదేశాలకు వెళ్లాలని, వాణిజ్య పంటలు వేయాలని, ఉద్యోగాలు చేయాలన్న వారి తలంపులు తెలుసుకున్నాడు . ఇందిర అభిప్రాయం మాత్రం తన మనసును ఆకర్షించింది. మనం భూమి మీద పడ్డప్పటినుండి ప్రాణం పోయేంతవరకు కంటికి రెప్పల కాపాడేది ప్రకృతే. ప్రకృతే నరుక్కోండని అభయహస్తం ఇచ్చినట్లు చెట్లు నరుకుతున్నాం. ఆచ్చోసిన ఆబోతులా తిరుగుతూ కాలుష్యం సృష్టిస్తున్నాం. ప్రకృతి పరిరక్షణ మాత్రం మరిచిపోతున్నాం. మన వంతు బాధ్యతగా ఎన్ని చెట్లను నాటుతున్నాము? ఇదే ఇందిర అందరికీ వేసిన ప్రశ్న. అనాదిగా వస్తున్న సృష్టి ధర్మం పాటిస్తున్నామా? మన పూర్వీకులు మనలా అనుకోని ఉంటే......? ఎంతోకాలంగా లక్షల మొక్కలు నాటుతున్న జార్ఖండ్ కి చెందిన 'చామీ ముర్ము ' చూసి చాలా నేర్చుకోవాలి అన్నది.

సతీష్ మనసు నిండా ఆమె వేసిన ప్రశ్నలే, దాని తాలూకు ఆలోచనలతో రోజు గడిచి పోయింది. ఏదో సాధించాలనే తపన. అతని ఆలోచనలకు వయస్సు కూడా సహకరించింది. ఇక సతీష్ ఆలస్యం చెయ్యలేదు. విత్తనాలను సేకరించడం ప్రారంభించాడు. మొక్కల పెంపకం చేస్తున్నాడు. ఫలాలను ఇచ్చే చెట్లు నాటడం వల్ల ఇతర జీవరాశులు బ్రతుకుతాయని అతని నమ్మకం. అలా పెంచిన మొక్కల్ని వర్షాకాలంలో ప్రతి గ్రామానికి వెళ్లే దారిలో అశోకుడిలా ఇరువైపులా కాదు గాని ఒకవైపు మాత్రం నాటడం మొదలుపెట్టాడు. తన జీవితం ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోలేదు. తోటి విద్యార్థులందరూ తన ముందు దిగదుడిపే అయ్యేలా శ్రమించాడు. ఈ పది యేండ్లలో సతీష్ లో ఎంతో మార్పు వచ్చింది. ఈ మార్పుని ఇంట్లో వారు గుర్తించలేకపోయారు. ఎందుకూ పనికిరాని పనులను చేస్తూ జీవితం వృధా చేసుకోవడం మంచిదా అన్నవారు ఎందరో. ఆ మాటలని పెడచెవిన పెట్టాడు. ప్రభుత్వం మాత్రం సతీష్ పనితనాన్ని గుర్తించింది. లక్షల మొక్కలు నాటినందుకు తను చేసిన పనిని ప్రశంసిస్తూ చిన్న వయసులోనే "పద్మశ్రీ" అవార్డుకు ఎంపిక చేసింది. ఎన్నో యేండ్ల శ్రమ ఫలితానికి చేరువ అయ్యాడు. ఆ ఆనంద సమయంలో సతీష్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పసాగాడు.

చింతచెట్ల వల్ల సతీష్ కి కన్ను పోయిందని ఇకపై ఎవరికి నష్టం జరగకూడదని తన తండ్రి చెట్లను నరికించాడు. అయితే ఆ చెట్లు పెంచడానికి ప్రోత్సహించింది తమ తాత వెంకటపతి. పెంచింది లక్ష్మమ్మ. నాటింది రంగస్వామి. ఆ రోజుల్లో తన తండ్రి ప్రకాష్ కి ఆక్సిజన్ సరిపోక ఇబ్బంది పడేటప్పుడు ఆ చింత చెట్ల కింద కూర్చోబెట్టి ఆడించేవారని నాన్న చెప్పారని చెప్పాడు. కన్ను కోల్పోయిన రోజు బైక్ మీద వస్తుంటే నా దృష్టి మళ్ళేలా చేసింది ఓ చిల్లర అంగడి వ్యక్తి. అంగడి సంచుల్ని స్కూటి చుట్టూ తగిలించుకొని వెళ్తు గుండెపోటుతో బైక్ మీద కన్నుమూశాడు. కుటుంబం కోసం నిత్యం శ్రమించి బంధాల నుండి శాశ్వతంగా విశ్రమించిన ఆ సంఘటన మర్చిపోలేనిది. అది చూస్తూ బైక్ నడిపి కన్ను కోల్పోయాను. కుర్రాడికి కాలు విరిగింది. చెట్లు పోయాయి. అప్పట్లో రోడ్డు మధ్యలో మిగిలిన ఆరు చింత చెట్లు గాంభీర్యంగా కనిపించేవి. ఇప్పుడు అవి లేకపోవడంతో కేశాలు తీసేసిన పుణ్యస్త్రీ లాగా రోడ్డంతా బోడిగా కనిపిస్తుంది. ఇదంతా నా మనసును కలచివేసింది. అందుకే లక్షల చెట్లను నాటాలని తీర్మానించుకున్నాను. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగాను. ఒకవేళ నేను కొమ్మని బైక్తో తగిలించకపోతే ఆ ఆరు చింత చెట్లు అలాగే ఉండేవి. నేను అగ్రికల్చర్ కళాశాలలో ఉండే వాడిని కాదు. ఎంబిబిఎస్ చదివి డాక్టర్ వృత్తిలో ఉండేవాడినేమో అని టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు.

మున్సిపల్ కమిషనర్ ఇంట్లో పనికి చేరిన రంగస్వామి కుమారుడు మునిసామి టీవీలో సతీష్ చెప్తున్న మాటలు వింటూ ఆలోచనలో పడ్డాడు. మా అవ్వ లక్ష్మమ్మ పెంచిన చెట్లు నాగరికత పేరుతో ఎప్పటికైనా కొట్టేస్తారు. కానీ ప్రకృతి ఆరు చింత చెట్లను కోల్పోయినా లక్షల చెట్ల బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసింది. మునిసామి మదిలో ఎన్నో ప్రశ్నలు. చింత చెట్ల చరిత్రను నా ద్వారా తెలుసుకున్న సతీష్ ఇవన్నీ చేశాడా? కన్ను కోల్పోయిన రోజున అక్కడ గుమ్మి కూడిన ప్రజలు పనికిరాని వెదవని కన్నారని మాట్లాడుకున్నారు. మరి కొందరు ఇప్పటి యువత కి బాధ్యత లేదన్నారు... ఇదంతా ఎవరు చేసిన తప్పు? రంగస్వామి చింత పిక్కలు వేయడం తప్పా? లక్ష్మమ్మ వాటిని కాపాడడం తప్పా? సతీష్ ఎండిన కొమ్మను ఎక్కించడం తప్పా? చింత చెట్లని ప్రకాష్ నరికించడం తప్పా? పరిణామాలను గమనించిన సతీష్ తన మనసులో దృఢంగా లక్షల చెట్లు నాటడానికి సంకల్పించాడా? లేక విధి రాసిన రాతేనా అనుకుంటూ ఇంటిదారి పట్టాడు. అధికార గృహం ముందు ఉండే ఆరు చింత చెట్లు మాయమయ్యాయి. కానీ మునిస్వామి ఊరికి పోయే దారి వెంట సతీష్ నాటిన చెట్లు తనకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉండటాన్ని చూసి సతీష్ కి మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. లక్ష్మమ్మ, రంగస్వామి ఎక్కడున్నా తప్పకుండా సతీష్ ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం కలిగింది. సతీష్ కన్ను పోయిందని చింతచెట్లను ఎంత తిట్టుకున్నాడో అంతకు కొన్ని వేలరెట్ల చెట్లను నాటాడు. మునిస్వామి రాత్రంతా అవే ఆలోచనలు ఏదో సాధించాం అన్నట్లు. చరిత్రలో కలిసిన రోజుల నాటి ఆలోచనలను చీల్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

మరిన్ని కథలు

Manavatwam
మానవత్వం
- సి.హెచ్.ప్రతాప్
Naa asha aakanksha
నా ఆశ-ఆకాంక్ష
- రాపాక కామేశ్వర రావు
Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్
Manasika vaikalyam
మానసిక వైకల్యం
- సి.హెచ్.ప్రతాప్
Pedanaanna
పెదనాన్న
- ఏ. కృష్ణమోహన్
Mrugaraju manasu
మృగరాజు మనసు
- - బోగా పురుషోత్తం
Amma Koyila
అమ్మ కోయిల
- విజయ వాణి. జన్నాభట్ల