ఏకశిలా నగరానికి రాజు చక్రధరుడు. ఆయనకు యుద్ధాలంటె ఎంతో
ఇష్టం. ఎప్పుడూ యుద్ధ తంత్రాలు ఆలోచనలతో ఉంటాడు.
ఆయనకు ముగ్గురు కుమారులు.మహరాజు వారికి రాజ్యపాలన, రాజనీతి, యుద్ధ విద్యలలో ప్రావీణ్యత కోసం వేరు వేరు గురుకులాలకు పంపినాడు.
రాకుమారులు గురువుల వద్ద శాస్త్రాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు,
అస్త్ర శస్త్రవిద్యలు, సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం సంపాదించి
రాజ్యానికి తిరిగి వచ్చారు.
మహరాజు చక్రధరుడు కుమారులు ఏమేమి విద్యలు నేర్చింది ఎంత ప్రావీణ్యం సంపాదించింది పరీక్షలు పెట్ట దలిచాడు.
పెద్ద కుమారుడిని గాలిలో ఎగిరే గరుడపక్షి కంటి గుడ్డును తెమ్మన్నాడు.
రెండవ కుమారుడిని అడవిలో సంచరించే దుప్పి కొమ్మును, మూడవ
కొడుకును నీటిలో ఈదే బంగారు చేపను పట్టి తెమ్మన్నాడు.
కొద్ది రోజుల విరామం తర్వాత ముగ్గురు కుమారులు నగరానికి తిరిగి
వచ్చారు.
పెద్ద కుమారుడు తెచ్చిన గరుడపక్షి గుడ్డును రాజకిరీటం మద్యన,
రెండవ కుమారుడు తెచ్చిన దుప్పి కొమ్మును రాజ సింహాసనానికి
అమర్చమన్నాడు.
మూడవ కుమారుడు తెచ్చిన బంగారు చేప రంగులతో మిలమిలా
మెరుస్తు కనబడింది.దాన్ని రాజసింహాసన శిఖరం మీద ఉంచాలనుకుని
సైన్యాధిపతికి బంగారు చేపను ఎండబెట్టి తెమ్మన్నాడు.
సైన్యాధిపతి ఒక సైనికుడికి ఇచ్చి బాగా ఎండబెట్టి భద్రంగా అప్పగించ
మన్నాడు.
ఆ సైనికుడు బంగారు చేపను తల్లికి ఇచ్చి బాగా ఎండలో పెట్టి తనకి
ఇవ్వమన్నాడు.
ఆ ముసలితల్లి బంగారు చేపను భద్రంగా పక్షులు, జంతువులు
ముట్టకుండా ఎత్తైన మంచి కట్టి ఎండలో ఉంచింది.అక్కడ ఒక
గడ్డి వాము ఉంది. రోజూ అవ్వ బంగారు చేపను ఎండలో ఉంచి
ఎండింది లేనిదీ చూసేది.
వారం రోజుల తర్వాత మహరాజు ఎండిన బంగారు చేపను
తెమ్మన్నాడు. సైన్యాధిపతి తను అప్పగించిన సైనికుడిని ఎండిన
బంగారు చేపను పట్టుకురమ్మన్నాడు.
సైనికుడు గృహానికి వచ్చి తల్లిని రాజుగారి బంగారు చేపను
ఇమ్మన్నాడు. ఆమె చేపను చేత్తో పరిశీలించి చేప ఎండలేదని
చెప్పింది.
వారం రోజులైన చేప ఎండ లేదని సైననికుడు సైన్యాధిపతికి
తెలియచేసాడు.
సైన్యాధిపతి అదే విషయం మహరాజుకు విన్నవించాడు.మహరాజు
ఆశ్చర్య పోతూ బంగారు చేప ఎందుకు ఎండలేదని వాకబు చెయ్య
మన్నాడు.
సైన్యాధిపతి సైనికుడి నివాసానికి చేరుకుని చేప వారం రోజులు
ఎండలో ఉన్నా ఎందుకు ఎండలేదో పరిశీలించగా చేపను ఉంచిన
మంచెకు అడ్డుగా ఎండుగడ్డి మోపు కనబడింది.
"ఏయ్ గడ్డిమోపూ, ఇది మహరాజు గారి బంగారు చేప, ఇది ఎండలో
ఎండకుండా అడ్డుగా ఎందుకు ఉన్నావంది."
" ఆవు నన్ను మేయలేదంది"
"ఆవు ఎందుకు మేయలేదు"
" కాపుకుర్రాడు గడ్డి వేయలేదు"
"ఆవును మేపే కుర్రవాడా, గడ్డి ఎందుకు వెయ్యలేదు.?"
"అవ్వ గంజి పొయ్యలేదు."
"అవ్వా, ఎందుకు గంజి పొయ్యలేదు."
"ఇంట్లో గింజలు లేవు " అందిఅవ్వ
"గింజలు ఎందుకు లేవు"
"పంటలు పండలేదు"
"ఎందుకు పంటలు పండలేదు."
"విత్తనాలు ఎరువులు అందుబాటులో లేవు"
"మహరాజుకు పంటల మీద కప్పం వసూలు చెయ్యడమే
కాని భూమిని దున్నే రైతుల బాధలు తెలుసుకోవడం లేదు."
బంగారు చేప ఎండకపోవడానికి కారణం మహరాజు చక్రధరుడి
చెవికి చేరింది.
ఆయనకు తన తప్పు తెలిసొచ్చింది. తను ఇంతకాలం యుద్ధాలు
రాజ్యకాంక్షే కాని సైనికుల కడుపులు నింపుతు ఎల్లవేళల భూమిని
దున్ని వ్యవసాయంతో పంటలు పండించే అన్నదాతల కష్టాలు
తెలుసుకోకుండా అనాలోచితంగా వ్యవహరించానని తెలుసుకున్నాడు
మహరాజు చక్రధరుడు.
అప్పటి నుంచి రాజ్యంలో తిండిగింజలు పండించే కర్షకుల బాధలు తెలుసుకుంటు కావల్సిన విత్తనాలు, ఎరువులు, నీటి వసతులు
కలగచేయసాగాడు.
సమాప్తం

