సుశాస్త్రీయం - లోపలి మనిషి - టీవీయస్. శాస్త్రి

Insider

మనలో మరో మనిషి ఉంటాడు.(అది 'అంతరాత్మ' కాదు) వాడు చాలావరకు ఇతరులకు కనపడకుండా జాగ్రత్త పడుతాడు.కారణం, మనం పైకి మంచిగా కనపడాలని చాలా తాపత్రయ పడుతాం. వాడు మాత్రం కొన్ని వేళలో మనం పైకి కనిపించేదానికి పూర్తి భిన్నంగా ఉంటాడు. లోపలున్న మనిషి పూర్తి మృగామూ కాదు, పూర్తి మనిషీ కాదు. రెండు రూపాలు, లక్షణాలు వాడిలో ఉంటాయి.'

అవకాశాలు లేక, చాలామంది ఈ దేశంలో నిజాయితీ పరులుగా ఉన్నారు కానీ, అవకాశాలుంటే వాళ్ళలో ఎంతమంది నిజాయితీగా ఉంటారు?' అని ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక సినిమాలో వ్రాసినట్లు నాకు గుర్తు. లోపలి మనిషిలోని మృగ లక్షణాలు, చీకట్లో బయట పడుతాయి. అంటే,సమాజం నిద్రించే వేళలో. చూడండీ! త్రాగుడు, వ్యభిచారం, మానభంగాలు, అక్రమసంబంధాలు, హత్యలు, దోపిడీలు,...ఇలాంటి ఆకృత్యాలన్నీ చీకట్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. అప్పుడు వాడిలోని మృగ లక్షణాలన్నీ విజ్రుంభించుతాయి. సమాజం మేల్కొనగానే, వాడు చాలా పెద్దమనిషిగా కనపడాలని తెగ తాపత్రయ పడిపోతాడు. కానీ, మనం వాడిలోని మృగాన్నిఇట్టే గుర్తించగలం -- మత్తుగా కనపడే కళ్ళు, స్పష్టతలేని భావాలు, రూపం --మొదలగు లక్షణాలను చూసి. అందరిలోనూ ఇలానే ఉండడు, Insider.

కొంతమందిలో చాలా అద్భుత మైన వాడు ఉంటాడు. అప్పుడప్పుడూ, వాడు వాళ్ళను దాటి బయటకు వస్తాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తితో మనకు కొంత సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత, అతనూ మనమూ స్వేచ్ఛగా, నిర్భయంగా మాట్లాడుకునే సందర్భంలో, అసలు సంభాషణ జరిగేది 'లోపలి మనుషుల' మధ్యే! ఈ మధ్య నాకొక మిత్రుడు, పరిచియమై ఆనతికాలంలోనే సన్నిహితుడుగా కూడా అయ్యాడు. అతనిలో ఒక రచయిత ఉన్నట్లు నేను గుర్తించాను. పలు మార్లు ఆ మిత్రునికి, వివరించాను కూడా!' నీ లోపలి మనిషికి బయటకు రావటానికి కొద్దిగా దారి ఇవ్వమని' అతనో లేక అతనిలోని 'లోపలి మనిషో' సంఘర్షణ పడుతున్నారు, తటపటాయిస్తున్నారు.

లోపలున్న మనిషి ఉక్కపోసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా నాకనిపిస్తుంది. వాడు కనుక ఒక్కసారి బయటకు వస్తే, వాడు ఆ వ్యక్తినే కాదు, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాడు. ఇది నిజం. మనమందరమూ కవులుగా అనుభూతి చెందకపోతే, కవిత్వాన్ని ఆస్వాదించలేం! అలాగే అన్ని కళలలోనూ అంతే. ఇవన్నీ, ఎలా చెబుతున్నానంటే--నేను అనుభవించినవి, నాకు అనుభవమైనవే ఎక్కువగా నేను చెబుతుంటాను. అప్పుడే అవి సహజంగా, నిజాయితీగా ఉంటాయి.

ఈ మధ్య నేను 'భవాని' అనే నాటకాన్ని చూసాను. అందులో 'శివాజీ' పాత్రను పోషించినవాడు నాకు స్నేహితుడు. ఆ నాటకంలో వాడు నటిస్తున్నట్లు నాకు చెప్పలేదు. 'మంచి నాటకం మా స్నేహితులు వేస్తున్నారు, మీరూ తప్పక రండి' అని మాత్రమే వాడు నాకు చెప్పాడు. నాటకం చూసి బిత్తర పోయాను. శివాజీ వేషం వేసిన వాడు నా మిత్రుడే! అద్భుతంగా నటించాడు. Dialogue delivery, modulation, హావ భావాలు నన్ను మంత్రముఘ్ధుడిని చేసాయి. నాటకం అయిపోగానే, వాడిని ఆలింగనం చేసుకొని 'నీలో ఇంత చక్కని నటుడు ఉన్నాడని నాకు ఇంత కాలం ఎందుకు చెప్పలేదురా?' అని వాడిని ప్రశ్నిస్తే, 'నాకు ఇదే మొదటి నాటకానుభవం' అని చెప్పి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఎందుకు చెబుతున్నానంటే, వాడి లోపల ఉన్న నటుడిని వెలుపలికి తీసుకొచ్చిన 'లోపలి నటుని' మేధస్సు ఎంత గొప్పదో! చాలా మందికి చక్కని భావాలు ఉంటాయి, ఉన్నాయి. అయితే వాటికి అక్షరరూపం ఇవ్వటానికి ఎందుకో తటపటాయిస్తుంటారు. ఒక్కసారి మీ లోపలిమనిషికి  పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, వాడు ఏది  చెబితే అది వ్రాయండి. మీరు వ్రాసింది బాగుందో లేదో కూడా మీకు మొట్ట మొదట చెప్పేది వాడే! వాడిని గురించి ఎందుకు ఆలోచించరూ? ఎందుకు వాడిని బయటకు రానివ్వరూ? ఇలా ఎంతకాలం మనం వాడిని బయటకు రాకుండా ఉంచుతాం? దానికి కారణాలు ఏమిటి? వాడికి 'స్వేచ్ఛ' ఎందుకు ఇవ్వరూ? మనం వాడికి స్వేచ్ఛ ఇవ్వటం లేదంటే, మనలోని భావాలను వాడు అంగీకరించటంలేదన్న మాట. కాకపొతే, మనలో ఉన్నవి సంకుచిత భావాలైనా కావచ్చు!

మీరే ఆలోచించండి!

( ఈ రచన వ్రాయటానికి నాకు ప్రేరణ, శ్రీ పీ.వీ.నరసింహారావు గారు వ్రాసిన.'Insider' అనే గ్రంధం. అందులోని 'ఆనంద్' అనే పాత్ర ఆయనిదే! సహజంగా గొప్ప పండితుడు కావటం చేత ఆ గ్రంధం, మనల్ని పూర్తిగా చదివింప చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఇది ఆయన 'ఆత్మకథ' )

మరిన్ని వ్యాసాలు

Ankitam
అంకితం
- మద్దూరి నరసింహమూర్తి
Peru lone pennidhi
పేరులోనే పెన్నిధి
- తోట సాంబశివరావు
పండరి విఠలుడు.
పండరి విఠలుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
ఇది నిజమా ???.
ఇది నిజమా ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మన రామాయణాలు .
మన రామాయణాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
జైనతత్వ శాస్త్ర ం
జైనతత్వ శాస్త్ర ం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.