విద్య వికాసాన్ని కలిగించాలి! - టీవీయస్. శాస్త్రి

Education Brings Awareness

కొంతమంది చిన్నప్పుడు ఏమేమి కావాలని కలలుకని, ఆ కలలు కల్లలుగా మిగిలిపోయాయో -- ఆ తీరని కోరికలు తీర్చుకోవటానికి వారి పిల్లలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. నాకు తెలిసిన వారి అమ్మాయి చిన్నప్పుడు డాక్టర్ కావాలని తెగ కలలు కన్నది. పెద్దయిన తరువాత డాక్టర్ కాలేదు కానీ, డాక్టర్ కు చేరువగా ఉండే పేషంట్ అయింది. ఆ అమ్మాయి ఆ తీరని కోరికను తీర్చుకోవటానికి తన కుమారుడిని ఆయుధంగా చేసుకుంది.

వాడి వయసు పట్టుమని పది ఏళ్ళు కూడా లేవు. తెల్లవారుఝామున 4 గంటలకు వాడిని బలవంతంగా నిద్ర లేపుతారు. అప్పటి నుండి 6 గంటల వరకు స్కూల్ లో ఇచ్చిన హోం వర్క్ ను చేయిస్తారు. అసలు స్కూల్ లో చెప్పేదానికన్నా ఇంట్లో హోం వర్క్ చేసేదే ఎక్కువ ఉంటుంది. 6 గంటల తరువాత వాడు కాలకృత్యాలు తీర్చుకొని, హడావుడిగా అల్పాహారాన్ని తీసుకుంటాడు.ఈలోపు తల్లి ఒక హాట్ పాక్ లో భోజనాన్ని సద్దిపెడుతుంది. 8 గంటలకల్లా 15 కిలోల బరువున్న పుస్తకాలున్న బాగ్ ను తగిలించుకొని వాన్ లో స్కూల్ కి వెళతాడు.  స్కూల్ 3 గంటలకు అయిపోతుంది.

వాడు ఆపసోపాలు పడుతూ అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్న తల్లి, వాడు వచ్చీ రాగానే డ్రెస్ మార్చి, కీ బోర్డు నేర్చుకోవటానికి పంపుతుంది. అక్కడ వాడొక ఒక గంట గడిపిన తరువాత, టెన్నిస్ కోచింగ్ కు వెళతాడు. రోజు మొత్తం మీద వాడు ఆనందంగా గడిపేది ఆ సమయంలోనే! ఎందుకంటే వాడికి ఆటలంటే ఇష్టం కనుక! ఆనందంతో ఒక రెండు గంటలు ఆడి అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే స్నానం చేసి మళ్ళీ చదువుకోవాలి. బాగా అలసిపోవటం వలన నిద్రవస్తుంది. ఒక పక్క నిద్రపోతుంటే, తల్లి బలవంతంగా నోట్లో ముద్దలు పెడుతుంది. పిల్లవాడితో తల్లి కూడా రోజంతా కష్టపడుతుంది. అసలు ఈ కష్టమంతా దేనికోసం? వాడినొక ఎ.అర్. రహమాన్ చేయాలనా? లియాండర్ పేస్ ను చేయాలనా? డాక్టర్ ను చేయాలనా? వాడికి ఇష్టమైన దానిని గుర్తించి అందులో బాగా ప్రోత్సహిస్తే, వాడు ఆ రంగంలో తప్పక రాణిస్తాడు, ఇందులో ఏమాత్రం సందేహం ఉండనవసరం లేదు.

మనమనుకున్న రీతిలో వాడు కావాలంటే వాడు కూడా మన లాగే  పేషంట్ అవుతాడు. నాకు తెలిసినంతవరకూ,ఏ విద్యార్ధి అయినా సరే , స్కూల్ కి వెళ్ళేటప్పుడు బాధగా వెళతాడు, ఇంటికి వచ్చేటప్పుడు ఆనందంగా వస్తాడు. అయితే,వాడి ఆనందం మీద నీళ్లు జల్లి మళ్ళీ వాడిని బాధపెడుతున్నారు చాలామంది నేడు. ప్రపంచంలో అతి మంచి స్కూల్ ఇల్లేనని నా అభిప్రాయం.

శిక్షణ పేరుతో ఇంట్లో కూడా వాడిని శిక్షించి వాడి బాల్యాన్ని అపహరిస్తున్న దొంగలం మనం. అప్పుడప్పుడు నేను పత్రికలలో కొన్ని వార్తలను చూసి విస్తుపోతాను. 12 ఏళ్ళకే ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్ధిని గురించి,16 ఏళ్ళకే ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్ధిని గురించి వాళ్ళ తల్లితండ్రులు గర్వంగా పత్రికలకు చెప్పటం మీరు కూడా చూసే ఉంటారు. పత్రికలలో ఆ పిల్లల  ఫోటోలను మీరు నిశితంగా పరిశీలించారా? వారి ముఖంలో చిరునవ్వు కూడా కనపడదు, బలహీనంగా ఉంటారు. వాడు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇవ్వటం ఎవరి తరమైనా అవుతుందా? అసలు మానవహక్కుల సంఘాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు మొదలైన బాధ్యతాయుత సంస్థలు ఇటువంటి విషయాల మీద స్పందించకపోవటం ఆశ్చర్యంతో పాటు విచారాన్ని కూడా కలిగిస్తుంది.

మా చిన్నప్పుడు 5 ఏండ్లు నిండి 6 వ సంవత్సరం రాగానే పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేసేవారు, అప్పటికి పిల్లవాడికి తగిన శక్తి, ఊహ కలుగుతుందని! మరి ఇప్పుడు మూడేళ్ళు నిండని లేత  కుసుమాలను విద్య పేరుతో మనం శిక్షించటం ధర్మమా! విద్య,వైద్యం.... ఇలా ఒక్కొక్కటి వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో, విద్యాలయాలు ఇచ్చే ప్రకటనల మోజులో పడి తల్లి తండ్రులు తమ పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్నారు.

మొన్నీమధ్య నా దగ్గర పనిచేసిన ఒక సహోద్యోగి తన కుమారుడిని డాక్టర్ ని చేయాలని 80 వేలు ఫీజు కట్టి ఒక Residential College లో ఇంటర్మీడియట్ లో చేర్చాడు. వాడు ఎప్పుడో పండక్కి ఇంటికి వస్తాడు. College లో వాడేమి కోల్పోయాడో వాటిని ఇంటివద్ద పొందాలను కుంటాడు. T.V. లో క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాడు. అది గమనించిన తండ్రి వచ్చి, "80 వేలు ఫీజు కట్టాను, జాగ్రత్తగా చదవాలి, ఇలా T.V. లు చూస్తుంటే కుదరదు" అని వాడిని వత్తిడిలో పెడతాడు. స్కూల్ కి వెళ్ళినా వాడి ధ్యాసంతా వాడు కోల్పోయిన దాన్ని గురించే ఆలోచిస్తాడు, పొందవలసింది వాడికి గుర్తుండదు.

ఇష్టపడి సంతోషంగా చదవని వాడికి Medicine లో సీట్ రాలేదు. ఈ సారి 2 లక్షల రూపాయలు ఫీజు కట్టి Trash Course లో వాడిని చేర్చాడు. వాడి మీద వత్తిడి ఇంకా పెరిగింది. College లో చెప్పేది వాడికి అర్ధం కావటం లేదు. College కి వెళ్ళాలనే ఉత్సాహం కూడా వాడికి పోయింది. ఉదయాన్నేCollege కి వెళ్ళే టైం కి ఇంటి నుండి బయలు దేరి ఒక పార్క్ లో సాయంత్రం దాకా గడిపి ఇంటికి వచ్చేవాడు. ఇలా ఒక పది రోజులు గడచిన తరువాత, వాడు College కి రాని విషయాన్ని యాజమాన్యం వారు ఇంటికి తెలియచేసారు. అప్పుడు వాడి తండ్రి హడావుడిగా నా వద్దకు వచ్చి జరిగిన విషయాలన్నిటినీ పూసగుచ్చినట్లు చెప్పాడు."నేనుచూస్తాలే! నీవు వాడిని కోప్పడకు" అని చెప్పి పంపాను.

మరుసటి రోజు వాడిని జాగ్రత్తగా గమనించి పార్క్ లో వాడిని కలిసాను. నన్ను చూడగానే వాడు భోరున విలపించాడు. వాడి సమస్యలు తెలుసుకున్నాను. వాడిలా చెప్పాడు, " ప్రతి నిమిషానికి, డాడీ 2 లక్షలను గురించి చెబుతుంటే, నేను తీవ్రమైన వత్తిడికి గురౌతున్నాను, అందుకనే చదువుకోవటానికి ఉత్సాహం కలుగటం లేదు." అని వాడు చెప్పాడు. మరుసటి రోజు వాడిని , వాడి తండ్రిని తీసుకొని నాకు తెలిసిన ఒక Psychiatrist దగ్గరికి తీసుకొని వెళ్లాను. Psychiatrist వాడి తండ్రిని నానా తిట్లుతిట్టి, "మీరిలా ప్రవర్తిస్తే, మీ వాడు డాక్టర్ కాలేడు సరికదా, పిచ్చివాడిగా మాత్రం తప్పక అవుతాడు" అని మందలించాడు. పిల్లవాడికి తగిన counseling ఇచ్చి పంపాడు.

అప్పటి నుండి వాడు స్వేచ్ఛగా చదివాడు. B.D.S లో సీట్ సంపాదించుకున్నాడు.

వాడికి అంతమాత్రం స్వేచ్ఛ ఇవ్వకపోతే నిజంగా పిచ్చివాడయ్యేవాడు,  ఏమాత్రం సందేహంలేదు!


Education should be an enjoyable process!

మరిన్ని వ్యాసాలు

Ankitam
అంకితం
- మద్దూరి నరసింహమూర్తి
Peru lone pennidhi
పేరులోనే పెన్నిధి
- తోట సాంబశివరావు
పండరి విఠలుడు.
పండరి విఠలుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
ఇది నిజమా ???.
ఇది నిజమా ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మన రామాయణాలు .
మన రామాయణాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
జైనతత్వ శాస్త్ర ం
జైనతత్వ శాస్త్ర ం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.