నిర్ణయం - జి.ఆర్.భాస్కర బాబు

Nirnamyam

ఆదిలక్ష్మి దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు విని అక్కడే ఉన్న విష్ణుమూర్తి ఆమె వంక చూశాడు. ఆదిలక్ష్మి,విష్ణుమూర్తి అనగానే ఇదేదో పౌరాణిక జానపద చారిత్రక కథ అనుకోకండి.ఇది పక్కా ప్రస్తుతం జరుగుతున్న విషయాలకు సంబంధించిన కథే! సరే…ఆదిలక్ష్మి గారి నిట్టూర్పు వెనకాల ఉన్న విషయం ఏమిటంటే.. విష్ణుమూర్తి మంచి ఉద్యోగమే చేస్తున్నాడు.స్వతహాగా ఆ దంపతులు పొదుపుగా బ్రతకటం అలవాటు అయిన వాళ్ళు కావటంతో ఆస్తులు బాగానే కూడబెట్టి గలిగారు. ఇళ్ళ స్థలాలకు బాగా గిరాకీ ఉన్న చోట రెండుమూడు స్థలాలు ఉన్నాయి. రెండు ఇళ్లు కూడా ఉన్నాయి.ఒక్క మాటలో చెప్పాలంటే బాగా ఉన్న మధ్యతరగతి కుటుంబం. ఆదిలక్ష్మి,విష్ణుమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. వల్లభ్, వికాస్ మగపిల్లలు, విషిత ఆడపిల్ల. పెద్ద పిల్లాడికి,ఆడపిల్లకూ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత చిన్నోడు వికాస్ కి ఈమధ్యే వింధ్యతో పెళ్ళయింది. పెద్ద కోడలు సులక్షణ పెళ్ళయిన కొత్తలో “మామయ్య గారూ, అత్తయ్య గారూ” అంటూ చాలా కలివిడిగా ఉండేది. తరువాత్తరువాత ఏమయిందోకాని అంటీముట్టనట్లు ఉండసాగింది. మాట్లాడటం కూడా చాలా లౌక్యంగా మాట్లాడుతూంది. ఉన్నట్టుండి ఆమె అలా మారి పోవటానికి కారణం ఏమైఉంటుందా అని ఆదిలక్ష్మి దంపతులు చాలా తర్జనభర్జన పడ్డారు. “మనకు తెలిసి మనం ఆమెను ఎప్పుడూ నొప్పించలేదే” అనుకున్నారు,“చక్కగా మన కుటుంబంలో కలిసిపోయింది.మనం,మనపిల్లాడు చాలా అదృష్టవంతులం.ఇప్పుడు ఎవరి దృష్టి తగిలిందో పిల్ల ఇలా మారిపోయింది”. కాని వాళ్ళ విచక్షణ, వివేకం వాళ్ళని బైటపడనివ్వలేదు. సులక్షణ పుట్టింటికి వెళ్ళి వచ్చిన తరువాత ఆ మార్పు వచ్చిందని గమనించారు. చూచాయగా పెద్దకొడుకు వల్లభ్ తో అని చూశారు. అతను చాలా తేలికగా, “అంతా మీ అనుమానం.తను నాతో బాగానే ఉంటూంది కదా.పుట్టింటి మీద బుధ్ధి పుట్టినప్పుడు ఆడపిల్లలు కాస్త అసహనంగా ఉండటం సహజమే.పెద్దగా పట్టించుకోవద్దు”అన్నాడు. “అదికాదురా పెద్దోడా”,అని ఏదో చెప్పబోయిన విష్ణమూర్తితో,”సరేలే నాన్నా.. నాకు ఆఫీసు టైం అవుతోంది.తను నిద్రలేచిన తరువాత చెప్పండి”అంటూ వల్లభ్ వెళ్లిపోయాడు

. కొత్తగా పెళ్లయిన చిన్న కొడుకు కోడలు అత్తారింటికి వెళ్లారు.ఈరోజో రేపో వస్తారు.ఇంకా వాళ్ళు ఆఫీసులకు వెళ్ళటం లేదు. పెద్ద కోడలు అదేదో స్టాక్స్ కంపెనీలో పని చేస్తుంది.ఆమెకు ఇంటివద్దనే పనిచేసే సౌలభ్యం ఉండటంతో వారానికి ఒకటో రెండో రోజులే ఆఫీసుకు వెళుతుంది.ఆఫీసుకి వెళ్ళాల్సిన రోజుల్లో తప్ప త్వరగా లేచి తయారవదు. విష్ణుమూర్తి పని చేసే ఆఫీసు కాస్త దూరంగా ఉండటంతో అతను ఉదయం ఎనిమిది గంటలకల్లా బయలు దేరి వెళ్తాడు. అతనికి టిఫిన్, భోజనం ఏర్పాటు చేయాలి.వల్లభ్ టిఫిన్ మాత్రం చేసి ఇంచుమించు తండ్రితోనే వెళ్తాడు. సులక్షణ తొమ్మిది గంటలకు లేచి కంప్యూటర్ లో లాగిన్ ఐన తరువాత ముఖం కడుక్కుంటుంది.అలా అలా పదకొండు గంటల వరకు తయారు అవుతూనేఉంటుంది. చిన్నోడి పెళ్లి కాకముందు వరకు తను త్వరగా లేవకపోయినా, లేచిన తర్వాత ఆదిలక్ష్మికి పనుల్లో సాయం చేయడం, ఆఫీసు పని విరామాల్లో కాసేపు కబుర్లు చెప్పటం చేస్తూండేది. ఇప్పుడు పిసరంత పనీ చేయటం లేదు, మాటా ముచ్చటా అసలే లేదు.మాట్లాడినా కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్లే ఉంటోంది. ఇంటి పని మొత్తం ఆదిలక్ష్మి మీదే పడింది. యాభై అయిదేళ్ల వయసులో ఆమెకు అది తలకు మించిన భారం అయింది. ఆమె ఇదివరలా ఎక్కువ సేపు పని చేయలేకపోతూంది. ఎవరయినా కొద్దిగానయినా సాయంచేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. కాని అది అరణ్య రోదనే అయింది. ముక్కుతూ మూలుగుతూ ఇంటెడుచాకిరీ ఒక్కతే చేస్తూంది. కొడుకు అలా మాట్లాడేసరికి దీర్ఘంగా నిట్టూర్చటం తప్ప ఏమీ చేయలేక పోయింది.అంతకంటే అతనితో ఏం చెప్పాలో అర్థం కాలేదు. విష్ణుమూర్తి ,వల్లభ్ ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఆసరికి వాషింగ్ మిషన్ ఈల వేయటం మొదలుపెట్టింది. ఈసురోమంటూ ఆదిలక్ష్మి బట్టల ఆరేయటానికి మిషన్ దగ్గరికి వెళ్లి ఆ పని ముగించుకుని వచ్చేసరికి తొమ్మిది అయింది. కాస్త టిఫిన్ తిందాం కదా అని కూర్చునే సరికి, కోడలు సులక్షణ లేచి బయటకు వచ్చి బరాబరా బ్రష్ చేయటం మొదలుపెట్టింది. ఆదిలక్ష్మి సులక్షణకి ఎన్నిసార్లో చెప్పింది ఇంట్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర కాదమ్మా ,బయట ఉన్న వాష్ బేసిన్ దగ్గర బ్రష్ చేసుకుని లోపలకి రమ్మని. కొద్దిరోజులు అలాగే చేసినా తర్వాత ఇంట్లోనే బ్రష్ చేయటం మొదలు పెట్టింది సులక్షణ. సులక్షణ వంక కాస్త కోపంగా చూసింది ఆదిలక్ష్మి. అదేమీ పట్టనట్టే బ్రష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది సులక్షణ. ఏమీ చేయలేకలేక కాస్త ఎంగిలిపడి హాల్లోకి వెళ్లి కూర్చుంది ఆదిలక్ష్మి.

******. *******. *******. ******* ఆరోజు సాయంకాలం విష్ణుమూర్తి వచ్చేసరికి ఆదిలక్ష్మి పడక గదిలో పడుకొని ఉంది. “అదేమిటోయ్ పడుకుని ఉన్నావు ఈవేళప్పుడు” అని అడిగాడు విష్ణుమూర్తి. “అబ్బే ఏం లేదండి తలనొప్పిగా ఉంది. ఒళ్ళు నొప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉండండి మీకు కాఫీ కలిపి తీసుకొస్తాను” అంటూ లేవబోయింది. కానీ ఆమె మంచం మీద నుండి లేవలేకపోయింది. కళ్ళు తిరిగినట్లు అయి మంచం మీదే మళ్లీ కూలబడిపోయింది. విష్ణుమూర్తి కంగారుగా,” ఏమైంది లక్ష్మీ, పద హాస్పిటల్ కి తీసుకెళ్తాను” అన్నాడు. “అబ్బే ఏమీ వద్దండి కాస్త నలతే కదా సర్దుకుంటుంది ఒక్క నిమిషం కూర్చోండి” అంటూ ఆదిలక్ష్మి ఓపిక చేసుకుని మంచం మీద నుంచి దిగి వంటింట్లోకి నడిచింది. ఆమె వెనకే వెళ్లిన విష్ణుమూర్తి “ఇంట్లో అమ్మాయి ఉంది కదా ఏమి చెప్పలేదా నీవు?మరి మధ్యాహ్నం భోజనం ఏం చేశావు, అప్పటినుండి అసలు ఏమీ తినలేదా నీవు?” అని అడిగాడు. ఆదిలక్ష్మి ఏమీ సమాధానం ఇవ్వలేదు. సులక్షణ గది దగ్గరికి వెళ్లి “అమ్మాయి ఇటు రామ్మా ఒకసారి” అని పిలిచాడు. సులక్షణ ఒక ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చి “చెప్పండి మామయ్య గారు” అని అడిగింది. “మీ అత్తయ్యకు ఒంట్లో బాగాలేదు నీకు తెలుసా అమ్మా” అని అడిగాడు విష్ణుమూర్తి. “ఏమోనండి నాకు ఏమీ చెప్పలేదు మరి. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు నేను” అంది సులక్షణ. “మరి మీ అత్తయ్య తిందో లేదో నువ్వు అడిగావా?” అని అడిగాడు విష్ణుమూర్తి. ఆమె మరేమీ మాట్లాడలేదు. అంతలోనే అక్కడికి కాఫీ కప్పుతో వచ్చింది ఆదిలక్ష్మి. ఆమె ముఖం ఏడు రోజులు లంకణాలు చేసినట్లు పీక్కుపోయి ఉంది. విష్ణుమూర్తి సులక్షణ వంక చుర చుర చూశాడు. ఆమె అదేమీ పట్టించుకున్నట్లు కనపడలేదు. సులక్షణ “అత్తయ్య గారు నాక్కూడా కొద్దిగా కాఫీ ఇస్తారా మధ్యాహ్నం కూడా నేను భోజనం చేయలేదు” అంది. “అదేమిటమ్మా నేను అన్నీ తయారుచేసి అక్కడ భోజనాలబల్ల మీద పెట్టాను కదా” అంది ఆదిలక్ష్మి. “ఏమో అత్తయ్య గారు మీరు నన్ను పిలవలేదు నేను బయటికి రాలేదు” అంది సులక్షణ. “అంతేకానీ నువ్వు ఇంట్లో ఏ విషయము పట్టించుకోవా అమ్మా”అని అడిగాడు కాస్త బిగ్గరగా విష్ణుమూర్తి. “ఇప్పుడు ఏమైంది మామయ్య గారూ ,నా మీద మీరు ఎందుకు అలా అరుస్తున్నారు అంది”సులక్షణ. “మీ అత్తయ్యకు పొద్దునుంచి ఒంట్లో బాగాలేదు తను ఏమీ తినలేదు ఈ విషయం తెలుసా నీకు” అని అడిగాడు కోపంగా విష్ణుమూర్తి. “అత్తయ్య గారు నాకు ఏమీ చెప్పలేదండి” అంది విసురుగా సులక్షణ. విష్ణుమూర్తికి మరి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.చాలా కోపంగా అతను బయటికి వెళ్లిపోయాడు. సులక్షణ కూడా విసురుగా తన గదిలోకి వెళ్లిపోయింది. ఆదిలక్ష్మి అక్కడే మ్రాన్పడి చూస్తూ ఉండిపోయింది. అంతలోనే ఆమెకు మైకం కమ్మినట్లు అయి కింద కుప్పకూలిపోయింది. ఓ పది నిమిషాల తర్వాత వచ్చిన విష్ణుమూర్తి, ఆదిలక్ష్మి నేలమీద పడిపోయి ఉండటం గమనించాడు. ఆదరాబాదరా ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ పరీక్ష చేసిన డాక్టర్లు, ఆమె చాలా బలహీనంగా ఉందని ఆమెకు తగినంత విశ్రాంతి కావాలని ,మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలని చెప్పారు. మూడు రోజులు ఆసుపత్రిలోనే తమ పర్యవేక్షణలో ఉంచాలని కూడా చెప్పారు.

విష్ణుమూర్తి ఆమెను ఆసుపత్రి గదిలోకి మార్చిన తర్వాత పెద్దవాడు వల్లభ్ కి ఫోన్ చేశాడు. వల్లభ్ ఆదరాబాదర ఆసుపత్రికి వచ్చాడు. “కంగారు ఏం లేదు లేరా , పని ఒత్తిడి వల్ల బలహీనంగా అయింది. ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది” అన్నాడు విష్ణుమూర్తి కొడుకుతో. ఇంత జరిగినా ఆఫీస్ పని ఎక్కువగా ఉందని సులక్షణ ఆసుపత్రికి రానేలేదు. మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు వికాస్ కి ఫోన్ చేసి చెప్పారు. “మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం నాన్నా” అన్నాడు వికాస్ “అంత కంగారు ఏమీ లేదని చెప్తున్నాను కదా వికాస్. నీవు మెల్లగానే రా. కోడల్ని కూడా కంగారు పడవద్దని చెప్పు.విషయం నీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను కంగారు పడాల్సిన విషయం అస్సలే లేదు” అన్నాడు విష్ణుమూర్తి. ఆరోజు మధ్యాహ్నానికి వికాస్ ,అతని భార్య ఇద్దరూ ఆసుపత్రికి వచ్చారు. పరామర్శలు అయిపోయిన తర్వాత వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ విష్ణుమూర్తి ఒక్కడే మిగిలిపోయాడు. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. ఈ మూడు రోజుల్లోనే ఆదిలక్ష్మి పీక్కు పోయినట్లు అయిపోయింది. కొడుకులిద్దరూ ఆసుపత్రికి వచ్చి చూసి వెళుతున్నారు కోడళ్ళు మాత్రం ఆమెను చూడటానికి ఒక్కసారి వచ్చారు. అతను తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ వల్ల డబ్బులు కట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ఆదిలక్ష్మిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పి పంపించారు వైద్యులు. వాటిల్లో ముఖ్యమైనవి ..ఆమెకు తగినంత విశ్రాంతి, పౌష్టికాహారం ఇవ్వాలి అనేది..తరువాత ఆమెకు మానసికంగా ఏ రకమైనటువంటి ఆందోళన కలిగించే విషయాలు చెప్పవద్దని మరీ మరీ చెప్పారు. వాళ్లు ఇంటికి వచ్చేసరికి దాదాపుగా రాత్రి ఎనిమిది గంటలు అయింది. ఇంట్లో పరిస్థితి మళ్లీ మామూలుగానే ఉంది. భోజనం తయారు చేసి లేదు, వేడి నీళ్లు లేవు అంతా అల్లకల్లోలంగా ఉంది. కోడళ్ళు ఏదో మొక్కుబడిగా వచ్చి అత్తగారిని చూసి మళ్ళీ వాళ్ళ గదిల్లోకి వెళ్లిపోయారు. కొడుకులు కూడా అట్లాగే ఉన్నారు అమ్మ పక్కన కూర్చోవాలి అన్న ఇంగిత జ్ఞానం వాళ్లకు ఉన్నట్లు అనిపించలేదు విష్ణుమూర్తికి. విష్ణుమూర్తికి కోపం వస్తోంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి. విష్ణుమూర్తి ఆసుపత్రిలో ఉండగానే ఆదిలక్ష్మి పనుల్లో సహాయంగా ఉండటానికి ఒకామెను పనిలో కుదుర్చుకున్నాడు . జీతం కోసం పని చేసే ఆమే అయినా అతనికి అన్ని పనుల్లో చేదోడువాదోడుగా ఉంది.దీనివల్ల అతనికి చాలా విషయాల్లో వెసలుబాటుగా ఉంది. చూస్తూ చూస్తూ ఓ పదిహేను రోజులు గడిచిపోయాయి. ఆదిలక్ష్మి ఆరోగ్యం ఓ మోస్తరుగా కుదుటపడింది. ఈ పదిహేను రోజులుగా ఆమెను తన కంటికిపాప లాగా చూసుకున్నాడు విష్ణుమూర్తి. మధ్య మధ్యలో ఆమె కోడళ్ళ గురించి కొడుకుల గురించి అడిగినప్పుడు అతను వాళ్ళని పిలిచి ఆమెతో మాట్లాడించేవాడు. వాళ్లు అంటీముట్టనట్టు మాట్లాడినా అతను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆదిలక్ష్మి ఆసుపత్రిలో చేర్చినప్పటి నుండి అతని మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. కాలం మరో పదిహేను రోజులు గడిచిపోయింది. ఆదిలక్ష్మికి పూర్తిగా స్వస్థత చేకూరింది. పనావిడ ఉన్నాకానీ మెల్లమెల్లగా ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది. విష్ణుమూర్తి కూడా ఆఫీసు కి వెళ్ళటం మొదలుపెట్టాడు. కొడుకులు,కోడళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోసాగారు.

ఓ రోజు ఆఫీసు నుంచి వచ్చిన తరువాత విష్ణుమూర్తి కాఫీ తాగుతూ ఆదిలక్ష్మితో తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆదిలక్ష్మి అతను చెప్పిన విషయంతో ఏకీభవించింది. “నువ్వు తొందరగా ఈ విషయాన్ని ఒప్పుకుంటావని నేను అనుకోలేదు లక్ష్మీ”,అన్నాడు విష్ణుమూర్తి. “మీరు ఏ విషయంలోనైనా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోరు. మీరు చెప్పిన విషయం గురించి మీరు ఏంతలా మధన పడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను” అంది ఆదిలక్ష్మి. ఆ తరువాత రోజు ఆదివారమే కావడంతో కుటుంబ సభ్యులందరితో సమావేశం పెట్టాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చెప్పిన కబురు విని కొడుకులు కోడళ్ళు తెల్లబోయి అతని వంక చూశారు. “అదేంటి నాన్నా ఉన్నట్టుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు” అన్నాడు వల్లభ్. “నా మాట కూడా అదే నాన్నా”అన్నాడు వికాస్. “నాకు ఆఫీసుకు వెళ్లి రావడం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని నాకు ఆఫీసుకు దగ్గరలో ఉండే మన ఇంటికి నేను మారిపోతున్నాను. మీరు కూడా మీ ఆఫీసుకు దగ్గరలో ఉండే ఇళ్లల్లోకి మారిపోయినా నాకు ఏమీ అభ్యంతరం లేదు”అన్నాడు విష్ణుమూర్తి. “నేను ఇక్కడే ఉంటాను నాన్నా”అన్నాడు వల్లభ్. “సరే అయితే ..వికాస్ నువ్వు మీ మామగారు కానుకగా ఇచ్చిన అపార్ట్మెంట్ లోకి మారు. అక్కడ అయితే నువ్వు ఆఫీసుకు వెళ్లి రావటానికి సౌకర్యవంతంగా ఉంటుంది” అన్నాడు విష్ణుమూర్తి. “మరి ఇక్కడ ఇప్పుడు మనం ఉండే ఇల్లు ఏం చేస్తారు నాన్నా” అడిగాడు వల్లభ్. “ఏముంది అద్దెకిచ్చేద్దాం లేరా” అంది ఆదిలక్ష్మి. కోడళ్ళు ఇంకా ఆ షాక్ లో నుంచి తీరుకోలేదు. “మేము ఆ ఇంట్లోకి మారిన తరువాత మీరు మీ సౌకర్యం ప్రకారం మమ్మల్ని చూసి వెళ్ళవచ్చు. మాతోపాటు ఇప్పుడు మన ఇంట్లో పని చేస్తున్న ఆయా మాతోనే ఉంటుంది”, అన్నాడు విష్ణుమూర్తి. “ఇప్పుడు ఇలా మనమందరం విడివిడిగా ఉండటం ఎందుకు మామయ్య గారు” అని అడిగింది చిన్న కోడలు వింధ్య . “మనం అందరం విడివిడిగా ఉండటం ఎవరు ఎవరికీ బరువు కాకూడదనే. అయినా దూరంగా ఉంటేనే బంధాలు బాంధవ్యాలు గట్టిగా ఉంటాయని అనిపిస్తుందమ్మా నాకు.” అన్నాడు విష్ణుమూర్తి. “మీరు మాకు బరువు కావడం ఏమిటి మావయ్య గారూ” అంది ఆమె. “లేదమ్మా, ఇప్పుడు ఈ పెద్ద వయసులో మేము ఎవరికీ భారం కాదల్చుకోలేదు. సేవ చేయించుకునే వయసులో ఉన్న మేము ఇంకా ఎవరికి సేవలు చేయలేము అనేది అర్థమైంది. మీరు మా కోసం సమయం వెచ్చించటానికి సాధ్యపడని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి నేను ఎవరిని తప్పు పట్టలేను.”అన్నాడు విష్ణుమూర్తి. కొడుకులు,కోడళ్ళు సంభ్రమంగా ఆ దంపతుల వంక చూస్తూనే ఉన్నారు ఇంకా!!! వాళ్లకు ఏమీ అర్థం అయిందో ఆ పరమాత్మకే ఎరుక!!!

మరిన్ని కథలు

Manchi snehiitulu
మంచి స్నేహితులు
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Kaanuka
కానుక
- డా:సి.హెచ్.ప్రతాప్
Manavatwama nuvuu ekkada
మానవత్వమా నువ్వు ఎక్కడ?
- హేమావతి బొబ్బు
Antarmathanam
అంతర్మథనం
- డా:సి.హెచ్.ప్రతాప్
Sirimalli seetaalu
సిరిమల్లి సీతాలు (కథ)
- బూర్గుల రవి, టీచర్
Needalo nilichina garwam
నీడలో నిలిచిన గర్వం
- రాము కోలా.దెందుకూరు
Aruna nirnayam
అరుణ నిర్ణయం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Puttinti matti
పుట్టింటి మట్టి
- హేమావతి బొబ్బు