“నేను మాత్రం ఇలా జరుగుతుందని అనుకున్నానా?” ముఖమంతా చిట్లించి.. కాస్త ఆవేశంగానే అన్నాడు విద్యాసాగర్.
“ఎందుకు ఊహిచలేక పోయావు?” తల ఎగరేస్తూ.. భర్త ఆవేశానికి తగ్గట్టుగా ఎదురు ప్రశ్నించింది సుశీల.
“విద్యాసాగర్ పేరుకు తగ్గట్టుగా సరస్వతీదేవి కటాక్షించి విద్యనార్జించావు. సరస్వతీదేవి నిలయంలో.. లక్ష్మీదేవి నివసించదని లోకోక్తి. అది మనపట్ల వాస్తవమని తేలింది. ఇద్దరమూ ఉద్యోగం చేస్తూ.. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. కాని ఏం మిగులుతున్నాయి? అప్పులు.!. అప్పులు..!! అప్పులు!!!” అంటూ సుతారముగా నొసలు కొట్టుకుంది. తన కడుపులోని ఆవేశం కాస్త సడలినట్టుకాగానే.. దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది.
“ఈ తెలివి మన పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నప్పుడు లేకపోయిందా?” అంతా నీ తప్పే అన్నట్టుగా రెట్టించాడు విద్యాసాగర్.
“నిజమే! ఇలాంటి అతి తెలివి అప్పుడు నాకు లేకుండా పోయింది” వెంటనే దెప్పి పొడిచింది సుశీల. “నామీద ప్రేమతో ఖర్చు చేస్తున్నావని అనుకున్నాను కాని అది దుబార ఖర్చు అని సంసారంలో పడ్డాక కాని తెలిసి రావడం లేదు” అంటుంటే సుశీల గొంతు పొరమారింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కడకొంగుతో కన్నీళ్లు ఒత్తుకో సాగింది.
విద్యాసాగర్ హృదయం ద్రవించింది. సందర్భం మార్చాలని.. “చూడు సుశీలా..! మొన్న నీకు ఒక ఫోన్ వస్తే నా సలహా అడిగావు. అది ఒక మోసగాని నుండి వచ్చిన అత్యంత ప్రమాదకరమైన ఫోన్. నీ ఆధార్ కార్డు బెంగళూరులో ఒకరికి దొరికిందని.. దాన్ని అతను దుర్వినియోగం చేస్తాడని బెదిరించాడు. అది మన దగ్గరి నుండి డబ్బులు లాగాలనే ప్రయత్నమని పసిగట్టి.. వానికి గట్టిగా బుద్ది చెప్పాం. అవునా..!” అంటూ నెమ్మదిగా అన్నాడు విద్యాసాగర్. అవునన్నట్టుగా సుశీల తలూపడంతో.. కాస్త ధైర్యం కూడగట్టుకున్నాడు విద్యాసాగర్.
“చూడు సుశీలా.. నాకు గూడా మా సాహితీసభ్యుల సమూహంలో ‘నేను మొదట నకిలీ అనుకున్నాను. కాని నిజంగా ఐదు వేల రూపాయలు వచ్చాయి. మీరూ ప్రయత్నించండి. మరో ఐదుగురికి పంపండి’ అంటూ మెసేజ్ తోబాటు లింక్ వచ్చింది. అది వేరే సమూహంలో వస్తే నమ్మకపోయే వాణ్ణి. సాహితీ మూర్తులపై గల నమ్మకంతో లింక్ ఓపెన్ చేసాను. బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయగానే ఐదు వేలు జమ అయినట్టు బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చింది.. ఆశ్చర్యపోయాను. ఎవరో పాపం!.. దయార్ద్రహృదయులు.. చేయి చాపక ముందే దానం చేస్తున్నారని సంబరపడ్డాను. ఇంతలో మరో ఏబది వేలు పంపుతాము. ఓటిపి చెప్పండి అని మేసేజ్ వచ్చింది. సంతోషంలో మైమరచి పోయి ఓటిపి పంపాను. అకౌంట్ లోని డబ్బంతా ఊడ్చుకు పోయింది” అంటూ తల బాదుకోసాగాడు విద్యాసాగర్.
“చూసారా? అదే అత్యాశ అంటే.. ఎవరో ఊరికే ఎందుకు డబ్బులు పంపిస్తారు? డబ్బులు ఇందులో పొదుపు చేయండి.. అధిక వడ్డీ లభిస్తుందనో! లేక ఆనతి కాలంలోనే రెట్టింపు అవుతుందనో! మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. మీరు పేరాసకు పోయి చేతులు కాల్చుకోవడం.. మనకు అప్పులు మిగలడం పరిపాటయ్యింది” అంటూ బిగ్గరగా రోదించసాగింది సుశీల.
విద్యాసాగర్ కోపం కట్టలు తెంచుకుంది. సుశీలను లాగి చెంప ఛెళ్ళుమనిపించాలనుకున్నాడు. కాని వాస్తవానికి అంతా తన తప్పే అని మనసు ఘోషిస్తుంటే కాస్త.. తమాయించుకున్నాడు. మనిషి ఎప్పుడూ తన నేరాన్ని ఒప్పుకోడు సరి కదా..! అది వేరే వారి నెత్తిన రుద్దడానికి యత్నిస్తుంటాడు. ఇంకా తనను తాను సమర్థించుకోడానికి ప్రయత్నిస్తుంటాడు కూడా. అదే ధోరణిలో..
“చూడు సుశీలా.. నేను మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన సంపాదను పదింతలు చేయాలనుకున్నాను. రైతు ఒక మొక్క గింజ భూమిలో నాటితే అది కంకి రూపంలో వంద గింజలనందిస్తుంది. అలాగే మన సంపాదన బ్యాంకులో మూలిగితే ఏమొస్తుందని.. దాన్ని పెట్టుబడిగా పెట్టి వందరెట్లు చేయాలనుకున్నాను. ఇప్పుడంటే మనం ఇద్దరం. మున్ముందు మనకు పిల్లలు.. వారిని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళాలంటే డబ్బే కదా! ప్రధానం. సంసార రథానికి మనమిరువురం చక్రాలం. సామరస్యంగా సహకరించుకుంటేనే.. సజావుగా బండి సాగుతుంది. దానికి ప్రణాళికలు రచిస్తున్నాను” అంటూ ప్రాధేయపూర్వకంగా సుశీలవంక చూడసాగాడు విద్యాసాగర్. లోలోన అతని మనసు మోసాన్ని మోసంతోనే జయించాలని ఉరుకులాడుతోంది.
***
తన పథకం ఫలిస్తూ పోతుంటే విద్యాసాగర్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
“ఇప్పటికి తొంబదితొమ్మిది బక్రాలు మన వలలో చిక్కారు సుశీలా.. తొంబదితొమ్మిది లక్షలు సమర్పించుకున్నారు. మరొక్కరు చిక్కితే.. కోటీశ్వరులమై పోతాము. ఇక ఈ దుకాణానికి స్వస్తి పలికి అప్పులన్నీ తీర్చేసి.. దర్జాగా బతుకోచ్చు. ఇక ఎలాంటి లింక్ ల మీద క్లిక్ చేయకుండా జాగ్రత్త పడతాను. ఎందులోనూ పెట్టుబడులు పెట్టను. నీ సహకారానికి జన్మాంతం ఋణపడి ఉంటాను” లోలోన ముసి. ముసి నవ్వులు నవ్వుతూ అన్నాడు విద్యాసాగర్.
“సరేలే.. సంబడం” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది సుశీల. “మనలో మనకు ఈ ఋణాల బాణాలు ఎందుకు గాని.. నేనెంతగా మనసు చంపుకొని.. నలిగి పోతున్నానో!. ఇలాంటి నరకయాతన అంటే బహుశః నరకం గూడా మొహం తిప్పుకుంటుందేమో!.. సిగ్గుతో చచ్చి బతుకుతున్నాను సాగర్. నువ్వన్నట్టు ఇదే చివరి గాలం. ఇక నా వల్ల కాదు. వచ్చే జన్మలో ఏ రాకాసిగానో పుడతాను కావచ్చు” అంటూ నేల చూపులు చూడసాగింది సుశీల. అలాంటి చూపులు విద్యాసాగర్ కు మహా ఇష్టం.
దగ్గరికి వెళ్లి లాలనగా సుశీలను తన హృదయానికి హత్తుకున్నాడు. సుశీల కళ్ళు వర్షించాయి. రెండు వేడి కన్నీటి చుక్కలు విద్యాసాగర్ భుజాన్ని తమను విముక్తి చేయుమన్నట్టుగా తడిమాయి.
“సుశీలా.. ఇందులో నీ తప్పేమీ లేదు.. తప్పంతా నాది. నువ్వన్నట్టు అత్యాశకు పోయి అప్పులతో ముప్పు పెంచాను. ఇక ఆ ఊబిలో నుండి బయట పడదాం. ఉన్న ఫలంగా అప్పులన్నీ తీర్చొద్దు. అందరికే అనుమానం వస్తుంది. అంచెలంచెలుగా అప్పులన్నీ తీరుద్దాం. చివరగా మన పథకంలో చిన్న మార్పు చేసాను” అనగానే విద్యాసాగర్ బాహు బంధాల నుండి సుతారముగా బయటకు వచ్చి..
“ఏంటది?” అని ప్రశ్నించింది.
ఇప్పటికే అతని కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ తో ప్రాణాలు కొట్టుమిట్టాడుతన్నాయి. మరో కొత్త పథకం అనగానే .. భయంతో సుశీల ఒళ్ళు కంపించింది. అది గమనించిన విద్యాసాగర్ చిరునవ్వుతో.. సుశీల బుగ్గ మీద చిటుకేస్తూ..
“కొత్త పథకం అంటే భయపడాల్సిందేమీ లేదు సుశీలా.. మామూలే!. అయితే ఈసారి తతంగమంతా ఒక హోటల్ గదిలో..” అదెలా సాధ్యం అన్నట్టు ముఖం పెట్టింది సుశీల. ఆమె ముఖ కవళికలు అర్థం చేసుకుని..
“ఇప్పటి వరకూ.. ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా మన ఇంట్లోనే రహస్యంగా తతంగమంతా నడిపించాము. కాని ఈసారి శతబక్రోత్సవం కదా.. దానికి తగ్గట్టుగా పథకం మార్చాను. నా బాల్య స్నేహితునికి ఒక అధునాతన లాడ్జి ఉంది. అందులో రెండు గదులు బుక్ చేసాను. ఒక గదిలో నేనుంటాను. దాని పక్క గదిలోనే నువ్వు రాసక్రీడ రిహార్సల్ నడిపిస్తావు. నేను రికార్డు చేయడం మామూలే..” అంటూ వివరించాడు విద్యాసాగర్.
“ఆతను నమ్మకస్తుడేనా?” శతబక్రోత్సవం విఫలం కావద్దనే.. అనుమానంతో అడిగింది సుశీల..
“అతనికి అనుమానమా!.. రాకుండా నేనన్నీ చూసుకుంటాను కదా! పక్కా ప్రణాళిక.. మన శతబక్రదినోత్సవం దిగ్విజయం కావడం ఖాయం” అంటూ పెదవులపై చిరునవ్వుల పూలు పూయించాడు.
“చూడు సుశీలా.. ఇతను కాస్త పెద్దాయన.. పేరు కోటేశ్వర్. మంచి డబ్బు కలవాడు. భార్య కొద్ది కాలం క్రితమే కాలంచేసింది. పిల్లలంతా అమెరికాలో సెటిలయ్యారు. ప్రస్తుతం ఒంటరి జీవనం కొనసాగిస్తున్నాడు. అతణ్ణి వలలో వేసి హోటల్ కు రప్పించడం నీ వంతు. నీకు తెలుసు కదా! మిగతా కార్యక్రమం నా వంతు” అంటూ తన మొబైల్ ఫోన్లోని కోటేశ్వర్ ఫోటో, ఫోన్ నంబర్ సుశీల ఫోన్లోకి బదిలీ చేసాడు.
మొబైల్ లో అతని ఫోటో చూస్తూ.. అతణ్ణి ముగ్గు లోనికి లాగడానికి ఎంత సమయం పడుతుందో! అని మనసులో లెక్కలేసుకుంటూ..
“ఒకవేళ కోటేశ్వర్ తన ఇంటికే రమ్మంటే..” అనుమానం వ్యక్తపరచింది సుశీల.
“అలా రమ్మనే అవకాశం లేదు సుశీలా. అతనిది లంకంత కొంప. కొంపంతా కిరాయకిచ్చి తానొక చిన్న గదిలో ఉంటున్నాడు. ఇంటి నిండా వచ్చీ, పోయే వాళ్ళతోనే సరి పోతుంది. అయినా నీకెందుకా అనుమానం. నేను అన్నీ స్టడీ చేసే ఈ పథకం పన్నాను. అతణ్ణి హోటల్ గదిలోకి రప్పించుకునే విద్య నీకు తెలియంది కాదు” అంటూ చిన్నగా నవ్వాడు విద్యాసాగర్. అలాగే అన్నట్టు చిరునవ్వుతోనే సమాధానమిస్తూ.. కార్యరంగంలోకి కాలు మోపింది సుశీల. ఆమె పనికి అంతరాయం కలుగరాదని.. విద్యాసాగర్ పక్క గదిలోకి వెళ్లి పోయాడు.
దాదాపు అరగంట మొబైల్ లో సయ్యాటలాడి బయటకు వచ్చి విద్యాసాగర్ ను పిలిచింది. విజయం సాధించినట్టు చేతి పెద్ద వేలుతో థమ్సప్ గుర్తు చూపించింది. విద్యాసాగర్ చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులు వేయసాగాడు. ఆ గంతులే తనను అతని అర్థాంగిగా మార్చిందని జ్ఞప్తికి వచ్చి.. తనూ అతని గంతుల్లో గంతులు కలిపింది సుశీల.
కాసేపటికి అలసి పోయి ఇద్దరూ సోఫాలో వాలి పోయారు. విద్యాసాగర్ తన చేతి గడియారంలో సమయం చూస్తుంటే గమనించిన సుశీల చటాలున లేచి నిలబడింది.
“నేను రడీ అవుతాను. పెద్దాయన ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్టు.. ఆత్రంగా తొందరగానే రావచ్చు. ఎందుకైనా మంచిది మనమూ లాడ్జికి కాస్త ముందు వెళ్ళడమే నయం. మీరూ రడీ అవ్వండి” అంటూ తన బాత్ రూం వైపు దారి తీసింది సుశీల. విద్యాసాగర్ ఆనందాన్ని పట్టపగ్గాలు లేవు. ఈల వేసుకుంటూ బట్టలు మార్చుకోడానికి మరో గదిలోకి వెళ్ళాడు.
పథకం ప్రకారం అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే సుశీలతోబాటు లాడ్జీలో అడుగు పెట్టాడు విద్యాసాగర్. వెంటనే తన పనిలో మునిగి పోయాడు. సుశీల గదిలో ఆమె పడక మీద కదలికలను తన పక్క గది నుండి రహస్యంగా చిత్రీకరించి సరి చూసుకున్నాడు. అంతా ఓకే.. అన్నట్టు సుశీలకు రహస్య కిటికీ గుండా సంజ్ఞ చేసాడు.
కోటేశ్వర్ వచ్చి సుశీల గది తలుపు తట్టాడు. సుశీల తలుపు తీసి, చిరునవ్వుతో ఆహ్వానించింది. విద్యాసాగర్ తన మొబైల్ కు పని అప్పగించి అందులోనే లీనమయ్యాడు. పక్క గదిలో సుశీల తన నైపుణ్యానంతా ప్రదర్శిస్తోంది. తన ధర్మపత్ని కాలం చేసిననాటి నుండి కామకేళి ఉపవాసాలుంటున్న కోటేశ్వర్ అధర్మ ఆతురతకు హద్దు లేకుండా పోతోంది.
మరో పదినిముషాలలో.. ఇప్పుడే వస్తానన్నట్టు చేత్తో సైగ జేసి వెనుక గది నుండి విద్యాసాగర్ వద్దకు వచ్చింది. విద్యాసాగర్ మొబైల్ చేతికందించాడు. అది తీసుకుని సుడి గాలిలా తిరిగి వచ్చి ఫోన్ ఆన్ చేసి కోటేశ్వర్ కు దృశ్యాలు చూపించింది.
“ఇవి మీ పిల్లలకు పంపుతాను. మీరు ఎలాంటి వారో ! వారికి తెలుస్తుంది. లేదంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వండి” అంటూ బెదిరించింది.
అలాగే అన్నట్టు తలూపాడు. పక్క గదిలో విద్యాసాగర్ తబ్బిబ్బవుతున్నా డు.
ఇంతలో టక, టక మంటూ లాఠీతో తలుపు మీద బాదిన శబ్ధానికి కోటేశ్వర్ మోము వికసించింది. వచ్చిన వాళ్ళు పోలీసులే అన్నట్టు సుశీల గజ, గజా వణక సాగింది. కోటేశ్వర్ బట్టలు సర్దుకుంటూ..
“నీ నాటకం నేను ముందే పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చాను” అంటూ వేగంగా వెళ్లి తలుపు తీసాడు.
బిల, బిలమంటూ ఇద్దరు పోలీసులు వచ్చే సరికి.. కెవ్వున కేక పెట్టాడు విద్యాసాగర్.
***
“ఏమయ్యిందండీ.. అంత గట్టిగా కేక పెట్టారు” అంటూ సుశీల వీపు తట్టేసరికి కళ్ళు తెరచి ‘ఇదంతా కలనా!’ అన్నట్టు పిచ్చి చూపులు చూడసాగాడు విద్యాసాగర్.
“నేనంత భయపడ్డానో! ఎందుకంతగా కేక పెట్టారు? ఏదైనా పీడకల వచ్చిందా.. తెల్లవారు ఝామున వచ్చిన కలలు నిజమవుతాయని అంటారు” అంటూ గ్లాసుతో మంచినీళ్ళు అందించింది.
కాసిన్ని మంచినీళ్ళు తాగి.. “నన్ను క్షమించు సుశీలా.. నా వల్ల మనకు అప్పులు.. అపఖ్యాతి” అంటూ తనకు వచ్చిన కలను వివరించాడు.
“అలాంటి కల ఎందుకు వచ్చింది? మీరేదో మదిలో ఆలాపన పెట్టుకున్నారు” నిజమేనా అన్నట్టు అడిగింది సుశీల.
అవునన్నట్టు తలాడిస్తూ.. “ నిన్న దినపత్రికలో ఒక వార్త చదివాను. మనలాగే అప్పుల పాలైన దంపతులు ఒక నీచమైన మార్గం ఎన్నుకున్నారట. భార్య అమాయకులపై వలపన్ని వారితో నిస్సిగ్గుగా మసలుతుంటే భర్త వీడియోలో బంధించే వాడట. వాటిని ఆయా వ్యక్తులకు పంపి భయపెట్టి డబ్బులు దండుకునే వారట. అలా దాదాపు వంద మందిని బలి చేసారట చివరికి పోలీసులకు చిక్కారు. ఆ వార్త నామదిని కలుషితం చేసింది. అదే కలలో వచ్చిందని బావురుమన్నాడు విద్యాసాగర్.
“చూడు సాగర్.. అత్యాశ అనర్థానికి మూలం. అవినీతిగా డబ్బు సంపాదనకంటే అసువులుబాయడం ఉత్తమం. కాని నేను ఇప్పుడు ఉత్త మనిషిని కాను. నా కడుపులో మన బిడ్డ..” అంటూ దీనంగా చూసింది.
అమితానందంలో గంతులు వేస్తూ.. సుశీల కడుపు మీద అరచేయి పెట్టి..“సుశీలా.. పుట్టబోయే మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను ఇక ముందు అత్యాశకు పోను. ఈ డిజిటాల్ అరెస్టులని వచ్చే ఫోన్లకు భయపడను. సంస్థల్లో పెట్టుబడులు అంటూ వచ్చే ప్రకటనలకు లొంగిపోను. నన్ను క్షమించు సుశీలా..” అంటూచేతులు చాచి దీనంగా వేడుకోసాగాడు విద్యాసాగర్.
“మీరూ నన్ను క్షమించాలి” అంటున్న సుశీల చిరునవ్వుమోమును చూసి నిర్ఘాంత పోయాడు విద్యాసాగర్.
“నేను మొదటి నుండీ గమనిస్తూ వస్తున్నాను. మీలో పొదుపరితనం లేదు.. పరివర్తన రావాలని ఎదురి చూస్తున్నాను. ఇప్పుడు మీ మీద నమ్మకం కుదిరింది. ఇక నిజం చెబుతాను. నేను మీకు తెలియకుండా కొంత డబ్బు నమ్మకమైన రిజిస్టర్డ్ సంస్థల్లో చిట్టీలు కట్టాను. ఈ అలవాటు మా అమ్మ నుండి నేర్చుకున్నాను. మా అమ్మ నాన్నకు తెలియకుండా ఆదాయపరంగా కుటుంబాన్ని ఆదుకుంటూ వచ్చేది.
ఇప్పుడు ఆ చిట్టీలు పాడాను. ఇరువది లక్షల వరకు వస్తాయి. మన అప్పులన్నీ తీరుతాయి. ఇకముందు మన జాగ్రత్తలో మనం ఉంటే సరి” అంటూ విద్యాసాగర్ చాచిన చేతుల్లో ఒదిగి పోయింది సుశీల. *

