సుశాస్త్రీయం - శ్రీమతి కన్నాంబ - టీవీయస్.శాస్త్రి

pasupuleti kannamba

శ్రీమతి కన్నాంబ గారి పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకొచ్చేది, లవకుశలోని ఆమె పోషించిన కౌసల్య పాత్ర. తరువాత గుర్తుకొచ్చేది మనోహర లోని పాత్ర. ఆ రోజుల్లో ఆమెకు ధీటైన నటీనటులు, శ్రీ యస్వీ రంగారావు గారు,శివాజీ గారు మరియు సావిత్రి గారు. గంభీరమైన స్వరం, చక్కటి రూపం వీటికి తోడు మాటలు పలకడం లో ఆమె చాతుర్యం, హావభావాలు.. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా అనిపించేది -- కళ దైవదత్తమైనదని! ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని, చలన చిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరముల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది తన నాటకరంగానుభవంతో 1935 లో హరిశ్చంద్ర తెలుగు చలనచిత్రంలో చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తరువాత ద్రౌపదీ  వస్త్రాపహరణం లో  ద్రౌపది గా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద మరియు చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్ధవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ.

కన్నాంబ భర్త కడారు నాగభూషణం. ఇద్దరు కలసి 'రాజరాజేశ్వరి' చిత్ర నిర్మాణ సంస్థ ని స్థాపించి అనేక చిత్రాలు తెలుగు లోను , తమిళ, కన్నడ భాషలలోనూ నిర్మించారు. ద్రౌపదీ  వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, చంద్రిక, కనకతార, పల్నాటియుద్ధం, గృహలక్ష్మి, అనార్కలి, దక్షయజ్ఞం, తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, లవకుశ తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి. ఎం. జి. రామచంద్రన్, ఎన్.ఎస్. రాజేంద్రన్ శివాజీ గణేషన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రాల్లో ఆమె నటించింది. కన్నాంబ గారి పేరు వింటేనే గౌరవభావం కలుగుతుంది. అంత ప్రజ్ఞావంతురాలైన నటి మరొకరు కనబడరు. కేవలం ఒక కనుబొమ్మతో ఆవిడ ప్రేమ, కరుణ, రౌద్రం... ఒకటేమిటి, నవరసాలు పలికించగలరు. నాకు ఆవిడ నటించిన తోడికోడళ్ళు అంటే చాల ఇష్టం. ఆవిడ తప్పితే ఆ భూమికను ఎవ్వరు చేయలేరేమో అనిపిస్తుంది.

ఆవిడ మంచి మనసు గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఆవిడ ఔదార్యంలో నాగయ్య గారి లాంటి వారు. శ్రీ రాజరాజేశ్వరి ప్రొడక్షన్స్ (కన్నాంబ గారి సంస్థ) ఒక దాన ధర్మ నిలయంగా విలసిల్లింది అని ఇప్పటికీ చెప్పుకుంటారట! ఇటువంటి గొప్ప నటులు, నటీమణులు కటిక పేదరికంలో చనిపోయారు అని తలచుకొంటేనే బాధగా వుంటుంది. చనిపోయిన యాభై ఏళ్ల తరువాత కూడా ఆ మహా నటులను , నటీమణులను మనం నేటికి తలచుకోవడమే వారి ప్రతిభకు గొప్ప నిదర్శనం. ఒక కళాకారిణికి అంతకన్నా కావలసిన యశస్సు ఏముంటుంది? ఆవిడ విశాల హృదయాన్ని గురించి ఒక మాట తప్పక చెప్పి తీరాలి. కన్నాంబ గారి పెంపుడు కూతురు రాజరాజేశ్వరినే దర్శకుడు సి.యస్. రావు గారికిచ్చి పెళ్లి చేసినా, వాళ్ళు విడిపోయారు. తరువాత రాజసులోచన గారు,  సి.యస్. రావు గారు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసి కన్నాంబ గారే దగ్గరుండి వివాహం చేయించారు. ఈ విషయం రాజసులోచన గారే స్వయంగా అన్నారని ఒక పత్రికలో చదివాను.

ఇక డీ.వీ. నరసరాజు గారు ఆయన పుస్తకంలో కన్నాంబ గారి గురించి, ఆవిడకు దక్కిన గౌరవం గురించి చెబుతూ -- ఒక సినిమాలో నటించే సమయంలో ఆవిడ మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లి చాలా ఆలస్యంగా వస్తున్నారని, ఆవిడని తొందరగా రమ్మనే సాహసం చేయలేక, ఆ చిత్ర దర్శకులు ఒక కారు ఇచ్చి, "నరసరాజు గారూ, కన్నాంబ గారిని డ్రాప్ చేసి ఈ కారు పట్టుకెళ్ళి మీరు భోంచేసి, మరల తిరిగి వచ్చేటప్పుడు  ఆవిడని తీసుకురండి టైంకి . " అని పంపారట. మొదట కన్నాంబ గారిని డ్రాప్ చేసిన కారు నరసరాజు గారిని డ్రాప్ చేయగానే, ఆయన గబగబా భోజనం ముగించి, బయటకు వచ్చి చూస్తే కారు కనబడలేదట. ఏమయింది చెప్మా అనుకుంటుంటే మాములుగానే కారు ఆలస్యంగా వచిందట. అందులో కన్నాంబ గారు ఉన్నారట (ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ.. ) "నరసరాజు గారు, మిమ్మల్ని డ్రాప్ చేసాక మా ఇంటికి రమ్మని చెప్పాలెండి డ్రైవర్ ని" అన్నారట ఆవిడ. అంతటి పసిపిల్లలాంటి నిష్కల్మషమైన ఆవిడ మన హృదయాలలో ఎప్పటికీ వుంటారు. కన్నాంబ పాడిన "కృష్ణం - భజరాధా" గ్రాంఫోన్ గీతాలు, ఆ రోజుల్లో ప్రతి ఇంట మారు మ్రోగుతూ ఉండేవి. ఆమె గొప్ప నటీమణి మాత్రమే కాదు. చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో  తనదైన ప్రత్యేక బాణీని ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964 లో మే 7 న తుదిశ్వాస వదిలింది. 
 

రావికొండలరావు రచన నుండి
1) 'నేనే రాణినైతే ఏలనే ఈ ధర ఏకధాటిగా ... ' అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకొని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవీగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పసుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు 'చండిక' (1941),  ఠీవి గురించి ఆ రోజుల్లొ ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకొనే వారు. అందులో కన్నాంబ గారు ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట - "ఏమే ఓ కోకిలా- ఏమో పాడెదవు. ఎవరే నేర్పినది ఈ ఆట  ఈ పాట..." ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు.  మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు
 

2) కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకొని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళ భాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారమే. 'సుమతి(1942) ', పాదుకా పట్టాభిషేకం (1954), సౌదామిని (1951), పేదరైతు (1952), లక్ష్మి (1953) సతీ సక్కుబాయి (1954), శ్రీకృష్ణతులాభారం (1955) , నాగపంచమి (1956) మొదలైన చిత్రాలు ఆ కంపనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపనీ కి గొప్ప పేరు వుండేది. ప్రతినెలా ఒకటో తేది రాకముందే ముందు నెల చివరి రోజునే స్టాఫ్ కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపనీ. వారి ఆఫీసు కూడా చాల విశాలమైన కాంపౌండ్ లో, కార్లు, వ్యాన్లతో  కళకలలాడుతూ వుండేది. ఇప్పుడు 'టైటానిక్ చీరలు' అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తునట్టు- అప్పుడు "కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు " అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకొనే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారని చెప్పుకునేవారు .
 

3) ఐశ్వర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని, కన్నాంబ మరణంతో కంపనితో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం గారు ఒక చిన్న గదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి 'గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేసాను' అని చెప్పారు. ఆ చిన్న గదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం వున్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకా ఏమి కనిపించలేదు. ఆయన కిందనే చాప మీద కూర్చొని, దిన పత్రిక చదువుకుంటున్నారు అన్నాడు ఆ మిత్రుడు.
 

4)  కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే  దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేసారట.