అదృష్టం కలిసొస్తె... - కందర్ప మూర్తి

Adrustam kalisoste
ఈ సంఘటన మన భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు
జరిగింది. అప్పట్లో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి పట్నంలో యువత,
పెద్దలు బ్రిటిష్ సైనికులతో పోరాడుతు నిరాహార దీక్షలు, రాస్తా రోకో,
బందులు జరుపుతు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు జరుగుతున్నాయి.
పోలీసులు దొరికిన వారిని పట్టుకుని జైళ్లలో వేస్తున్నారు.
పేరాపురంలో ఉండే 30 ఏళ్ల కోటయ్య ఊళ్ళో బ్రతుకుతెరువు దొరక్క
పట్నంలో ఏదైనా కూలిపని చూసుకుందామని పోగేసుకున్న చిల్లర
డబ్బులు, ఉడికించిన తియ్య దుంపలు, కాల్చిన తేగలు మూట కట్టి
కాలి నడకన రైలు స్టేషనుకి చేరేడు.
అప్పుడు రైలు స్టేషను దగ్గర కొంతమంది యువకులు రైల్ రోకో
చేస్తున్నారు. ఇంతలో బ్రిటిష్ సైనికులు బస్సుల్లో వచ్చి నిరసన
చేస్తున్న యువకులను లాఠీలతో కొట్టి చెల్లాచెదురు చేస్తున్నారు.
మరికొందర్ని పట్టుకుని లారీలలో పడవేసి తలుపులు మూస్తున్నారు.
అలా కొందరు యువకులు పరుగులు పెడుతు కోటయ్య ఉన్న వైపు
వచ్చేరు.
లాఠీలతో వెంట పడిన పోలీసులు దొరికిన వారిని బస్సుల్లో
ఎక్కిస్తున్నారు. వారితో పాటు అక్కడ ఏమి జరుగుతోందొ తెలియని
కోటయ్యను కూడా పోలీసు బస్సులో తోసేసి జైల్లో వేసేరు.
పట్నానికి పోయి ఏదైనా బ్రతుకుతెరువు చూసుకుందామనుకుంటె
ఇలా జైల్లో పడ్డానేమిటని కోటయ్య దుఖిస్తున్నాడు.
రోజూ జైల్లో బ్రిటిష్ పోలీసులు ఖైదీల చేత రోడ్లు తుడిపిస్తు, మురికి
కాలువలు శుభ్రం చేయించడం సరైన తిండి లేకుండా చేస్తున్నారు.అక్కడి
నుంచి ఎప్పుడు బయట పడతానోనని ఎదురు చూస్తున్నాడు.
కోటయ్య మొర దేవుడు విన్నట్టున్నాడు. నెహ్రూ, గాంధీ, పటేల్ వంటి
స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు బ్రిటిష్ ప్రభుత్వ అధికారులతో
సామరస్య చర్చలు జరిగి దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు.
అప్పటి వరకు జైళ్లలో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న ఖైదీలకు
విముక్తి లభించింది.
స్వాతంత్ర్య సమర యోధుల్ని విడుదల చేయవల్సిందిగా జైళ్ల శాఖ
అధికారులకు ఆర్డర్లు వచ్చినాయి.
జైలు అధికారులు జైళ్ళలో ఖైదీలుగా ఉన్న యువకుల్ని వారి పేర్లు,
ఊరి వివరాలు తీసుకుని విడుదల చేస్తున్నారు.
అలా కోటయ్యను కూడా పట్నం జైలు నుంచి విడుదల చేసారు.
గుబురు గెడ్డం, పెరిగిన జుత్తుతో ఊళ్ళోకీ వచ్చిన కోటయ్యను చూసి
ఏదో దొంగపని చేసుంటాడు, అందుకే పోలిసోళ్లు జైల్లో ఏసి వుంటారని
ఊళ్ళో జనం తలో మాట అంటుంటె కోటయ్య బాధ పడసాగేడు.
కొద్ది నెలల తర్వాత తాసీల్దారు ఆఫీసు నుంచి జవానుతో పాటు
కొంతమంది ఉద్యోగులు కోటయ్యను వెతుక్కుంటూ పేరాపురం వచ్చి
కరణం, మున్సబుతో సంప్రదించి తమ వెంట తీసుకువెళ్లారు.
దొంగతనం కేసులో పోలీసోళ్లే వచ్చి కోటయ్యను తీసుకుపోయి
వుంటారని ఊరంతా గుసగుసలు మొదలయాయి.
పట్నం తీసుకుపోయిన కోటయ్యను జిల్లా కలెక్టరు సాదరంగా
ఆహ్వానించి కూర్చోబెట్టి మీలాంటి స్వాతంత్ర్య సమర యోధుల
వల్లనే దేశానికి స్వాతంత్య్రం సిద్దించిందని అభినందించి మెడలో
పూలహారం వేసారు. ఫలహారం తినిపించారు.
కోటయ్యకు ఇదేమీ అంతుబట్టడం లేదు. అంతా అయోమయంగా
అనిపిస్తోంది.
తర్వాత జిల్లా కలెక్టరు " ఇటుపైన మీకు నెల వారీ స్వాతంత్ర్య
సమరయోధుల పెన్షన్ కింద నూటయాబై రూపాయలు ప్రభుత్వం
తరపున అందుతాయి " అని సంతోషవార్త చెప్పేరు.
ఊరి తలారి ద్వారా కోటయ్యకు జిల్లా కలెక్టరు చేతుల మీదుగా
సన్మానంతో పాటు నెలవారీ పెన్షన్ మంజూరైన సంగతి తెలిసి
ఊరి కరణం, మున్సబుతో పాటు జనం ఎదురెళ్లి కోటయ్యను
సాదరంగా ఆహ్వానించేరు.
ఉపాధి కోసం పట్నానికి పోదామనుకుంటె ఇంటి వద్దే బ్రతుకు
తెరువు చూపెడుతు పెన్షన్ ఇచ్చాడని దేవుడికి మొక్కుకున్నాడు
కోటయ్య.
అదృష్టం కలిసొస్తె ఏదైనా జరగవచ్చు
* * *

మరిన్ని కథలు

Illaale Devatha
ఇల్లాలే దేవత
- డా:సి.హెచ్.ప్రతాప్
Hidimbi premakatha
హిడింబి ప్రేమ కథ
- హేమావతి బొబ్బు
Vimukthi
విముక్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Aadhaar OTP
ఆధార్ ఓటీపీ
- యస్. రాజేష్ కుమార్
Tappu
తప్పు
- మద్దూరి నరసింహమూర్తి
Andari bandhuvayya
అందరి బంధువయ్యా
- డా:సి.హెచ్.ప్రతాప్
Ruthuchakram- O chinnari katha
ఋతు చక్రం - ఓ చిన్నారి కథ
- మిక్కిలి రాజ్యలక్ష్మి