భగవాన్ శ్రీ రమణ మహర్షి (పదవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography

ఓం నమో భగవతే శ్రీ రమణాయ.

శ్రీ రమణ మహర్షిని సందర్శించి (సం:1879 - 1950), వారి వల్ల ప్రభావితులైన భక్తుల అనుభూతులు

మొరార్జీ దేశాయి: మార్చ్ 1977 నుండి జూలై 1979 వరకు భారత ప్రధాని తన ఆత్మకథ "స్టోరీ ఆఫ్ మైలైఫ్" లో ఇట్లా వ్రాసారు.
శ్రీ రమణ మహర్షిని ఆగష్టు 1935 లో చూచే భాగ్యం నాకు కలిగింది. సోఫా మీద ఆసీనులైవున్నారు. వారి ఆచ్చాదన అంతా ఒక్క కౌపీనమే. శాంతి, ఆనందంతో వారి వదనం వెలిగిపోతుంది. ఆ ముఖం మీద ఒక జ్యోతిశ్చక్రాన్ని కూడా గమనించాను. వారి ఎదురుగా కూర్చున్నాను. వారిని ఏమీ అడగలేదు. వారు కూడా నాతో ఏమీ అనలేదు. వారి ముఖాన్ని చూస్తూ ఒక గంటపైనే కూర్చున్నాను. ఈనాటి వరకూ అటువంటి వదనాన్ని నేనెక్కడా చూడలేదు. నేనక్కడుండగా వారినడగాలని నాకే ప్రశ్నలూ తట్టలేదు. ఆకోరికలేకపోయింది. ఎంతో చిట్టా శాంతితో ఉండిపోయాను. శ్రీ రమణ మహర్షి భగవంతుని సత్యాన్ని దర్శించారని నా నమ్మకం. భగవాన్ దర్శనం నాపై చెరగని ముద్రవేసింది. భగవంతుని సాక్షాత్కరింపచేసుకోవాలనుకున్నవాడు శ్రమపడి యోగా భ్యాసం తనంతటతాను చేసుకోవాలని మహర్షి సన్నిధిలో కూర్చోవడం వల్ల గ్రహించాను.

డిల్లీలోని శ్రీ రమణకేంద్రం నిర్వహించిన శ్రీ రమణ 99వ జయంత్యోత్సవ వేడుకలకు అధ్యక్షత వహిస్తూ 1979 జనవరి 13న భారత ప్రధాని, మొరార్జీదేశాయ్ ఇట్లా అన్నారు:-
మహర్షి సర్వజ్ఞులు. వారికి జంతువుల భాష తెలుసు. వాటి ఫిర్యాదులను వింటుండేవారు. ప్రతి జీవి అంటే గోవైనా, కుక్కైనా, కాకి అయినా, కోతి అయినా సరే ఎంతో ప్రేమతో చూచేవారు. వారి దృష్టిలో అందరూ సమానమే. బిచ్చగాడైనాసరే, ధనవంతుడైనాసరే. వారు తిరువన్నామలైని విడిచి ఎప్పుడూ కదలలేదు. ఉద్భోదలు చేయటానికి నిరాకరించారు. "నేను జ్ఞానిని అయితే ప్రతివారిని జ్ఞానిగానే భావిస్తాను. ఇంక బోధించటానికేముంది?" అన్నారు.

అప్పా. బి. పంత్
అప్పా. బి. పంత్ ఒకప్పుడు ఇంగ్లాండ్ లో భారతదేశ ప్రతినిధిగా వ్యవహరించారు. 1937లో మహర్షిని దర్శించుకున్నారు. ఆయనని శ్రీ రమణుల వద్దకు మౌరిస్ ప్రైడ్ మన్ తీసుకువెళ్ళారు.

మేము ఆశ్రమానికి చేరినరోజు నాకింకా గుర్తువుంది. ఆనాడు ఏదో పండుగ జరుగుతుంది. హాలంతా జనంతో నిండి వుంది. మేము హాలులో ఒక మూల మౌనంగా కూర్చున్నాం. ఒకటి, రెండు నిమిషాల్లో హాలునంతా ఏదో వెలుగు నింపేసింది. ఆ వెలుగు నిశ్చలంగా, మౌనంగా వుంది. నాపై ఎన్నటికీ చెరగని ముద్రవేసి, స్థిరపడి పోయింది.

నేను అప్పుడే ఇంగ్లాండ్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగివచ్చాను. అక్కడ ఫిలాసఫీ లో రీసెర్చ్ చేసాను. భగవాన్ ని ఎన్నో ప్రశ్నలు అడుగుదామనుకొన్నాను. కానీ అడగలేకపోయాను.

రాత్రి చల్లదనానికి ఆరుబయట పడుకున్నాం. చుట్టూ ఎంతో అలజడీ, చప్పుడూను. ఆరాత్రంతా నిద్రపట్టలేదు. మర్నాడు ఉదయం మౌరిస్ ని ఆ విషయమడిగాను. అతను "చప్పుడా? ఎక్కడ్నించి వచ్చింది? అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా వుంది కదా రాత్రంతా" అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. అప్పుడు నాకు తట్టింది "శ్రీ భగవాన్ మౌనంగానే నాకొక ఉపదేశమిచ్చారని." "ఆ చప్పుడనీ, వాగుడనీ మనస్సే కల్పిస్తుంది. ఏవో భ్రమల గురించి అంతు లేకుండా వాగుతుంది. ఆ అలజడిని దాటకపోతే సత్యంలో జీవించడం కానీ, విమోచనం కానీ లేవు నాకు." అంతా ఎరుకే, చైతన్యమే" అని అర్ధమయింది. మహర్షి అనుగ్రహం వల్ల.

ఆనాటి సాయంత్రం మౌరీస్ శ్రీభగవాన్ తో నేను సూర్య నమస్కారాలు చేస్తుంటానని చెప్పాడు. వారు నా వైపు సూటిగా చూస్తూ "ఎట్లా చేస్తావో నాకు చూపించు అన్నాడు." అందరు ఎదుటా, 12 సూర్యనమస్కారాలు చేసిచూపాను. చిరునవ్వుతో భగవాన్ "గంటల తరబడి ధ్యానంలో కూర్చున్న తర్వాత కీళ్ళు బిగుసుకుపోతాయి. ఆ తర్వాత ఈ వ్యాయామం చెయ్యటం మంచిదే అన్నారు. ఆ రోజుల్లో నేను ధ్యానం చేసేవాణ్ణి కాను. కాని 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గ్రహించాను. వారి ఉపదేశం వల్లనే ధ్యానం చేసుకోవటం నేను మొదలుపెట్టానని.

1938లో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, జమ్నాలాల్ బజాజ్ తో కలిసి రమణాశ్రమానికి వచ్చారు. తిరిగివెళ్తూ రాజేంద్రప్రసాద్ శ్రీ భగవాన్ తో "మహాత్ముడు నన్నిక్కడికి పంపించారు" వారికేమైనా చెప్పమంటారా?" అని అడిగాడు శ్రీ భగవాన్. "హృదయం, హృదయంతో మాట్లాడుతున్నప్పుడు ఇక వర్తమానం అవసరమేమిటి? ఇక్కడ పనిచేసే శక్తి అక్కడ కూడా పనిచేస్తుంది అన్నారట. సబర్మతీ, వార్ధా మొదలైన ఆశ్రమాల్లో ఎవరైనా మనస్సు బాగుండలేదని "మహాత్మా" తో అంటే "రమణాశ్రమానికి వెళ్లి, అక్కడ నెలరోజులు వుండి రండి" అని చెప్పి పంపేవారట.

శ్రీ భగవాన్ దర్శించిన తరువాత సరోజినీనాయుడు, "ఒకరు క్షణమైనా ఎవ్వరినీ ఊరికే ఉండనీయరు. ఇంకొకరు ఎవ్వరి అహాన్ని క్షణమైనా పైకి లేవనీయరు" అన్నారు. ఈ క్లుప్తమైన భాషణ, "నాది" అనే భావం లేకుండా ఆత్మత్యాగం చేసిన మహాత్ముని జీవితాన్ని, అహమే లేని మహర్షి జ్ఞానసిద్దినీ వర్ణిస్తుంది.

చలం (గుడిపాటి వెంకటచలం 1894 - 1979) ప్రసిద్ధ తెలుగురచయిత. 1939లో ఆయన శ్రీ రమణులని దర్శించేటప్పటికి ఆయన విప్లవాత్మక సంస్కర్త. 1950లో అరుణాచలంలో స్థిరపడ్డారు. చివరి వరకు అక్కడే వుండిపోయారు.

చలం గారి మాటలలో "దేవుడు మీద నాకు నమ్మకం వుండేది కాదు. ఆస్థితిలో దీక్షితులు అనే నామిత్రుడు నన్ను 1936లో శ్రీ రమణాశ్రమానికి తీసుకువెళ్ళాడు. భగవాన్ దగ్గరికి వచ్చే భక్తులను చూస్తున్న కొద్దీ నాకు ఆశ్రమమంటే అయిష్టం పెరుగుతూ వచ్చింది. దీక్షితుల్ని అడిగాను. మహర్షి మనుష్యులలో మార్పుతేగలరన్నారు. అయితే, ఆయనని ఏళ్ళ తరబడి అంటిపెట్టుకొని ఉన్న వాళ్లింకా ఇట్లాగే ఉన్నారా?" అని.

రెండవరోజు భగవాన్ ని కలిసి "నేను వెళ్తున్నాను" అని చెప్పినప్పుడు. శ్రీ భగవాన్ నావైపు చూచి, చిరునవ్వునవ్వారు. ఆ చిరునవ్వు నాలో మార్పుని తీసుకుని వచ్చింది. శ్రీ భగవాన్ నాతో "నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేనెట్లా బ్రతకగలను? నేనెంతటి ఒంటరితనాన్ని అనుభవిస్తానో!" అన్నట్లుగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత యధాలాపంగా "నేను ఎవరిని" అనే చింతనని ప్రారంభించాను. చాలా సార్లు నా ప్రమేయం లేకుండా "ధ్యానం" ముంచెత్తుకొని వచ్చి కూర్చోబెట్టేది. అటువంటి విషయాల్లో నా మనస్సు నిశ్చలమయిపోయేది. ఇదంతా శ్రీ భగవాన్ వల్లనే జరుగుతోందని స్పష్టం కాజొచ్చింది. వారంటే నమ్మకం కలిగింది. ఆధ్యాత్మిక ఆశలు చిగిర్చాయి. ధ్యానం చేస్తూంటే నిద్ర వస్తుంటుందని శ్రీ భగవాన్ తో చలం చెప్పుకుంటే వారు, "అయితే నిద్రపొ"మ్మని కోపంగా అన్నారట!'

***

భగవాన్ ని సందర్శించిన ముఖ్యులలో "మా ఆనందమాయి" ఒకరు. వారు జన్మతః బెంగాలీ. ఉత్తరప్రదేశ్ లో స్థిరపడిన వారిపేర హృషీకేష్, హరిద్వార్ లలో ఆశ్రమాలున్నాయి. ఈ మహాత్ములు భగవాన్ నిర్యాణం చెందినప్పుడు, వారి సమాధివద్ద "తండ్రీ అంటూ భోరున విలపించారట.

ఇంకొకరు స్వామి యుక్తానంద. వీరికి గణేష్ పురిలో ఆశ్రమం ఉంది. వీరి ఆచార్యులు స్వామి నిత్యానంద బాబా వీరితో "దేహధ్యాసలేని జీవన్మక్తుని చూడగోరినచో, అరుణాచలం వెళ్ళమని" చెప్పారట.

అలాగే ఆంధ్రులైన "జిల్లెల్లమూడి అమ్మవారు" కూడా భగవానుని సందర్శించారట.

మహర్షిని గూర్చి శ్రీ అరవిందులు "He is a prince of peace" అన్నారు. మహర్షిని ఆశ్రయించిన పాశ్చాత్యులలో ముఖ్యులు. హంప్రీస్, పాల్, బ్రౌంటన్, చాడ్విక్ మొదలగువారు.

చిత్తూరు వి. నాగయ్య: తెలుగు సినీ నటుడు, ఆయన నటించిన భక్తపోతన, త్యాగయ్య చిత్రాలు ఎల్లకాలమూ జ్ఞాపకముండేవి. వారు శ్రీ భగవాన్ ను 1930 ప్రాంతాన దర్శించారు.

"నా భార్య పోగానే  ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది నాకు. నాభార్య గురించి ఏ చిన్న తలంపు వచ్చినా కృంగిపోయేవాణ్ణి. ఒకనాడు శ్రీ రమణాశ్రమానికి చేరుకున్నాను. భూలోక స్వర్గంలో అడుగుపెట్టినట్లనిపించింది. మహర్షి చుట్టూ, మొత్తం ఆశ్రమంలోనూ, వున్న ఆప్రశాంతత నన్ను ముంచేసింది. నా మనస్సుకి విశ్రాంతి దొరికింది. భగవాన్ మౌనం నాశోకాన్ని అంతం చేసింది.

ఒకనాడు నా స్నేహితుడొకరు నన్ను గుర్తుపట్టి, తాను తీస్తున్న చిత్రంలో పాటపాడమని అడిగారు. భగవాన్ అనుమతి కోరగా "వెళ్ళవచ్చు. నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా వుంది" అన్నారు. నేను సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాను. చాలా ఖ్యాతి ఆర్జించాను.

శ్రీ రమణుల అనుగ్రహమే లేకపోతే అనామకునిగా రుష్కించి పోయేవాన్ని. నాకొక క్రొత్త జీవితాన్ని చూపించారు వారు. ప్రతి మనిషి అవసరాన్ని గ్రహించే అద్భుతమైన శక్తి మహర్షికుండేది. ప్రతివారికి అనువైన దారి చూపేవారు.
 

శ్రీ రమణార్పణ మస్తు

*****************