సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

..ఆముక్తమాల్యద

గోదాదేవి శ్రీపతిని మోహించి, అతనిని తన పతిగా చేసుకోవాలని పరితపిస్తున్నది. విరహబాధతో అలమటిస్తున్నది.  ఆబాధతో ఆమె పలుకుతున్న నిష్ఠురోక్తులను నెపంగా చేసుకుని నిందాస్తుతి చేస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.

ధరపై నీతడు పూర్వకల్పముల సక్తస్త్రీవిశాలాంబకాం
బురుహ శ్రేణి జలంబుమై బులకలున్ బూరించుచున్ బెంచు దు
ర్భరకర్మం బలమంగ వచ్చుజలచార స్తబ్ధరోమత్వకే
సరితల్పొం డవతారదంభమున నాచ్ఛాదించు దా బ్రౌఢిమన్

చమత్కారము, పాండితీప్రతిభ, అపూర్వమైన కల్పనాచాతుర్యము ముప్పేటలుగా కలసిన త్రివేణీసంగమం రాయలవారి కవనప్రవాహం.  అందుకు ఈ పద్యం అద్భుతమైన ఉదాహరణం. పూర్వజన్మలలో ఈ శ్రీహరి  తనపై మరులుగొని, తనపట్ల ఆసక్తులైన స్త్రీలను ఏడిపించి వారి పద్మములవంటి కనులనిండా నీరు తెప్పించాడు, వారి శరీరాలు పులకలతో నిండేట్లు చేశాడు(సక్తస్త్రీవిశాలాంబకాంబురుహ శ్రేణి జలంబుమైబులకలున్ బూరించుచున్)ఆపాపం ఊరికే పోతుందా? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు కదా, శుభకృచ్ఛుభమాప్నోతి, పాపకృత్పాపమశ్నుతే అన్నారు కదా. ఆ స్త్రీల కంటినీరు మున్నీరైంది. వారి మీనములవంటి కనుల ఆకృతి తనకు కలిగింది, ఆ దెబ్బకు నీళ్ళలో చాపగా తిరిగాడు.పైకి మాత్రం దాన్ని మత్స్యావతారం అని డాబులు చెప్పుకున్నాడు, పిచ్చిభక్తులు అదే నిజమనుకుని నమ్మారు. తనను వలచినవారి శరీరాలకు పులకలు రేపి వారిని పీడించిన పాపానికి ఆ పులకలు ముళ్ళుగా మారి వరాహమై, కేసరములుగా, జూలుగా మారి సింహమై జన్మించాడు. పైకి మాత్రం వరాహావతారము, నరసింహావతారము అని చెప్పుకున్నాడు, పిచ్చిభక్తులు నిజమని నమ్మారు. అదమ్మా ఆ హరి

గడుసుదనము, కపటము!   
అనిమిషముని మనుజాధిప
జననంబుల నీతడెట్లు జలజాక్షుల గూ
ర్చినవారి నేచె దయ లే
కనిన వినుడు మీదు పాటలంద తెలిపెదన్

అనిమిషులు అంటే దేవతలు, అనిమిషముని అంటే దేవముని. దేవమునులు అంటే వామనుడు, పరశురాముడు అనే ఉద్దేశముతో చెప్తున్నాడు రాయలవారు. మనుజాధిపుడు అంటే శ్రీరాముడు అని సూచిస్తున్నాడు, రాబోయే పద్యాలలో ఈ అవతారాల ప్రసక్తి ఉంటుంది కనుక. గొప్పగా భజన చేస్తున్నారులే ఆ హరిని. వామనుడిగా, పరశురాముడిగా, శ్రీరాముడిగా, నిర్దయుడై, తనను వలచినస్త్రీలను ఎలా వేపుకుని తిన్నాడో మీరు పాడుతున్న పాటలనుబట్టే చెప్తాను వినండి.

మొదల నుపేంద్రు డై యిత డమోఘహతిం భృగుపత్నిద్రుంచి య
మ్ముదుసలి గేహినీవిరహముం దనయట్లన పొందు మన్న నా
కదియును దేవకార్యమున కయ్యెడునంచు వహించి త్రోచు లా
వెద వటు వయ్యు లచ్చి మది కెన్నడు బాయని జాలి నింపడే?

ఉపేంద్రుడు అన్న పదం శ్రీమహావిష్ణువుకు వామనుడికి యిద్దరికీ సంకేతము. భృగుమహర్షి భార్య ఖ్యాతి. ఆమె కుమారుడు కవి అనేవాడు పుట్టబోతున్నాడు. కవి కుమారుడు శుక్రాచార్యుడు అనేవాడు కూడా పుడతాడు ముందు ముందు. ఆ శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా చేరి వారిని అజేయులుగా చేయగలవాడు అన్న కారణంతో, దేవతల ప్రార్థన మేరకు ఆమెను శ్రీహరి సంహరించాడు. అందుకుఆగ్రహించిన భృగుమహర్షి తనలా శ్రీహరి కూడా భార్యా వియోగముతో బాధపడును గాక అని శపించాడు, తన తపోశక్తితో భార్యను బ్రతికించుకున్నాడు. భృగుమహర్షి శాపకారణంగా శ్రీహరి తన భార్య ఐన శ్రీ మహాలక్ష్మిని విడిచి ఆమెను విరహబాధకు గురిచేశాడు. ఆ శాపాన్ని తీర్చుకోవడం కోసం, దేవతలకు హితము చేయడంకోసము దృఢమైన(కఠినమైన)మనసుతో తానుమాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వామనుడిగా(ఉపేంద్రునిగా) జన్మించాడు. తన భార్య ఐన మహాలక్ష్మికి మాత్రం నిరంతరమూ పరితపింపజేసే బాధకు కారకుడు అయినాడు. ఇదీ మీరు యింతగా భజన చేస్తున్న ఆ మహానుభావుని నిర్వాకము అని శ్రీహరిని నింద చేస్తున్నట్లుగా నిజానికి స్తుతి చేస్తున్నది గోదాదేవి.  

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు          

మరిన్ని వ్యాసాలు

Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు