మర్మ స్థానం కాదది మన జన్మ స్థానం! - టీవీయస్.శాస్త్రి

marmasthanam kadadi mana janmasthanam

దారుణమైన తెనాలి సంఘటన తలచుకుంటే, ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నిన్ననే నేను తెనాలి వెళ్లి 'మౌనిక' ను ఓదార్చాలని ప్రయత్నించాను. ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం భగవంతుని వల్ల కూడా కాదేమో! ఆమె అడిగే ప్రశ్నలకు  సమాధానం చెప్పలేక తలదించుకొని మౌనంగా నిలబడ్డాను. అక్కడ నేను ఉన్నంత సేపు నా కళ్ళు నా మాట వినలేదు. బయలుదేరి తిరిగి వచ్చే సమయంలో ఆ అమ్మాయి అన్న మాటలు "ఇదే నేను కనక మగాడినైతే, ఆ కామాంధుల రక్తాన్ని అక్కడికక్కడే కళ్ళ చూసేదాన్ని" ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆమెతో మాట్లాడిన వారికి అనిపించేది ఒక్కటే! - "అసలు మనం మగాళ్ళమేనా!" అని. ఆ అమ్మాయి అన్న మాటలలో ఒక నిజం వుంది. అదేమిటంటే! అసలు మనం మగాళ్ళం కాదు. ఆ అమ్మాయిలో సంస్కారం ఉండబట్టి అలా  అంది. నిజానికి ఈ దేశంలో ఉన్న చాలా మంది మగాళ్ళు నపుంసకులే! ఇటువంటి వారిని 'దిగంబర కవులు 'నిర్భయంగా కొజ్జాలనీ అనేవారు! నిర్భయంగా చెప్పిన కవులను అశ్లీల కవులన్నారు. మనలాంటి సంస్కార వంతులు. ఈ పుణ్యభూమిలో అన్నింటికంటే చౌక అయినది స్త్రీ మానమేమో! పొట్టకూటి కోసం వ్యభిచరించే స్త్రీలను శిక్షించే ప్రభుత్వాలు. దారుణంగా చెరచబడ్డ స్త్రీకి రక్షణ కూడా కల్పించలేని నిస్సహాయతలో ఉన్నాయి. మన తల్లులను, భార్యలను, సోదరీమణులను మనం రక్షించుకోలేని దుర్భర నిస్సహాయతలో ఉన్నాం మనం. మరి వీరిని రక్షించేది ఎవరు? ఖడ్గం ధరించి కల్క్యావతరం వస్తుందా? వీరభోగ వసంతరాయలు అసలు వస్తాడా? వాళ్ళు వచ్చేదాకా, ఓ న్యాయదేవతా! నీ కళ్ళకున్న నల్ల గంతలను తీసి, నీ కంటి ఆగ్రహజ్వాల్లో ఈ దుర్మార్గులను భస్మీపటలం చేయి తల్లి! ఈ ఉద్వేగంలో 'అక్షరబ్రహ్మ' స్వర్గీయ శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు వ్రాసిన 'ప్రతిఘటన' లోని ఈ క్రింది పాట గుర్తుకొచ్చి, మనల్ని కొరడాతో కొట్టుతున్నట్లనిపించింది.

పల్లవి:
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహా భారతం....  ఆరవ వేదం...
మానభంగ పర్వంలో..... మాతృ హృదయ నిర్వేదం నిర్వేదం

చరణం-1:
పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి
పెరిగి పెద్ద కాగానే ముద్దుమురిపాల కేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిల కామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో...  మీ అక్కల రక్తంతో... 
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహా భారతం...  ఆరవ వేదం... 
మానభంగ పర్వంలో....
మాతృ హృదయ నిర్వేదం నిర్వేదం

చరణం-2:
కన్న మహా పాపానికి ఆడది తల్లిగ మారి
నీ కండలు పెంచినది గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి
పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర
ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగల్యం
మర్మ స్థానం కాదది మీ జన్మ స్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే
మానవ రూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే
కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువ శక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుంది సభ్య సమాజం
ఏమైపోతుంది మానవ ధర్మం
ఏమైపోతుంది ఈ భారత దేశం
మన భారత దేశం మన భారత దేశం

ఏమైపోతుంది సభ్య సమాజం? ఏమైపోతుంది మానవ ధర్మం? ఏమైపోతుంది ఈ భారత దేశం? మన భారత దేశం మన భారత దేశం

మరిన్ని వ్యాసాలు

Mana rajakeeya nayakulu
మన రాజకీయ నాయకులు
- మద్దూరి నరసింహమూర్తి
మహానటి
మహానటి
- ambadipudi syamasundar rao
పొడుపు కథలు .
పొడుపు కథలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tasmat jagratta
'తస్మాత్ జాగ్రత్త'
- మద్దూరి నరసింహమూర్తి
Tirumala lo samanyudu
తిరుమలలో సామాన్యుడు
- మద్దూరి నరసింహమూర్తి