సమాజంలో మన status తెలియాలంటే.... - భమిడిపాటి ఫణిబాబు

Our Status in society

సాధారణంగా చాలామందిలో చూస్తూంటాము, తన గొప్పతనం, సమాజంలో తన స్తోమత, అందరికీ తెలియచేయాలని. మరీ ప్రతీవారినీ పిలిచి తను ఫలానా.. ఫలానా అని చెప్పుకోలేడుగా, మరి వాళ్ళకి తెలియచేయడం ఎలాగ? అలా చెప్పనవసరంలేకుండగా, తెలియచేయడానికి ఈ రోజుల్లో కావలిసినన్ని, ఉపకరణాలనండి, సాధనాలనండి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటినే ముద్దుగా ' స్టేటస్ సింబల్స్' అంటూంటారు. మనం నోరువిప్పవలసిన అవసరం ఉండదు, మన చేతిలో వాటిని చూస్తే చాలు, చూసినప్రతీవాడూ " ఓహో..." అనుకునేటంతగా తమ పని తాము చేసేసికుంటాయి.

ఇదివరకటిరోజుల్లో విదేశాలకి వెళ్ళడం అంటే ఘనంగా చెప్పుకునేవారు. ఈరోజుల్లో వెళ్ళనివాళ్ళని వేళ్ళమీద లెఖ్ఖెట్టొచ్చు. ఏదో పెద్దపెద్ద చదువులు చదివినవారే వెళ్ళేవారు. ఈరోజుల్లో చదువనేది అవసరం కూడా లేదు, చేతిలో ఓ 'కళ' లాటిదుంటే చాలు, బయటకెళ్ళడానికి కావాల్సినన్ని అవకాశాలు. ఆ 'కళ' దేనికి సంబంధించినదైనా కావొచ్చు. మరి విదేశాల్లో ఈ కళాకారులు లేక, మనవాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయా అనేది చర్చనీయాంశం. పోనిద్దురూ కారణం ఏదైతేనే, ఇదివరకటి రోజుల్లోకంటే ఇప్పుడు చాలామంది వెళ్ళకలుగుతున్నారా లేదా అనేదే విశేషం.

మరి విదేశాలకి వెళ్ళొచ్చారని అందరికీ తెలియచేయడం ఎలాగా? అవకాశం దొరికినప్పుడల్లా మనదేశం, దేశంలోని lack of discipline గురించీ, అడిగినవాడిదగ్గరా, అడగనివాడిదగ్గరా ధారాళంగా మాట్టాడేయడం. 'అసలు విదేశాల్లో అయితేనండీ..." అంటూ మొదలెట్టేయడం. వీడి కబుర్లు విన్నవాళ్ళల్లో ఏ ఒక్కడైనా అడుగుతాడుగా, " బయటకెళ్ళొచ్చారాండీ..." అని, అది చాలదూ. ఇదివరకటి బారిస్టర్ పార్వతీశం గారి రోజుల్లోలాగ, సముద్రాలు దాటి ఓడలమీద ప్రయాణాలు ఎవరు చేస్తున్నారూ ఈరోజుల్లో, కావలిసినన్ని విమానసర్వీసులాయె, ఈ విమానయానాలు చేసేటప్పుడు, వీళ్ళు తీసికెళ్ళే లగేజీకి అవేవో ట్యాగ్గులాటివి పెడుతూంటారు. మనవాళ్ళు బయటకి వెళ్ళొచ్చారని అందరికీ తెలియడానికి, చివరకి మనవైపు "పల్లె వెలుగు" బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా, ఆ ట్యాగ్గులు అందరికీ కనిపించేటట్టు పెడితే చాలు పనైపోతుంది.

అలాగే రైళ్ళలో ఈమధ్య ప్రభుత్వం వారు ఇచ్చిన రాయితీల ధర్మమా అని, చాలామంది ఇదివరకటిరోజుల్లో, ఏసీ తరగతిలో ప్రయాణం చేయలేనివారు కూడా, ఈరోజుల్లో ఆ ఏసీ లలో ప్రయాణం చేయకలిగే అవకాశం దొరుకుతోంది. మళ్ళీ వీటిల్లో ఏసి3, ఏసీ 2 , ఏసీ1. సరదాగా జీవితంలో ఒక్కసారైనా ఏసీ2 లోనో, ఏసీ1 లోనో ప్రయాణం చేస్తేబాగుండుననే ప్రాణులు కొందరుంటూంటారు. ఏసీ3 లో ఏదో సాధారణ జీవులుంటూంటారు, కానీ ఏసీ2,1 లలో కొంతమంది విచిత్రజీవులుంటూంటారు, వాళ్ళు ఎవరితోనూ మాట్టాడరు, చేతిలో ఓ ఇంగ్లీషు పుస్తకమో, పత్రికో పెట్టుకునే ఉంటారు. అధవా పలకరించాల్సొచ్చినా, మొట్టమొదటగా వారి నోటంట వచ్చే మొదటి మాట-- " ఏమిటోనండీ, ఎప్పుడూ ఫ్లైట్ లోనే వెళ్తూంటాము. . ఈసారే ఇలా వెళ్ళాల్సొచ్చిందీ..." అని, ఇలా రైల్లో ప్రయాణం చేయడం, ఎంత బాధగా ఉందో, చెప్పకుండానే చెప్పడం అన్నమాట! అసలు అవతలివాళ్ళకెందుకూ ఈ పెద్దమనిషి ప్రయాణాలు ఎలా చేస్తూంటాడో, అయినా సరే వాళ్ళకీ తెలియాలి తన స్టేటస్ ఏమిటో !!

ఇదివరకటి రోజుల్లో గుర్తుండే ఉంటుంది, కొత్తగా చేతికి ఏ వాచీ యో కొనుక్కున్నప్పుడు, అందరికీ తెలియాలని, ఎప్పుడూ లేనిది, ఆ వాచీ పెట్టుకున్నచేతిని అదేపనిగా ఊపుతూ మాట్టాడడం, ఎవడో ఒకడు అడుగుతాడుగా, " కొత్తగా వాచీ కొన్నారేమిటీ..." అని, అదిచాలు మనం కొత్తగా వాచీకొనుక్కున్నామని అందరికీ తెలియడానికి. అలాగే కొత్తగా బూట్లు కొన్నప్పుడూనూ, " ఏమిటోనండీ, ఈ లేసులతో గొడవ భరించలేకపోతున్నానూ, హాయిగా చెప్పులేసుకుని వచ్చినా బాగుండేదీ. . " అని ఒక్కమాటంటే చాలు, " అరే.. మీ బూట్లు చాలా బాగున్నాయి, కొత్తగా కొన్నారేమిటీ..." ఆ మాట చాలదూ...

శ్రీ నరసింహరావుగారు ఆర్ధిక సంస్కరణలు దేశంలో ప్రవేశపెట్టినప్పటినుంచీ, విదేశాల్లో ఇదివరకటి రోజుల్లో దొరికే ప్రతీ వస్తువూ, ఈరోజుల్లో మనదేశంలోనే లభ్యం అవుతోంది. ఎక్కడ చూసినా బ్రాండెడ్ షాప్పులూ, మాల్లులూనూ. ఒక్కోబ్రాండ్ కి ప్రత్యేకంగా షాప్పులు. ఏ కొట్లోకి వెళ్ళో, ఓ చిన్నవస్తువైనా కొనుక్కుంటే, ఆ కొట్టువాడు, ఆ వస్తువుని జాగ్రత్తగా, ఆ బ్రాండ్ పేరున్న ఓ క్యారీ బ్యాగ్గులోనొ, ఓ బాక్స్ లోనో పెట్టి ఇస్తాడు. ఆ బ్రాండు పేరు ఖర్చులేకుండగా, అందరికీ తెలిసేటట్టు అవుతుంది. ఇందులో ఆ బ్రాండు కంటే, ఆ బాక్సో, క్యారీబాగ్గో చేతిలో పెట్టుకుని ఏ బస్సులోనో వెళ్తే, మన స్టేటస్ ఎంతగా పెరిగిపోతుందోకదూ. చూసినవాళ్ళందరూ, "ఓహో ఈయన ఫలానా బ్రాండే వాడుతాడన్నమాట. . " అని అనుకోడానికి ఎక్కువగా ఉపయోగపడుతూంటుంది. ఆ బ్యాగ్గో బాక్సులోనో, ఓ చిన్న జేబిరుమ్మాలో, సాక్సో ఉన్నా పరవాలేదు. లోపలేముందో ఎవడికి తెలుస్తుందీ, బయట కనిపించే బ్యాగ్గూ, బాక్సూ దానిమీద ఉన్న బ్రాండు పేరూ ముఖ్యం.

అలాగే బస్సుల్లో చూస్తూంటాము, ప్రతీవాడి వీపుమీదా, ఓ ల్యాప్ టాప్ సంచీ, దాంట్లో లాండ్రీకి ఇవ్వాల్సిన పాత బట్టలుంటే ఎవడిక్కావాలి? బ్యాగ్గు ముఖ్యం. అలాగే ఏ "నైకీ", "ఆడిడాస్", " ప్యూమా" వాడిచ్చే బాక్సుల్లో, తెగిపోయిన చెప్పులుంటే ఎవడిక్కావాలి, అరిగిపోయిన షూస్ ఉంటే ఎవడిక్కావాలి? మన సామాజిక స్తోమత పెరిగిందా లేదా?

ఇంక అన్నిటిలోకీ ముఖ్యం, ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండగా, చాలామంది పెద్దవారుకూడా, పువ్వుల డిజైన్ల టీ షర్టులూ, నిక్కర్లతోనూ దర్శనం ఇస్తూంటారు, అంటే ఆయనగారు ఈమధ్యనే విదేశాలకెళ్ళొచ్చుండొచ్చూ, అధవా వారి అబ్బాయో, అమ్మాయో విదేశాల్లో ఉంటూ, తల్లితండ్రులను చూడడానికి వచ్చీ ఉండొచ్చు. ఎవరి సరదా వారిదనుకోండి, వాటిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. కానీ వయస్సుకి తగ్గట్టు వేషధారణ కూడా ఉంటేనే, వారిమీద గౌరవం పెరుగుతుందని మర్చిపోతూంటారు.

ఇంక కార్ల విషయానికొస్తే చెప్పఖ్ఖర్లేదు. సొసైటీలో ఒకరికి ఫలానా బ్రాండ్ శాంట్రో ఉంటే, మన దగ్గర ఐ10. ఐ20 ఉండితీరాల్సిందే. ఒకడిదగ్గర ఏ బి.ఎం.డబ్ల్యూ లాటిదో ఉంటే మనదగ్గర ఏ జాగ్గువా యో ఉండాలే. ఇలా చెప్పుకుంటూపోతే మన స్థోమత ప్రపంచం అందరికీ తెలియ చేయాలంటే ఉన్న సాధనాలు ఎన్నెన్నో ఉన్నాయి. మన బ్యాంకు బాలెన్సు ఎంతుందీ అని ఎవడికీ అవసరం లేదు, మనం ఏం వాడుతున్నామూ, ఏ బ్రాండు బట్టలు కడుతున్నామూ అనేదే ముఖ్యం.
భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.