శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Swamy Vivekananda

నరేంద్రుని దేశాటనం
నరేంద్రుడు సోదర శిష్యుల పరిపూర్ణ వికాసాభివృద్దికి పాటు పడుతున్నా అని తనను బంధించే బంగారు సంకెళ్ళగా భావించేవాడు. అదీగాకుండా ఆ శిష్యబృందం స్వశక్తి పై ఆధారపడాలని అతని ఆశపడేవాడు. ఈకారణాల వల్ల అతడు మఠాన్ని వదిలి దేశాటనానికి బయలుదేరాడు. మొట్టమొదట అతడు పుణ్యక్షేత్రమైన కాశీనగరానికి వెళ్ళాడు. అక్కడ చాలామంది ప్రముఖ పండితుల్ని దర్శించి, వారితో ఆధ్యాత్మిక, వైజ్ఞానికాది విషయాలు చర్చించాడు. వారంతా నరేంద్రుని బుద్ధి - కుశలతకూ, - వాగ్దాటికీ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత అతడు ఆగ్రా - బృందావనం - అయోధ్య - హరిద్వారం నగరాలు తిరిగాడు.

ఇలా అతడు హిమాలయ పర్వత ప్రాంతం వరకూ పర్యటించి 1891వ సంవత్సరం జనవరి నెలలో డిల్లీ చేరుకున్నాడు. ఈదేశాటన సందర్భంలో అతనికెన్నో కొత్త అనుభవాలు కలిగాయి. ఎన్నో వేలమంది ప్రజలు అతని ప్రతిభా విశేషాలను గుర్తించగలిగారు. డిల్లీ నుంచి ఆళ్వారు నగరం వెళ్ళాడు. అక్కడ మౌల్వీ సాహెబ్ అనునతనికి, నరేంద్రునితో పరిచయమేర్పడింది. అతని మూలంగానూ మరికొందరి మూలంగానూ నరేంద్రుని ఘనత ఆళ్వారు నగరమంతా ప్రాకిపోయి ప్రజలు అతని సందర్శనం కోసం తండోపతండాలుగా రాసాగారు. ఈ వార్త ఆళ్వారు మహారాజు కోటలోనికి కూడా ప్రాకింది. ఆ రాజు పాశ్చాత్య వ్యామోహానికి లోనై ప్రాచ్య సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తూ వుండటం వల్ల అక్కడ దివాన్ గా వున్న రామచంద్ర జీ మహారాజును నరేంద్రుని దర్శనానికి, తీసుకువచ్చాడు. అప్పుడా రాజు నరేంద్రునితో "స్వామీజీ! నాకు విగ్రహారాదనలో విశ్వాసం లేదు. అందువల్ల నాకేమైనా దుర్గతి పడుతుందా? అని ప్రశ్నించాడు. విగ్రహారాధనను ఆరాజు ప్రత్యక్షంగా సమర్ధించాలనే తలంపుతో నరేంద్రుడు మహారాజు ఛాయాపటాన్ని తెప్పించి "దీనిపై ఉమ్మివేయ"మని దివాన్ ను కోరాడు. దివాను భయంతో దిక్కులు చూడసాగాడు.

నరేంద్రుడు రాజుగారి యితర పరివారాన్ని కూడా ఉద్దేశించి "ఎవరైనా సరే యీ పటంపై ఉమ్మివేయండి" అన్నాడు. అంతా వణికిపోసాగారు, కానీ ఎవరూ సాహసించలేదు. అంతట దివాను నరేంద్రునితో "స్వామీ! ఏమిటిది? మహారాజుగారి ఛాయాపటంపై ఉమ్మివేయమంటున్నారా? అని అడిగాడు. అప్పుడు నరేంద్రుడు "అవును. యిది మీ మహారాజు పటమే కానీ ఇందులో మహారాజు శరీరం, రక్త మాంసాలు లేవే. ఇది ఒట్టి కాగితం ముక్క మాత్రమే కదా!" అని చెప్పి మహారాజుతో "రాజా! చూశారా! పటాన్ని చూసేసరికి మీరూపం అందులో కనిపిస్తుంది. మిమ్మల్ని గౌరవిస్తున్నట్లే మీ పటాన్ని కూడా అంతా గౌరవిస్తున్నారు. విగ్రహాలను పూజించే భక్తుల విషయం కూడా ఇలాంటిదే. వారు రాళ్ళనూ, రప్పలనూ, మాత్రమే పూజించటం లేదు. ఆయా విగ్రహాల రూపంలో వున్న దైవాన్ని పూజిస్తున్నారు" అన్నాడు. దానితో మహారాజు మనస్సు మారినది. నరేంద్రునిపై అతనికి అపారభక్తి, విశ్వాసాలేర్పడ్డాయి.

రాజు గారి బలవంతం వల్ల నరేంద్రుని బస దివాన్ గారి ఇంటికి మార్చారు. అయితే తనను చూడటానికి వచ్చే వారందరి పట్ల వారు ధనికులైనా, పేదలైనా, బ్రాహ్మణులైనా, పంచములైనా సమానాదరణ చూపేటట్లు దివాన్ చేత వాగ్ధానం చేయించుకుని మరీ అక్కడ బసచేసాడు నరేంద్రుడు. ఈ సమయంలో అనేకమంది రోజూ అతని దర్శనం చేసి ఉపదేశాలను విని వెళ్ళేవారు. వారిలో చాలామందికి హృదయ పరివర్తన కూడా కలిగింది. సంస్కృత భాషా ప్రాశస్త్యాన్ని గురించి నరేంద్రుడు అక్కడ చేసిన భోధన వల్ల నగరంలోని యువకులెంతో సంస్కృత విధ్యాభ్యాసం సాగించారు.

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.