విశ్వకర్మ జయంతి - జే.వి.కుమార్ చేపూరి

Vishwakarma jayanthi

విశ్వకర్మ బ్రహ్మ దేవుని కుమారునిగా పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ సకల కళలకు ఆదిదేవుడు, అధిపతి. దేవలోకాలను నిర్మించిన భవన శిల్పి, వాస్తు శిల్పి, స్థపతి (ఆర్కిటెక్చర్). దేవతలకు ఆకాశాన విహరించే పుష్పక విమానాలు, ఆయుధాలు, వివిధ రకాల సువర్ణాభరణాలు మరియు పనిముట్లను సృష్టించి ఇచ్చిన రూప శిల్పి. విశ్వకర్మ భగవానుడు సమస్త హస్తకళలన్నింటికి ఆది దేవుడు మరియు విశ్వము యొక్క ప్రధాన రూపశిల్పి. విశ్వకర్మ ప్రపంచానికి దైవ యాంత్రికుడు (ఇంజనీరు).

విశ్వకర్మ భగవానుడు చతుర్ముఖుడు. కిరీటాన్ని, సువర్ణా భరణాలను ధరించి ఎనిమిది హస్తములు కలిగి, ఒక చేతిలో నీటి బిందెను, ఒక చేత గ్రంధాన్ని, ఒక చేత ఉచ్చు, మిగిలిన హస్తాలయందు వివిథ ఆయుధాలను మరియు పనిముట్లను ధరించి దివ్య పురుషునిగా దేవతలచే కీర్తించబడే వేలుపు.

హిందూ పురాణాలన్ని విశ్వకర్మచే సృష్టించబడిన అద్భుత నిర్మాణాలతో నిండినవే. నాలుగు యుగాలన్నింటిలోను ఆయన దేవతలకు అనేక పట్టణాలు మరియు రాజభవనాలు నిర్మించి ఇచ్చిన స్థపతి, వాస్తు మరియు భవన శిల్పి. సత్య యుగంలో ఇంద్రుడు పరిపాలించే ఇంద్ర లోకాన్ని, త్రేతాయుగంలో స్వర్ణ లంకను, ద్వాపరయుగంలో ద్వారకా నగరాన్ని, కలియుగంలో హస్తినాపురాన్ని, ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన అద్భుత శిల్పి, గొప్ప స్థపతి.

స్వర్ణ లంక: పరమేశ్వరుడు పార్వతి దేవిని పరిణయమాడిన పిదప, తాము నివసించడానికి ఒక సుందర నగరాన్ని నిర్మించి ఇవ్వవలసిందని విశ్వకర్మను కోరగా, విశ్వకర్మ బంగారముతో చేయబడిన సుందర రాజ భవనాన్ని అద్భుత కళా నైపుణ్యంతో శివునికి నిర్మించి ఇచ్చాడు. శివుడు, రావణ బ్రహ్మను తన నూతన రాజగృహ ప్రవేశ పూజలను, సంస్కారాలను నిర్వహించ వలసినదిగా కోరగా, రావణుడు శాస్త్రోక్తంగా రాజగృహ ప్రవేశ వేడుకలను నిర్వహించాడు. దానికి సంతోషించిన శివుడు ప్రతిఫలంగా రావణుడిని ఏదైనా వరం కోరుకో మన్నాడు. ఆ సుందర స్వర్ణ రాజగృహ సౌందర్యానికి అచ్చెరువొందిన రావణుడు, ఆ బంగారు నగరాన్నే తనకు బహుమతిగా ఇవ్వ వలసినదిగా కోరాడు. శివుడు రావణుడి కోరికను సమ్మతించాడు. ఆనాటి నుండి అది రావణుడి వశమై స్వర్ణ లంకగా మారిందని పురాణ ప్రతీతి.

ద్వారక: ద్వాపర యుగంలో కృష్ణుని కోరిక మేరకు విశ్వకర్మ సుందర ద్వారకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. దీనిని రాజధానిగా చేసుకుని కృష్ణుడు ద్వారకను కర్మ భూమిగా పరిపాలించాడని శాస్త్రోక్తి.

హస్తినాపురం: కురు పాండవ రాజధాని అయిన హస్తినాపురాన్ని కలియుగంలో విశ్వకర్మ భగవానుడు నిర్మించి ఇచ్చాడు. కురుక్షేత్రానంతరం కృష్ణుడు, ధర్మరాజును హస్తినాపురానికి పట్టాభిషక్తుడిని చేసాడని మహాభారత పురాణం తెలియజేస్తోంది.

ఇంద్రప్రస్థం: దృతరాష్ట్రుడు పాండవులు నివసించడానికి ఖాండవప్రస్త అనే స్థలాన్ని కానుకగా ఇచ్చాడు. ధర్మరాజు తనకు ఇవ్వబడిన ఖాండవప్రస్తలో తన తమ్ములతో కలసి నివసించ సాగాడు. అపుడు కృష్ణుడు విశ్వకర్మను ఆహ్వానించి అక్కడ పాండవులకు ఒక అద్భుత రాజధాని నగరాన్ని నిర్మించి ఇవ్వవలసినదిగా కోరాడు. విశ్వకర్మ అనేక అద్భుతాలు గల అత్యంత మహత్తర మైన ఇంద్రపస్థాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇదే మయసభగా ప్రఖ్యాతి గాంచినది. మయసభ లోని విశేషాలను, వింతలను ప్రత్యేకించి ప్రస్థుతించ వలసిన అవసరం లేదు. సుయోధనుడికి మయసభలో కలిగిన వింత అనుభూతులు, అనుభవాలు జగద్విదితం.

విశ్వకర్మ పూజ (జయంతి) : సెప్టెంబర్ 17 వ తేదీ విశ్వకర్మ జయంతి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన విశ్వకర్మ జయంతిని అన్ని ప్రాంతాల వారు ఘనంగా జరుపుకుంటారు. విశ్వకర్మ దైవ యాంత్రికుడు (ఇంజనీరు) కావడం వలన భక్తి సూచకంగా ఆ రోజున సాంకేతిక లోకం (ఇంజనీర్లు, కర్మకారులు, సాంకేతిక నిపుణులు, సూత్రగ్రాహకులు) మరియు వివిధ వృతుల వారు, పరిశ్రమల వారు విశ్వకర్మ పేరున తమ పరికరాలను, పనిముట్లను శాస్త్రోక్తంగా పూజిస్తారు. విశ్వకర్మ జయంతి రోజున కర్మాగారాల్లో విధిగా కార్మికులు విశ్వకర్మను కొలిచి తమ పరికరాలను, పనిముట్లను పూజిస్తారు. ఈ రోజున కృషీవలులు (రైతులు) విశ్వకర్మను భక్తితో కొలిచి తమ నాగళ్ళను మరియు ఇతర వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున సంతోష సూచికంగా ఆనందంతో గాలి పటాలను ఎగుర వేస్తారు. ఈ జయంతిని దేశంలోని అన్ని రాష్ట్రాల వారు వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా అస్సాము, పశ్చిమ బెంగాలు, ఉత్తరాఖండ్, డెహ్రాడున్, రాజస్థాన్ రాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. విశ్వకర్మ భగవానుని భక్తి సూచకంగా కేంద్ర ప్రభుత్వము కూడా ప్రతి ఏటా అత్యన్నత ఉన్నత విశ్వకర్మ పురస్కారాలను ఉత్తమ ప్రతిభను కనబరిచిన పరిశ్రమలకు అందజేస్తోంది.

ఆయన జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవానుని మనము కూడా ఒకసారి స్మరించుకుందాం.

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి